Rajugari gadi
-
'రాజుగారి గది 3' మూవీ రివ్యూ
టైటిల్ : రాజుగారి గది 3 జానర్ : హర్రర్ కామెడీ నటీనటులు : అశ్విన్ బాబు, అవికా గోర్, అలీ, అజయ్ ఘోష్, ఊర్వశీ, బ్రాహ్మాజీ, గెటప్ శ్రీను, శివశంకర్ మాస్టార్, హరితేజ సంగీతం : షబీర్ దర్శకత్వం : ఓంకార్ నిర్మాణం : ఓక్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ‘ఆట’లాంటి షోస్‌తో టెలివిజన్ తెరపై సత్తా చాటిన ఓంకార్.. దర్శకుడిగా ‘రాజుగారి గది’ సినిమాతో సినీ పరిశ్రమలోనూ తనదైన ముద్ర వేశారు. హర్రర్ కామెడీ జానర్లో తీసిన ‘రాజుగారి గది’ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఈ సిరీస్‌లో తీసే చిత్రాలకు క్రేజ్ ఏర్పడింది. ఆ తర్వాత నాగార్జున, సమంత వంటి అగ్రశ్రేణి స్టార్స్‌తో తీసిన ‘రాజుగారి గది-2’ అనుకున్న అంచనాలను అందుకోలేకపోయింది. ఆ సినిమా కమర్షియల్‌గా విజయం సాధించలేదు. ఈ నేపథ్యంలో మరోసారి హర్రర్ కామెడీనే నమ్ముకున్న ఓంకార్ ‘రాజుగారి గది-3’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈసారి అశ్విన్ బాబుకు జోడీగా అవికా గోర్ నటించిన ‘రాజుగారి గది-3’ ప్రేక్షకులను మెప్పించిందా? అసలు గదిలో ఏముంది? ఈ మూడోపార్టులో దెయ్యం నవ్వించి.. భయపెట్టిందా? తెలుసుకుందాం పదండి! కథ..: మాయా (అవికా గోర్) ఓ ఆస్పత్రిలో వైద్యురాలిగా పనిచేస్తుంటుంది. ఆమె తండ్రి గరడపిళ్లై. కేరళలో పేరుమోసిన మాంత్రికుడు. ఈ క్రమంలో మాయను ఎవ్వరూ వెంబడించి వేధించినా.. ఐ లవ్యూ చెప్పినా.. మాయాను అనుసరిస్తూ ఉండే ఓ దెయ్యం వారి భరతం పడుతుంది. మరోవైపు అశ్విన్ ఓ కాలనీలో ఆటోడ్రైవర్. నిత్యం తాగి తందనాలు ఆడుతూ.. కాలనీ వాసులను వేధించుకు తింటుంటాడు. మాయను ప్రేమించి.. ఐలవ్యూ చెప్పి దెయ్యం చేతిలో చావుదెబ్బలు తిన్న డాక్టర్ శశి (బ్రహ్మాజీ).. కాలనీ వాసులతో పథకం రచించి.. మాయను అశ్విన్ ప్రేమించేలా చేస్తాడు. అశ్విన్ కూడా మాయకు ఐలవ్యూ చెప్పడంతో దెయ్యం అతనికి చుక్కలు చూపిస్తుంది. ఈ క్రమంలో గరడపిళ్లైతో తాడో-పెడో తేల్చుకోవడానికి అశ్విన్, తన మామ అలీతో కలిసి కేరళ వెళుతాడు. అక్కడ అశ్విన్‌కు ఎదురైన పరిస్థితులేమిటి? యక్షిని ఎవరు? మాయకు రక్షణగా యక్షిని ఎందుకు తిరుగుతుంది? యక్షిని బారి నుంచి మాయను ఎలా రక్షించి.. అశ్విన్ పెళ్లి చేసుకున్నాడు? రాజుగారి గదిలో వారికి ఎదురైన పరిస్థితులు ఏమిటి? అన్నది తెలుసుకోవడానికి సినిమా చూడాలి. ఎవరు ఎలా చేశారు? రాజుగారి గదిలో హీరోగా చేస్తూ వస్తున్న అశ్విన్ బాబు.. ఈ సినిమాలోనూ తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు. యాక్టింగ్ పరంగా కొంచెం మెరుగయ్యాడు. కానీ, డైలాగ్ మాడ్యులేషన్ అనేక యాసల్లో ఉండటం కనిపిస్తుంది. ఇక, మాయగా అవికా గోర్ అందంగా కనిపించింది. కొంచెం బొద్దుగా ఉన్నప్పటికీ తన నటనతో పర్వాలేదనిపించింది. క్లైమాక్స్‌లో కాసేపు దెయ్యంగా కనిపించింది. ఫస్ట్ హాఫ్‌లో అలీ, అశన్లతో కలిసి బ్రహ్మాజీ, శివశంకర్ మాస్టార్, గెటప్ శ్రీను తదితరులు కాసింత నవ్వులు పంచారు.సెకండ్ హాఫ్‌లో గరడ పిళ్లై, రాజమాతలుగా అజయ్ ఘోష్, సీనియర్ నటి ఊర్వశీలు.. అలీ, అశ్విన్ తోడుగా దెయ్యాలతో కలిసి హర్రర్ కామెడీ పండించారు. ముఖ్యంగా అలీ, అజయ్ ఘోష్, ఊర్వశీ తమ పాత్రలకు న్యాయం చేస్తూ.. నవ్వులు పంచారు. విశ్లేషణ..! హర్రర్ కామెడీ సినిమాలకు బలమైన కథ, కథనాలు ముఖ్యం. దర్శకుడిగా ఓంకార్.. ఈ హర్రర్ కామెడీ సినిమాకు ఒకింత డిఫరెంట్ పాయింట్‌నే ఎంచుకున్నారు. అమ్మాయి వెంటపడే వ్యక్తులనే యక్షిని రఫ్ ఆడటమనే కాన్సెప్ట్ బాగానే ఉన్నా.. సెకండాఫ్‌లో రాజుగారి గదిలోకి పాత్రలు ఎంటరైన తర్వాత పూర్తిగా కామెడీ మీద ఫోకస్ చేయడం కొంత ప్రేక్షకులకు నిరాశకు గురిచేయవచ్చు. అంతగా భయపెట్టి థ్రిల్ చేసే అంశాలు సినిమాలో లేకపోవడం మైనస్‌గా చెప్పవచ్చు. సెకండాఫ్‌లో దెయ్యాలన్నీ వచ్చి కామెడీ పండించడం తప్ప పెద్దగా ప్రేక్షకుడిని ఉత్కంఠకు గురిచేయవు. యక్షిని నేపథ్యాన్ని కార్టూన్రూపంలో చెప్పడం కన్విన్సింగ్‌గానే ఉన్నా.. ఇంకాస్త మెరుగ్గా చెబితే ప్రేక్షకుల్లో నాటుకుపోయేది. దర్శకుడిగా ఓంకార్ టేకింగ్ బాగుంది. ఛోటా కే నాయుడు సినిమాటోగ్రఫి.. షబీర్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాను బాగా ఎలివేట్ చేశాయి. ఎప్పటిలాగే బుర్ర సాయిమాధవ్ డైలాగులు హాస్యాన్ని పండిస్తూ.. అదనపు బలాన్ని చేకూర్చాయి. షబీర్ పాటలు అంతగా గుర్తుండిపోవు కానీ పాటల టేకింగ్ బావుంది. మొత్తానికి ఈ హర్రర్ కామెడీలో హర్రర్ అంతలేకపోయినా కామెడీ ప్రేక్షకులను మెప్పించవచ్చు. బలాలు కామెడీ సినిమాటోగ్రఫీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఓంకార్ టేకింగ్ బలహీనతలు కథ, కథనాలు సాలిడ్‌గా లేకపోవడం హార్రర్ పెద్దగా లేకపోవడం ఫస్టాఫ్‌లో సాగదీత ఫీలింగ్ - శ్రీకాంత్ కాంటేకర్ -
అందుకే వారు గొప్ప నటులయ్యారు
‘‘దర్శకుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడో నటుడిగా దాన్ని అందించడానికి ప్రయత్నిస్తాను. నేనెప్పుడూ దర్శకుణ్ణి ఇబ్బంది పెట్టలేదు. ‘వీడు బాగా నవ్విస్తాడు, ఏడిపిస్తాడు’ అని ప్రేక్షకులు ఎవర్ని భావిస్తారో వారే గొప్ప నటుడు’’ అన్నారు నటుడు అలీ. ఓంకార్ దర్శకత్వంలో అశ్విన్ బాబు, అవికా గోర్ జంటగా తెరకెక్కిన ‘రాజుగారి గది 3’ చిత్రం ఈ నెల 18న విడుదలకానుంది. ఈ సినిమాలో కీలక పాత్ర చేసిన అలీ మాట్లాడుతూ– ‘‘నేను ఇప్పటి వరకూ చేసిన సినిమాలు ఒక ఎత్తు, ‘రాజుగారి గది 3’ ఒకఎత్తు. విభిన్నమైన భావోద్వేగాలున్న పాత్రను నాకు ఇచ్చారు ఓంకార్. డైరెక్టర్‌గా తనకు చాలా క్లారిటీ ఉంది. ఆర్టిస్టుల నుంచి ఏం కావాలో రాబట్టుకుంటారు. మొదటి రెండు భాగాలకంటే ఈ సినిమా చాలా బావుంటుంది. ఛోటా కె.నాయుడు విజువల్స్ ఈ సినిమాను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లాయి. ఈ చిత్రంతో అశ్విన్ నటుడిగా మరో ఎత్తుకి ఎదుగుతాడు. సెకండ్ హాఫ్‌లో సాయిమాధవ్ బుర్రా గారి డైలాగ్స్‌కు థియేటర్లో నవ్వులే. ఈ సినిమా చూస్తూ ప్రేక్షకులు పొట్టచెక్కలయ్యేలా నవ్వుతారు. డీటీఎస్ మిక్సింగ్ చేసిన వ్యక్తి చూసిన ప్రతిసారీ నవ్వుతూనే ఉన్నారని నాకు తెలిసింది. దీన్ని బట్టి థియేటర్లో ప్రేక్షకుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. బ్రహ్మానందం, మల్లికార్జునరావు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎంఎస్ నారాయణగార్లు నాకు నచ్చిన హాస్యనటులు. రైటర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి కామెడీ యాక్టర్స్ అయ్యారు. కామెడీ ఎంత మోతాదులో ఉండాలో వాళ్లకు తెలుసు. అందుకే గొప్ప హాస్యనటులుగా పేరు తెచ్చుకున్నారు’’ అన్నారు. -
భయపెడుతూ నవ్వించే దెయ్యం
‘‘రాజుగారి గది’ రెండు భాగాలు మంచి సక్సెస్ అయ్యాయి. సెకండ్ పార్ట్‌లో కామెడీ మిస్ అయింది అన్నారు. అది దృష్టిలో ఉంచుకొని ‘రాజుగారి గది 3’ కథ రెడీ చేశా’’ అన్నారు దర్శకుడు ఓంకార్. ‘రాజుగారి గది’ సిరీస్ నుంచి వస్తున్న మూడో సినిమా ‘రాజుగారి గది 3’. అశ్విన్‌బాబు, అవికా గోర్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను హీరో వెంకటేశ్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఓంకార్ మాట్లాడుతూ– ‘‘రెండు నెలల్లో సినిమా పూర్తి చేశాం. అందరూ సొంత సినిమాలా భావించి పని చేశారు. మా సినిమా వందశాతం ఎంటర్టైన్ చేస్తుంది’’ అన్నారు. ‘‘మూడేళ్ల తర్వాత నేను చేస్తున్న తెలుగు సినిమా ఇది. ఓంకార్‌గారు కథ చెప్పగానే థ్రిల్ అయ్యాను’’ అన్నారు అవికా గోర్. ‘‘ఓంకార్ అన్నయ్య నన్ను కొత్త కోణంలో చూపించాడు’’ అన్నారు అశ్విన్‌బాబు. ‘‘ఈ సినిమాలో దెయ్యం ఆహ్లాదంగా నవ్విస్తుంది. భయపెడుతూ నవ్విస్తుంది. ఓంకార్ చాలా క్లారిటీ ఉన్న దర్శకుడు’’ అన్నారు మాటల రచయిత బుర్రా సాయిమాధవ్. ‘‘భయపడుతూ, నవ్విస్తూ ఉండే సినిమా ఇది. ఆర్టిస్టులకు గౌరవం ఇచ్చి నటన రాబట్టుకుంటారు ఓంకార్’’ అన్నారు నటుడు బ్రహ్మాజీ. ‘‘చిన్నప్పుడు విఠాలాచారి సినిమాలు చూసేవాణ్ణి. ఇప్పుడు ఓంకార్ అలాంటి దర్శకుడు’’ అన్నారు నటుడు అలీ. -
పక్కా ప్లానింగ్!
ఇటు సౌత్ అటు నార్త్‌ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు తమన్నా. ఇక్కడ సినిమాలు కమిట్ అవుతూ అక్కడి సినిమాలకు కూడా డేట్స్ ఇస్తూ పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో వెళుతునాన్రు. ఇటీవల విడుదలైన హిందీ చిత్రం ‘ఖామోషి’ చిత్రంలో కనిపించిన తమన్నా ఇప్పుడు బాలీవుడ్లో మరో చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని టాక్. విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ హీరోగా తెరకెక్కనున్న చిత్రం ‘బోలె చూడియా’లో తమన్నా నాయికగా నటించనున్నారట. ఈ సినిమాతో నవాజుద్దీన్ సిద్ధిఖీ సోదరుడు షమాస్ నవాబ్ సిద్ధిఖీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రొమాంటిక్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమాలో తొలుత మౌనీ రాయ్‌ను కథానాయికగా ఎంపిక చేశారు. అయితే ఆమె ఈ చిత్రం నుంచి తప్పుకోవడంతో ఆ అవకాశం తమన్నాకి దక్కింది. ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న ఒక సమస్యపై ఈ చిత్రకథ ఉంటుందట. కాగా, ఈ చిత్రంలో ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే ‘రాజుగారి గది 3’ నుంచి తమన్నా తప్పుకున్నారని ఫిల్మ్ నగర్ టాక్. ‘సైరా’లో ఆమె ఓ కీలక పాత్ర చేసిన విషయం తెలిసిందే. తమిళంలో సుందర్ .సి దర్శకత్వంలో ఓ సినిమా, ‘ఆనందో బ్రహ్మ’ తమిళ రీమేక్‌లో నటిస్తున్నారు. -
'రాజుగారి గది' చూస్తూ ప్రేక్షకుడు మృతి
-
'రాజుగారి గది' చూస్తూ ప్రేక్షకుడు మృతి
చంద్రాయణగుట్ట (హైదరాబాద్) : వినోదం కోసం థియేటర్‌కు వెళ్లిన ఓ వ్యక్తి హారర్ సినిమా చూస్తూ గుండెపోటుతో మృతి చెందిన సంఘటన నగరంలో శుక్రవారం చోటుచేసుకుంది. ప్రముఖ టీవీ యాంకర్ ఓంకార్ డైరెక్షన్లో తెరకెక్కిన తెలుగు హారర్ సినిమా 'రాజు గారి గది' చూస్తూ ప్రేక్షకుడు మృతి చెందాడు. నగరంలోని బహదూర్‌పురా పరిధిలోని మెట్రో థియేటర్లో ప్రదర్శితమవుతున్న ఈ సినిమాకు వెళ్లిన అమర్‌నాథం(55) అక్కడికక్కడే చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
ఇలాంటి కాన్సెప్ట్ ఈజీ కాదు
- ఓంకార్ ఓక్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో ఓంకార్ నిర్మించిన చిత్రం ‘రాజుగారి గది’. అశ్విన్, చేతన్, ధన్యా బాలకృష్ణన్, పూర్ణ ముఖ్య తారలుగా నటించిన ఈ చిత్రం విజయోత్సవం మంగళవారం జరిగింది. ఓంకార్ మాట్లాడుతూ - ‘‘అవయవదానం గొప్పదనం చెప్పే సినిమా తీయడమంటే అంత ఈజీ కాదు. ఆ విషయంలో నిమ్మగడ్డ ప్రసాద్ గారు హెల్ప్ చేశారు. సాయి కొర్రపాటి, అనిల్ సుంకర అందించిన సపోర్ట్‌తో దసరా కానుకగా విడుదల చేసి, మంచి విజయం సాధించాం’’ అని చెప్పారు. ‘‘ఇది నా సెకండ్ హారర్ మూవీ’’ అని పూర్ణ అన్నారు. ‘‘టీమ్ అందరం బాగా కష్టపడ్డాం. ఈ చిత్రాన్ని పెద్ద హిట్ చేసి నాకు లైఫ్ ఇచ్చారు’’ అని హీరో అశ్విన్ చెప్పారు. నిర్మాత సాయి కొర్రపాటి, సంగీత దర్శకుడు సాయికార్తీక్, చిత్ర కథానాయిక ధన్యా బాలకృష్ణన్, నటులు చేతన్, ధన్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు. -
నా తమ్ముడు రెండు త్యాగాలు చేశాడు!
‘‘దర్శకుడిగా నా తొలి చిత్రం ‘జీనియస్’ను ఆరు కోట్లలో తీయాలనుకుంటే పది కోట్లయ్యింది. దర్శకుడిగా నాకు మంచి పేరొచ్చినా నిర్మాతకు ఆర్థిక సంతృప్తి లభించలేదు. అందుకే ఈసారి వీలైనంత తక్కువ బడ్జెట్లో, తక్కువ టైమ్‌లో సినిమా తీయాలనుకున్నా’’ అని ఓంకార్ అన్నారు. ఓక్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తన తమ్ముడు అశ్విన్‌ను హీరోగా పరిచయం చేస్తూ స్వీయదర్శకత్వంలో ఓంకార్ నిర్మించిన చిత్రం ‘రాజుగారి గది’. దసరా కానుకగా ఈ నెల 22న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఓంకార్ మాట్లాడుతూ - ‘‘నా కెరీర్‌కు మంచి మలుపు అయిన ‘ఆట’ గేమ్ షోలో నా తమ్ముడు అశ్విన్ కూడా పోటీపడ్డాడు. అశ్విన్ గెలిస్తే, షో నాది కాబట్టి గెలిచాడనుకుంటారని తనంతట తానుగా తప్పుకుని, త్యాగం చేశాడు. అలాగే, తనని హీరోగా పెట్టి ఓ సినిమా ప్రారంభిస్తే, నిర్మాతల కోరిక మేరకు వేరే హీరోతో తీయాల్సి వచ్చింది. ఆ విధంగా రెండోసారి కూడా నా తమ్ముడు త్యాగం చేశాడు. అందుకే అశ్విన్‌ని హీరోగా నిలబెట్టాలనే తపనతో ఈ సినిమా చేశా. నిర్మాతలు సాయి కొర్రపాటి, అనిల్ సుంకర నా సినిమా కొనడం ఆనందంగా ఉంది. ఓ గ్రామంలో ఉన్న మహల్లోకి వెళ్లినవాళ్లందరూ చనిపోతుంటారు. ఏడుగురు వ్యక్తులు ఆ మహల్లోకి వెళితే ఏం జరిగిందన్నది చిత్ర కథాంశం. భయపెడుతూనే నవ్వించే చిత్రమిది’’ అన్నారు. ఈ చిత్రం తర్వాత ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయడానికి కథ రెడీ చేసుకున్నాననీ, ‘రాజుగారి గది’ సీక్వెల్‌కి స్టోరీ రెడీ చేశానని ఓంకార్ అన్నారు.