rain effects
-
వరంగల్‌లో గవర్నర్ పర్యటన.. స్వాగతం వరకు ఒకే.. తరువాత ఎక్కడ?
సాక్షి, వరంగల్ అర్బన్/హసన్‌పర్తి: వరంగల్ నగరంలో వరద ముంపునకు గురై సర్వస్వం కోల్పోయిన బాధితులకు సాయం కోరుతూ కేంద్రానికి లేఖ రాస్తానని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలకు నగరంలో దెబ్బతిన్న ప్రాంతాలను బుధవారం ఆమె సందర్శించారు. జవహర్‌కాలనీ, నయీంనగర్ నాలా, పోతననగర్, ఎన్టీఆర్ నగర్లలో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరద ముంపు బాధితులతో మాట్లాడి వారి ఇబ్బందులు తెలుసుకున్నారు. వరద బాధితులకు ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సమీకరించిన ఆరోగ్య కిట్లు, కిరాణా సరుకులను అందజేశారు. ఎన్టీఆర్ నగర్లో గవర్నర్ పర్యటిస్తున్న సమయంలో ఓ మహిళ వరదకు అన్నీ కొట్టుకుపోయాయని చెబుతూ ఆమెను పట్టుకుని రోదించారు. గవర్నర్ ఆ మహిళను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా తమిళిసై మాట్లాడుతూ ముంపునకు గురైన ప్రాంతాల్లో సత్వరం సహాయక చర్యలు చేపట్టాలన్నారు. ఇటువంటి పరిస్థితులు ఎందుకు తలెత్తుతున్నాయో అ«ధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని, వరద పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండేందుకు శాశ్వత నిర్మాణాలు చేపట్టాలన్నారు. కేంద్ర బృందాలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ నష్టం అంచనా వేస్తున్నట్లు చెప్పారు. నివేదిక ఆ«ధారంగా కేంద్రం స్పందిస్తుందని చెప్పారు. బాధితులకు సహాయం కోసం కేంద్రానికి లేఖ రాస్తానన్నారు. గవర్నర్ వెంట గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ రిజ్వాన్ బాషా, రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ విజయ్‌చందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. చదవండి: తెలంగాణ ఎన్నికలకు కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ.. ఉత్తమ్‌కు ప్రాధాన్యత స్వాగతం వరకు ఒకే.. ఆ తరువాత కమిషనర్ ఒక్కరే.. గవర్నర్ వరద ముంపు ప్రాంతాల పర్యటనలో బల్దియా కమిషనర్ మినహా జిల్లా అధికారులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పాల్గొనలేదు. కాజీపేట నిట్‌కు చేరుకున్న గవర్నర్‌కు హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావీణ్యలు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. కానీ క్షేత్రస్థాయి పర్యటనకు వీరు రాలేదు. గవర్నర్ వెంట పలు కాలనీల్లో బల్దియా కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా ఒక్కరే ఉన్నారు. కాగా, గవర్నర్ పర్యటన ముగిసేదాకా పలువురు బీజేపీ నాయకులు ఆమె వెంటే ఉండటం గమనార్హం. -
టమాటా దిగుబడులపై వర్షం ఎఫెక్ట్
మదనపల్లె(చిత్తూరు జిల్లా): టమాటా దిగుబడులపై వర్షాలు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. మార్కెట్‌కు అంతంతమాత్రంగా వస్తున్న టమాటా దిగుబడులు రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మరింతగా తగ్గిపోయాయి. వర్షాలు విస్తారంగా కురుస్తుండడంతో కాయలపై మచ్చలు వచ్చి.. తెగుళ్లు సోకుతున్నాయి. పంట నాణ్యతగా ఉండడం లేదు. గత నెల 9న రైతులు మార్కెట్‌కు 445 మెట్రిక్ టన్నుల టమాటాలు తీసుకువచ్చారు. ఇందులో మెదటి రకం టమాట ధర కిలో రూ.14 వరకు పలికింది. ప్రస్తుతం దిగుబడులు 70 శాతం మేర తగ్గిపోయింది. ఇతర రాష్ట్రాల్లో వర్షాలకు పంట దెబ్బతినడం, డిమాండ్‌కు తగ్గ సరుకు లేకపోవడంతో ధరలు పెరిగిపోతున్నాయి. శనివారం చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్ యార్డులో మొదటిరకం టమాటా ధర కిలో రూ.35 నుంచి రూ.52 మధ్య పలికింది. రెండో రకం రూ.16 నుంచి రూ.33 మధ్య నమోదైంది. తంబళ్లపల్లె, పీలేరు, మదనపల్లె నియోజకవర్గాల నుంచి రైతులు 86 మెట్రిక్ టన్నుల టమాటాను మార్కెట్‌కు తీసుకువచ్చారు. కోత దశ చివరిది కావడంతో టమాటా దిగుబడులు తగ్గాయని, రబీ సీజన్ ప్రారంభమయ్యాక దిగుబడులు పెరిగే అవకాశం ఉందని హార్టికల్చరల్ ఆఫీసర్ సౌజన్య తెలిపారు. -
‘రిజర్వ్ డే’ సాధ్యం కాదు
లండన్: ప్రపంచ కప్‌లో ఇప్పటికే మూడు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. మరికొన్ని మ్యాచ్ లకు కూడా వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఐసీసీ టోర్నీ నిర్వహణ తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రతిష్టాత్మక ఈవెంట్లో అన్ని మ్యాచ్‌లకు ‘రిజర్వ్ డే’ ఉంటే బాగుండేదని చాలా మంది అభిప్రాయపడ్డారు. అయితే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) దీనిపై పూర్తి స్థాయి వివరణ ఇచ్చింది. 45 లీగ్ మ్యాచ్‌లకు రిజర్వ్ డే ఉంచడం సాధ్యం కాదని... అది తీవ్ర శ్రమతో కూడుకున్న వ్యవహారమని స్పష్టం చేసింది. సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లకు మాత్రం రిజర్వ్ డే ఉన్నట్లు వెల్లడించింది. ‘ప్రపంచకప్‌లో ప్రతీ మ్యాచ్‌కు రిజర్వ్ డే పెట్టడం సాధ్యం కాదు. రిజర్వ్ డే రోజున కూడా వర్షం పడదని ఎవరూ హామీ ఇవ్వలేరు’ అని ఐసీసీ వివరణ ఇచ్చింది. -
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన
విశాఖపట్నం: రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం సూచించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని వెల్లడించింది. దీని ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయని తెలిపింది. గత మూడు రోజులుగా పలు జిల్లాల్లో చెదురు మదురుగా వర్షాలు కురుస్తున్నాయి. -
ఆర్టీసీ బస్సులు ఢీ : ప్రయాణికులకు గాయాలు
ఖమ్మం: రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్న ఘటనలో ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి. ఈ సంఘటన ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం పల్లిపాడులో బుధవారం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు ఆర్టీసీ బస్సులు ఒకదానినొకటి ఢీకొనడంతో.. ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. భారీ వర్షం వస్తుండటంతో.. ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు.