ప్రిన్స్ చావులో కొత్త కోణం!
న్యూయార్క్: అమెరికా పాపులర్ పాప్ మ్యూజిక్ స్టార్ ప్రిన్స్ మృతి విషయంలో ఓ కొత్త కోణం వెలుగుచూసింది. ఆ రోజు ప్రిన్స్ చనిపోయిన ఆరుగంటల తర్వాతే ఆయనను గుర్తించారని ఓ నివేదిక బయటకు వచ్చింది. ఈ 57 ఏళ్ల పాప్ స్టార్ అనుమానాస్పద స్థితిలో గత ఏప్రిల్‌లో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆయన ఉండే బంగ్లాలోని ఎలివేటర్లో విగత జీవిగా పడిఉండటం చూసి ఆస్పత్రికి తరలించినా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు.
ఆయన మృతిపట్ల అమెరికా దిగ్భ్రాంతిని కూడా వ్యక్తం చేసింది. అయితే, ఆయన విరివిగా పెయిన్ కిల్లర్స్‌ను ఇష్టం వచ్చినట్లు ఉపయోగించడం వల్లే ప్రాణాలు విడిచినట్లు భారీ స్థాయిలో ఊహగానాలు అందుకున్నాయి. కానీ, తాజాగా మిన్నెసోటా స్టార్ ట్రిబ్యూన్ కొత్త విషయాలు బయటి ప్రపంచానికి తెలియజేసింది.
వాస్తవానికి తనకు మందులు కావాలని ఆరోజు ప్రిన్స్ 9.43గంటల ప్రాంతంలో తన సహాయకులకు ఫోన్ చేసి అడిగారని.. కానీ వారు సరైన సమయంలో అందించకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగి ఉండొచ్చని ఆ నివేదిక అనుమానం వ్యక్తం చేసింది. ఆ మందుల కోసమే ఆయన ఎలివేటర్ లోకి వెళ్లి అక్కడే కుప్పకూలిపోయి చనిపోయి ఉండొచ్చంటూ పలు అనుమానాలు వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా ఈయన శవపరీక్ష నివేదికపై ఇప్పటి వరకు ఒక్క విషయాన్ని కూడా దర్యాప్తు అధికారులు బయటకు చెప్పకపోవడం ఆ అనుమానాన్ని మరింత బలపరుస్తోంది.