railway official
-
36 గంటల్లో మహబూబాబాద్ రైల్వే ట్రాక్ పునరుద్ధరణ
మహబూబాబాద్, సాక్షి: తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లాలోని ఇంటికన్నె రైల్వే స్టేషన్ సమీపంలోని పెద్ద మోరీ వద్ద వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పూర్తి అయింది. ఈ పట్టాల పునరుద్ధరణ నిర్మాణ మరమ్మతు పనులను రైల్వే శాఖ అధికారులు యుద్ద ప్రాతిపదికన కేవలం 36 గంటల్లో పూర్తి చేసి రికార్డు సృష్టించారు.తాజాగా నిర్మాణ పనులు తుది దశకు చేరుకోవడంతో రైల్వే అధికారులు ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. ఆదివారం తెలంగాణ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల కారణంగా ట్రాక్ కొట్టుకుపోవటంతో వందలాది రైళ్లను దక్షిణమధ్య రైల్వే రద్దు చేసింది. కొన్ని రైళ్లను దారిమళ్లించి విషయం తెలిసిందే. రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పూర్తి కావటంతో రేపటి(బుధవారం) నుంచి యాధావిధిగా రైళ్ల రాకపోకలు కొసాగుతాయని రైల్వే అధికారులు పేర్కొన్నారు. -
రహదారి నిర్మాణంలో నయా టెక్నాలజీ
సాక్షి, విశాఖపట్నం: సమస్యకు పరిష్కారం చూపాలి. సమాజానికి ఉపయుక్తంగా నిలవాలి. పరిశోధనల ప్రధాన ఉద్దేశం ఇది. రైల్వేలో అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్(బ్రిడ్జెస్)గా పనిచేస్తున్న సాలూరు మురళీకృష్ణ పట్నాయక్ ఇదే ఉద్దేశంతో పరిశోధన చేసి.. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ స్వీకరించారు. ఏయూ సివిల్ ఇంజినీరింగ్ విభాగం ఆచార్యులు పి.వి.వి సత్యనారాయణ పర్యవేక్షణలో ఆయన పరిశోధన చేశారు. వాల్తేరు డీఆర్ఎం అనూప్ కుమార్ సత్పతి నుంచి అభినందనలు అందుకున్నారు. విజయనగరం జిల్లా సాలూరుకు చెందిన మురళీకృష్ణ పట్నాయక్ చిన్నతనం నుంచి విద్యపై ఆసక్తిని పెంచుకున్నారు. తండ్రి సాలూరు శంకరనారాయణరావు ప్రభుత్వ ఉపాధ్యాయుడు కావడంతో.. ఆయనే ప్రేరణగా నిలిచారు. పట్నాయక్ పాలిటెక్నిక్‌లో సివిల్ ఇంజినీరింగ్ చదివారు. రైల్వేలో 1988లో ఉద్యోగంలో చేరి ఏఎంఐఈ పూర్తి చేశారు. అనంతరం ఏయూలో ఎంటెక్ చదివారు. అనంతరం పీహెచ్‌డీలో ప్రవేశం పొంది విజయవంతంగా పూర్తి చేశారు. వ్యర్థాలకు అర్థం చెప్పాలనే... విద్యుత్ ఉత్పత్తిలో భాగంగా నేషనల్ థర్మల్ పవర్ ప్లాంట్లలో భారీగా యాష్(బూడిద) ఏర్పడుతుంది. దీనిని నిల్వ చేయడం, పునర్వినియోగం విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు తలకుమించిన భారం. అదే విధంగా క్రషర్‌ల్లో వివిధ సైజ్‌ల్లో కంకర తయారు చేసినపుడు క్రషర్ డస్ట్ ఏర్పడుతుంది. ఈ రెండు పరిశ్రమల్లో ఉత్పత్తి అయ్యే యాష్, క్రషర్ డస్ట్‌లు పర్యావరణపరంగా సమస్యలకు కారణమవుతున్నాయి. పర్యావరణ ప్రాధాన్యం కలిగిన ఇటువంటి అంశాన్ని తన పరిశోధన అంశంగా పట్నాయక్ ఎంచుకున్నారు. ఎన్టీపీసీలో నిరుపయోగంగా ఉన్న యాష్‌ను, వివిధ క్రషర్‌ల్లో ఏర్పడే డస్ట్‌ను ఉపయుక్తంగా మార్చే దిశగా తన పరిశోధన ప్రారంభించారు. గ్రావెల్‌కు ప్రత్యామ్నాయంగా.. రహదారులు, రైల్వే లైన్లు నిర్మాణం చేసే సమయంలో నిర్ణీత ఎత్తు వరకు నేలను చదును చేయడం, రాళ్లు, గ్రావెల్, మట్టి, కంకర వంటి విభిన్న మెటీరియల్స్‌ను ఉపయోగిస్తారు. ఇవన్నీ ఖర్చుతో కూడుకున్నవి. వీటిలో కొన్నింటికి ప్రత్యామ్నాయంగా ఉచితంగా లభించే యాష్‌ను ఉపయోగిస్తే కలిగే సామర్థ్యాన్ని పట్నాయక్ అంచనా వేశారు. నాలుగు పొరలుగా రహదారిని నిర్మిస్తారు. సబ్ గ్రేడ్, సబ్ బేస్ కోర్స్, బేస్ కోర్స్, సర్ఫేసే కోర్స్‌గా ఉంటుంది. మధ్య రెండు పొరలుగా వేసే సబ్ బేస్ కోర్స్, బేస్ కోర్స్‌లో గ్రావెల్, కంకర వివిధ పాళ్లలో కలిపి వినియోగిస్తారు. ఈ రెండింటి లభ్యత తక్కువగా ఉంది. పైగా అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. వీటికి ప్రత్యామ్నాయంగా తగిన పాళ్లలో బాటమ్ యాష్, క్రషర్ డస్ట్‌లను కలిపి వినియోగించే అంశాన్ని ప్రయోగశాల పరిస్థితుల్లో ఆయన అధ్యయనం చేశారు. సీబీఆర్ రేషియో ప్రామాణికంగా.. రహదారుల నిర్మాణంతో నాణ్యతను గుర్తించడానికి, గణించడానికి కాలిఫోర్నియా బేరింగ్ రేషియో(సీబీఆర్)ను ప్రామాణికంగా తీసుకున్నారు. సీబీఆర్ రేషియో 30 కంటే అధికంగా ఉంటే నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నట్లు లెక్క. ప్రస్తుతం వినియోగిస్తున్న గ్రావెల్, కంకరలకు బదులు తగిన పరిమాణంలో బాటమ్ యాష్, క్రషర్ డస్ట్‌లను కలిపి వినియోగించి.. సీబీఆర్ రేషియోను ఆయన గణించారు. కేంద్ర జాతీయ రహదారులు –మంత్రిత్వ శాఖ నిర్ధారించిన ప్రామాణికాలు పరిశీలిస్తే.. సబ్ బేస్ కోర్స్‌కు లిక్విడ్ లిమిట్ 25 కన్నా తక్కువ, ప్లాస్టిసిటీ ఇండెక్స్ 6 కన్నా తక్కువగా, సీబీఆర్ వాల్యూ 30 కన్నా అధికంగా ఉండాలి. పట్నాయక్ ప్రయోగశాల పరిస్థితుల్లో చేసిన ప్రయోగాల ఫలితాలను విశ్లేషిస్తే.. లిక్విడ్ లిమిట్ 22 నుంచి 24, ప్లాస్టిసిటీ ఇండెక్స్ 6 కన్నా తక్కువగా, సీబీఆర్ వాల్యూ 33 నుంచి 72 వరకు వచ్చాయి. ఎర్ర కంకర(గ్రావెల్)కు బాటమ్ యాష్‌ను 20 నుంచి 100 శాతం వరకు కలపగా సీబీఆర్ వాల్యూ 33 నుంచి 65 వరకు, క్రషర్ డస్ట్‌ను 20 నుంచి 100 శాతం వరకు కలపగా సీబీఆర్ వాల్యూ 33 నుంచి 72 శాతం వరకు రావడం ఆయన గుర్తించారు. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా.. థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో బాటమ్ యాష్ నిల్వలు పెరిగిపోతున్నాయి. ఇది థర్మల్ విద్యుత్ సంస్థలకు పెనుభారంగా మారింది. క్రషర్ యూనిట్ల ద్వారా క్రషర్ డస్ట్ వెలువడుతోంది. యాష్, క్రషర్ డస్ట్ పర్యావరణానికి సమస్యగా మారాయి. వీటిని ఉపయోగించాలనే లక్ష్యంతో ఈ పరిశోధన చేశాను. ప్రయోగశాల పద్ధతిలో అధ్యయనం చేశాను. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల నిర్మాణంలో, రైల్వే లైన్ల నిర్మాణంలో శాస్త్రీయ అధ్యయనంతో నిర్ణీత పరిమాణంలో వీటిని వినియోగించవచ్చు. తద్వారా నిర్మాణ భారం తగ్గుతుంది. పర్యావరణానికి మేలు జరుగుతుంది. పశ్చిమబెంగాల్లో తుమ్లుక్ థిగా రైల్వే లైన్ నిర్మాణంలో బాటమ్ యాష్‌ను వినియోగించారు. భవిష్యత్‌లో ఇటువంటి నిర్మాణాలు జరగాల్సిన అవసరం ఉంది. – డాక్టర్ సాలూరు మురళీకృష్ణ పట్నాయక్, అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్(బ్రిడ్జెస్), వాల్తేర్ డివిజన్ -
రైల్వే ఉద్యోగులూ తస్మాత్ జాగ్రత్త!
‘‘నేను ఏడీఎఫ్‌ఎం మాట్లాడుతున్నాను... మీకు నెల జీతం బ్యాంకుకు పంపించడంలో సాంకేతికంగా ఇబ్బంది ఎదురైంది.. కంప్యూటర్లో మీ బ్యాంకు వివరాలు మళ్లీ నమోదు చేయాల్సి ఉంది...మీ వివరాలు చెబుతారా..?’’ – గుంతకల్లు రైల్వే డివిజన్ అధికారులకు వారం రోజుల్లో తరచూ వస్తున్న ఫోన్ కాల్ సారాంశమిది. అనంతపురం, గుంతకల్లు: ఆన్లైన్ మోసగాళ్లు కొత్త పుంతలు తొక్కుతున్నారు. నిన్నటి వరకు బ్యాంకు ఉద్యోగుల పేరుతో వినియోగాదారులకు ఫోన్ చేసి వారి అంకౌట్ నంబర్లు, ఏటీఎం వివరాలు తెలుసుకొని ఖాతాలోని సొమ్మును కాజేసేవారు. దీనిపై జనం చైతన్యవంతులు కావడంతో... ఇపుడు కొత్తగా రైల్వో ఉద్యోగులను టార్గెట్ చేస్తున్నారు. రైల్వే సీనియర్ డివిజనల్ ఫైనాన్స్ మేనేజర్ పేరుతో గుంతకల్లు డీఆర్ఎం కార్యాలయంలోని ఉద్యోగులతోపాటు తిరుపతి, రేణిగుంట, రాయాచూర్ తదితర ప్రాంతల్లోని రైల్వే ఉద్యోగుల మొబైల్ నంబర్లుకు ఫోన్లు చేస్తున్నారు... ‘‘నేను ఏడీఎఫ్‌ఎం మాట్లాడుతున్నాను... మీ జీతం బ్యాంకులో వేసేందుకు సాంకేతికంగా ఇబ్బంది ఎదురైంది.. కంప్యూటర్లో మీ బ్యాంకు వివరాలు మళ్లీ నమోదు చేయాల్సి ఉంది...మీ బ్యాంకు అకౌంట్ నంబర్...ఏటీఎం కార్డుపై ఉన్న 16 సంఖ్యల నంబర్, పేరు, సీవీవీ నంబర్ చెప్పండి’’ అని ఆన్లైన్ మోసగాళ్లు ఉద్యోగులపై వల వేస్తున్నారు. గత వారం రోజులు నుంచి పదులు సంఖ్యలో ఉద్యోగులకు ఈ తరహా కాల్స్ వచ్చాయి. అయితే ఉద్యోగులు కొందరు అప్రమత్తంగా ఉండడంతో ప్రస్తుతానికి ఎవరికీ ఇబ్బంది తలెత్తలేదు. మరోవైపు సీనియర్ డీఎఫ్ఎం చంద్రశేఖర్‌బాబుకు ఈ సమాచారం అందడంతో ఆయన అప్రమత్తమయ్యారు. ఈ విషయమై ఆయన విలేకరులతో మాట్లాడుతూ, అకౌంట్స్ విభాగం ఉద్యోగుల నుంచి గానీ, బ్యాంకుల నుంచి గానీ ఎవరూ బ్యాంకు ఖ>తాల వివరాలు అడగరని ఉద్యోగులు గుర్తించాలన్నారు. ఉద్యోగులు తమ బ్యాంకు ఖ>తా వివరాలు ఎట్టి పరిస్థితుల్లోను చెప్పకూడదుని ఆయన సూచించారు. -
తనిఖీలతో హడలెత్తించిన జీఎం
చంద్రశేఖర్‌కాలనీ,న్యూస్‌లైన్: నిజామాబాద్ రైల్వే స్టేషన్‌ను శుక్రవారం దక్షిణ మధ్యరైల్వే జనరల్ మేనేజర్ ప్రదీప్‌కుమార్ శ్రీవాత్సవ తనిఖీ చేశారు. దాదాపు గంటన్నరపాటు తనిఖీలు చేసి రైల్వే అధికారులను హడలెత్తించారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ముథ్కేడ్ నుంచి నిజామాబాద్ స్టేష న్కు 14 బోగీలు గల ఇన్స్పెక్షన్ ప్రత్యేక రైలులో వ చ్చారు. ఇక్కడి రైల్వే అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. రైలు దిగగానే తనిఖీల పర్వం కొనసాగించారు. స్టేషన్‌లోని ఫుడ్ ప్లాజా క్యాంటిన్‌ను, మార్వాడీ యువమంచ్ వారు స్వచ్ఛందంగా నిర్మించిన తాగునీటి కుళాయిల పనితీరు, రాష్ట్ర ప్రభుత్వ రైల్వే పోలీసు స్టేషన్‌ను, సాధారణ ప్రయాణికుల వెయింటింగ్ రూంను, టాయిలెట్లను నిశితంగా పరిశీలించారు. వెయింటింగ్ రూంలో కూర్చున్న ఓ ప్రయాణికుడిని స్టేషన్లో సౌకర్యాలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి స్టేషన్‌లోని రిజర్వేషన్ కౌంటర్లో తనిఖీ చేసి బయటకు వచ్చి ప్రయాణికుల రిజర్వేషన్, జనరల్ టిక్కెట్ బుకింగ్ కౌంటర్లను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రయాణికులతో ఇబ్బందులేమైనా ఉన్నాయా అని అడిగితెలుసుకున్నా రు. అక్కడి నుంచి స్టేషన్ ఆవరణలో పార్కింగ్ స్థలాన్ని, రైల్వే స్టేషన్ ఎంట్రెన్స్తోపాటు మొత్తం రైల్వే స్థలం వివరాలను స్టేషన్ మాస్టర్ ప్రభుచరణ్‌ను అడిగితెలుసుకున్నారు. స్టేషన్ ఆవరణలో ఎత్తుపల్లాలు ఉన్న విషయాన్ని కూడా అడిగారు. అక్కడి నుంచి స్టేషన్ మాస్టర్ చాంబర్లోకి వెళ్లారు. అనంతరం డ్రైవర్-క్లీనర్లు, రైల్వే సిబ్బంది ఉండే రన్నింగ్ రూంను, కంబైండ్ క్రూ బుకింగ్ లాబీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అక్కడి రైల్వే ఉద్యోగుల మెడికల్ యూనిట్(డిస్పెన్సరీ)ని, రైల్వే క్వార్టర్లను సందర్శించారు. రైల్వే క్వార్టర్లలో నివసిస్తున్న ఉద్యోగ కుటుంబ సభ్యులతో మాట్లాడి సమస్యలు, వసతుల గురించి అడిగితెలుసుకున్నారు. గంటన్నరపాటు జరిగిన తనిఖీలతో రైల్వే అధికారులు ఉరుకులుపరుగులు తీశారు. రైల్వేస్టేషన్లో రన్నింగ్ రూంలో డ్రైవర్లు, గార్డులు రెస్ట్ విభాగంలో ఏసీ సౌకర్యాన్ని ప్రారంభించారు. -
కృష్ణా ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం జరగలేదు
వరంగల్: జిల్లాలోని సంగెం మండలం చింతలపల్లి రైల్వేస్టేషన్ వద్ద రైలు ప్రమాదం జరిగిందని వచ్చిన వార్తలపై రైల్వే డీఎస్పీ సురేష్ కుమార్ స్పందించారు. ఆగిఉన్న ట్రాక్ మరమ్మతు మిషన్‌ను కృష్ణా ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టిన ఘటనలో పెద్దగా నష్టం ఏమీ జరగలేదని ఆయన చెప్పారు. కృష్ణా ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం జరిగిందనేది కేవలం వదంతులు మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. కృష్ణా ఎక్స్‌ప్రెస్ గంట క్రితమే వెళ్లిపోయిందని సురేష్ కుమార్ తెలిపారు. మరమ్మతులు చేస్తున్న ట్రాక్ మిషన్ కృష్ణా ఎక్స్ ప్రెస్ ను ఢీకొట్టింది. దీంతో రైలు అక్కడ కొద్దిసేపు ఆగినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, చింతలపల్లి రైల్వేస్టేషన్ వద్ద జరిగిన ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు గాయపడినట్లు వదంతులు వ్యాపించాయి. -
లారీ- కారు ఢీ: దంపతులు మృతి
కనగానపల్లి మండలం పర్వతదేవపల్లి వద్ద ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న వాహనం ఈ రోజు తెల్లవారుజామున బోల్తా పడింది. ఆ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిలో వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు.పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ఎర్రచందన దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతదేహన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్షతగాత్రుడిని కూడా అదే ఆసుపత్రికి తరలించారు. ఎర్రచందనం దుంగల అక్రమ రవాణపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అదే జిల్లాలోని పామిడి మండలం గజరాంపల్లి సమీపంలో వేగంగా వెళ్తున్నలారీ, ఎదురుగా వస్తున్న కారుని ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో దంపతులు మరణించారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.దాంతో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహలను స్వాధీనం చేసుకుని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మృతి చెందిన దంపతుల్లో భర్త సుబ్బరాయుడు రైల్వే అధికారి అని పోలీసులు తెలిపారు. అనంతరం లారీ డ్రైవర్ ను పోలీసులు ఆదుపులోకి తీసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేశారు. అలాగే వైఎస్ఆర్ కడప జిల్లాని పుల్లంపేటలో హెచ్‌పీ గ్యాస్ గోడౌన్ వద్ద ఈ రోజు తెల్లవారుజామున లారీ - పాల వ్యాన్ ఢీ కొన్నాయి. ఆ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని కడప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.