సెమీస్లో బెంగాల్, ఒడిశా
విజయ్ హజారే ట్రోఫీ
రాజ్కోట్: దేశవాళీ వన్డే టోర్నీ (విజయ్ హజారే ట్రోఫీ)లో బెంగాల్, ఒడిశా జట్లు సెమీ ఫైనల్లోకి ప్రవేశించాయి. గురువారం ఇక్కడ జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లలో బెంగాల్ 17 పరుగుల తేడాతో విదర్భను... ఒడిషా పరుగు తేడాతో గోవాను ఓడించాయి. విదర్భతో జరిగిన తొలి క్వార్టర్స్ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్కు దిగిన బెంగాల్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసింది. మనోజ్ తివారి (101 బంతుల్లో 130; 4 ఫోర్లు, 9 సిక్సర్లు) సెంచరీతో చెలరేగగా, శ్రీవత్స్ గోస్వామి (84) రాణించాడు. అనంతరం విదర్భ 50 ఓవర్లలో 8 వికెట్లకు 301 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫైజ్ ఫజల్ (111 బంతుల్లో 105; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), బద్రీనాథ్ (94 బంతుల్లో 100; 13 ఫోర్లు) శతకాలు చేసినా లాభం లేకపోయింది.
మరో మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఒడిశా 49.4 ఓవర్లలో 289 పరుగులకు ఆలౌటైంది. అనురాగ్ సారంగి (112 బంతుల్లో 112; 12 ఫోర్లు, 1 సిక్స్), బిప్లబ్ సమంత్రే (73 బంతుల్లో 100; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీలు సాధించారు. ఆ తర్వాత గోవా 50 ఓవర్లలో 9 వికెట్లకు 288 పరుగులు చేసింది. అమోఘ్ దేశాయ్ (139 బంతుల్లో 110; 12 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ చేయగా, షగున్ కామత్ (92 నాటౌట్) ఆ అవకాశం కోల్పోయాడు.