Police Housing Corporation
-
పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా దామోదర్ గుప్తా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా మూడోసారి కోలేటి దామోదర్ గుప్తాను నియమిస్తూ సీఎం కేసీఆర్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రామగుండం ప్రాంతానికి చెందిన కోలేటి దామోదర్ గుప్తాను సీఎం కేసీఆర్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించారు. వరుసగా మూడుసార్లు తనకు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా అవకాశం కల్పించినందుకు దామోదర్ గుప్తా కృతజ్ఞతలు తెలిపారు. -
ఏపీ ఆర్టీసీ ఎండీగా ద్వారకా తిరుమలరావు నియామకం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ఎండీగా సీనియర్ ఐపీఎస్ అధికారి ద్వారకాతిరుమలరావు నియమితులయ్యారు. ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా విధులు నిర్వర్తిస్తున్న ఆర్పీ ఠాకూర్ రిటైర్ కావడంతో ఆ స్థానాన్ని ద్వారకా తిరుమలరావు భర్తీ చేయనున్నారు. అలాగే పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా ఎన్.సంజయ్ నియమకాన్ని ఖరారు చేసింది ఏపీ సర్కార్. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వలు జారీ చేశారు. చదవండి: 14 మెడికల్ కాలేజీల నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన -
సీఎంపై అనుచిత వ్యాఖ్యలు, డీఈ సస్పెన్షన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎంవీ విద్యాసాగర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ముఖ్యమంత్రిపై అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ, సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ సోమవారం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. దుష్ప్రవర్తన, క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు సస్పెండ్ చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ మాట్లాడుతూ... ‘డీఈ విద్యాసాగర్ తన మొబైల్ వాట్సాప్ గ్రూప్‌ల్లో కొన్ని ప్రభుత్వ వ్యతిరేక విషయాలను పోస్ట్ చేశారు. ముఖ్యమంత్రిని అసభ్య పదజాలంతో దూషిస్తూ, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను తన వాట్సాప్ గ్రూప్‌లలో విమర్శించారు. మా విచారణలో ఆధారాలతో సహా అవన్ని వాస్తవమని తేలాయి. ఉద్యోగులు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో లేదా బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. అతిక్రమిస్తే రాష్ట్ర ప్రభుత్వ ప్రవర్తనా నియమావళి ప్రకారం క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాం’ అని స్పష్టం చేశారు. చదవండి: ‘మా అమ్మ మంచి తల్లి, కానీ నేనే బ్యాడ్’ -
పోలీసులకు సొంత ‘గూడు’!
సాక్షి, అమరావతి: పదవీ విరమణ చేసే నాటికి పోలీసులకు సొంత గూడు కోసం కసరత్తు మొదలైంది. ఈ మేరకు ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ నడుంబిగించింది. సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను ఆదేశించారు. డీజీపీ చొరవతో ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ పీవీ సునీల్‌కుమార్ నేతృత్వంలో 15 మంది పోలీసు అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో ప్రత్యేక బృందం ఏర్పాటైంది. ఈ బృందం ఇప్పటికే తమిళనాడు వెళ్లి అక్కడ పోలీస్ హౌసింగ్ స్కీమ్ అమలవుతున్న తీరును అధ్యయనం చేసింది. ప్రతిపాదనలు కార్యరూపంలోకి వస్తే రాష్ట్రంలో దాదాపు 65 వేల పోలీస్ కుటుంబాలకు సొంత ఇంటి కల నెరవేరుతుంది. తమిళనాడునే ఎందుకు ఎంచుకున్నారంటే.. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తమిళనాడులో ప్రత్యేకంగా పోలీస్ హౌసింగ్ స్కీమ్ అమలవుతోంది. ‘వోన్ యువర్ హౌస్’ అనే పేరుతో ఈ పథకాన్ని జయలలిత ముఖ్యమంత్రిగా ఉండగా అక్కడ అమల్లోకి తెచ్చారు. దాదాపు 20 ఏళ్ల నుంచి ఈ స్కీమ్ విజయవంతంగా కొనసాగుతోంది. ప్రభుత్వమే నేరుగా స్థల సేకరణ చేసి పోలీసులకు ఇల్లు కట్టిస్తోంది. ఇందుకు ప్రభుత్వ నిధులను వినియోగించడంతోపాటు బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటోంది. పోలీసులకు ప్రభుత్వం ప్రతి నెలా ఇచ్చే ఇంటి అద్దె అలవెన్స్ (హెచ్ఆర్ఏ)ను మినహాయించి ఈ మొత్తానికి ప్రభుత్వం కొంత కలిపి నెలవారీ వాయిదాలు చెల్లిస్తోంది. పోలీసులు ఇలా నెలవారీ వాయిదాలు చెల్లించిన అనంతరం పదవీ విరమణ నాటికి ఆ ఇల్లు వారి సొంతమవుతుంది. సాధ్యాసాధ్యాలు పరిశీలించాకే నివేదిక ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ పీవీ సునీల్‌కుమార్ తమిళనాడు స్కీమ్ రాష్ట్రానికి ఎంత వరకు సరిపోతుందనే దానిపై నివేదిక రూపొందిస్తున్నాం. క్షేత్రస్థాయిలో అంశాలను అధ్యయనం చేస్తున్నాం. అన్ని జిల్లాలు, అన్ని నగరాల్లో ప్రస్తుతం భూముల ధరలు ఎలా ఉన్నాయి? ఎంత భూమి అవసరమవుతుంది? హౌసింగ్ స్కీమ్‌లో ఎంత మంది చేరడానికి మక్కువ చూపుతారు? వంటి అనేక విషయాలపై వివరాలు సేకరిస్తున్నాం. తమిళనాడు తరహాలో ప్రభుత్వమే పోలీసులకు ఇల్లు కట్టించి నెలవారీ వాయిదాలు వారి వేతనాల్లోంచి తీసుకోవడమా? ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉన్నాయా? అనే వాటిపై కూడా దృష్టిపెట్టాం. పోలీసుల గృహవసతి కోసం ఇచ్చే స్థలం, నిర్మాణ వ్యయంలో ప్రభుత్వ భాగస్వామ్యం ఏ మేరకు ఉండాలి.. ఇలా అన్ని కోణాల్లోనూ అధ్యయనం చేస్తున్నాం. అన్ని విభాగాల్లోని పోలీసులకు ఆప్షన్స్ ఇచ్చి ఎక్కువ మంది ఏ పద్ధతికి మొగ్గుచూపుతారో తెలుసుకుంటాం. అందులో సాధ్యాసాధ్యాలు తెలుసుకున్నాకే ప్రభుత్వానికి నివేదిక అందిస్తాం. -
ఏపీ పోలీస్ హౌసింగ్.. సరికొత్త రికార్డు
ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్స్టేషన్లు, పోలీసుల క్వార్టర్లు నిర్మించడానికి 40 ఏళ్ల క్రితం ఏర్పడ్డ ఈ సంస్థ ఏడాదికి గరిష్టంగా రూ.250 కోట్ల విలువైన భవన నిర్మాణ పనులు మాత్రమే చేసేది. అలాంటిది ప్రస్తుత ఏడాదిలో ఏకంగా రూ.1,750 కోట్ల విలువైన నిర్మాణ పనులు చేపట్టే స్థాయికి చేరడం విశేషం. కార్పొరేషన్ పనితీరు నచ్చిన వివిధ ప్రభుత్వ శాఖలు కూడా తమ భవన నిర్మాణాల బాధ్యతలను దానికే అప్పగిస్తుండటం గమనార్హం. సాక్షి, అమరావతి : రాష్ట్రవ్యాప్తంగా 25 పోలీస్స్టేషన్లను ఆధునిక వసతులతో, అతి తక్కువ సమయంలో నిర్మించి రికార్డు సృష్టించిన ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా నెల్లూరు, కాకినాడలో జిల్లా పోలీస్ కార్యాలయాలను నిర్మించి మరో ఘనతను సాధించింది. అదేవిధంగా విశాఖపట్నంలో గ్రేహౌండ్స్ ప్రధాన కార్యాలయ భవనాలను కూడా అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో నిర్మించింది. ప్రస్తుతం రాజధాని ప్రాంతం తుళ్లూరులో రూ.45.40 కోట్లతో ఫోరెన్సిక్ సైన్స్ విభాగానికి పరిపాలన భవనంతోపాటు ఇతర మౌలిక భవనాలను నిర్మిస్తోంది. వివిధ ప్రభుత్వ విభాగాలకు సంబంధించి సాంఘిక సంక్షేమ శాఖ, పశు సంవర్థక శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, శ్రీ పద్మావతి మహిళా, శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ, శ్రీ వేంకటేశ్వర, ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయాలతోపాటు అనేక సంస్థలు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ సేవలను వినియోగించుకోవడం గమనార్హం. నిర్మాణాల్లో ఆధునిక పద్ధతులు నిర్మాణ రంగంలో పోటీని తట్టుకునేందుకు కార్పొరేషన్ వినూత్న ఆవిష్కరణలు చేపట్టింది. నిర్మాణ రంగంలో ఎక్కువ సమయం వృథా అయ్యే దశలను గుర్తించి ‘డ్యాష్ బోర్డ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్’ను ప్రవేశపెట్టింది. ఈ విధానం ద్వారా ప్రత్యక్ష పర్యవేక్షణ సులువవడంతోపాటు త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవచ్చు. రియల్‌టైమ్ మానిటరింగ్, ఈజీ ప్లానింగ్, కచ్చితమైన ప్రాజెక్ట్ ట్రాకింగ్, సమర్థవంతంగా బడ్జెట్ కంట్రోల్, రిస్క్ ఎనాలిసిస్, పారదర్శకతకు ఇది దోహదపడుతుంది. ఆధునిక సాంకేతిక పద్ధతులను నిర్మాణాల్లో ఉపయోగించేందుకు పరిశోధన అభివృద్ధి విభాగాన్ని, మరిన్ని నిర్మాణ పనులు దక్కించుకుని లాభాలు ఆర్జించేందుకు మార్కెటింగ్ సెల్‌ను కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. అదేవిధంగా కార్పొరేషన్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు నైపుణ్యాలు మెరుగుపడేలా ఎప్పటికప్పుడు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట ఉద్యోగులు, సిబ్బంది సంక్షేమానికి కూడా కార్పొరేషన్ ప్రాధాన్యత ఇస్తోంది. ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ టాప్ అప్ నిమిత్తం 2014 నుంచి పెండింగ్‌లో ఉన్న రూ.5.27 కోట్ల ఎల్ఐసీ బకాయిలను తాజాగా చెల్లించింది. ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతుల అంశాన్ని కూడా పరిష్కరించింది. పది మంది ఏఈ, ఏఈఈలకు డీఈఈలుగా, ఒక డీఈకి ఈఈగా, ముగ్గురు సూపరింటెండెంట్లను ఏవోలుగా, పది మంది సీనియర్ అసిస్టెంట్, సీనియర్ అకౌంటెంట్లకు సూపరింటెండెంట్లుగా, జూనియర్ అసిస్టెంట్లను సీనియర్ అసిస్టెంట్లుగా ఇటీవల పదోన్నతులు కల్పించారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలను ప్రభుత్వ ఉద్యోగుల జీతాలతో సమానంగా పెంచడంతోపాటు బీమా సౌకర్యాన్ని ప్రవేశపెట్టారు. దేశంలో ఏ ఇతర హౌసింగ్ కార్పొరేషన్ కూడా ఈ తరహా పథకాన్ని ప్రవేశపెట్టకపోవడం గమనార్హం. సమష్టి కృషితోనే రికార్డు నేను బాధ్యతలు చేపట్టిన ఏడాది కాలంలోనే సమష్టి కృషితో రికార్డును సాధించడం ఆనందంగా ఉంది. తక్కువ వ్యయం, నాణ్యతతోపాటు నిర్ణీత సమయానికి నిర్మాణాలు పూర్తి చేయడంతో కార్పొరేషన్‌కు ఇతర శాఖల నిర్మాణ పనులు కూడా దక్కుతున్నాయి. వ్యాపారాభివృద్ధికి మాత్రమే కాకుండా సంస్థలో పనిచేస్తున్న అందరి సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. – పీవీ సునీల్ కుమార్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ, వైస్ చైర్మన్ -
టీఎస్పీహెచ్సీ చైర్మన్ పదవీకాలం పొడిగింపు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ పోలీసు గృహ నిర్మాణ సంస్థ(టీఎస్పీహెచ్సీ) చైర్మన్‌గా కోలేటి దామోదర్ గుప్తా పదవీకాలం మరో ఏడాది పొడిగించారు. ఆయన పదవీకాలాన్ని ఏడాది కాలం పొడగిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్‌వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో అన్ని స్థానాలు గెలిచి క్లీన్‌స్వీప్ చేస్తారని కోలేటి దామోదర్‌గుప్తా అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పనిచేసేవారంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎంతో ఇష్టమని, తన పనితనాన్ని చూసి ఆయన తన పదవీకాలాన్ని పొడగించారన్నారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‌ను మరింత బలోపేతం చేసి పాలనను పారదర్శకం చేస్తానని ఆయన అన్నారు. -
రూ.375 కోట్లతో నూతన పోలీస్ భవనాలు
116 చోట్ల కొత్త పోలీస్స్టేషన్లు, క్వార్టర్లు పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్, ఎండీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్తో పాటు ఎక్సైజ్, జైళ్ల శాఖకు సంబంధించిన భవన నిర్మాణాలను నిబద్ధతతో చేపడుతున్నా మని పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ తెలిపారు. నూతన జిల్లాల ఎస్పీ, కమిషనరేట్ల భవనాలు, పోలీస్ స్టేషన్ల ఆధునీ కరణ తదితర నిర్మాణాలను హౌజింగ్ కార్పొరేషన్ ప్రతిష్టాత్మకంగా చేపడుతోం దని ఆయన చెప్పారు. రాష్ట్ర పోలీస్ ముఖ్య కార్యాల యంలోని హౌజింగ్ కార్పొరేషన్లో ఆయన మీడియా తో మాట్లాడారు. రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇప్పటివరకు పోలీస్ శాఖలోని నిర్మాణాలతో పాటు జైళ్ల శాఖ, ఎక్సైజ్ శాఖకు సంబంధించి రూ.1100 కోట్ల విలు వైన నిర్మాణాలను తమ హౌజింగ్ బోర్డు నిర్మిస్తోం దన్నారు. తనకు ఈ పదవి ఇచ్చి తోడ్పాటు అందిం చిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞ తలు తెలుపుతున్నాన న్నారు. పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న పనులను ఎండీ మల్లారెడ్డితో కలసి మీడియాకు వెల్లడించారు. వివరాలు... ♦ రాష్ట్రంలో 116 చోట్ల పోలీస్ స్టేషన్ భవనా లు, క్వార్టర్లను నిర్మించడానికి ప్రభుత్వం రూ.93.07 కోట్లను మంజూరు చేసిందని తెలిపారు. 13 జిల్లా పోలీస్ కార్యాలయాలు, రెండు కమిషనరేట్ల నిర్మాణా నికి రూ. 375 కోట్లు మంజూరు చేయగా, ఈ పనులు టెండర్లు పిలిచే దశలో ఉన్నాయి. ♦ వివిధ జిల్లాల్లో ఐఆర్ బెటాలియన్స్ నిర్మాణానికి ప్రభుత్వం రూ. 20 కోట్లు మంజూరు చేయగా, అందులో మూడు పనులు రూ. 10 కోట్ల ఖర్చుతో పురోగతిలో ఉన్నాయి. ఠి గ్రేహౌండ్స్ దళాలకు సంబంధించిన పనులకు గాను రూ. 68 కోట్లు మంజూరు చేయగా, వీటిలో తొమ్మిది పనులు పూర్తి అయ్యాయని, మిగిలిన పది పనులు పురోగతిలో ఉన్నాయి. ♦ ఇక జైళ్ల శాఖకు సంబంధించిన 31 పనులకుగాను రూ. 4.44 కోట్లు మంజూరు చేయగా, 31 పనులు పురోగతిలో ఉన్నాయి. అగ్నిమాపక శాఖకు సంబంధించిన 137 పనులను రూ.23.15 కోట్లతో చేపడుతున్నారు. ♦ ఆబ్కారీ శాఖకి సంబంధించిన 9 స్టేషన్ బిల్డింగ్ పనులలో 8 పూర్తి అయ్యాయి. ఒక పని పురోగతిలో ఉంది. వీటి మొత్తం ఖర్చు రూ. 358.25 కోట్లు. ♦ రూ.100 కోట్లతో కరీంనగర్ నూతన కమిషనరేట్ భవనంతోపాటు బ్యారక్‌లు, క్వార్టర్లు, పరేడ్ గ్రౌండ్, ఆర్మ్డ్ రిజర్వ్ హెడ్‌క్వార్టర్, బెల్ ఆఫ్ ఆర్మ్స్ తదితర నిర్మాణాలను చేపడుతున్నారు. ♦ఇవి కాక కార్పొరేషన్ దగ్గరున్న రూ.30 కోట్లతో ఫ్రంట్ ఆఫీసుల నిర్మాణం, రూ.46.98 కోట్లతో పోలీస్ శిక్షణా సంస్థల స్థాయి పెంపు, రూ. 20 కోట్ల వ్యయంతో తెలంగాణ పోలీస్ అకాడమీ పనులు, రూ.30 కోట్లతో వరంగల్ కమిషనరేట్ పనులు జరుగుతున్నాయి. -
హౌసింగ్ సొసైటీలో అక్రమాలపై సీఐడీ
♦ దేవుని కడప పోలీసు హౌసింగ్ సొసైటీలో గోల్మాల్ ♦ రాజకీయాలకతీతంగా విచారణ జరిగేలా ప్రణాళిక ♦ ఇటీవలే పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు ♦ కర్నూలు సీఐడీకి అప్పగిస్తూ నిర్ణయం సాక్షి కడప : పోలీసు హౌసింగ్ సొసైటీ గోల్మాల్ వ్యవహారాన్ని జిల్లా పోలీసు యంత్రాంగం సీరియస్‌గా తీసుకుంది. రాజకీయాలకతీతంగా.. నిష్పక్షపాతంగా విచారణ జరిగితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పలువురు భావిస్తున్న నేపథ్యంలో సీఐడీ(క్రైం ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంటు)కి అప్పగించారు. అందుకు సంబంధించి కేసును సీఐడీకి అప్పగిస్తూ మంగళవారమే నిర్ణయం తీసుకున్నప్పటికి బుధవారం ఫైల్స్‌ను అందజేసినట్లు తెలుస్తోంది. కడప నగరంలోని దేవుని కడప పోలీస్ హౌసింగ్ సొసైటీ వ్యవహారంలో అక్రమాలు చోటుచేసుకున్నట్లు పిర్యాదులు వెలువెత్తాయి. దీంతో ప్రస్తుత ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ సీఐడీకి కేసును అప్పగించారు. కోట్లాది రూపాయల అక్రమాలు జరగడంతోనే.. జిల్లాలోని పోలీసులకు సంబంధించి 2004లో హౌసింగ్ సొసైటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దేవుని కడప ప్రాంతంలోని కొంత భూమిని పోలీసు సొసైటీకి కేటాయించారు. ఇందులో కానిస్టేబుల్ నుంచి ఎస్పీస్థాయి అధికారుల వరకు దాదాపు 440మందికి ఇళ్ల పట్టాలు నామమాత్రపు ధరతో అందజేశారు. ఈ వ్యవహారంలో కొంతమందికి ప్రత్యేక లబ్ధి జరిగిందని..రూ.కోట్లలో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఇటీవలే ఆరోపణలు వెల్లువెత్తాయి. పెద్దఎత్తున పోలీసు వర్గాల్లో ప్రచారం జరగడంతోపాటు చర్చకు దారితీసిన నేపథ్యంలో ఇటీవలే ఒకరు కడపలోని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో హౌసింగ్ సొసైటీ అక్రమాలపై పిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే కోట్లకు సంబంధించిన అక్రమాల వ్యవహారం కావడంతో ఈ కేసును సీఐడీకి అప్పగించాలని నిర్ణయించడంతోపాటు వన్‌టౌన్ సీఐ రమేష్‌తో కూడా జిల్లా ఎస్పీ రామకృష్ణ వివరాలపై ఆరా తీశారు. హౌసింగ్ సొసైటీలో అక్రమాల వ్యవహారంలో ఏమి జరుగుతుందోనని ఒకపక్క పోలీసు వర్గాల్లో ఆసక్తి నెలకొనగా.. మరోపక్క అక్రమాలకు పాల్పడిన వారి గుండెల్లో గుబులు రేపుతోంది. నేడో.. రేపో రంగంలో దిగనున్న సీఐడీ దేవుని కడప పోలీస్ హౌసింగ్ సొసైటీ వ్యవహారాన్ని కర్నూలు సీఐడీ పోలీసులకు అప్పగించడంతో త్వరలోనే బృందం కడపకు రానున్నట్లు తెలుస్తోంది. వీటికి సంబంధించి రికార్డులను స్వాధీనం చేసుకోవడంతోపాటు పూర్తిస్థాయిలో విచారణ చేసేందుకు పెద్దఎత్తున రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. కర్నూలు నుంచి త్వరలోనే బృందం కడపకు వచ్చి విచారణ చేపట్టనుంది. హౌసింగ్ సొసైటీ వ్యవహారంపై సంబంధిత పోలీసు అధికారులతోపాటు బాధితులు, ఇతర అన్నివర్గాలతో కూపీ లాగనున్నట్లు సమాచారం. ఈ విషయమై హౌసింగ్ సొసైటీ అక్రమాల వ్యవహారాల కేసును సీఐడీకి అప్పగించినట్లు ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ స్పష్టం చేశారు. -
ఆంధ్రా ఉద్యోగులను రిలీవ్ చేయాలని రేపు ధర్నా
పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‌లోని తెలంగాణ ఉద్యోగుల నిర్ణయం సాక్షి, హైదరాబాద్: పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‌లోని ఆంధ్రా ఉద్యోగులను రిలీవ్ చేయాలని తెలంగాణ ఉద్యోగులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 29న మధ్యాహ్నం భోజన విరామ సమయంలో హైదరాబాద్ సైఫాబాద్‌లోని కార్పొరేషన్ కార్యాలయంలో ధర్నా చేపట్టాలని నిర్ణయించారు. అయినా స్పందన లేకుంటే 31 నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేయాలని భావిస్తున్నారు. విభజన చట్టం ప్రకారం షెడ్యూల్ 9లోని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్లో ఉద్యోగుల విభజన పూర్తయ్యింది. రెగ్యులర్ ఉద్యోగుల్లో తెలంగాణకు 79, ఏపీకి 99 మందిని కేటాయించారు. కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ సిబ్బంది విభజన పూర్తికాలేదు. ఏపీకి కేటాయించిన రెగ్యులర్ ఉద్యోగులు ఇంకా రిలీవ్ కాలేదు. దీంతో టీ సర్కార్ ప్రకటించిన పీఆర్సీ, ఇంక్రిమెంట్లు అందకుండా పోతున్నాయని టీ ఉద్యోగులు వాపో తున్నారు. కావాలనే ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ కాలయాపన చేస్తున్నారని అంటున్నారు. -
సమ్మె యోచనలో పోలీస్ హౌసింగ్ ఉద్యోగులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన జరిగి ఏడాది పూర్తయినా విభజన కష్టాలు తీరడం లేదు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఉద్యోగుల విభజన ఇప్పటిదాకా పూర్తికాకపోవడంతో తెలంగాణకు చెందిన వారు సమ్మెకు సిద్ధమవుతున్నారు. విభజన చట్టం ప్రకారం తొమ్మిదో షెడ్యూల్లో ఉన్న సంస్థలను ఏడాదిలోగా విభజన చేయాల్సి ఉంది. అయితే గడువు దాటినా కూడా ఇప్పటి దాకా ఉద్యోగుల విభజన పూర్తికాలేదు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్లో పనిచేసే ఉద్యోగుల స్థానికతపై కనీస సమాచారం కూడా సేకరించడం లేదని, ఆంధ్ర ప్రాంత అధికారులు సహకరించకపోవడం వల్లే తాత్సారం జరుగుతోందని తెలంగాణ ప్రాంత ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ, ఇంక్రిమెంట్లు తమకు అందకుండాపోతున్నాయన్నారు. అదేవిధంగా కార్పొరేషన్ విభజన పూర్తయితేనే కాంట్రాక్టు ఉద్యోగులకు రెగ్యులరైజేషన్ అవకాశం ఉంది. దీంతో గతకొంత కాలంగా కార్పొరేషన్ విభజన కోసం తెలంగాణ ఉద్యోగులు అంతర్గతంగా తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ జరగకపోవడానికి నిరసనగా ఈనెల 3 (సోమవారం) నుంచి పది జిల్లాల ప్రధాన కార్యాలయాలతో పాటు సబ్డివిజన్లలో కూడా సమ్మె చేయాలని ఉద్యోగుల సంఘం నిర్ణయించింది. పోలీస్ విభాగానికి చెందిన అన్ని రకాల భవనాల నిర్మాణంతో పాటు సదుపాయాల కల్పనను కార్పొరేషన్ సంస్థ ద్వారానే నిర్వహిస్తారు. ఈ సంస్థలో ఇంజనీరింగ్, నాన్‌టెక్నికల్, అకౌంట్స్ తదితర విభాగాల్లో మొత్తం తెలంగాణ ప్రాంతానికి సంబంధించి 200 మంది వరకు ఉన్నారు. -
‘పోలీసు హౌసింగ్’ చైర్మన్‌గా వెంకటేశన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్‌గా హోంశాఖ కార్యదర్శి బి.వెంకటేశన్, డెరైక్టర్లుగా డీజీపీ, ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ జేఏండీలను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు కొత్త కంపెనీని రిజిస్టర్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశిస్తూ హోంశాఖ కార్యదర్శి బి.వెంకటేశన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉండగా డెరైక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్‌గా హోంశాఖ కార్యదర్శి వెంకటేశన్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
ఎస్పీ ఇంటివద్ద రెక్కీ ?
పెనమలూరు (కృష్ణా): యవాడ శివారులోగల కానూరులోని ఓ పోలీసు ఉన్నతాధికారి ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు గురువారం వేకువజామున రెక్కీ నిర్వహించారు. అయితే వీరు దొంగతనానికి వచ్చారా? లేక ఏదైనా చర్యకు పాల్పడటానికా ? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ ఇల్లు శ్రీకాకుళం జిల్లా ఎస్పీది కావడంతో ఆయన కుటుంబసభ్యులు ఈ ఘటనతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. స్థానికులు, ఎస్పీ కుటుంబసభ్యుల నుంచి సేకరించిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం ఎస్పీ ఎ.ఎస్.ఖాన్‌కు విజయవాడ శివారులోని కానూరు గ్రామంలోగల సనత్‌నగర్‌లో మూడంతస్తుల భవనం ఉంది. ఖాన్ భార్య నసీం, తల్లి రహీమున్నిసా, కుటుంబసభ్యులు ఈ భవనంలోని వివిధ పోర్షన్లలో ఉంటున్నారు. గురువారం వేకువజామున మూడు గంటల సమయంలో ఆరుగురు వ్యక్తులు ముఖాలకు వస్త్రాలు కట్టుకుని బైక్‌లపై ఖాన్ ఇంటికి వచ్చారు. లోనికి చొరబడి తలా ఒక అంతస్తులో కలియదిరిగారు. రెండో అంతస్తులో ఎస్పీ భార్య ఉంటున్న పోర్షన్ తలుపు గడియ ఊడబెరికేందుకు యత్నించారు. ఆ అలికిడికి ఎదురింట్లో ఉన్న వారికి మెలకువ వచ్చి బయటకు వచ్చారు. వారిని చూసి గుర్తుతెలియని వ్యక్తులు హడావుడిగా వెళ్లిపోయారు. దీంతో ఎదురింటివారు ఎస్పీ భార్యను లేపి, ఈ విషయాన్ని చెప్పారు. ఆమె కుటుంబసభ్యులను పిలిచి, తన పోర్షన్ తలుపును పరిశీలించారు. తలుపునకు వేసిన గడియ ఊడిపోయి ఉండటాన్ని గుర్తించి, తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన గురించి తెలియడంతో స్థానికులు వచ్చి ఎస్పీ కుటుంబసభ్యులతో మాట్లాడారు. రెక్కీయా...? దొంగతనానికి యత్నమా..? కాగా ఇంట్లోకి ఆరుగురు వ్యక్తులు చొరబడ్డారని తెలుసుకుని ఎస్పీ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఇంట్లోని అన్ని పోర్షన్లలో అందరూ ఉండగా వచ్చినవారు దొంగతనం ఎలా చేయగలరనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో దొంగతనాలు చేయడం అంత తేలిక కాదని స్థానికులు అంటున్నారు. ఆగంతకులు రెక్కీ నిర్వహించటానికి వచ్చారా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ అందుకోసమే అయితే దానికి కారణాలు ఏమిటన్నది అంతుబట్టకుండా ఉంది. పోలీసులు రాత్రి వేళల్లో గస్తీ మమ్మరం చేస్తే భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా ఉంటాయని స్థానికులు పేర్కొంటున్నారు. -
'రూ.3,400 కోట్లు నిధులు అవసరం'
హైదరాబాద్: పోలీసుల గృహనిర్మాణశాఖపై ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సమీక్షా సమావేశం నిర్వహించారు. విభజన తర్వాత పోలీసుల గృహనిర్మాణం కోసం 3,400 కోట్ల రూపాయల నిధులు అవసరమని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. గృహ నిర్మాణాలకు పరిపాలన అనుమతి డీజీ పీకే ఇవ్వాలన్న దానిపై సమావేశంలో సమాలోచనలు జరిపినట్టు వెల్లడించారు. వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని రాజప్ప అంతకుముందు అన్నారు. -
సమాజానికి 24 గంటలు సేవ చేసేవారే పోలీసులు
హైదరాబాద్ : సమాజానికి 24 గంటలు సేవ చేసేవారే పోలీసులు అని నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన ఓపెన్ హౌస్ కార్యక్రమానికి నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ హాజరయ్యారు.విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన అమరవీరులకు ఆయన నివాళులు అర్పించారు. అనంతరం అనురాగ్ శర్మ మాట్లాడుతూ ఈ ఏడాది దేశవ్యాప్తంగా 576మంది పోలీసులు వివిధ సంఘటనల్లో ప్రాణాలు కోల్పోయారన్నారు. వారి త్యాగాలు చిరస్మరణీయమని కొనియాడారు. శత్రువులతో పోరాడి అమరులు అవుతున్న సైనికులకు లభిస్తున్న గుర్తింపు ...విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు లభించటం లేదన్నారు.