ఇక రాజమహేంద్రవరం
రాజమండ్రి పేరును మారుస్తున్నట్లు చంద్రబాబు ప్రకటన
* సాంస్కృతిక రాజధానిగా తీర్చిదిద్దుతామని వెల్లడి
* పుష్కర సేవలందించిన ఉద్యోగులకు స్పెషల్ డీఏ ప్రకటన
రాజమండ్రి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రాజమండ్రి పేరును రాజమహేంద్రవరంగా మారుస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గతంలో ఈ పేరే ఉన్నా ఇంగ్లిష్‌వారు తాము పిలుచుకోవడానికి వీలుగా రాజమండ్రిగా మార్చారని, దాన్ని మళ్లీ మార్చాలని నిర్ణయించినట్లు చెప్పారు.
రాజమహేంద్రవరాన్ని ఆధునిక టూరిజం నగరంగా, రాష్ట్రానికి సాంస్కృతిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. గోదావరి మహా పుష్కరాల ముగింపు సందర్భంగా శనివారం రాత్రి నగరంలోని ఆర్ట్స్ కాలేజీలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ఉభయగోదావరి జిల్లాలను కలిపే గామన్... ధవళేశ్వరం బ్యారేజీ చుట్టూ రౌండుగా 35 కిలోమీటర్లు ఉంటుందని తెలిపారు. ఈ ప్రాంతం మొత్తాన్ని అఖండ గోదావరి ప్రాజెక్టు పేరుతో అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇందుకోసం ప్రత్యేకంగా అధికారులను నియమిస్తామన్నారు.
తొలివిడతగా రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. సెంట్రల్ జైలు పక్కన ఖాళీగా ఉన్న 50 ఎకరాల స్థలంలో కన్వెన్షన్, ఎగ్జిబిషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. నగరంలోని అన్ని చారిత్రక ఆనవాళ్లను అభివృద్ధి చేస్తామని తెలిపారు. పుష్కరుడు వచ్చే సంవత్సరంవరకూ గోదావరిలోనే ఉంటాడని, ఆ తర్వాత కృష్ణా నదిలోకి వస్తాడని రెండేళ్లు మన రాష్ట్రంలోనే ఉంటాడని చెప్పారు. పుష్కరాలను బ్రహ్మాండంగా నిర్వహించామని, అధికార యంత్రాంగం చిత్తశుద్ధివల్లే ఇది సాధ్యమైందని ప్రశంసించారు.
మంత్రులు, అధికారులు, ఉద్యోగులందరినీ అభినందించిన సీఎం ఈసారి వారికి డీఏను ఒకటిన్నర రెట్లు పెంచి ఇస్తామని ప్రకటించారు. రాబోయే రోజుల్లో ప్రతి పాఠశాలల్లో కూచిపూడి నృత్యం నేర్పించాలని భావిస్తున్నట్లు తెలిపారు. గోదావరి నిత్య హారతిని గంగా హారతి తర్వాత చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించామని, దీనికి తన భార్యే కారణమని చెప్పారు. మొదటిరోజు జరిగిన సంఘటన తనను ఎంతో బాధించిందని, తన ప్రభుత్వ హయాంలో ఇది జరగడంపై చింతిస్తున్నానని ఆవేదన వ్యక్తంచేశారు. సినీ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ బ్రహ్మాండంగా పనిచేశారని అభినందించారు.
గోదావరి కుంభమేళాలా ఉంది: బాబా రాందేవ్
గోదావరి పుష్కరాలు గోదావరి కుంభమేళాలా ఉన్నాయని, ఇక్కడి ఒక్క హారతిలో అన్ని హారతులు కలిపి ఇవ్వడం అద్భుతంగా ఉందని బాబా రామ్‌దేవ్ గోదావరి హారతిని కొనియాడారు. సైన్స్, ఆధ్యాత్మికత, టెక్నాలజీని మేళవించి దీన్ని కొత్తగా రూపొందించడం అభినందనీయమన్నారు. తాను కుంభమేళా చూశానని, కానీ ఇక్కడి సుందర రమణీయతను తానెక్కడా చూడలేదని, ఇందుకు కారణమైన చంద్రబాబును అభినందిస్తున్నట్లు తెలిపారు. త్వరలో రాష్ట్రంలో తమ పతంజలి యోగా సెంటర్‌ను ప్రారంభిస్తామని చెప్పారు. సభలో బెంగుళూరు ఆది చంచన్గిరి మఠ్‌కి చెందిన స్వామి నిర్మలానంద, పలువురు మంత్రులు పాల్గొన్నారు.