తెలంగాణలో రూ.621 కోట్ల రైల్వే అభివృద్ధి పనులు | 621 crore railway development works in the state | Sakshi
Sakshi News home page

తెలంగాణలో రూ.621 కోట్ల రైల్వే అభివృద్ధి పనులు

Published Sun, Feb 25 2024 4:56 AM | Last Updated on Sun, Feb 25 2024 5:00 AM

621 crore railway development works in the state - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో రూ.621 కోట్ల విలువ చేసే పలు రైల్వే అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన, ప్రారంబోత్సవం చేయనున్నారు. ఈ నెల 26న దేశవ్యాప్తంగా 500కు పైగా అమృత్‌ భారత్‌ స్టేషన్లు, దాదాపు 1,500 రైల్‌ ఫ్లై ఓవర్లు, అండర్‌ పాస్‌లలో నిర్మాణం పూర్తయిన వాటిని జాతికి అంకితం చేయనుండగా, కొత్తవాటికి భూమిపూజ చేయనున్నారు.

అందులో తెలంగాణలో రూ.230 కోట్లకు పైగా నిధులతో 15 అమృత్‌ భారత్‌ స్టేషన్లు, రూ.169 కోట్లకు పైగా నిధులతో నిర్మించనున్న 17 రైల్‌ ఫ్లైఓవర్, అండర్‌ పాస్‌లకు ప్రధాని భూమి పూజ చేయనున్నారు. వీటితోపాటు రూ.221.18 కోట్లతో పూర్తి చేసిన మరో 32 రైల్‌ ఫ్లై ఓవర్, రైల్‌ అండర్‌ పాస్‌లను మోదీ జాతికి అంకితం చేయనున్నారు. 

17 రైల్వే ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం 
అమృత్‌ భారత్‌ స్టేషన్లతో పాటు మోదీ రాష్ట్రంలో రూ.169 కోట్లకు పైగా నిధులతో నిర్మించనున్న ఒక రైల్‌ ఫ్లై ఓవర్‌కు, 16 రైల్‌ అండర్‌ పాస్‌లకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. అందులో హైదరాబాద్‌ డివిజన్‌లోని బోధన్‌ వద్ద రైల్‌ ఫ్లై ఓవర్, మేళ్ల చెరువు, కురుముర్తి వద్ద రెండు రైల్‌ అండర్‌ పాస్‌లు, చిలకమర్రి, గౌడవల్లి, కీసర, రామాంతపూర్, పాలాట, కూచవరం వద్ద, మదనపూర్, గద్వాల్‌ వద్ద రైల్‌ అండర్‌ పాస్‌లు... సికింద్రాబాద్‌ డివిజన్‌లోని కురచపల్లి, వెలమల, చాగల్‌ వద్ద రైల్‌ అండర్‌ పాస్‌లు, గుంతకల్‌ డివిజన్‌లోని నారాయణపేట వద్ద రైల్‌ అండర్‌ పాస్‌ల నిర్మాణం జరగనుంది.

వీటితోపాటు ఆయా డివిజన్లలో రూ.221 కోట్ల నిధులతో నిర్మాణం పూర్తి చేసుకున్న 3 రైల్‌ ఫ్లై ఓవర్‌లను, 29 రైల్‌ అండర్‌ పాస్‌లను మోదీ జాతికి అంకితం చేయనున్నారు. అందులో హైదరాబాద్‌ డివిజన్‌లోని మహబూబ్‌నగర్‌ రూరల్, పెద్దదిన్నె, తిప్పాపూర్, గద్వాల్, సిద్దరామేశ్వర్‌నగర్, బైరవాపురం, తలమడ్ల, ఇటిక్యాల, అడ్లూర్, నవీపేట్, ఉండవల్లి వద్ద రైల్‌ అండర్‌ పాస్‌లను... సికింద్రాబాద్‌ డివిజన్‌లోని ఎర్రగుంట, ఉంకిచర్ల/నిరుపమకొండ, చర్లపల్లి వద్ద రైల్‌ ఫ్లై ఓవర్‌లు, విలాసాగర్, బిస్‌బాగ్, శివపురం, కాశీపేట్, మంచిర్యాల, బూడ, కాజీపేట్, గరిడపల్లి, మీనవోలు, బయ్యారం, దెందుకూరు, ముత్యాలగూడెం, రాజనెల్లి, ఉప్పరపల్లి వద్ద రైల్‌ అండర్‌ పాస్‌లను... గుంటూర్‌ డివిజన్‌లోని నార్కట్‌పల్లి, కీసరజూపల్లి, బుదారం వద్ద అండర్‌ పాస్‌లను... గుంతకల్‌ డివిజన్‌లోని తంగడి వద్ద ఉన్న అండర్‌ పాస్‌ను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు.

మోదీ, రైల్వేమంత్రికి ధన్యవాదాలు: కిషన్‌రెడ్డి 
రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధికి పెద్ద ఎత్తున సహకరించడంపై ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌లకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. ఇంతవరకూ ఎలాంటి రైలు సౌకర్యం లేని మెదక్, సిద్ధిపేట వంటి ప్రాంతాలకు కొత్తగా రైలు సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని, ఆదాయపరంగా అనుకూలం కాకపోయినా మల్లన్న భక్తుల కోసం కొమురవెల్లిలో నూతన రైల్వే హాల్ట్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.  

మార్చిలో చర్లపల్లి రైల్వే టర్మి నల్‌ ప్రారంభం 
సాక్షి, హైదరాబాద్‌: చర్లపల్లి రైల్వే టర్మి నల్‌ మార్చిలో అందుబాటులోకి రానుందని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌ తెలిపారు. టర్మినల్‌ పనులు చివరిదశలో ఉన్నాయని చెప్పారు. ఈ టర్మి నల్‌ అప్రోచ్‌ రోడ్డును విస్తరించడంతోపాటు టర్మి నల్‌కు చేరేందుకు అవసరమైన బస్సుల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నామన్నారు.

శనివారం రైల్‌ నిలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సోమవారం దక్షిణ మధ్య రైల్వే పరిధిలో దాదాపు రూ.925 కోట్లతో చేపట్టే 57 స్టేషన్‌ల పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారని చెప్పారు. గత నాలుగేళ్లలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 415 మ్యాన్‌ లెవల్‌ క్రాసింగ్‌లను తీసేసినట్టు జైన్‌ పేర్కొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement