ఇదీ.. జగన్ కమిట్మెంట్
ఒకపక్క.. రోజుకు వంద రూపాయల సంపాదన కూడా లేక.. కనీస అవసరాలని చెప్పే తిండి, ఇల్లు, దుస్తులకు కూడా నోచుకోని జనం లెక్కించలేనంత మంది. మరోపక్క.. రోజుకు లక్ష రూపాయలు సైతం గ్యాంబ్లింగ్‌లో పోగొట్టుకుని చింతలేకుండా గడిపేసే శ్రీమంతులూ లెక్క లేనంతమంది. ఇదీ.. మన సమాజంలో ఉన్న విభజన. నానాటికీ పెద్దదవుతున్న ఈ రేఖ చెరిగేంతవరకూ అభివృద్ధి చెందిన దేశంగానో, రాష్ట్రంగానో మారటం అసాధ్యం. కనీస అవసరాలు తీర్చుకోలేని కోట్లాది మందిని విడిచిపెట్టేస్తే ఆ అభివృద్ధికి అర్థం ఉండదు. ఆ అభివృద్ధిలో వాళ్లకూ వాటా ఉండాలి. ఆ స్థాయికి వాళ్లను తీసుకురావాలి. వాస్తవానికి సంక్షేమ పథకాల పరమార్థం ఇదే. ఇపుడు ఆంధ్రప్రదేశ్‌లో కనిపిస్తున్నది ఆ అభివృద్ధే. చదువుతోనే తలరాత మారుతుంది దీన్ని మనసావాచా నమ్మిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్. కాబట్టే తన పిల్లలిద్దరినీ టాపర్లుగా నిలబెట్టగలిగారు. ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలకూ సరైన విద్యనందించాలన్న ఉద్దేశంతోనే మేనిఫెస్టోలో ‘అమ్మ ఒడి’ని ప్రతిపాదించారు. చేతిలో డబ్బుల్లేక చిన్న పిల్లల్ని సైతం కూలికి పంపే పరిస్థితిని మార్చాలన్నదే దీనివెనకున్న ఆలోచన. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక దీన్ని ఆచరణలోకి తెచ్చారు. ఆశించినట్టే ‘అమ్మ ఒడి’ ఊతంతో పిల్లలు బడి బాట పట్టారు. మరి ఇది సరిపోతుందా? ఇదిగో.. ఈ ఆలోచనే విద్యారంగంలో పెను సంస్కరణలకు బీజం వేసింది. స్కూళ్లకొచ్చే పిల్లల కడుపు నిండితేనే చదువు ఒంట బడుతుందన్న ఆలోచన.. పౌష్టికాహారంతో కూడిన ‘గోరుముద్ద’కు ప్రాణం పోసింది. బళ్లు తెరిచిన ఆరు నెలలకు కూడా పుస్తకాలు అందకపోతే పిల్లలెలా చదువుతారు? ఎవరి స్థాయిని బట్టి వారు దుస్తులు, బ్యాగులతో వస్తే.. ఒకరు షూ వేసుకుని, మరొకరు చెప్పులు లేకుండా వస్తే అంతా ఒక్కటేనన్న భావన ఎందుకొస్తుంది? వీటన్నిటికీ సమాధానమే.. స్కూళ్లు తెరవటానికి ముందే ప్రతి విద్యార్థికీ అందుతున్న ‘విద్యా కానుక’. సరే! మరి స్కూళ్లో? తమ వారి ప్రయివేటు ప్రయోజనాల కోసం గత ప్రభుత్వాలు వాటిని చిత్రవధ చేసి చంపేశాయిగా? ఆడపిల్లలు టాయిలెట్ కోసం ఇంటికెళ్లాలి. సరైన గదుల్లేవు. బెంచీలు, బ్లాక్ బోర్డులు అన్నీ అంతంతే! ఎందుకెళ్లాలి?... అనిపించేలా ఉన్నాయి మన బడులు. వీటిని మార్చాలనుకున్నారు జగన్. అందుకే.. ‘నాడు–నేడు’ పేరిట ఓ యజ్ఞాన్ని ఆరంభించారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలనూ కార్పొరేట్ స్కూలుకు దీటుగా సౌకర్యాలతో తీర్చిదిద్దారు. వేల కోట్లు ఖర్చు చేయాల్సి రావటంతో.. దశల వారీగా ఈ యజ్ఞాన్ని పూర్తి చేస్తున్నారు. స్కూళ్లకు వస్తున్నారు. భోజనం, దుస్తులు ఓకే. స్కూళ్లూ మారాయి. మరి చదువో! మన పిల్లలు పోటీ పడాలంటే ఇంగ్లిష్ రావాలి. వస్తేనే రాణించగలరు. అంతర్జాతీయంగానూ పోటీ పడగలరు. అందుకే ప్రయివేటు స్కూళ్లకు మల్లే ప్రీప్రయిమరీ–1,2 తరగతులు వచ్చాయి. ఆది నుంచే ఇంగ్లిష్ మీడియంలో బోధన మొదలయింది. ఇలాగైతే ప్రయివేటు స్కూళ్లకు ఎవరూ రారు కనక.. మాతృభాషపై మమకారం లేదంటూ, ఇంగ్లీషు చదువులు వద్దంటూ మాఫియా గాళ్లంతా కలిసి మాయా యుద్ధానికి దిగారు. కేసులు వేశారు. అయినా సరే.. జగన్ సంకల్పం గట్టిది కావటంతో ఇంగ్లీషు మీడియం వచ్చింది. ఇప్పుడు చాలా మంది పిల్లలు అనర్గళంగా ఆంగ్లంలో మాట్లాడుతుండటం ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అక్కడితో ఆగలేదు జగన్.అగ్రశ్రేణి కార్పొరేట్ స్కూళ్లలోనే దొరికే ఎడ్యుటెక్ కంటెంట్‌ను దిగ్గజ సంస్థ ‘బైజూస్’ ద్వారా మన పిల్లలకూ అందుబాటులోకి తెచ్చారు. ఏటా 8వ తరగతి పిల్లలకు శాంసంగ్ ట్యాబ్‌లనూ అందజేస్తున్నారు. మిగిలిన తరగతుల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్‌ను (ఐఎఫ్‌పీ) ఏర్పాటు చేస్తున్నారు. డిజిటల్ క్లాస్రూమ్లనూ అందుబాటులోకి తెస్తున్నారు. దీన్ని బట్టి తెలిసేది ఒక్కటే. పిల్లల చదువుపై సీఎం జగన్‌కు అంతులేని నిబద్ధత ఉంది. చదివించటం ద్వారా వారి రాతలను మార్చాలన్న తపనతో.. యావత్తు విద్యా రంగాన్ని సమూలంగా సంస్కరించటం మొదలెట్టారు. ఇదంతా చేసింది జస్ట్ నాలుగున్నరేళ్ల వ్యవధిలోనే! వైద్యం.. ప్రతి ఒక్కరి హక్కు.. చదువుకైనా.. సరైన వైద్యం చేయించుకోవటానికైనా పేదరికం అడ్డు కాకూడదని, వైద్యం కోసం అప్పులపాలు కాకూడదని జగన్ భావించారు. అందుకే.. వెయ్యి రూపాయలు దాటిన ఏ వైద్యానికైనా ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తానని మేనిఫెస్టోలో చెప్పారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక దాన్ని అమల్లోకి తెచ్చారు. ఆరోగ్య సేవలకు అదొక బీజం మాత్రమే. అక్కడి నుంచి మొదలుపెడితే.. రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థ అంచెలంచెలుగా విస్తరిస్తూ పోయింది. ఆసుపత్రులన్నీ స్కూళ్ల మాదిరే ‘నాడు–నేడు’ కింద కొత్త రూపాన్ని, కొత్త సౌకర్యాలను సంతరించుకున్నాయి. ఎక్కడా ఒక్క పోస్టు కూడా ఖాళీ లేకుండా వైద్యులు, నర్సులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు... ఇలా ప్రతి పోస్టూ భర్తీ చేశారు. సూపర్ స్పెషాలిటీ వైద్యుల భర్తీతో పాటు.. అత్యాధునిక పరికరాలనూ తీసుకొచ్చారు.యావత్తు ప్రపంచంతో పాటు రాష్ట్రాన్ని కూడా కోవిడ్ వణికించినపుడు వీళ్లంతా కలిసి వలంటీర్ల సాయంతో ఎంత అద్భుతం చేశారన్నది రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ తెలుసు. ఇతర రాష్ట్రాల్లో ఆసుపత్రుల్లో బెడ్లు దొరకని పరిస్థితుల్లో పొరుగు రాష్ట్రాల నుంచి సైతం ఇక్కడికి వచ్చి, సంరక్షణ కేంద్రాల్లో ఉచితంగా చికిత్స తీసుకుని వెళ్లారంటే.. అది రాష్ట్రంలో వైఎస్ జగన్ అమల్లోకి తెచ్చిన పక్కా వ్యవస్థ వల్లేనన్నది కాదనలేని నిజం. అంతేకాదు.. గ్రామ స్థాయి నుంచీ వైద్య వ్యవస్థను బలోపేతం చేస్తూ వచ్చారు. ఏకంగా 1,405 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఏర్పడ్డాయి. ప్రతి చోటా వైద్యులొచ్చారు. ఉచిత మందులు అందుబాటులోకి వచ్చాయి. వీటన్నిటికీ తోడు విదేశాల్లోనే కనిపించే ‘ఫ్యామిలీ డాక్టర్’... మన ఊళ్లలో ప్రతి ఇంటికీ అందుబాటులోకి వచ్చారు.రాష్ట్రంలో ఇపుడు నిరుపేదలందరికీ కావాలనుకున్న వెంటనే సూపర్ స్పెషాలిటీ డాక్టర్ అపాయింట్మెంట్.. అదీ ఉచితంగా దొరుకుతోందంటే.. అదే వైఎస్ జగన్ విజన్. పరిస్థితులు మారి... కొన్ని చికిత్సలకు వ్యయం ఎక్కువవుతోందని గ్రహించటంతో ఇపుడు ఆరోగ్య శ్రీ చికిత్సకయ్యే ఖర్చును ఏకంగా రూ.25 లక్షల వరకూ ప్రభుత్వమే భరించేలా నిర్ణయం తీసుకున్నారు. ప్రతి చికిత్సా ఆరోగ్య శ్రీ పరిధిలోకి వచ్చేలా చికిత్స ప్రకిరయలను సైతం 1,059 నుంచి 3,257కి పెంచారు. ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించే నెట్వర్క్ ఆసుపత్రుల సంఖ్యను 820 నుంచి 2,513కి పెంచారు. నాలుగున్నరేళ్లలో ఇవన్నీ చేయాలంటే ఎంత కమిట్మెంట్ ఉండాలి మరి! ఇదీ వ్యవ‘సాయం’ అంటే.. దేశానికి రైతే వెన్నెముక. వైఎస్సార్ వారసుడిగా దీన్ని బలంగా నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకే ఏడాదికి రెండుసార్లు పంట వేసే ముందు రైతుకు పెట్టుబడిగా రూ.12,500 చొప్పున ఇస్తామని భరోసా ఇచ్చారు. దాన్ని మరో రూ.వెయ్యి పెంచి కోవిడ్ కష్టకాలంలోనూ ఆపకుండా మరీ అమల్లోకి తెచ్చారు. నిజానికి రైతుకు ఏం చేసినా తక్కువే. ఎంత చేసినా తక్కువే. అందుకే గ్రామ స్థాయిలోనే రైతులకు అన్ని సేవలూ అందించే ఓ బలమైన వ్యవస్థను సృష్టించాలని సంకల్పించారు. రైతు భరోసా కేంద్రాలకు ప్రాణం పోశారు. రైతు ఎదుర్కొంటున్న కష్టాలన్నిటికీ ఇది వన్‌స్టాప్ పరిష్కారంగా ఉండాలని భావించారు.నకిలీ విత్తనాల బారిన పడకుండా ఇక్కడే సర్టిఫైడ్ విత్తనాలు, పురుగు మందులు దొరుకుతాయి. భూసార పరీక్ష కేంద్రాల నుంచి పండిన పంటను నిల్వ చేసుకునే గిడ్డంగులు, ఆఖరికి ఖాతాలో పడ్డ నగదును డ్రా చేసుకునేందుకు ఏటీఎంలు కూడా కొన్నిచోట్ల ఆర్బీకేలలోనే అందుబాటులోకి వచ్చాయి. ఇపుడు ఆర్బీకే అనేది ఓ బలమైన ప్రభుత్వ వ్యవస్థ. రైతును విత్తు నుంచి పండిన పంటను విక్రయించుకునేదాకా చేయిపట్టి నడిపించే అమ్మ, నాన్న.. అన్నీ. మనసు మంచిదైతే ప్రకృతి కూడా సహకరిస్తుందనేది ఎంత నిజమో ఈ నాలుగున్నరేళ్ల వైఎస్ జగన్ పాలనలో ప్రస్ఫుటమైంది. సువిశాల కోస్తా తీరం కారణంగా కొన్నిసార్లు తుపాన్లు దెబ్బతీసినా.. తట్టుకుని రోజుల వ్యవధిలోనే బయటపడే వ్యవస్థను ఏర్పాటు చేశారు. నష్టపోయిన ప్రతి కుటుంబానికీ అతివేగంగా సాయం అందించటంతో పాటు ప్రతి ఎకరాకూ ఉచితంగా ప్రభుత్వమే బీమా చేయించటం, ఒక సీజన్లో జరిగిన నష్టానికి మళ్లీ ఆ సీజన్ రాకముందే పరిహారాన్ని అందించటం.. ఏ సీజన్లో జరిగిన నష్టానికి ఆ సీజన్లోనే ఇన్పుట్ సబ్సిడీని అందించటం.. ఇలా ప్రతిదీ నెరవేర్చేలా ‘ఈ–క్రాప్’ ద్వారా ఆర్బీకేల చుట్టూ ఓ బలమైన వ్యవస్థను సృష్టించారు. ఇదీ విజన్ అంటే. వికేంద్రీకరణకు కొత్త అర్థం వృద్ధులకు, దివ్యాంగులకు ప్రభుత్వమిచ్చే పింఛన్లంటే ఇదివరకు ఓ మహా ప్రహసనం. పట్టణాల్లోనైతే బ్యాంకుల ముందు పడిగాపులు. పల్లెల్లోనైతే ఇచ్చే వ్యక్తి ఏ రోజున వస్తాడో తెలియని దైన్యం. అసలే వాళ్లు వృద్ధులు, దివ్యాంగులు. అలాంటి వారికిచ్చే సాయమేదైనా వారికి సాంత్వన కలిగించాలి తప్ప ఇబ్బంది పెట్టకూడదు కదా? ఇదిగో.. ఈ ఆలోచనతోనే ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ వలంటీర్ల సైన్యాన్ని సృష్టించారు. ప్రతినెలా ఒకటవ తేదీన ఠంచనుగా ఇళ్లకు వెళ్లి సామాజిక పింఛన్లు అందజేయటం ఈ సైన్యం బాధ్యత. ఆ తరవాత..! ఆ వలంటీర్లు మరిన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగమయ్యారు.పథకాలను లబ్ధిదారులకు చేరువ చేశారు. ప్రతి 50 ఇళ్లకు ఓ వలంటీరు. ప్రభుత్వానికి – ఆ గడపలకు తనే సంధానకర్త. సూక్ష్మ స్థాయిలో వికేంద్రీకరణ ఫలితాలను కళ్లకు కట్టిన వలంటీర్ల మాదిరే... గ్రామాల్లో సచివాలయాలు ఏర్పాటయ్యాయి. ప్రభుత్వ పథకాల లబ్దిదారులకు చేరువ చేయడానికి వలంటీర్లయితే... ప్రభుత్వాన్ని గ్రామ స్థాయికి చేర్చేది గ్రామ సచివాలయాలు. అవసరమైన సర్టిఫికెట్ల నుంచి స్థానికంగా కావాల్సిన సేవలూ అక్కడే. ఈ వ్యవస్థ ఆలోచనతో ఏకంగా లక్షన్నర ప్రభుత్వ ఉద్యోగాలొచ్చాయి. అవినీతికి, లంచాలకు ఆస్కారం లేకుండా యువత ఉన్న ఊళ్లోనే ఉద్యోగాలు తెచ్చుకుని కొలువుల్లో స్థిరపడింది. అక్కడితో ఆగకుండా గ్రామాల్లో రైతుల కోసం ఆర్బీకేలు, వైద్య సేవల కోసం పీహెచ్‌సీలు నిర్మించి, యావత్తు గ్రామ వ్యవస్థను బలోపేతం చేశారు జగన్. అందుకే ఇపుడు పల్లెల్లో ఆర్థిక కార్యకలాపాలు పెరిగాయి. పల్లెల నుంచి వలసలు తగ్గాయి. ఒక బలమైన ఆలోచన... దాని ద్వారా మరింత మంచి చేయాలన్న తపన... ఈ రెండూ ఉంటే ఎంతటి అద్భుతమైన వ్యవస్థలను నిర్మించవచ్చో చేసి చూపించారు జగన్. అందుకే ప్రతి రాష్ట్రం ఇప్పుడు మన రాష్ట్రం వైపు చూస్తోంది. ♦ డీబీటీ ద్వారా వివిధ వర్గాల ప్రజలకు ఇప్పటిదాకా అందిన మొత్తం రూ.2,43,958.04 కోట్లు♦ లబ్ధి పొందిన వారి సంఖ్య (పలువురికి రెండు మూడు పథకాల ద్వారా లబ్ధి) 8,29,81,601♦ డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా వివిధ వర్గాల ప్రజలకు ఇప్పటిదాకా అందిన మొత్తం రూ.4,11,488.99 కోట్లు♦ నాన్ డీబీటీ ద్వారా వివిధ వర్గాల ప్రజలకు ఇప్పటిదాకా అందిన మొత్తం రూ.1,67,530.95 కోట్లు♦ లబ్ధి పొందిన వారి సంఖ్య (పలువురికి రెండు మూడు పథకాల ద్వారా లబ్ధి) 4,44,04,251♦ డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా లబ్ధి పొందిన వారి సంఖ్య (పలువురికి 2, 3 పథకాల ద్వారా లబ్ధి) 12,73,85,852-రమణమూర్తి మంథా