ప్రైవేట్ సెక్రటరీగా దేవయాని కోబ్రాగడే
న్యూఢిల్లీ: కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయమంత్రి రామ్‌దాస్ అథవాలేకు ప్రైవేట్ సెక్రటరీగా అమెరికాలో భారత మాజీ ఉప దౌత్యవేత్త దేవయాని కోబ్రాగడే నియమితులయ్యారు. దేవయాని న్యూయార్క్‌లో భారత డిప్యూటీ కాన్సుల్ జనరల్‌గా ఉన్న సమయంలో తన ఇంట్లో పనిచేస్తున్న మహిళకు సంబంధించిన వీసా పత్రాల్లో తప్పుడు సమాచారం ఇచ్చారన్న ఆరోపణలపై ఆమెను న్యూయార్క్ పోలీసులు 2013లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆమె 2.5 లక్షల డాలర్ల పూచీకత్తుపై బయటకొచ్చారు. దేవయానిపై పెట్టిన అభియోగాలను ఉపసంహరించుకునేలా అమెరికా ప్రభుత్వంపై కేంద్రం ఒత్తిడి చేసినా ఫలితం లేకపోయింది.
కాగా, దేవయాని ఇద్దరు కూతుళ్లు భారత పౌరులు కాదని కేంద్ర ప్రభుత్వం జనవరిలో ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. ఎలాంటి నోటీసు జారీ చేయకుండా, చట్ట విరుద్ధంగా తమ కుమార్తెలకు సంబంధించిన పాస్‌పోర్టులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని ఆమె కోర్టును ఆశ్రయించడంతో కేంద్రం ఈమేరకు నివేదించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖకు తెలియజేయకుండా, చట్టాన్ని ఉల్లంఘించి దేవయాని కూతుళ్లు అమెరికా, భారత్ పౌరసత్వాలు పొందారని పేర్కొంటూ కేంద్రం వారి పాస్‌పోర్టులను రద్దు చేసింది.