pulivendula branch canal
-
'పులివెందుల బ్రాంచ్ కెనాల్‌కు నీరు ఇవ్వాలి'
అనంతపురం : పులివెందుల బ్రాంచ్ కెనాల్‌కు నీరు విడుదల చేయాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, పులివెందుల రైతులు మంగళవారం అనంతపురం హైలెవల్ కెనాల్ (హెచ్ఎల్సీ) ఎస్ఈ శేషగిరిరావును కలిశారు. కెనాల్‌కు వెంటనే నీరు విడుదల చేయాలని కోరుతూ అధికారులకు ఆయన వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ...ఐఏబీ సమావేశంలో 3.2 టీఎంసీల నీరు కేటాయిస్తామని చెప్పిన విషయాన్ని గుర్తుకు చేశారు. చిత్రావతి రిజర్వాయర్‌కు 1.8 టీఎంసీలు ఇచ్చామంటున్నారు. కానీ, చిత్రావతి రిజర్వాయర్‌కు 0.6 టీఎంసీల నీరు మాత్రమే వచ్చాయని మిగిలిన నీటికోటాను హంద్రీనీవా ద్వారా సర్దుబాటు చేయాలన్నారు. పులివెందుల బ్రాంచ్ కెనాల్‌కు వెంటనే నీరు విడుదల చేయకపోతే సమస్య మరింత జఠిలమవుతుందని ఎంపీ చెప్పారు. -
పీబీసీకి ఏటా అన్యాయమే
అనంతపురం కలెక్టర్‌కు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి లేఖ పులివెందుల : పులివెందుల బ్రాంచ్ కెనాల్ (పీబీసీ) పరిధిలోని రైతులకు ప్రతి ఏడాదీ అన్యాయమే జరుగుతోందని, ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సాగు, తాగు నీటిని పూర్తి స్థాయిలో కోటా మేరకు సరఫరా చేయాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన అనంతపురం జిల్లా కలెక్టర్ కోన శశిధర్‌కు లేఖ రాశారు. (తుంగభద్ర జలాశయం నుంచి హెచ్చెల్సీ ద్వారా వచ్చే నీటిని కోటా మేరకు అనంతపురం అధికారులు పీబీసీకి విడుదల చేస్తారు) ఈ సందర్భంగా ఆయన పులివెందుల బ్రాంచ్ కెనాల్‌కు సంబంధించిన పలు విషయాలను లేఖలో పొందుపరిచారు. సీబీఆర్, పీబీసీకి నీరు విడుదలయ్యే ప్రాంతాలు తుంగభద్ర ప్రాజెక్టు పరిధిలోని హైలెవెల్ కెనాల్‌కు చివరి భాగంలో ఉన్నాయని, పీబీసీ ద్వారా 55,579 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉందన్నారు. అయితే ఐదేళ్లుగా సాగు నీరు అరకొరగా సరఫరా చేస్తున్నారన్నారు. దీనివల్ల రైతులు సంప్రదాయ పంటలను పండించడం మాని, పండ్ల తోటలను సాగు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో వర్షాభావ పరిస్థితుల వల్ల బోర్లలో నీరు అడుగంటి చీనీ చెట్లు ఎండిపోయాయన్నారు. దీంతో తాగునీటికి కూడా కొరత ఏర్పడిందన్నారు. నియోజకవర్గంలోని సాగు, తాగునీటికి 2015-16 సంవత్సరానికి 3.23టీఎంసీలు కేటాయించినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. కేటాయించిన నీరు మిడ్ పెన్నార్ నుంచి సీబీఆర్‌కు రావాల్సి ఉందన్నారు. మిడ్ పెన్నార్ నుంచి సీబీఆర్‌కు 98 కిలోమీటర్లు నీరు పారే సమయంలో ఆవిరి, ఇంకిపోవడం వల్ల దాదాపు 45 శాతం నీటిని నష్టపోతున్నామని వివరించారు. పీబీసీకి కేటాయించిన నీటిని ఇతర ప్రాంతాల ప్రజలు ఆక్రమంగా వాడటం వల్ల నియోజకవర్గంలోని రైతాంగం తీవ్రంగా నష్టపోతోందన్నారు. ప్రవాహ నష్టాన్ని దృష్టిలో ఉంచుకొని విడతల వారీగా కాకుండా నీటిని ఒకేసారి వదలాలని తాను గతంలోనే కోరానన్నారు. సీబీఆర్‌కు సంబంధించి ప్రతి ఏడాది తాగునీటి అవసరాలకు 1.73 టీఎంసీల స్థిర జలాలు కేటాయించాలన్నారు. భూగర్భ జలాలు అడుగంటిన దృష్ట్యా పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో తీవ్ర తాగునీటి సమస్య ఏర్పడిందన్నారు. మిడ్ పెన్నార్ వద్ద 1.82 టీఎంసీల నీటిని విడుదల చేస్తే సీబీఆర్‌కు వచ్చేసరికి ఒక టీఎంసీ మాత్రమే చేరుతోందన్నారు. తుంపెర్ డీప్‌కట్ వద్ద సీబీఆర్ ప్రవేశం దగ్గర నీటి ప్రవాహ విషయంలో కొంత ఇబ్బందికర పరిస్థితి నెలకొందన్నారు. వాటర్ రీడింగ్ స్కేలు క్రాస్‌గా ఉండటం వల్ల 20 శాతం నీటిని నష్టపోతున్నామన్నారు. అందువల్ల మిడ్ పెన్నార్ నుంచి 4.97 టీఎంసీల నీటిని సీబీఆర్, పీబీసీలకు విడుదల చేయాలని కోరారు. -
పీబీసీ వెంట పర్యటించిన వైఎస్ అవినాష్‌రెడ్డి
లింగాల : పులివెందుల బ్రాంచ్ కెనాల్ వెంట బుధవారం వైఎస్ఆర్ సీపీ కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పర్యటించారు. పార్నపల్లె చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి నక్కలపల్లె సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు విడుదలవుతున్న నీరు కొంత మేర కామసముద్రం చెరువకు చేరాయి. బండ్ దాటి నీరు ప్రవహించకపోవడంతో గాలి పైపులను అమర్చి నీటిని నక్కలపల్లె సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు చేరవేసే ప్రయత్నాలను సాగిస్తున్నారు. సుమారు 40గాలి పైపులను అమర్చి నీటిని తోడుతున్న దృశ్యాలను ఆయన పరిశీలించారు. రోజుకు 5క్యూసెక్కుల నీటినైనా ఎస్ఎస్ ట్యాంకుకు తరలించే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం నక్కలపల్లె సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు విడుదలవుతున్న నీటిని అక్కడకు వెళ్లి పరిశీలించారు. కామసముద్రం చెరువు నుంచి గురిజాల వరకు పీబీసీ వెంట పర్యటించారు. జేసీ సోదరులు పీబీసీ కాలువను ధ్వంసం చేయడంతో సోమవారం నుంచి సీబీఆర్ నుంచి నీటి విడుదలను ఆపేశారు. మంగళవారం మాజీ మంత్రి వైఎస్ వివేకా చేపట్టిన నిరసన కార్యక్రమాలతో అధికారులు స్పందించి పీబీసీ అధికారులు కాలువకు మరమ్మతులు చేసి నీటిని విడుదల చేశారు. అలా విడుదలైన నీరు బుధవారం మధ్యాహ్నానికి గురిజాలకు చేరాయి. ప్రస్తుతం విడుదల అవుతున్నా నీరు ఎంత సామర్థ్యంతో ప్రవహిస్తున్నాయని వైఎస్ అవినాష్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో బుధవారం సీబీఆర్ నుంచి నీటి విడుదలను ఆపి వేయాలని అనంతపురం కలెక్టర్, పీబీసీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారని.. దీంతో మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుతో చర్చించి నీటి సరఫరాను ఆపివేయొద్దని కోరినట్లు తెలిపారు. ఇందుకు ఆయన సానుకూలగా స్పందించి నీటి సరఫరా ఆపవద్దని అనంతపురం, కడప జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డితోపాటు హెచ్ఎల్సీ ఈఈ మక్బుల్ బాషా, పీబీసీ మాజీ ఈఈలు రాజశేఖర్, పులివెందుల మున్సిపల్ కమిషనర్ విజయసింహారెడ్డిలు ఎస్ఎస్ ట్యాంకును పరిశీలించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ చిన్నప్ప, కౌన్సిలర్లు, లింగాల ఎంపీపీ పీవీ సుబ్బారెడ్డి, కామసముద్రం సర్పంచ్ ప్రభాకర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ రామచంద్రారెడ్డి, మున్సిపల్ అధికారులు, పోలీసులు పాల్గొన్నారు. దౌర్జన్యకారులు ఎంతటివారైనా ఉపేక్షించం లింగాల: దౌర్జన్యకారులు ఎంతటివారైనా సరే ఉపేక్షించేదిలేదని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఆయన చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను పరిశీలించారు. అనంతరం పీబీసీ వెంట పర్యటించి కామసముద్రం చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. -
జేసీ సోదరులపై టీడీపీ అధిష్టానం ఆగ్రహం!
అనంతపురం : అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సోదరులపై పార్టీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. చిత్రావతి జలాశయం నుంచి వైఎస్ఆర్ జిల్లాకు నీటిని తీసుకెళ్లే పులివెందుల బ్రాంచి కెనాల్‌కు సింగవరం వద్ద జేసీ దివాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిన్న గండి కొట్టిన విషయం తెలిసిందే. ఈ చర్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. సింగపూర్ పర్యటన నుంచి రాగానే తనను కలవాలని చంద్రబాబు నాయుడు ...జేసీ సోదరులను ఆదేశించినట్లు తెలుస్తోంది. అందరికీ నీటిని అందించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని, అయితే ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడం సరికాదని సీఎం చంద్రబాబు అభిప్రాయపడినట్లు సమాచారం. -
పులివెందుల బ్రాంచి కెనాల్ వద్ద ఉద్రిక్తత
పులివెందుల : అనంతపురం జిల్లా యల్లనూరు మండలం కల్లూరు గ్రామం వద్ద సోమవారం పులివెందుల బ్రాంచి కెనాల్(పీబీసీ) కు గండి కొట్టిన వ్యవహారం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, ఎమ్మెల్యే యామినీబాల ఆధ్వర్యంలో సోమవారం దౌర్జన్యంగా పీబీసీకి గండికొట్టి నీటిని చిత్రావతి నదికి మళ్లించారు. దీంతో వైఎస్ వివేకానందరెడ్డి ఆధ్వర్యంలో రైతులు మంగళవారం ఉదయం అక్కడికి చేరుకున్నారు. కాలువ గండి పూడ్చే ప్రయత్నం చేయగా వారిని పోలీసులు అడ్డుకుని దురుసు గా ప్రవర్తించారు. దీంతో వైఎస్ వివేకా కెనాల్ వద్ద బైఠాయించి నిరసనకు దిగారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
పీబీసీకి నీరు విడుదల
కడప: తాగునీటి అవసరాల కోసం చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి పులివెందుల బ్రాంచి కెనాల్(పీబీసీ)కు గురువారం నీటిని విడుదల చేశారు. ఈ ఎడాది పీబీసీకి కేటాయించిన 1.2 టీఎంసీల నీటిని నెలరోజులుగా తుంగభద్ర జలాశయం నుంచి చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు తరలించి నిల్వ ఉంచారు. నిల్వ ఉంచిన నీటిని చిత్రావతి కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ గేట్లను ఎత్తి పీబీసీకాలువకు కడప ఎంపీ వైఎస్అవినాష్ రెడ్డి నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి,మాజీమంత్రి వివేకానంద రెడ్డి పాల్గొన్నారు.