peanuts crop
-
'అందుకే కరోనా కేసులు ఎక్కువవుతున్నాయి'
సాక్షి,సిద్దిపేట : గజ్వేల్ మండలం రిమ్మనగూడలో శనిగల కొనుగోలు కేంద్రాన్ని ఎంపీ క్తొత ప్రభాకర్‌రెడ్డితో కలిసి మంత్రి హరీశ్ రావు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా కరోనా పట్ల మిగతా రాష్ట్రాల కంటే తెలంగాణాలో జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవడం వల్ల తక్కువ ప్రభావం ఉందన్నారు. కరోనాను నివారించాలంటే సోషల్ డిస్టెన్స్తో పాటు జాగ్రత్తలు వహించడమే తప్ప మరోమార్గం లేదన్నారు. గ్రామాల్లో కరోనాపై తీసుకుంటున్న జాగ్రత్తలు పట్టణాల్లో కనబడడం లేదన్నారు. అందుకే పట్టణాల్లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయన్నారు. గ్రామాల్లో ఉపాధి కోల్పోయిన వివిధ రంగాల్లో పనిచేసే కార్మికులకు ఆయా గ్రామాల్లో ఉపాధిహామీ పనులు చేయాలన్నారు. ఒకవేళ వారికి జాబ్ కార్డు లేనట్లయితే తక్షణమే ఇస్తామన్నారు. ఉపాధి హామీ పనిచేసే కూలీలకు డబ్బుల కొరత లేదన్నారు. అనంతరం సిద్దిపేట రెడ్డి సంక్షేమ భవన్లో 104 మంది వలస కార్మికులకు ప్రతి ఒక్కరికీ 12 కిలోల బియ్యం, ఒక్కొక్కరికీ రూ.500 రూపాయల నగదు మంత్రి హరీశ్ రావు, ఎంపీ ప్రభాకర్ రెడ్డిలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డిసి ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
అధికారులు–వ్యాపారుల కుమ్మక్కు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అర్హులైన చాలామంది పప్పు శనగ రైతులకు అధికారులు, వ్యాపారుల అవినీతి వల్ల తీవ్ర అన్యాయం జరుగుతోంది. ధరల స్థిరీకరణ నిధి పథకంతో రైతులను ఆదుకోవాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి అక్రమార్కులు తూట్లు పొడుస్తున్నారు. గోడౌన్ల కొరత వల్ల ఇంటి వద్దనే పంటను నిల్వ చేసిన రైతులకు ఈ పథకం కింద సాయం అందడం లేదు. మరోవైపు వ్యాపారులు,అధికారులు కుమ్మక్కై అనర్హులకు సాయం అందిస్తూ కమీషన్లు మింగేస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. క్వింటాల్‌కు 1,500 చొప్పున అదనపు సాయం కర్నూలు, వైఎస్సార్, అనంతపురం, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో రైతులు పప్పు శనగను సాగు చేస్తున్నారు. 2016–17లో 4 లక్షల హెక్టార్లలో సాగు కాగా, 2018–19లో సాగు విస్తీర్ణం 4.78 లక్షల హెక్టార్లకు పెరిగింది. రబీలో పండే పప్పు శనగలకు కేంద్ర ప్రభుత్వం క్వింటాల్‌కు రూ. 4,620 కనీస మద్దతు ధర ప్రకటించింది. ఈ మద్దతు ధర గిట్టుబాటు కాకపోవడంతో ఎక్కువ మంది రైతులు పంటను శీతల గిడ్డంగులు, ప్రైవేటు గోదాముల్లో నిల్వ చేసుకున్నారు. నిల్వ ఉంచిన ఈ పంటను హామీగా పెట్టి, కొందరు రైతులు తక్షణ అవసరాల కోసం వడ్డీ వ్యాపారుల నుంచి రుణాలు తీసుకున్నారు. రాష్ట్రంలో దాదాపు 59 లక్షల క్వింటాళ్ల పప్పు శనగ శీతల గిడ్డంగులు, ప్రైవేట్ గోదాముల్లోనూ, రైతుల వద్ద దాదాపు 10 లక్షల క్వింటాళ్లు నిల్వ ఉన్నట్టు అంచనా. నిల్వలను కొనేందుకు ప్రభుత్వం రూ.333 కోట్లు విడుదల చేసింది. రైతులను ఆదుకునేందుకు కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకు పప్పు శనగను కొనుగోలు చేయడంతోపాటు క్వింటాల్‌కు రూ.1,500 చొప్పున అదనంగా అందజేస్తోంది. ఒక్కో రైతుకు 30 క్వింటాళ్ల దాకా ఈ సాయం అందిస్తోంది. దీనివల్ల ఒక్కో రైతుకు రూ.45 వేల ప్రయోజనం చేకూరుతోంది. అయితే, ఈ–క్రాపింగ్‌లో పేర్లు నమోదైన వారికే ఈ అదనపు సాయం అందుతోంది. వ్యాపారుల మాయాజాలం అనంతపురం, వైఎస్సార్ జిల్లాలో పప్పు శనగ రైతుల జాబితాలో అనర్హుల పేర్లు ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై అక్కడి రైతులు ధర్నా సైతం చేశారు. కొందరు వ్యాపారులు ఇతర రాష్ట్రాల్లో పప్పు శనగను కొనుగోలు చేసి, ఏపీలో తమకు తెలిసిన రైతుల పేరిట కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేశారు. అధికారులతో కుమ్మక్కై ఆ రైతుల పేర్లను ఈ–క్రాపింగ్‌లో నమోదు చేసి, ప్రభుత్వం నుంచి అందే అదనపు సాయాన్ని జేబుల్లో వేసుకుంటున్నారు. గోడౌన్ల కొరత వల్ల ఇంటి వద్ద పంటను నిల్వ చేసుకున్న రైతులకు సాయం అందించడానికి అధికారులు నిరాకరిస్తున్నారు. అర్హులందరికీ ప్రభుత్వ సాయం అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. -
ఆందోళనలో శనగ రైతులు
సాక్షి, బోధన్: శనగ రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతల కష్టాలు తప్పడం లేదు. రైతులు అవసరాలు, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో నిబంధనలను ఆసరాగా చేసుకున్న దళారులు, వ్యాపారులు శనగలను తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించడానికి అనేక నిబంధనాలు ఉండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నాఫెడ్ ద్వారా శనగ కొనుగోళ్లు రబీలో పండించిన శనగలను కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న నాఫెడ్, రాష్ట్ర మార్క్‌ఫెడ్ మధ్యవర్తిత్వంతో ప్రాథమిక సహాకార సంఘాల ద్వారా కొనుగోలు చేస్తోంది. ప్రభుత్వం మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.4,620గా ప్రకటించింది. కానీ సవాలక్ష నిబంధనలు పెట్టారు. ప్రతి రైతు నుంచి ఎకరానికి 5 క్వింటాళ్ల చొప్పున 20 క్వింటాళ్ల వరకు మాత్రమే కొనుగోలు చేస్తారు. అంతకు మించి కొనుగోలు చేయమని తేల్చి చెప్పారు. వ్యవసాయ శాఖ మాత్రం ఎకరానికి 5 నుంచి 6 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చిందని అంచనా వేస్తోంది. జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ఎకరానికి 8 నుంచి 10 క్వింటాళ్లు, మరికొన్ని ప్రాంతాల్లో 12 క్వింటాళ్లకు పైగా దిగుబడి వస్తోందని రైతులంటున్నారు. దీంతో రైతుల నుంచి పూర్తిస్థాయిలో శనగలు కొనే పరిస్థితి లేదు. జిల్లాలో తొమ్మిది కొనుగోలు కేంద్రాలు జిల్లాలో మార్కెట్ కమిటీ నిజామాబాద్, ప్రాథమిక వ్యవసాయ సహాకార సంఘాలు బోధన్, సాలూర, కల్దుర్కి, హున్సా, పోతంగల్, రెంజల్, నీలా, జాకోరాలో మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సొసైటీల ద్వారా కొనుగోళ్లు ప్రారంభించింది. ఫిబ్రవరి 22న కేంద్రాలు ప్రారంభించి తొలి విడతలో ఒక్కొక్క కేంద్రానికి నాలుగు వేల క్వింటాళ్లు కొనుగోలుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కొన్ని మినహా చాలా సొసైటీల్లో టార్గెట్ ప్రకారం కొనుగోళ్లు పూర్తి చేశారు. నిజామాబాద్, బోధన్ కేంద్రాలకు అదనంగా 500 క్వింటాళ్లు కొనుగోలుకు అనుమతి ఇచ్చారు. జాకోరా (వర్ని మండలం)కేంద్రంలో ఇప్పటి వరకు కొనుగోళ్లు నమోదు కాలేదు. కొన్ని కేంద్రాల్లో ప్రారంభించిన నాలుగైదు రోజుల్లో లక్ష్యం పూర్తయింది. దీంతో కొనుగోళ్లు నిలిపివేశారు. సాలూర, హున్సా, కల్దుర్కి కేంద్రాల్లో విక్రయానికి తీసుకొచ్చిన శనగ కుప్పల వద్ద రైతులు వారం రోజుల నుంచి పడిగాపులు కాస్తున్నారు. రెండో విడతకు అనుమతి మళ్లీ రెండో విడత నాలుగు వేల క్వింటాళ్ల శనగ కొనుగోళ్లకు సోసైటీలకు అనుమతి ఇచ్చారు. తొలి విడత టార్గెట్ పూర్తి చేసిన కేంద్రాల్లో కొన్ని చోట్ల కొనుగోళ్లు ప్రారంభించారు. దిగుబడితో పోల్చుకుంటే రెండో విడత కొనుగోళ్లు కూడా కొన్ని సొసైటీల్లో మరో రెండు రోజుల్లో అయిపోయే పరిస్థితి ఉంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పూర్తిస్థాయిలో శనగలు కొనుగోలు చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం ప్రస్తుతం సొసైటీల్లో రెండు విడతల్లో 8 వేల క్వింటాళ్ల చొప్పున కొనుగోలుకు అనుమతి ఉంది. అదనంగా కొనుగోలుకు అనుమతి కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. జిల్లా వ్యాప్తంగా మరో 12 వేల టన్నులు కొనుగోలుకు అనుమతి కావాలని ప్రయత్నాలు చేస్తున్నాం. – ప్రవీణ్‌రెడ్డి, మార్క్‌ఫెడ్ జిల్లా అధికారి -
రైతును ముంచిన శనగ
సాక్షి, రాజుపాళెం : రైతులను శనగ పంట ముంచేసింది. ప్రకృతి సహకరించక, ప్రభుత్వం పట్టించుకోక వారు అష్టకష్టాలు పడుతున్నారు. గతేడాది రబీలో జిల్లాలో 84480 హెక్టార్లలో శనగ సాగు చేశారు. విత్తనం వేశాక ఒక్క వాన కూడా పడకపోవడంతో పంట పూర్తిగా ఎండుముఖం పట్టింది. ఎకరాకు కేవలం 2 నుంచి 6 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ప్రతి రైతు ఎకరాకు విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు, ట్రాక్టరు బాడుగలు, కూలీలు తదితర వాటి కోసం రూ.20 నుంచి రూ.25 వేల వరకు ఖర్చు చేశారు. ధర అంతంత మాత్రమే... శనగ పంటకు కనీస మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. ప్రస్తుతం క్వింటా ధర రూ.3500 పలుకుతోంది. గతంలో రైతులు విత్తనం వేసేటప్పుడు కొనుగోలు చేయగా.. క్వింటా రూ.7 వేలు పలికింది. ఇలా ధర వ్యత్యాసం ఉంటే ఎలా గట్టెక్కుతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మద్దతు ధర రూ.8000 కల్పించి ఉంటే.. పరిస్థితి కొంత వరకు బాగుండేదని వారు పేర్కొన్నారు. కౌలు రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఎకరాకు రూ.7 వేల నుంచి రూ.14 వేలు చెల్లించి కౌలుకు తీసుకున్నారు. దీంతో పెట్టుబడులు కూడా చేతికి అందలేదు. అటు అప్పులు కట్టలేక, ఇటు ధాన్యం అమ్ముకోలేక సందిగ్ధంలో ఉన్నారు. మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. చాలా మంది రైతులకు టోకన్లు దొరకక అమ్ముకోలేదు. మరి కొంతమంది రైతులు శనగ పంట నూర్పిడి తర్వాత పొలాల్లోనే వ్యాపారులకు అనామత్ (ధాన్యం వేశాక ఎప్పుడైనా అమ్ముకోవచ్చు) వేశారు. ప్రభుత్వ గోదాములు నిండిపోవడంతో చాలా మంది ప్రైవేటు గోదాములను ఆశ్రయించారు. ఒక్కో బస్తాకు ఏడాదికి రూ.130 బాడుగ చెల్లిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చొరవ చూపి గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు. రైతులకు వేలం నోటీసులు ఒక వైపు గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న రైతాంగానికి బ్యాంకులు వేలం నోటీసులు ఇవ్వడంతో.. దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. గోదాముల్లో ఉంచిన ధాన్యాన్ని ప్రైవేటు, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారు. గతంలో క్వింటా ధర రూ.10 వేలు పలికింది. ఇలాంటి ధర వచ్చిన తర్వాత అమ్ముకుందామని కొందరు రైతులు భావించారు. అయితే ఏడాది గడిచినా ధర తక్కువగా ఉండటంతో అమ్ముకోలేక పోయారు. బ్యాంకుల్లో తీసుకున్న రుణం చెల్లించక ఏడాది పూర్తి కావడంతో.. బ్యాంకర్లు రైతులకు వేలం నోటీసులు పంపారు. ఆ తర్వాత శనగలు వేలం వేస్తామని పత్రికల్లో ప్రకటన ఇచ్చారు. దీంతో రైతులు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తీసుకున్న రుణానికి వడ్డీ చెల్లించి, రుణాలను రెన్యువల్ చేయాలని కోరినా బ్యాంకర్లు వినుకోవడం లేదు. గతంలో క్వింటా ధర రూ.6000 నుంచి రూ.6500 వరకు ఉండటంతో.. బ్యాంకులు క్వింటాకు రూ.3500 నుంచి రూ.4500 వరకు రుణం ఇచ్చాయి. ప్రస్తుతం క్వింటా రూ.3500 పలుకుతుండటంతో తీసుకున్న అప్పునకు కూడా సరిపోవడం లేదు. ఎమ్మెల్యేను కలిసిన రైతులు రుణం చెల్లించకుంటే ఈ నెల 22న వేలం వేస్తామని బ్యాంకులు పత్రికల్లో ప్రకటన ఇచ్చాయి. దీంతో రాజుపాళెం మండలంలోని పలు గ్రామాల రైతులు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డిని కలిసి, పరిస్థితి వివరించారు. ఎమ్మెల్యే వెంటనే బ్యాంక్ మేనేజర్‌తో ఫోన్లో మాట్లాడారు. ‘రైతులకు రుణాలు ఇచ్చేటప్పుడు ఫలానా రోజు కట్టాలని చెప్పలేదు కదా.. ఉన్నట్టుండి ఇప్పుడు కట్టమంటే ఎలా కడతారు. కాదు కూడదు రుణం వడ్డీతో సహా చెల్లించాలంటే నేనే చెల్లిస్తా. గాంధీ మార్గంలో దీక్ష చేస్తా. శనగలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వేలం వేయనీయబోం’ అని మేనేజర్‌కు ఎమ్మెల్యే చెప్పారు. -
శెనక్కాయలు తిన్నాడని చంపేశాడు!
కెరమెరి(ఆదిలాబాద్): తన చేనులో శెనక్కాయలు తిన్నాడని జరిగిన గొడవ ఒకరి మరణానికి దారితీసింది. ఆదిలాబాద్ జిల్లా కెరమెరి మండలం నిశాని గ్రామానికి చెందిన లక్ష్మణ్ తనచేనులో వేరుశెనగ పంట వేశాడు. గురువారం మధ్యాహ్నం గ్రామానికే చెందిన మడావి గంగు (45) ఆ చేనులో వేరుశెనగకాయలు తింటుండగా లక్ష్మణ్ అతనితో గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. తీవ్ర ఆగ్రహానికి లోనైన లక్ష్మణ్ రాయితో గంగు తలపై కొట్టటంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. ఈ మేరకు ఏఎస్సై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.