
సాక్షి, వరంగల్ అర్బన్/హసన్‌పర్తి: వరంగల్ నగరంలో వరద ముంపునకు గురై సర్వస్వం కోల్పోయిన బాధితులకు సాయం కోరుతూ కేంద్రానికి లేఖ రాస్తానని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలకు నగరంలో దెబ్బతిన్న ప్రాంతాలను బుధవారం ఆమె సందర్శించారు. జవహర్‌కాలనీ, నయీంనగర్ నాలా, పోతననగర్, ఎన్‌టీఆర్ నగర్‌లలో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరద ముంపు బాధితులతో మాట్లాడి వారి ఇబ్బందులు తెలుసుకున్నారు. వరద బాధితులకు ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సమీకరించిన ఆరోగ్య కిట్‌లు, కిరాణా సరుకులను అందజేశారు.
ఎన్టీఆర్ నగర్‌లో గవర్నర్ పర్యటిస్తున్న సమయంలో ఓ మహిళ వరదకు అన్నీ కొట్టుకుపోయాయని చెబుతూ ఆమెను పట్టుకుని రోదించారు. గవర్నర్ ఆ మహిళను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా తమిళిసై మాట్లాడుతూ ముంపునకు గురైన ప్రాంతాల్లో సత్వరం సహాయక చర్యలు చేపట్టాలన్నారు. ఇటువంటి పరిస్థితులు ఎందుకు తలెత్తుతున్నాయో అ«ధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని, వరద పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండేందుకు శాశ్వత నిర్మాణాలు చేపట్టాలన్నారు.
కేంద్ర బృందాలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ నష్టం అంచనా వేస్తున్నట్లు చెప్పారు. నివేదిక ఆ«ధారంగా కేంద్రం స్పందిస్తుందని చెప్పారు. బాధితులకు సహాయం కోసం కేంద్రానికి లేఖ రాస్తానన్నారు. గవర్నర్ వెంట గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ రిజ్వాన్ బాషా, రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ విజయ్‌చందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
చదవండి: తెలంగాణ ఎన్నికలకు కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ.. ఉత్తమ్‌కు ప్రాధాన్యత
స్వాగతం వరకు ఒకే.. ఆ తరువాత కమిషనర్ ఒక్కరే..
గవర్నర్ వరద ముంపు ప్రాంతాల పర్యటనలో బల్దియా కమిషనర్ మినహా జిల్లా అధికారులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పాల్గొనలేదు. కాజీపేట నిట్‌కు చేరుకున్న గవర్నర్‌కు హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావీణ్యలు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. కానీ క్షేత్రస్థాయి పర్యటనకు వీరు రాలేదు. గవర్నర్ వెంట పలు కాలనీల్లో బల్దియా కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా ఒక్కరే ఉన్నారు. కాగా, గవర్నర్ పర్యటన ముగిసేదాకా పలువురు బీజేపీ నాయకులు ఆమె వెంటే ఉండటం గమనార్హం.