రోడ్డు ప్రమాదంలో బండల వ్యాపారి మృతి
గుత్తి: గుత్తి పట్టణ శివారులోని ఎస్కేడీ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బండల వ్యాపారి మృతి చెందాడు. ఇదే ప్రమాదంలో ఆయన తల్లి తీవ్రంగా గాయపడింది. పెద్దవడుగూరు ఎస్ఐ రమణారెడ్డి తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. తాడిపత్రి పట్టణంలోని మూడో రోడ్డులో నివాసముంటున్న రవికుమార్‌రెడ్డి (42) బండల ఫ్యాక్టరీ నడుపుతున్నాడు. తల్లి విజయలక్ష్మికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో గురువారం ఇండికా కారు (ఏపీ 09 బీఎన్ 5698)లో కర్నూలుకు తీసుకెళ్లాడు. అక్కడ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించాడు. శుక్రవారం తల్లితో కలిసి తాడిపత్రికి అదే కారులో పయనమయ్యాడు. గుత్తి సమీపంలో 44వ నంబరు జాతీయరహదారిపై కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న సైన్ బోర్డుకు ఢీకొట్టింది. దీంతో కారు రోడ్డు పక్కనే పల్టీ కొట్టింది. కారు నడుపుతున్న రవికుమార్‌రెడ్డి అక్కడిక్కడే మృతి చెందాడు. తల్లి విజయలక్ష్మి తీవ్రంగా గాయపడింది. మృతుడికి భార్య , పిల్లలు ఉన్నారు. ఎస్ఐ రమణారెడ్డి కేసు నమోదు చేసుకున్నారు.
రూట్ అవగాహన లేకే..
హైవే నుంచి తాడిపత్రికి వెళ్లాలంటే కొత్తపేట వద్ద ఫ్లై ఓవర్ దిగాలి. అయితే తాడిపత్రికు ఎలా వెళ్లాలో తెలియని రవికుమార్‌రెడ్డి అలాగే ముందుకు అంటే అనంతపురం వైపు కొంత దూరం నడిపాడు. కొత్తపేట నుంచి కేవలం కిలో మీటరు దూరంలో సైన్‌బోర్డుకు ఢీకొని మృత్యువాత పడ్డాడు. తాడిపత్రి రోడ్డుకు కారును తిప్పి ఉంటే అసలు ప్రమాదం జరిగేది కాదని పోలీసులు చెప్పారు.