prime membership programme
-
ఫ్లిప్‌కార్ట్ ప్లస్, అసలేమిటిది? ఆఫర్లేమిటి?
ఆఫర్ల మీద ఆఫర్ల వర్షం కురిపించే దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్.. మరో సరికొత్త ప్రొగ్రామ్‌కు రేపటి నుంచి శ్రీకారం చుట్టబోతుంది. ‘ఫ్లిప్‌కార్ట్ ప్లస్’పేరుతో కస్టమర్ లోయల్టి ప్రొగ్రామ్‌ను లాంచ్ చేస్తోంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దీన్ని కస్టమర్ల ముందుకు తీసుకొస్తోంది. అమెజాన్ ప్రైమ్ ప్రొగ్రామ్‌కు ఈ ఫ్లిప్‌కార్ట్ ప్లస్ గట్టి పోటీ ఇవ్వబోతుంది. ఈ లోయల్టీ ప్రొగ్రామ్‌ను ప్రారంభించడం ఇది రెండో సారి. తొలిసారి 2014లో ‘ఫ్లిప్‌కార్ట్ ఫస్ట్’ పేరుతో ఈ లోయల్టీ ప్రొగ్రామ్‌ను ఆఫర్ చేసింది. అమెజాన్ ప్రైమ్ మాదిరిగానే.. ఫ్లిప్‌కార్ట్ కొత్త లోయల్టి ప్రొగ్రామ్, అచ్చం దాని ప్రత్యర్థి అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ సర్వీసు మాదిరిగానే ఉండబోతుంది. అమెజాన్ ప్రైమ్ లాంచ్ చేసిన రెండేళ్ల తర్వాత ఫ్లిప్‌కార్ట్ ఈ లోయల్టి ప్రొగ్రామ్‌ను తీసుకొస్తోంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ ఉచితం... మీరు విన్నది నిజమే. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ పూర్తిగా ఉచితం. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్షిప్ ప్రొగ్రామ్‌కు ఎలాంటి వార్షిక సబ్స్క్రిప్షన్ ఫీజు లేదు. అమెజాన్ మాత్రం తన ప్రైమ్ మెంబర్‌షిప్‌కు ప్రవేశ ఆఫర్ కింద 499 రూపాయలను సేకరించింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వార్షిక సబ్స్క్రిప్షన్ ఫీజు 999 రూపాయలుగా ఉంది. నెలవారీ ఫీజు 129 రూపాయలు. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ ప్రయోజనాలు.. ఈ ప్రొగ్రామ్ కింద కస్టమర్ లోయల్టీ పాయింట్లను ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేయనుంది. ఈ పాయింట్లను ఫ్లిప్‌కార్ట్ తన ప్లాట్‌ఫామ్‌పై సేల్ ఆఫర్లు నిర్వహించే సమయంలో ఉచిత డెలివరీకి, ముందస్తు షాపింగ్‌కు, ముందస్తుగా ప్రొడక్ట్‌లు పొందేందుకు ఉపయోగించుకోవచ్చు. అమెజాన్ ప్రైమ్ సభ్యులు మాదిరి, ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులు కూడా సేల్స్ నిర్వహించే సమయంలో ముందస్తు యాక్సస్‌ను పొందవచ్చు. ఇది ఎలా పనిచేస్తుంది... ఫ్లిప్‌కార్ట్ వెబ్సైట్లో జరిపే ప్రతి కొనుగోలుపై ఫ్లిప్‌కార్ట్ ప్లస్ కింద ప్లాస్ కాయిన్లను యూజర్లకు ఆఫర్ చేస్తుంది. ఈ ప్లస్ కాయిన్లను తర్వాత కంపెనీ వెబ్సైట్లో జరిపే షాపింగ్‌కు వాడుకోవచ్చు. ఈ ప్లస్ కాయిన్లను జోమాటో, బుక్‌మైషో, మేక్మైట్రిప్ వంటి ఇతర ప్లాట్‌ఫామ్‌లపై కూడా వాడుకోవచ్చు. తమ 100 మిలియన్ కస్టమర్లలో ఎవరైనా ఈ కాయిన్లను పొందవచ్చని, ప్రయోజనాలను, రివార్డులను అన్‌బ్లాక్ చేసుకోవడం ప్రారంభించుకోవచ్చని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. గత నెలలోనే ఫ్లిప్‌కార్ట్ ఈ లోయల్టీ ప్రొగ్రామ్‌ను లాంచ్ చేయాలని ప్లాన్ చేసింది. కానీ కుదరలేదు. దీనికోసం వచ్చే మూడేళ్లలో 173 మిలియన్ డాలర్లను కూడా వెచ్చించబోతుంది. కాగ, రిటైల్ స్పేస్‌లో లోయల్టీ ప్రొగ్రామ్‌లు మంచి పేరును సంపాదించుకుంటున్నాయి. కస్టమర్లను ఆకట్టుకోవడానికి పలు కంపెనీలు వీటిని ఆఫర్ చేస్తున్నాయి. అయితే ఈ ప్రొగ్రామ్‌ను కస్టమర్లకు ఆఫర్ చేయడంలో ఫ్లిప్‌కార్ట్ కాస్త ఆలస్యం చేసిందని ఈ-రిటైల్ మార్కెట్ విశ్లేషకులు చెప్పారు. -
అమెజాన్ ప్రైమ్ సర్వీసు ఛార్జీ డబుల్
సాక్షి, బెంగళూరు : అమెజాన్ ప్రైమ్ సర్వీసులకు భారత్‌లో ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఇప్పటి వరకు అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే ఆ ధర రూ.499 మాత్రమే ఉండేది. కానీ ప్రస్తుతం ఈ ఛార్జీని అమెజాన్ రెండింతలు చేయబోతుంది. అమెజాన్ ఇండియా త్వరలోనే తన పాపులర్ సబ్స్క్రిప్షన్ సర్వీసు ప్రైమ్ ధరను రూ.999కు పెంచబోతున్నట్టు తెలిసింది. గతేడాది జూలైలో ఈ సర్వీసులను అమెజాన్ లాంచ్ చేసింది. అప్పటి నుంచి అన్ని మేజర్ సేల్ ఈవెంట్లలో ప్రైమ్ టాప్-సెల్లింగ్ ప్రొడక్ట్‌గా ఉంటోంది. ప్రస్తుతం ఈ సర్వీసు సబ్స్క్రిప్షన్ ఛార్జీలను పెంచుతున్నప్పటికీ అమెరికాలో కంటే భారత్‌లోనే వీటి ధర తక్కువని తెలిసింది. ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న సబ్స్క్రైబర్లకు అమెజాన్ చాలా వేగవంతంగా ఉత్పత్తులను డెలివరీ చేస్తోంది. తొలుత వీరికే సేల్‌ను అమెజాన్ ప్రారంభిస్తోంది. అంతేకాక ప్రైమ్ వీడియో, అమెజాన్ మూవీలు, టీవీ షోలను కూడా ఈ సబ్స్క్రైబర్లకు అందిస్తారు. ఎక్స్‌క్లూజివ్ డిస్కౌంట్లు, ఫ్రీ షిప్పింగ్, కొన్ని ఉత్పత్తులపై ఫ్రీ నెక్ట్స్ డే డెలివరీలు వీరికి లభిస్తాయి. 1.3 మిలియన్ ఉత్పత్తులతో ప్రైమ్ షిప్మెంట్లను ప్రారంభించామని, ప్రస్తుతం అవి 11 మిలియన్లకు పెరిగినట్టు అమెజాన్ ప్రైమ్ ఇండియా అధినేత అక్షయ్ సాహి తెలిపారు. ప్రైమ్‌ను మరింత ఆకర్షణీయంగా తయారుచేయడానికి తాము ఎల్లవేళలా కృషిచేస్తామని చెప్పారు. అమెజాన్ ప్లాట్‌ఫామ్‌పై వచ్చే ఆర్డర్లలో ప్రతి మూడింటిలో ఒకటి ప్రైమ్ సబ్స్క్రైబర్ల నుంచే వస్తుందని తెలిపారు. పండుగ సీజన్లో, మేజర్ సేల్ ఈవెంట్లలో కొనుగోలు ఎక్కువగా ఉంటున్నాయన్నారు. -
జియో యూజర్లకు బంపర్ ఆఫర్
ఉచిత డేటా, ఉచిత వాయిస్ కాలింగ్ అంటూ దూసుకొచ్చిన రిలయన్స్ జియో మరో సంచలన ఆఫర్‌తో వినియోగదారులను ఊరిస్తోంది. మంగళవారం ముంబైలో నిర్వహించిన మీడియా సమావేశంలో రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ జియో వినియోగదారులకు మరిన్ని ఆఫర్లను ప్రకటించారు. రికార్డు స్థాయి ఖాతాదారులను నమోదు చేసిన వినియోగదారులకు ఈ సందర్భంగా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. జియో రాకతో జియో యూజర్ల జీవితాలు డిజిటల్‌గా అందంగా మారిపోయాయని అంబానీ అభివర్ణించారు. మార్చి 1తో ముగియనున్న హేపీ న్యూ ఇయర్ ఆఫర్ ముగియనున్న నేపథ్యంలో మరో ఆఫర్‌ను ప్రకటించారు. ఒకవైపు ఎయిర్ టెల్, ఐడియా లాంటి ప్రత్యర్థుల అభ్యంతరాలు కొనసాగుతుండగానే జియో ఇన్ఫోకాం మరిన్ని ఆఫర్లను అందించనుంది. ముఖ్యంగా 100 మిలియన్ కస్టమర్ల మైలురాయిని దాటేసిన జియోకు చాలా తక్కువగా రీచార్జ్‌ల టారిఫ్‌లను అంబానీ ప్రకటించారు. రూ. 99 రుసుముతో జియో ప్రధాన సభ్యత్వం (ప్రైమ్ మెంబర్ షిప్) కార్యమాన్ని ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. జియో వినియోగదారుల కోసం మార్చి 1న దీన్ని లాంచ్ చేస్తామన్నారు. మార్చి 31 వరకు ఈ సభ్యత్వాన్ని నమోదు చేసుకోవచ్చని చెప్పారు. 2018 మార్చి వరకూ రూ. 99 రీచార్జ్‌తో ఈ సభ్యత్వాన్ని నమోదు చేసుకోవచ్చు. దీంతో పాటు అన్ లిమిటెడ్ సేవలను అందించనున్నట్టు ప్రకటించారు. ఈ నమోదు ద్వారా ప్రైమ్ వినియోగదారులు మరో ఏడాది పాటు ఉచిత సేవలను పొందవచ్చు. అలాగే ఈ సభ్యత్వం తీసుకుని ఉచిత వాయిస్ కాల్స్ (రోమింగ్ సహా) మార్చి 2018 వరకు అనుభవించవచ్చు. జియో ప్రధాన సభ్యులుగా చేరేవారు కేవలం (రోజుకు రూ.10) నెలకు రూ. 303 పరిచయ ధరతో ఈ సేవలను పొందవచ్చని తెలిపారు. వినియోగదారులకు మెరుగైన అనుభవాన్ని అందించడమే తమ లక్ష్యమని ముకేష్ అంబానీ మరోసారి పునరుద్ఘాటించారు. సంబంధిత వార్తలు.. జియో డేటా రెట్టింపు జియో వినియోగదారులకు గుడ్ న్యూస్ జియో డౌన్లోడు స్పీడులో దూసుకుపోయింది!