pratyusha suicide
-
చనిపోతున్నానని బాయ్‌ఫ్రెండ్‌కు చెప్పిందా?
న్యూఢిల్లీ: ప్రముఖ టీవీ నటి, 'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్ హీరోయిన్ ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య కేసులో సరికొత్త కోణం వెలుగుచూసింది. ఈ కేసులో సోమవారం బొంబాయి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మృదుల భట్కర్ వాదనలు విన్నారు. చనిపోయేరోజున ప్రత్యూష తన ప్రియుడు రాహుల్ రాజ్ కు చేసిన చివరి ఫోన్‌కాల్ రికార్డింగ్‌ను వినాలని న్యాయమూర్తి నిర్ణయించారు. చివరి ఫోన్‌కాల్ రికార్డింగ్‌లో పలు కీలకమైన విషయాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. తాను ఆత్మహత్య చేసుకోబోతున్నానని ఈ ఫోన్‌కాల్‌లోనే ప్రత్యూష రాహుల్‌కు చెప్పిందని ఆమె లాయర్ చెప్తున్నారు. మరోవైపు ఈ కేసును విచారిస్తున్న బాంగుర్ నగర్ పోలీసులు ఫోరెన్సిక్ నివేదికను అందుకున్నారు. ఈ నివేదికలో కీలక అంశాలు వెలుగుచూశాయి. చనిపోయేరోజున 24 ఏళ్ల ప్రత్యూష మద్యం మత్తులో ఉందని ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించినట్టు సమాచారం. ప్రత్యూష చాలా అప్పులు చేసిందని, అప్పులవారి బాధ నుంచి తప్పించుకునేందుకు తరచూ మద్యం తాగేదని సన్నిహితులు చెప్తున్నారు. ప్రియుడు రాహుల్ రాజ్‌తోనూ తనకు సత్సంబంధాలు లేకపోవడం, తరచూ గొడవలు జరుగుతుండటంతో ఆమె ఆత్మహత్యకు దారితీసినట్టు పోలీసులు భావిస్తున్నారు. తన ఆత్మహత్యకు ముందురోజు రాహుల్, ప్రత్యూష తన స్నేహితులకు పార్టీ ఇచ్చారని, ఈ పార్టీకి వారి సన్నిహితులు మాత్రమే హాజరయ్యారని పోలీసుల విచారణలో వెల్లడైంది. అంతేకాకుండా చనిపోయేరోజున మధ్యాహ్నం బాగా మద్యం తాగుతుండటంతో ప్రత్యూషను రాహుల్ తిట్టాడని, సాయంత్రం ఆమె ఆత్మహత్య చేసుకుందని పోలీసు వర్గాలు తెలిపాయి. మరోవైపు ప్రత్యూష మృతి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాహుల్‌రాజ్‌కు బొంబాయి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ప్రత్యూష మృతి వ్యవహారంలో తాను అమాయకుడినని రాహుల్ చెప్తున్నాడు. -
పని లేదని బాధపడొద్దు
తగినంత పని చేతిలో లేకపోయినా పెద్దగా బాధపడొద్దని నటీనటులను బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కోరాడు. టీవీ నటి ప్రత్యూషా బెనర్జీ మృతిపట్ల ఆయన తన సంతాపం తెలిపారు. 'ఫ్యాన్' సినిమా ప్రమోషన్ సందర్భంగా షారుక్‌ను ఈ అంశంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దానికి షారుక్ సమాధానమిచ్చారు. ''మీరు అడుగుపెట్టిన రంగంలో తగినంత విజయం రాకపోయినా నిరాశపడొద్దు. ప్రతివాళ్లకు మంచిరోజులు, చెడ్డరోజులు వస్తుంటాయి. చెడ్డ రోజుల గురించి ఆలోచిస్తూ బాధపడటం అనవసరం. మీకు పని చేతనైతే ఈరోజు కాకపోతే రేపు మీకు వచ్చి తీరుతుంది. మీ ప్రయాణం మొదలుపెట్టినప్పుడు మీలో సత్తా ఉండబట్టే ఇక్కడివరకు వచ్చారు. ఇప్పటికే ఈ రంగంలో స్థిరపడ్డారు కాబట్టి పని ఎందుకు దొరకదు? ఒకటి రెండు రోజులు దొరక్కపోయినా మీరు ఆందోళన చెందొద్దు'' అని సలహా ఇచ్చారు. అనవసరంగా బాధపడినంత మాత్రాన ప్రయోజనం ఉండదని అన్నారు. టాలెంట్ ఉంటే పని అదే దొరుకుతుందని, దాని మీద విశ్వాసం ఉంచాలని చెప్పారు. బాలికా వధు సీరియల్‌తో తారాపథానికి వెళ్లిన ప్రత్యూషా బెనర్జీ ఆత్మహత్యతో టీవీ పరిశ్రమ యావత్తు దిగ్భ్రాంతిలో మునిగిపోయింది. -
ప్రత్యూషది హత్య కేసు అయ్యే అవకాశం?
ముంబై: ప్రముఖ టీవీ నటి ప్రత్యూష బెనర్జీ మృతికేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఆమె ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్‌కు ముంబై కోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. రాహుల్ కు ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని ప్రత్యూష కుటుంబం తరఫు న్యాయవాది వ్యతిరేకించారు. ప్రత్యూష కేసు హత్యకేసు అయ్యే అవకాశముందని, కాబట్టి ముందస్తు బెయిల్ ఇవ్వరాదని జడ్జికి విజ్ఞప్తి చేశారు. దీంతో బెయిల్ ఇవ్వడం లేదంటూ జడ్జి కేఎఫ్ అహ్మద్ ఉత్తర్వులు ఇచ్చారు. బెయిల్ కోసం ఆయన ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారా? లేదా? అన్నది ఇంకా స్పష్టం కాలేదు. మరోవైపు ప్రత్యూషది నూటికి నూరుపాళ్లు హత్యేనని, ఈ కేసులో రాహుల్‌ను తీవ్రంగా శిక్షించాలని ఆమె తల్లి డిమాండ్ చేసింది. ప్రత్యూషను ఆత్మహత్యకు పురికొల్పినట్టు రాహుల్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇక రాహుల్ గతంలో కూడా పలువురు మహిళలను మోసం చేసినట్టు తెలుస్తోంది. అతడు తమను మోసం చేసి లక్షల రూపాయలు వసూలు చేశాడని టీవీ పరిశ్రమకు చెందిన హీర్ పటేల్, కేశా కంభాటితోపాటు మరో మహిళ ఆరోపించారు. రాహుల్ వలలో చిక్కి మోసపోయిన మహిళలు డజను వరకు ఉంటారని వారు చెప్పారు. -
హీరోయిన్ల పరిస్థితి పనిమనుషుల కన్నా దారుణం!
ముంబై: ప్రముఖ బాలీవుడ్ సినీ దర్శక నిర్మాత మహేశ్ భట్ ఇండస్ట్రీలోని నటీమణుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చాలామంది టీవీ, సినిమా నటీమణులు బహిరంగంగా మహిళా సాధికారిత గురించి మాట్లాడుతున్నా, ఇంట్లో వారి పరిస్థితి పనిమనుషుల కంటే దారుణంగా ఉందని పేర్కొన్నారు. టీవీనటి ప్రత్యూష బెనర్జీ మృతి నేపథ్యంలో టీవీ, సినీ రంగాల్లో విజయవంతమవుతున్న మహిళలు కూడా భాగస్వాముల విషయంలో ఎందుకు బలహీనంగా మారిపోతున్నారనే చర్చ జరుగుతోంది. దీనిపై మహేశ్ భట్ మాట్లాడుతూ సినీ రంగుల ప్రపంచంలో వృత్తిపరమైన విజయం సాధించినంతమాత్రాన అది భావోద్వేగమైన స్వేచ్ఛను ఇవ్వలేదని అన్నారు. 'ఇది నిజంగా విషాదకరం. అసహనం వెళ్లగక్కే తమ భాగస్వాముల నుంచి మహిళలు విముక్తి పొందేందుకు ఆర్థిక స్వాతంత్ర్యం వారికి దోహద పడుతుందని ఒకప్పుడు నేను అనుకునేవాణ్ని. కానీ, చిత్రసీమలో నేను ఎంతోమంది నటీమణులను చూశాను. వారి వద్ద ఊహించలేనంత డబ్బు ఉంది. మహిళలు, మహిళల సాధికారిత గురించి వారు అద్భుతమైన అభిప్రాయాలు వెల్లడించేవారు. వాళ్లు చెప్పే సూక్తుల కోసం చాలామంది ఎదురుచూసేవాళ్లు. కానీ వ్యక్తిగత జీవితంలో వాళ్లు ఎంతగా హింస ఎదుర్కొన్నారంటే.. పనిమనుషులు కూడా అంతటి అరాచకాన్ని సహించేవాళ్లు కాదు' అని భట్ విలేకరులతో అన్నారు. ఆర్థికంగా బలహీనంగా ఉన్న మహిళలు సైతం తమ భర్తలు పెట్టే హింస భరించలేక, తమ బంధాన్ని తెంపేసుకుంటున్నారని, కానీ చాలామంది నటీమణులు మాత్రం ఇప్పటికీ మునిగిపోయేందుకు సిద్ధంగా ఉన్న అనుబంధాలను పట్టుకొని వేలాడుతున్నారని, ఎంతటి ఆర్థిక స్వేచ్ఛ ఉన్నప్పటికీ పలువురు స్టార్ హీరోయిన్లు ఇదేరకమైన అనుబంధాల్లో కొనసాగుతున్నారని ఆయన చెప్పారు. వచ్చే శుక్రవారం విడుదలకానున్న 'లవ్ గేమ్స్' సినిమా ప్రమోషనల్ కార్యక్రమంలో భాగంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. -
ప్రత్యూష ఎఫ్ఐఆర్ లో సంచలన అంశాలు!
ముంబై: ప్రముఖ టీవీ నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య కేసులో ఆమె ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్ ను అరెస్టు చేసేందుకు పోలీసుల రంగం సిద్ధం చేశారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న రాహుల్ డిశ్చార్జ్ అయిన వెంటనే అతన్ని అరెస్టు చేయాలని భావిస్తున్నారు. ప్రత్యూషను ఆత్మహత్యకు పురికొల్పడం, ఆమెపై దాడి చేయడం, బెదిరించడం వంటి అభియోగాలతో పోలీసులు అతనిపై చార్జిషీట్ దాఖలు చేయనున్నారు. మరోవైపు ఈ కేసు ఎఫ్ఐఆర్ లోనూ పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. ప్రత్యూష తల్లిదండ్రులు సోమ, శంకర్ బెనర్జీ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం రాహుల్ కు సంబంధించి పలు విషయాలు తెలిపారు. ఆమె తల్లిదండ్రుల వాంగ్మూలం ప్రకారం.. ప్రత్యూష టీవీ నటిగా ప్రాచుర్యం పొంది.. బాగా సంపాదిస్తున్న తర్వాతే రాహుల్ ఆమె జీవితంలోకి ప్రవేశించాడు. అంతకుముందే అతనికి గత సంబంధాల వల్ల తొమ్మిదేళ్ల కొడుకు ఉన్నాడు. 'రాహుల్ తన ఆస్తుల గురించి ప్రత్యూషకు అబద్ధాలు చెప్పాడు. అతను తనకు ముంబైలో నాలుగు ఫ్లాట్లు, సొంతూరిలో 150 ఎకరాల భూమి ఉందని చెప్పాడు. తన తల్లి ఎమ్మెల్యే అని నమ్మబలికాడు. అలా ప్రత్యూష జీవితాన్ని పూర్తిగా తన కంట్రోల్ లోకి తీసుకున్నాడు. ఆ తర్వాత స్నేహితులను కలువకుండా ఆమెను అడ్డుకున్నాడు. మొబైల్ ఫోన్ కూడా వినియోగించనివ్వలేదు. ప్రత్యూష పాత సంబంధాలను గుర్తుచేసి ఆమెను తిట్టేవాడు. కొట్టేవాడు. ఒకప్పుడు వారు నివసించిన కాందివ్లి హౌస్ లో గట్టిగా అరుపులు వినిపించేవని, రాహుల్ కొట్టినప్పుడల్లా ప్రత్యూష బాధతో అరిచేదని ఇరుగుపొరుగు వారు చెప్పారు' అని ఆమె తల్లిదండ్రలు పోలీసులకు వివరించారు. రాహుల్ చేసిన అప్పులు పెరిగిపోయి ఇంటి అద్దె కూడా కట్టడం కష్టమైపోయిందని, దీంతో ఆర్థిక కష్టాలు కూడా వారిని చుట్టుముట్టాయని తెలిపారు. తాము మొదట తమ కూతురితో ముంబైలోనే ఉండేవాళ్లమని, తల్లిదండ్రులతో ఉంటే నిన్ను వదిలేస్తానని రాహుల్ హెచ్చరించడంతో ఆమె రాహుల్ తోనే ఉండటం ప్రారంభించిందని చెప్పారు. రాహుల్ తనను హింసిస్తున్నాడని ప్రత్యూష తన అంకుల్ దీపాంకుర్, ఆయన భార్యకు గత జనవరిలో చెప్పిందని, రాహుల్ వల్ల తన కాలిపై జరిగిన గాయాన్ని కూడా వారికి చూపిందని తల్లిదండ్రులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రత్యూష ఆత్మహత్య కేసులో విచారణ ముమ్మరం చేసిన పోలీసులు ఆమె తల్లి సోమతోపాటు మరో 12 మంది వాంగ్మూలం కూడా సేకరించాలని భావిస్తున్నారు. ఆమె స్నేహితులు, ఆమె నివాసం సెక్యూరిటీ గార్డ్స్, ప్రత్యూష ఫ్లాట్ తాళం తెరిచేందుకు రాహుల్ పిలిపించిన తాళంచెవి తయారీదారు, ప్రత్యూష భౌతికకాయాన్ని మొదట చూసిన వారి ఇంటి వంట మనిషి తదితరుల నుంచి సాక్ష్యాలను సేకరించాలని వారు భావిస్తున్నారు. -
ప్రత్యూష బెనర్జిది మూర్ఖమైన పని!
ప్రముఖ టీవీ నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య బాలీవుడ్ అలనాటి కథనాయిక హేమామాలిని చికాకు పరిచినట్టు ఉంది. ఆమె ఆత్మహత్య మూర్ఖమైనదని హేమ అభిప్రాయపడింది. చేజేతులా ప్రాణాలు తీసుకొనే ఇలాంటి ధోరణి ఎంతమాత్రం సబబు కాదంటూ కొన్ని పరుషమైన వ్యాఖ్యలు ఆమె ట్విట్టర్లో చేసింది. 'అన్ని మూర్ఖమైన ఆత్మహత్యలే. వాటివల్ల ఏమీ జరుగదు. జీవితం దేవుడు ఇచ్చిన కానుక. అది జీవించేందుకు ఉంది కానీ మనకు నచ్చినప్పుడు ప్రాణాలు తీసుకోవడానికి కాదు. ప్రాణాలు తీసుకొనే హక్కు మనకు లేదు' అని హేమామాలిని పేర్కొంది. 'కష్టాలను ఎదుర్కొని ఎలా విజయం సాధించాలో ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. అంతేకానీ ఒత్తిడికి తలొగ్గి ప్రాణాలు తీసుకోకూడదు. ప్రపంచం పోరాడేవారినే కీర్తిస్తుంది. కానీ పరాజితులను కాదు' అని తెలిపింది. 'సెలబ్రిటీ ఆత్మహత్యలు ఆకలిగొన్న మీడియాకు ఆహారంలాంటింది. మరో సెన్సేషనల్ వార్త వచ్చేవారకు దానిని ప్రసారం చేస్తుంది. ఆ తర్వాత మరిచిపోతుంది' అని హేమ పేర్కొంది. -
ఆస్పత్రిలో ప్రత్యూష ఫ్రెండ్
ప్రత్యూష గర్భవతి అని అనుమానాలు ముంబై: బుల్లితెర నటి, ‘చిన్నారి పెళ్లికూతురు’ ఫేమ్ ప్రత్యూష బెనర్జీ బాయ్‌ఫ్రెండ్ రాహుల్ రాజ్ ఆదివారం ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని ఆయన తరఫు న్యాయవాది నీరజ్ గుప్తా తెలిపారు. అతను ఛాతీలో నొప్పి, లో బీపీ, కుంగుబాటు కారణంగా స్థానిక ఆస్పత్రిలో చేరారని, చాలా బలహీనంగా ఉన్న ఆయనను ఐసీయూలో ఉంచారని చెప్పారు. కాగా, ప్రత్యూష ఆత్మహత్యకు గల కారణాలు ఏమిటనేది ఇంకా తెలియరాలేదు. అయితే రాహుల్ కారణంగానే ఆమె ఇబ్బందులు పడినట్లు తెలుస్తోంది. ప్రత్యూష గర్భవతా..?: చనిపోయే సమయానికి ప్రత్యూష రెండు నెలల గర్భవతి అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం వైద్యులు ఇచ్చిన రిపోర్టులో పేర్కొనలేదని విచారణాధికారి తెలిపారు. ఆమె పోస్ట్‌మార్టమ్ రిపోర్టు నెల రోజుల్లో రానుందని, అది వస్తే అందులో ఆమె గర్భవతా కాదా అనేది తేలుతుందన్నారు. ప్రత్యూష, రాహుల్ జంటకు స్నేహితులైన పలువురు చెబుతున్న దాని ప్రకారం బెంగాలీ నూతన సంవత్సరాది రోజైన ఈ నెల 14న వారు పెళ్లి చేసుకోడానికి సిద్ధమయినట్లు తెలుస్తోంది. కాగా, ప్రత్యూషకు ఆర్థిక ఇబ్బందులున్నాయని, ఆమె తల్లిదండ్రుల కోసం రూ. 50 లక్షల అప్పు తీసుకుందని రాహుల్ తండ్రి హర్షవర్ధన్ చెప్పారు. దీంతో ఆమె ఒత్తిడికి గురయ్యేదన్నారు. ఆమెకు అప్పుడప్పుడు రూ. పది వేల చొప్పున డబ్బులు పంపేవాడినని అన్నారు. -
ప్రత్యుషను పెళ్లి చేసుకోవాలనుకున్నా!
ప్రముఖ టీవీ నటి ప్రత్యుష బెనర్జీ అనుమానాస్పద మృతి వ్యవహారంలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె ప్రియడు రాహుల్ రాజ్ సింగ్ తాజాగా నోరువిప్పాడు. తాను అమాయకుడినని, ఈ వ్యవహారంలో తన తప్పు ఏమీ లేదని 'మిడ్ డే' పత్రికతో చెప్పాడు. ప్రత్యుష-తాను తరచూ గొడవలు పడిన విషయం వాస్తవమేనని అంగీకరించాడు. నవంబర్ 2015 నుంచి తాను ప్రత్యుషతో డేటింగ్ చేస్తున్నానని, ఆమెను పెళ్లి కూడా చేసుకోవాలని భావించానని తెలిపాడు. ఆమెను ఎప్పుడూ తన భార్యగానే భావించినట్టు చెప్పాడు. ఆత్మహత్యకు ముందురోజు ప్రత్యుషతో తాను గొడవ పడ్డానని, ఆ రోజంతా తాను తాగుతూ గడిపిందని తెలిపాడు. పనిమీద తాను బయటకు వెళ్లి వచ్చేలోపు తాను ఉరేసుకొని కనిపించిందని, తను అలా చేసుకుంటుందని తెలిసి ఉంటే తాను ఇంటి నుంచి బయటకు వెళ్లేవాడిని కాదని చెప్పుకొచ్చాడు. కాగా, రాహుల్ రాజ్ సింగ్ ఆదివారం ఆస్పత్రి పాలైన సంగతి తెలిసిందే. రాహుల్ తీవ్ర ఒత్తిడి, కుంగుబాటుతో సతమవుతున్నాడని, ఛాతినోప్పి రావడంతో అతన్ని ముంబైలోని ఓ ఆస్పత్రిలో చేర్చామని రాహుల్ తరఫు లాయర్ నీరజ్ గుప్తా తెలిపారు. రాహుల్ పోలీసు విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరడంతో పోలీసు స్టేషన్‌కు వెళ్లలేదు. -
రాహుల్ పిచ్చివాడిలా చేస్తున్నాడు!
ప్రముఖ టీవీ నటి ప్రత్యుష బెనర్జీ మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్ ఆస్పత్రి పాలయ్యాడు. రాహుల్ తీవ్ర ఒత్తిడి, కుంగుబాటుతో సతమవుతున్నాడని, ఛాతినొప్పి రావడంతో అతన్ని ముంబైలోని ఓ ఆస్పత్రిలో చేర్చామని రాహుల్ తరఫు లాయర్ నీరజ్ గుప్తా తెలిపారు. రాహుల్ ఆదివారం పోలీసు విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరడంతో పోలీసు స్టేషన్‌కు వెళ్లలేదు. మరోవైపు అతన్ని ఆస్పత్రిలో చేర్చిన అతని స్నేహితురాలు శైలా చద్దా మాట్లాడుతూ.. రాహుల్ దాదాపు పిచ్చివాడిగా మారిపోయాడని, అందుకే కుటుంబసభ్యులు అతన్ని ఆస్పత్రిలో చేర్చారని తెలిపింది. 'అతను తీవ్ర వేదనలో ఉన్నాడు. దిగ్భ్రాంతికి లోనయ్యాడా? లేక పిచ్చివాడు అవుతున్నాడా? తెలియడం లేదు. అతనికి ఏమైనా జరిగే అవకాశముంది. అందుకే మేం అతన్ని ఆస్పత్రిలో చేర్చాం' అని ఆమె తెలిపింది. 'ప్రపంచం అతనికి వ్యతిరేకంగా ఉండవచ్చు. కానీ నాకు మాత్రం అతనిది ఏ తప్పు లేదని అనిపిస్తోంది. ఘటన జరిగిన నాటి నుంచి అతను ఏడుస్తూనే ఉన్నాడు. నేను స్వయంగా చూశాను' అని ఆమె చెప్పింది. ప్రత్యుష బెనర్జీ అనుమానాస్పద ఆత్మహత్య వ్యవహారంలో ప్రధానంగా రాహుల్‌పైనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అతడు ఆమెను కొట్టేవాడని, వారిద్దరి మధ్య గతకొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయని కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం ముంబై పోలీసులు రాహుల్‌ను ప్రశ్నించిన సంగతి తెలిసిందే. -
రాహుల్, ప్రత్యూష తాగి కొట్టుకునేవారు!
ప్రత్యూషా బెనర్జీ మరణం విషయంలో ఇప్పుడు అనుమానాలన్నీ ఆమె బోయ్ ఫ్రెండ్ రాహుల్ రాజ్‌సింగ్ మీదకే వెళ్తున్నాయి. వీళ్లిద్దరూ కొన్నాళ్లు బాగానే కలిసి ఉన్నా, తర్వాత మాత్రం ఇద్దరి మధ్య గొడవలు ఎక్కువగానే అయినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రత్యూష ఇంటి చుట్టుపక్కల నివసించేవాళ్లు కూడా చెబుతున్నారు. వీళ్లిద్దరూ ఈమధ్య కాలంలో తరచు తాగి గొడవపడేవాళ్లని అంటున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే ఇద్దరి మధ్య సంబంధాలు అంతగా బాగోలేదని తెలుస్తోంది. ఇక ప్రత్యూష మరణం తర్వాత రాహుల్ రాజ్‌సింగ్ ప్రవర్తన కూడా అనుమానాలకు తావిస్తోంది. తోటి నటీనటులు అతడికి కాల్ చేసేందుకు ప్రయత్నించినా అతడి ఫోన్ మాత్రం స్విచాఫ్ చేసి ఉన్నట్లే వస్తోంది. దీంతో అతడి మీద అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ప్రత్యూష ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఆమె మరణం వెనుక ఏదో బలమైన కారణం ఉండి ఉంటుందని స్థానికులు, తోటి నటీనటులు అంటున్నారు. ఈ నేపథ్యంలో పోస్టుమార్టం నివేదిక వస్తే తప్ప అసలు ఏం జరిగిందో స్పష్టంగా తెలిసే అవకాశం లేదు. ఇక ప్రత్యూష సూసైడ్ నోట్ విషయం గురించి కూడా పలురకాల వాదనలు వినిపిస్తున్నాయి. అసలు ఆమె ఎలాంటి సూసూడ్ నోట్ రాయలేదని నిన్నటి నుంచి వినిపిస్తుండగా.. తాజాగా మాత్రం ఆమె ఒక నోట్ రాసిందని పోలీసు వర్గాల ద్వారా అనధికారికంగా తెలిసింది. అదే నిజమైతే, చిట్టచివరిగా ఆమె తన ఆవేదన ఎలా వ్యక్తం చేసింది, ఎవరిమీదైనా అనుమానాలు వ్యక్తం చేసిందా.. అసలు నిజంగానే ఆత్మహత్య చేసుకుందా, ఆ లేఖ ఆమె చేతిరాతతోనే ఉందా అనే అనుమానాలన్నీ నివృత్తి అవుతాయి. మరోవైపు, రాహుల్ రాజ్సింగ్ను ముంబై పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. అతడి వాంగ్మూలన్ని తాము రికార్డు చేస్తున్నట్లు తెలిపారు.