railway development works
-
తెలంగాణలో రూ.621 కోట్ల రైల్వే అభివృద్ధి పనులు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో రూ.621 కోట్ల విలువ చేసే పలు రైల్వే అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన, ప్రారంబోత్సవం చేయనున్నారు. ఈ నెల 26న దేశవ్యాప్తంగా 500కు పైగా అమృత్ భారత్ స్టేషన్లు, దాదాపు 1,500 రైల్ ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లలో నిర్మాణం పూర్తయిన వాటిని జాతికి అంకితం చేయనుండగా, కొత్తవాటికి భూమిపూజ చేయనున్నారు. అందులో తెలంగాణలో రూ.230 కోట్లకు పైగా నిధులతో 15 అమృత్ భారత్ స్టేషన్లు, రూ.169 కోట్లకు పైగా నిధులతో నిర్మించనున్న 17 రైల్ ఫ్లైఓవర్, అండర్ పాస్‌లకు ప్రధాని భూమి పూజ చేయనున్నారు. వీటితోపాటు రూ.221.18 కోట్లతో పూర్తి చేసిన మరో 32 రైల్ ఫ్లై ఓవర్, రైల్ అండర్ పాస్‌లను మోదీ జాతికి అంకితం చేయనున్నారు. 17 రైల్వే ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం అమృత్ భారత్ స్టేషన్లతో పాటు మోదీ రాష్ట్రంలో రూ.169 కోట్లకు పైగా నిధులతో నిర్మించనున్న ఒక రైల్ ఫ్లై ఓవర్‌కు, 16 రైల్ అండర్ పాస్‌లకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. అందులో హైదరాబాద్ డివిజన్లోని బోధన్ వద్ద రైల్ ఫ్లై ఓవర్, మేళ్ల చెరువు, కురుముర్తి వద్ద రెండు రైల్ అండర్ పాస్‌లు, చిలకమర్రి, గౌడవల్లి, కీసర, రామాంతపూర్, పాలాట, కూచవరం వద్ద, మదనపూర్, గద్వాల్ వద్ద రైల్ అండర్ పాస్‌లు... సికింద్రాబాద్ డివిజన్లోని కురచపల్లి, వెలమల, చాగల్ వద్ద రైల్ అండర్ పాస్‌లు, గుంతకల్ డివిజన్లోని నారాయణపేట వద్ద రైల్ అండర్ పాస్‌ల నిర్మాణం జరగనుంది. వీటితోపాటు ఆయా డివిజన్లలో రూ.221 కోట్ల నిధులతో నిర్మాణం పూర్తి చేసుకున్న 3 రైల్ ఫ్లై ఓవర్లను, 29 రైల్ అండర్ పాస్‌లను మోదీ జాతికి అంకితం చేయనున్నారు. అందులో హైదరాబాద్ డివిజన్లోని మహబూబ్‌నగర్ రూరల్, పెద్దదిన్నె, తిప్పాపూర్, గద్వాల్, సిద్దరామేశ్వర్నగర్, బైరవాపురం, తలమడ్ల, ఇటిక్యాల, అడ్లూర్, నవీపేట్, ఉండవల్లి వద్ద రైల్ అండర్ పాస్‌లను... సికింద్రాబాద్ డివిజన్లోని ఎర్రగుంట, ఉంకిచర్ల/నిరుపమకొండ, చర్లపల్లి వద్ద రైల్ ఫ్లై ఓవర్లు, విలాసాగర్, బిస్‌బాగ్, శివపురం, కాశీపేట్, మంచిర్యాల, బూడ, కాజీపేట్, గరిడపల్లి, మీనవోలు, బయ్యారం, దెందుకూరు, ముత్యాలగూడెం, రాజనెల్లి, ఉప్పరపల్లి వద్ద రైల్ అండర్ పాస్‌లను... గుంటూర్ డివిజన్లోని నార్కట్‌పల్లి, కీసరజూపల్లి, బుదారం వద్ద అండర్ పాస్‌లను... గుంతకల్ డివిజన్లోని తంగడి వద్ద ఉన్న అండర్ పాస్‌ను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. మోదీ, రైల్వేమంత్రికి ధన్యవాదాలు: కిషన్‌రెడ్డి రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధికి పెద్ద ఎత్తున సహకరించడంపై ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌లకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. ఇంతవరకూ ఎలాంటి రైలు సౌకర్యం లేని మెదక్, సిద్ధిపేట వంటి ప్రాంతాలకు కొత్తగా రైలు సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని, ఆదాయపరంగా అనుకూలం కాకపోయినా మల్లన్న భక్తుల కోసం కొమురవెల్లిలో నూతన రైల్వే హాల్ట్ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మార్చిలో చర్లపల్లి రైల్వే టర్మి నల్ ప్రారంభం సాక్షి, హైదరాబాద్: చర్లపల్లి రైల్వే టర్మి నల్ మార్చిలో అందుబాటులోకి రానుందని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ తెలిపారు. టర్మినల్ పనులు చివరిదశలో ఉన్నాయని చెప్పారు. ఈ టర్మి నల్ అప్రోచ్ రోడ్డును విస్తరించడంతోపాటు టర్మి నల్కు చేరేందుకు అవసరమైన బస్సుల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నామన్నారు. శనివారం రైల్ నిలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సోమవారం దక్షిణ మధ్య రైల్వే పరిధిలో దాదాపు రూ.925 కోట్లతో చేపట్టే 57 స్టేషన్ల పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారని చెప్పారు. గత నాలుగేళ్లలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 415 మ్యాన్ లెవల్ క్రాసింగ్లను తీసేసినట్టు జైన్ పేర్కొన్నారు. -
దక్షిణాదిపై చిన్నచూపు లేదు: కేంద్ర మంత్రి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మంగళవారం ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోయల్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఆనాడు పోరాటం చేశామని పేర్కొన్నారు. ప్రధాని మోదీ అందరి కోసం పని చేస్తానని మాట ఇచ్చారని, దానికి కట్టుబడి పని చేస్తున్నామని తెలిపారు. దక్షిణ భారత్‌ను నిర్లక్ష్యం చేశారనడం అవాస్తవమన్నారు. ‘కాంగ్రెస్ హయాంలోనే సౌత్ సెంట్రల్ రైల్వేను నిర్లక్ష్యం చేశారు. ప్రధాని మోదీకి దేశమంతా ఒక్కటే, రూ.258 కోట్లు గతంలో ఇచ్చారు. కానీ ఇప్పటి బడ్జెట్లో పదింతలు ఎక్కువ నిధులు ఇచ్చాం. కేంద్రం ఎంత ఇచ్చిందో నా దగ్గర పూర్తి లెక్కలు ఉన్నాయని’ వివరించారు. రూ.258 కోట్లతో తెలంగాణలో రైలు మార్గాలను అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. 2008లో ప్రారంభించిన పెండింగ్ పనులు అన్ని పూర్తి చేశామన్నారు. ఎంఎంటీఎస్ కోసం 500 కోట్లు కేంద్రం ఇచ్చిందని.. రాష్ట్రం ఇంకా డబ్బులు ఇవ్వలేదని..అది ఇస్తే పనులు పూర్తవుతాయన్నారు. తెలంగాణలో ఒక్క ప్రాజెక్టు కూడా ఆగదలేదని ఆయన తెలిపారు. ఎంఎంటీఎస్, సబ్బరన్ రైళ్ల సంఖ్య పెంచాలి.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ..హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ప్రధాన సమస్య అని..సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి వేల మంది ప్రయాణిస్తారని..చర్లపల్లి రైల్వేస్టేషన్ వద్ద శాటిలైట్ టర్మినల్ ఏర్పాటుతో రద్దీ భారం తగ్గుందన్నారు. ఎంఎంటీఎస్, సబ్బరన్ రైళ్ల సంఖ్య పెంచాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రిని ఆయన కోరారు. యాద్రాది వరకు ఎంఎంటీస్‌పై కేంద్రం దృష్టిపెడితే రైల్వే ట్రాఫిక్ సమస్య తగ్గుతుందన్నారు. 427 రైల్వేస్టేషన్లలో ఉచిత హైస్పీడ్ వైపై సౌకర్యం కల్పించడం మంచి పరిణామం అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్రం ప్రత్యేక శ్రద్ధ చూపాలి.. సౌత్ సెంట్రల్ రైల్వే అభివృద్ధి విషయంలో కేంద్రం ప్రతిసారి నిర్లక్ష్యం చూపుతోందని..ఇప్పటికైనా ప్రత్యేక శ్రద్ధ చూపాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఎన్నో పనులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. ఎంఎంటీఎస్ ను ఘట్కేసర్ వరకు పొడిగించాలని ఆయన కేంద్రాన్ని కోరారు. -
రింగ్ రింగా..
గుంతకల్లు, న్యూస్‌లైన్ : గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలో దాదాపు రూ.23 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు పిలిచిన టెండర్లలో కాంట్రాక్టర్లు ఎప్పటిలాగే సిండికేట్ అయ్యారు. కొన్ని పనులకు సంబంధించి మాత్రమే పోటాపోటీగా షెడ్యూళ్లు దాఖలు చేశారు. గుంతకల్లు రైల్వే డీజిల్‌షెడ్డులో రెండు పనులను రూ.13,25,904తో, ఇంజనీరింగ్ బ్రాంచి పరిధిలో తొమ్మిది పనులను రూ.22 కోట్ల 37లక్షల 52 వేల 499తో, ఎలక్ట్రికల్ విభాగంలో ఒక పనిని రూ.56,33,382తో చేపట్టడానికి టెండర్లు పిలిచారు. సోమవారం స్థానిక డీఆర్ఎం కార్యాలయంలోని టెండరు కమిషనరేట్‌లో ప్రక్రియ చేపట్టారు. భారీ మొత్తంతో కూడిన పనులను దక్కించుకునేందుకు కొందరు కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు ఒక రోజు ముందుగానే గుంతకల్లుకు చేరుకుని ప్రయత్నాలు ప్రారంభించారు. పోటీ లేకుండా షెడ్యూళ్లు దాఖలు చేయడానికి మార్గం సుగమం చేసుకున్నారు. చిన్నాచితక పనుల విషయంలో మాత్రం పోటీ పడి షెడ్యూళ్లు దాఖలు చేశారు. ప్రధానంగా నంద్యాల - గుంతకల్లు సెక్షన్‌లోని రంగాపురం కంకర డిపోనకు 1.5 లక్షల క్యూబిక్ మీటర్ల బెలాస్ట్ సరఫరా కోసం రూ.9,06,48,450తో పిలిచిన టెండర్‌ను దక్కించుకోవడానికి ఆ ప్రాంత నాయకులు రంగంలోకి దిగారు. ఈ పనికి డమ్మీ షెడ్యూల్‌తో కలిపి కేవలం రెండు మాత్రమే దాఖలైనట్లు సమాచారం. గుంతకల్లులోని శాంతినగర్, సౌత్ కాలనీలలో 96 సిబ్బంది క్వార్టర్ల నిర్మాణానికి, రన్నింగ్ రూమ్ రిపేర్ల కోసం, రైల్వే ఆసుపత్రిలో రోగుల వెంట వచ్చే అటెండర్ల కోసం డార్మెటరీ నిర్మాణానికి రూ.2,13,31,392 కేటాయించారు. గుంతకల్లు డీఆర్ఎం కార్యాలయంలోని కమర్షియల్, జనరల్, ఆపరేటింగ్, సెక్యూరిటీ, ఎలక్ట్రికల్, పర్సనల్ బ్రాంచి కార్యాలయాల రిపేర్ల కోసం, మెకానికల్, ఎస్‌అండ్‌టీ కార్యాలయాల అభివృద్ధి కోసం, ఆర్పీఎఫ్ డాగ్ టన్నెల్ భవన నిర్మాణానికి రూ.1,17,57,920 కేటాయించారు. రేణిగుంటలో డ్రైనేజీ, సీవెర్లైన్ల నిర్మాణం, తిరుపతి-గూడూరు సెక్షన్‌లోని మామండూరు రైల్వేస్టేషన్‌లోనూ, వెంకటగిరి-వెండూడు, శ్రీకాళహస్తి-ఏర్పేడు రైల్వేస్టేషన్ల మధ్య డ్రైయినేజీల నిర్మాణానికి రూ.1,59,51,771 కేటాయించారు. ఇవి ముఖ్యమైన పనులు కావడంతో కాంట్రాక్టర్లు సిండికేట్ అయ్యి షెడ్యూళ్లు దాఖలు చేసినట్లు సమాచారం.