టైటిల్ : రాజుగారి గది 3
జానర్ : హర్రర్ కామెడీ
నటీనటులు : అశ్విన్ బాబు, అవికా గోర్, అలీ, అజయ్ ఘోష్, ఊర్వశీ, బ్రాహ్మాజీ, గెటప్ శ్రీను, శివశంకర్ మాస్టార్, హరితేజ
సంగీతం : షబీర్
దర్శకత్వం : ఓంకార్
నిర్మాణం : ఓక్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్
‘ఆట’లాంటి షోస్‌తో టెలివిజన్ తెరపై సత్తా చాటిన ఓంకార్.. దర్శకుడిగా ‘రాజుగారి గది’ సినిమాతో సినీ పరిశ్రమలోనూ తనదైన ముద్ర వేశారు. హర్రర్ కామెడీ జానర్‌లో తీసిన ‘రాజుగారి గది’ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఈ సిరీస్‌లో తీసే చిత్రాలకు క్రేజ్ ఏర్పడింది. ఆ తర్వాత నాగార్జున, సమంత వంటి అగ్రశ్రేణి స్టార్స్‌తో తీసిన ‘రాజుగారి గది-2’ అనుకున్న అంచనాలను అందుకోలేకపోయింది. ఆ సినిమా కమర్షియల్‌గా విజయం సాధించలేదు. ఈ నేపథ్యంలో మరోసారి హర్రర్ కామెడీనే నమ్ముకున్న ఓంకార్ ‘రాజుగారి గది-3’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈసారి అశ్విన్ బాబుకు జోడీగా అవికా గోర్ నటించిన ‘రాజుగారి గది-3’ ప్రేక్షకులను మెప్పించిందా? అసలు గదిలో ఏముంది? ఈ మూడోపార్టులో దెయ్యం నవ్వించి.. భయపెట్టిందా? తెలుసుకుందాం పదండి!
కథ..:
మాయా (అవికా గోర్) ఓ ఆస్పత్రిలో వైద్యురాలిగా పనిచేస్తుంటుంది. ఆమె తండ్రి గరడపిళ్లై. కేరళలో పేరుమోసిన మాంత్రికుడు. ఈ క్రమంలో మాయను ఎవ్వరూ వెంబడించి వేధించినా.. ఐ లవ్యూ చెప్పినా.. మాయాను అనుసరిస్తూ ఉండే ఓ దెయ్యం వారి భరతం పడుతుంది. మరోవైపు అశ్విన్ ఓ కాలనీలో ఆటోడ్రైవర్. నిత్యం తాగి తందనాలు ఆడుతూ.. కాలనీ వాసులను వేధించుకు తింటుంటాడు. మాయను ప్రేమించి.. ఐలవ్యూ చెప్పి దెయ్యం చేతిలో చావుదెబ్బలు తిన్న డాక్టర్ శశి (బ్రహ్మాజీ).. కాలనీ వాసులతో పథకం రచించి.. మాయను అశ్విన్ ప్రేమించేలా చేస్తాడు. అశ్విన్ కూడా మాయకు ఐలవ్యూ చెప్పడంతో దెయ్యం అతనికి చుక్కలు చూపిస్తుంది. ఈ క్రమంలో గరడపిళ్లైతో తాడో-పెడో తేల్చుకోవడానికి అశ్విన్, తన మామ అలీతో కలిసి కేరళ వెళుతాడు. అక్కడ అశ్విన్‌కు ఎదురైన పరిస్థితులేమిటి? యక్షిని ఎవరు? మాయకు రక్షణగా యక్షిని ఎందుకు తిరుగుతుంది? యక్షిని బారి నుంచి మాయను ఎలా రక్షించి.. అశ్విన్ పెళ్లి చేసుకున్నాడు? రాజుగారి గదిలో వారికి ఎదురైన పరిస్థితులు ఏమిటి? అన్నది తెలుసుకోవడానికి సినిమా చూడాలి.
ఎవరు ఎలా చేశారు?
రాజుగారి గదిలో హీరోగా చేస్తూ వస్తున్న అశ్విన్ బాబు.. ఈ సినిమాలోనూ తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు. యాక్టింగ్ పరంగా కొంచెం మెరుగయ్యాడు. కానీ, డైలాగ్ మాడ్యులేషన్ అనేక యాసల్లో ఉండటం కనిపిస్తుంది. ఇక, మాయగా అవికా గోర్ అందంగా కనిపించింది. కొంచెం బొద్దుగా ఉన్నప్పటికీ తన నటనతో పర్వాలేదనిపించింది. క్లైమాక్స్‌లో కాసేపు దెయ్యంగా కనిపించింది. ఫస్ట్ హాఫ్‌లో అలీ, అశన్లతో కలిసి బ్రహ్మాజీ, శివశంకర్ మాస్టార్, గెటప్ శ్రీను తదితరులు కాసింత నవ్వులు పంచారు.సెకండ్ హాఫ్‌లో గరడ పిళ్లై, రాజమాతలుగా అజయ్ ఘోష్, సీనియర్ నటి ఊర్వశీలు.. అలీ, అశ్విన్ తోడుగా దెయ్యాలతో కలిసి హర్రర్ కామెడీ పండించారు. ముఖ్యంగా అలీ, అజయ్ ఘోష్, ఊర్వశీ తమ పాత్రలకు న్యాయం చేస్తూ.. నవ్వులు పంచారు.
విశ్లేషణ..!
హర్రర్ కామెడీ సినిమాలకు బలమైన కథ, కథనాలు ముఖ్యం. దర్శకుడిగా ఓంకార్.. ఈ హర్రర్ కామెడీ సినిమాకు ఒకింత డిఫరెంట్ పాయింట్‌నే ఎంచుకున్నారు. అమ్మాయి వెంటపడే వ్యక్తులనే యక్షిని రఫ్ ఆడటమనే కాన్సెప్ట్ బాగానే ఉన్నా.. సెకండాఫ్‌లో రాజుగారి గదిలోకి పాత్రలు ఎంటరైన తర్వాత పూర్తిగా కామెడీ మీద ఫోకస్ చేయడం కొంత ప్రేక్షకులకు నిరాశకు గురిచేయవచ్చు. అంతగా భయపెట్టి థ్రిల్ చేసే అంశాలు సినిమాలో లేకపోవడం మైనస్‌గా చెప్పవచ్చు. సెకండాఫ్‌లో దెయ్యాలన్నీ వచ్చి కామెడీ పండించడం తప్ప పెద్దగా ప్రేక్షకుడిని ఉత్కంఠకు గురిచేయవు. యక్షిని నేపథ్యాన్ని కార్టూన్‌రూపంలో చెప్పడం కన్విన్సింగ్గానే ఉన్నా.. ఇంకాస్త మెరుగ్గా చెబితే ప్రేక్షకుల్లో నాటుకుపోయేది. దర్శకుడిగా ఓంకార్ టేకింగ్ బాగుంది. ఛోటా కే నాయుడు సినిమాటోగ్రఫి.. షబీర్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాను బాగా ఎలివేట్ చేశాయి. ఎప్పటిలాగే బుర్ర సాయిమాధవ్ డైలాగులు హాస్యాన్ని పండిస్తూ.. అదనపు బలాన్ని చేకూర్చాయి. షబీర్ పాటలు అంతగా గుర్తుండిపోవు కానీ పాటల టేకింగ్ బావుంది. మొత్తానికి ఈ హర్రర్ కామెడీలో హర్రర్ అంతలేకపోయినా కామెడీ ప్రేక్షకులను మెప్పించవచ్చు.
బలాలు
కామెడీ
సినిమాటోగ్రఫీ
బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్
ఓంకార్ టేకింగ్
బలహీనతలు
కథ, కథనాలు సాలిడ్‌గా లేకపోవడం
హార్రర్ పెద్దగా లేకపోవడం
ఫస్టాఫ్‌లో సాగదీత ఫీలింగ్
- శ్రీకాంత్ కాంటేకర్
Comments
Please login to add a commentAdd a comment