Ravula Sridhar Reddy
-
BRS Party: మాగంటి Vs రావుల.. వేదికపైనే తిట్టుకున్నఇరువురు నేతలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ భవన్ వేదికగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, రావుల శ్రీధర్ రెడ్డి మధ్య గొడవ జరిగింది. ఇద్దరు వేదికపైనే తిట్టుకున్నారు. మాగంటి మాట్లాడుతుండగా శ్రీధర్ రెడ్డి అడుకున్నారు. దీంతో శ్రీధర్ రెడ్డిపై మాగంటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నిన్ను ఎవడ్రా పిలిచింది’ అంటూ మాగంటి గోపి ఫైర్ అయ్యారు. దీనికి శ్రీధర్ రెడ్డి బదులిస్తూ ‘నువ్వేవడివి.. నాకు చెప్పడానికి’ అంటూ కౌంటర్ ఇచ్చారు. ఇంతలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ జోక్యం చేసుకొని ఇరువురి నేతలకు సర్ది చెప్పారు. దీంతో గొడవ సద్దుమణిగింది. ఈ క్రమంలోనే స్టేజీ కింద ఉన్న బీఆర్ఎస్ క్యాడర్ కొంత అసంతృప్తికి లోనయ్యారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. చదవండి: ఫోన్ ట్యాపింగ్‌పై పొలిటికల్ ఫైట్.. రేవంత్, కిషన్ రెడ్డికి కేటీఆర్ సవాల్ -
బీజేపీ సీనియర్ నేత రాజీనామా
సాక్షి, హైదరాబాద్ : బీజేపీకి సీనియర్ నేత, రాష్ట్ర అధికార ప్రతినిధి రావుల శ్రీధర్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన ఆదివారం ఉదయం రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడికి పంపించారు. అలాగే కార్యకర్తలు, అనుచరులతో కలిసి నేడు టీఆర్ఎస్లో చేరనున్నారు. 2018 ఎన్నికల్లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ తరపున పోటీచేసిన శ్రీధర్‌రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓటమి చవిచూశారు. బీజేపీ కీలకంగా భావించే జీహెచ్ఎంసీ ఎన్నికలు ముందు శ్రీధర్‌రెడ్డి రాజీనామా చేయడం ఆ పార్టీకి ఎదురుదెబ్బగా నేతలు భావిస్తున్నారు. దీనిపై శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజుల్లో 11 ఏళ్ల కిందట కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీలో చేరాను. జూబ్లీహిల్స్ నుంచి 2018లో పోటీ చేశాను. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ గెలుపుకు కృషి చేశాను. బీజేపీ అనుసరిస్తున్న తీరు వల్ల తెలంగాణకు న్యాయం జరిగే పరిస్థితి లేదు. కేంద్రం రైతు వ్యతిరేక విధానాలు పూర్తి అబద్ధాలు చెప్పడం నచ్చడం లేదు. కేసీఆర్ ద్వారా తెలంగాణ సాధ్యమైంది. 6 ఏళ్లుగా పురోగమిస్తుంది. దేశంలో తెలంగాణ అగ్రగామిగా కేసీఆర్ నిలబెట్టారు. ఈ మధ్య కేంద్ర విధానాలు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నాయి. వ్యవసాయ బిల్లు రైతులకు గుదిబండగా మారుతోంది.తెలంగాణను కేసీఆర్ సస్యశ్యామలం చేస్తుంటే.. బీజేపీ కార్పొరేట్ మయం చేస్తోంది. ఆత్మవంచన రాజకీయాలు చేయడం నచ్చడం లేదు. కేటీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ అగ్రగామిగా నిలుస్తోంది. కేంద్ర నిర్ణయాలు తిరోగమన దిశగా ఉన్నాయి. రైతులకు విద్యుత్ మోటర్లకు మీటర్లు బిగించడం సమంజసం కాదు.తెలంగాణ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న కేసీఆర్.. ఆధ్వర్యంలో తెలంగాణ భద్రంగా ఉంది. కేసీఆర్ నేతృత్వంలో పనిచేయాలని నిర్ణయించాను.’అని అన్నారు. -
సమ్మె పరిష్కారంపై చిత్తశుద్ధి లేదు: శ్రీధర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెను పరిష్కరించాలన్న చిత్తశుద్ధి రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, న్యాయస్థానాలను సైతం అది తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తోందని బీజేపీ అధికార ప్రతినిధి రావుల శ్రీధర్‌రెడ్డి ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడిన ఆర్టీసీ కార్మికుడి కుటుంబానికి సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన పార్టీ నాయకులను అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. బుధవారం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ నగర పాలకసంస్థ అవినీతికి మారుపేరుగా తయారైందని ధ్వజమెత్తారు. జీహెచ్ఎంసీలో అన్ని విభాగాల పనితీరు అధ్వానంగా తయారైందన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా, డల్లాస్‌గా మారుస్తామని రాష్ట్ర ప్రభుత్వం గుప్పిస్తున్న వాగ్దానాలకు పూర్తి భిన్నమైన పరిస్థితులు క్షేత్రస్థాయిలో ఉన్నాయన్నారు. నగరంలో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నీరుగారుస్తున్నారని, పారిశుద్ధ్య నిర్వహణ ఘోరంగా తయారైందని విమర్శించారు. ఎక్కడ చూసినా వ్యర్థ పదార్థాలు నిండిపోయి, దుర్వాసన వస్తోందని, అసలు జీహెచ్ఎంసీ పనిచేస్తోందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు. టీఆర్ఎస్, మజ్లిస్ నాయకులు ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. అక్రమ కట్టడాల నిరోధానికి గట్టి చర్యలు తీసుకోవాలని శ్రీధర్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
ఉత్తమ్‌వి మతిలేని మాటలు: శ్రీధర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంపై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మతిలేని మాటలు మాట్లాడుతున్నారని బీజేపీ అధికార ప్రతినిధి రావుల శ్రీధర్‌రెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీనే తెలివి తక్కువతనంతో, అవగాహన లేకుండా మాట్లాడితే.. వాటిని పట్టుకొని పీసీసీ అధ్యక్షుడు కూడా తెలివి లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. బీజేపీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ జవాబు ఇచ్చి న తరువాత కూడా విమర్శలు చేయడం కాంగ్రెస్ పార్టీ కుటిల నీతికి నిదర్శమన్నారు. 2008లోనే ఫ్రాన్స్‌తో అప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఒప్పందం చేసుకుం దని తెలిపారు. -
సెటిల్మెంట్లకు అడ్డాగా మంత్రుల పేషీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మంత్రుల, ఎమ్మెల్యేల పేషీలు భూముల పంచాయితీలకు, సెటిల్మెంట్లకు అడ్డాగా మారాయని బీజేపీ అధికార ప్రతినిధి రావుల శ్రీధర్‌రెడ్డి సోమ వారం ఆరోపించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యవహారం కొత్తగా తెరపైకి రావడం టీఆర్ఎస్ ప్రభుత్వంలోని ప్రజా ప్రతినిధుల వ్యవహారశైలికి నిదర్శనమన్నారు. గతంలో ప్రజలకు రౌడీలు, గూం డాల నుంచి బెదిరింపులుండేవని, టీఆర్ఎ స్ అధికారంలోకి వచ్చాక మంత్రుల నుంచే నేరుగా బెదిరింపులు వస్తున్నాయన్నారు. మంత్రులు పద్మారావు, జూపల్లి, ఎమ్మెల్యే లు గువ్వల బాలరాజు, దుర్గం చిన్నయ్య వంటివారి బెదిరింపులు వెలుగులోకి వచ్చాయన్నా రు. నిజామాబాద్ జిల్లాలో దళితుల భూమి కబ్జా చేశారని ఆరోపణలు వస్తే సీఎం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. సీఎం చూసీచూడనట్టుగా వ్యవహరించడం వల్లే అధికారపార్టీ నేతలు బరితెగించారని ఆరోపించారు. -
శూన్యం నుంచి శిఖరం దాకా
రెండు పార్లమెంట్ సీట్లతో 1984లో ప్రారంభమైన బీజేపీ ప్రయాణం నేడు 32 ఏళ్ల తరువాత, 282 సీట్ల అత్యధిక మెజారిటీతో అధికారాన్ని పొందిన తీరు, నిజం నెమ్మదిగానైనా గెలిచి తీరుతుందని చాటింది. ఇంతింతై వటుడింతై అన్న రీతిలో జనసంఘ్‌గా స్థాపితమై, భారతీయ విలువలతో కూడిన ప్రజాస్వామ్య పరిరక్షణకు, భారత సమగ్రతకు అనునిత్యం శ్రమించి, నాటి పాలకులు విధించిన ఉక్కు సంకెళ్ళ నిర్బంధాన్ని ఛేదించేందుకు జనతా పార్టీతో మమేకమై, నమ్మిన సిద్ధాంత ఆచరణకు అధికార అందలాన్నికూడా అంచుకు నెట్టి భారత దేశ సమున్నత అభివృద్ధే లక్ష్యంగా, జాతీయవాద భావననే స్ఫూర్తిగా జనించిన ‘భారతీయ జనతా పార్టీ‘కి నేటికి 38 ఏళ్ళు. శ్యామాప్రసాదు ముఖర్జీ మనః ఫలకం నుంచి మొలకెత్తిన ‘జనసంఘ్’ దీనదయాళుని మానస పుత్రికై పరిఢవిల్లి, వాజపేయి నాయకత్వాన ‘భారతీయ జనతా పార్టీ‘గా కమల వికాసమై వెలిగింది. అడ్వాణీ ర«థ చక్రాల సాక్షిగా, ఎందరో నాయకమ్మన్యుల శ్రమతో ఎదిగి, రాజ్‌నాథ్ సింగ్ సారథ్యాన కనీవినీ ఎరుగని రీతిలో అధికారాన్ని సాధించింది. నేడు అమిత్ షా ఆధ్వర్యాన పదికోట్ల మంది ప్రాథమిక సభ్యత్వాలతో ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీగా ఆవిర్భవించింది. ఈ 38 వసంతాల ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో, సైద్ధాంతిక నిబద్ధతతో, దేశాభివృద్ధే లక్ష్యంగా, అధికారంలో ఉన్నా, లేకున్నా ఒక దృఢమైన ఒరవడితో కొనసాగుతున్న భిన్నమైన రాజకీయ పార్టీగా నేడు విశ్లేషకుల ప్రశంసలందుకుంటూ, 21 రాష్ట్రాల్లో అధికారాన్ని చేపట్టి, దేశ ప్రగతికి నిరంతరం బీజేపీ కృషి చేస్తోంది. దేశంలోని మెజారిటీ పార్టీలు కుటుంబాల ఆధారంగానో, వ్యక్తులపేరు పైననో, ప్రాంతీయ భావోద్వేగాల పునాదులపైనో నడిస్తే, బీజేపీ మాత్రం భారతదేశమంతా ఒక్కటే, భిన్న జాతులు, వర్గాలు ఉన్నా భారత జాతి ఒక్కటే అని విశ్వసించి, సర్వ ధర్మ సమభావంతో కూడిన, శోషణ ముక్త సమరస భారతాన్ని నిర్మించడంకోసం అహరహం శ్రమిస్తోంది. దీనదయాళ్ ప్రవచించిన ఏకాత్మత మానవ వాదం ప్రధాన సైద్ధాంతిక వనరుగా పయనించే బీజేపీ, సమాజంలో వ్యక్తి పాత్రను, తద్వారా భారతీయతతో కూడిన సమాజ అభివృద్ధి భావనను పెంపొందించింది. 1984లో రెండు పార్లమెంట్ సీట్లతో ప్రారంభమైన పార్టీ ప్రయాణం అంచెలంచెలుగా ప్రజామోదం చూరగొంటూ నేడు 32 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత, ఒకే పార్టీకి 282 సీట్ల అత్యధిక మెజారిటీతో అధికారాన్ని పొందిన తీరు, నిజం నెమ్మదిగానైనా గెలిచి తీరుతుందనే నానుడిని నిజం చేసింది. కుటుంబ పాలనా ప్రచార హోరులో, వ్యక్తి పూజ హద్దు మీరి, ‘వ్యక్తులే దేశం, దేశమే ఫలానా వ్యక్తి’ అన్నంత స్థాయిలో జరిగిన వికృత ప్రచార పోకడతో దేశం వెనుకబడినా, నిరంతర కృషితో ప్రజా సంక్షేమం, ప్రజా మనోభావనలకు అనుగుణంగా పోరాడిన బీజేపీని ప్రజలు అక్కున చేర్చుకున్నారు. తన సైద్ధాంతిక, రాజకీయ పరి ణితితో, భారతీయీకరణతో కూడిన ప్రజాస్వామ్యాన్ని ప్రజలకు అనుభవ నైవేద్యంగా సమర్పిస్తున్నది. ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వ పగ్గాలు దూరమవుతున్నా, విపరీత ధోరణులకు పోని వాజ పేయి రాజనీతిజ్ఞత, ప్రజల మనోభావాల సాధనకు జీవితాన్నర్పించిన అడ్వాణీ లక్ష్య సాధన సమర్ధత, సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పని చేసి, సర్వ భారతావని ఆమోదంతో ప్రధాని పదవిని చేపట్టిన నరేంద్రుని పరిపాలన దక్షత, రాష్ట్రాల వారీగా అన్ని వర్గాల ఆశీర్వాదం అందుకుంటూ బీజేపీని ప్రపంచంలోనే అతిపెద్ద రాజ కీయ పార్టీగా నిలబెట్టిన అమిత్ షా నాయకత్వ పటిమ, వీరిని అనుసరిస్తూ దేశ సంక్షేమం కోసం అనునిత్యం పరితపించే కార్యకర్తల బలంతో బీజేపీ భవిష్యత్తు మరింత బ్రహ్మాం డంగా ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. 2014లో బీజేపీపై ప్రజా విశ్వసనీయతే బలంగా, అభివృద్ధే ధ్యేయంగా పరిపాలన పగ్గాలు చేపట్టిన బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం, సుస్థిరమైన, సమర్థమైన, అవినీతిరహిత, క్రియాశీల ప్రభుత్వాన్ని నడపడంలో విజయవంతమైంది. అంతర్జాతీయంగా ప్రశంసలందుకుంటోంది. ఎన్నో ప్రభుత్వ ప«థకాలు, జనధన్, ముద్ర, స్టాండ్ అప్, ఉజ్వల యోజన తదితరాలన్నీ పార్టీ సైద్ధాంతిక పునాదుల ఆధారంగా నిర్మితమైనవే. అఖండ భారతావని సర్వతోముఖాభివృద్ధికి ఈ వ్యవస్థాపక దినోత్సవం నాడు యావత్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పునరంకితమవుతారని ఉద్ఘాటిస్తూ.. భారత్ మాతాకీ జై. (నేడు బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం) రావుల శ్రీధర్ రెడ్డి, వ్యాసకర్త రాష్ట్ర అధికార ప్రతినిధి బీజేపీ, తెలంగాణ ‘ మొబైల్ : 99855 75757 -
వితండవాదానికి విలువుండదు!
సందర్భం దేశ గౌరవానికి చెందిన కీలక అంశాలతోపాటు, అత్యంత సామాన్యమైన అంశాలపై కూడా రాద్దాంతం చేయడమే కాంగ్రెస్ పార్టీ పనిగా పెట్టుకుంది. జాతి ప్రయోజనం కోసం పనిచేస్తున్న మోదీపై వితండవాదంతో నెగ్గలేమని ప్రతిపక్షం గుర్తించాలి. తెలంగాణలో ఒక సామెత ఉంది. ‘సుయ్ అంటే నాకో బూరె’ అంటావేందిరా అని పెద్దలు అంటుంటారు. అంటే సంబంధం లేకున్నా, విచక్షణ లేకుండా, చేస్తున్న పని ఫలితాల ప్రభావం ఎలా ఉంటుందనే సోయి లేకుండా ప్రతీ విష యంలో జోక్యం చేసుకునే వారిపై ప్రయోగించే వాక్యం.. పైన పేర్కొన్న సామెత. సరిగ్గా ఇదే రకంగా దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఉన్నది. నరేంద్రమోదీ ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత దేశంలో జరిగిన వివిధ సంఘటనలు, తదనంతర పరిణామాలపై కాంగ్రెస్ పార్టీ తీరును పరిశీలిస్తే, ఎందుకు వారిని ఆ సామెతతో పోల్చానో అవగతమవుతుంది. ఇటీవల ముగిసిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వారి దిమ్మతిరిగేట్లు వచ్చిన తర్వాత ఈవీఎంల పని తీరుపై చేసే వితండవాదం కావచ్చు. ఆ మధ్యన పుణే ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ నియామకం తరువాత జరిగిన నానా యాగీ కావచ్చు. విషయం సహేతుకమా కాదా అనవసరం. విషయ పరిజ్ఞానంతో సంబంధం లేకుండా ఏదో రకంగా పార్లమెంట్ వెలుపల లేదా బయట నానా కంగాళీ చేసి ఉనికి చాటుకోవాలి, పేరు సంపాదించుకోవాలి. పని లోపనిగా కాంగ్రెస్ పతనావస్థకి కారణమైన మోదీ నాయకత్వంపైన వీలైనంత బురదజల్లి అక్కసు తీర్చుకొని, కడుపుబ్బరం తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ప్రజలు మున్నెన్నడూ లేనంత మెజారిటీ కట్టబెట్టి అధికారాన్నిచ్చిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో యోగి ఆదిత్యనాథ్‌ను ఏకగ్రీవంగా సీఎంగా ఎన్నుకుంటే అదేదో కొంపలు మునిగిపోయినట్లు ఎమ్మెల్యేలే లేరా అని దీర్ఘాలు తీస్తారు. యోగి ఆ రాష్ట్రం నుంచి ఐదుసార్లు ఎంపీగా ఉన్న విషయం, ఆయన దక్షత పట్ల ఉన్న ఆదరణ తెలియనట్లు ప్రవర్తిస్తారు. నల్ల ధనానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో భాగంగా పాత పెద్ద నోట్ల ఉపసంహరణ చేసి వాటి స్థానే కొత్త నోట్లను ప్రవేశపెట్టిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ, దాని మిత్ర పక్షాలు చేసిన గొడవ అంతా ఇంతా కాదు. మొదట దాన్ని సమర్థిస్తున్నామని, ఆ తర్వాత నిర్వహణ బాగా లేదని, చివరకు మొత్తంగా యూ టర్న్ తీసుకుని ఆ మొత్తం ప్రక్రియను వ్యతిరేకిస్తున్నామని వేసిన కుప్పిగెంతులకు జనం ఆశ్చర్యపోయారు. అసలు ఈ పార్టీకేమైంది అని చర్చించుకున్నారు. యావత్ దేశం ఆ నోట్ల ఉపసంహరణను సమర్థించి, మోదీ వెంట నడిచి, ఎన్ని ఇబ్బందులనైనా ఎదుర్కొని, అవినీతిపై జరుగుతున్న యుద్ధంలో భాగస్వాములైతే కాంగ్రెస్ నిలకడలేని మాటలు మాట్లాడి అపహాస్యం పాలయింది. చివరకు ఆ చర్య తరువాత జరిగిన అనేక పంచాయతీ, అసెంబ్లీ, స్థానిక సంస్థలు, కొన్ని పార్లమెంట్ ఉప ఎన్నికల్లో కూడా ప్రజలు మెజార్టీ స్థానాలు బీజేపీకి కట్టబెట్టి మోదీ నాయకత్వంపట్ల విశ్వాసం ప్రకటించారు. అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో నోట్ల ఉపసంహరణ ప్రజా వ్యతిరేక చర్య అని ప్రచారం చేసిన కాంగ్రెస్ అడ్రస్ గల్లంతైంది. వారితో జట్టు కట్టిన సమాజ్‌వాదీ పరిస్థితి అగమ్య గోచరమైంది. అక్కడక్కడా జరిగిన చెదురు మదురు సంఘటనలను భూతద్దంలో చూపించి ప్రభుత్వాన్ని నిందించే కాంగ్రెస్‌కు, ప్రతీ విషయానికి అదే పనిగా ఆర్ఎస్ఎస్ను విమర్శించే కాంగ్రెస్ నాయకులకు వీరభద్రసింగ్పైనున్న అవినీతి మరకలు, కర్ణాటక కాంగ్రెస్ నాయకుడిపై జరుగుతున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు గోచరించవు. కశ్మీర్ విషయానికొస్తే అక్కడ జరిగిన అనేక అలజడులకు కాంగ్రెస్ ప్రభుత్వాలు అవలంభించిన విధానాలే కారణం. ఉదారవాద విధానాలతో ఓటు బ్యాంకు రాజకీయాలు నడిపిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీజేపీతో కూడిన సంకీర్ణ ప్రభుత్వం నేతృత్వంలో పరిస్థితులు మెరుగుపడితే తట్టుకోలేక ప్రతి చిన్న విషయాన్ని రాద్ధాంతం చేస్తోంది. ఈమధ్యనే బీజేపీకి చెందిన మాజీ ఎంపీ తరుణ్ విజయ్ ఓ విదేశీ టీవీ ఛానెల్ చర్చలో చేసిన వ్యాఖ్యలపైన కాంగ్రెస్ దాని మిత్రపక్షాల వైఖరి హాస్యాస్పదం, గర్హనీయం. భారత దేశంలో ఉన్న ఆఫ్రికన్లపై స్థానిక అంశాల ప్రాతిపదికన జరిగిన దాడులకు సంబంధించి వ్యాఖ్యాత వేసిన ప్రశ్నల పరంపరకు సమాధానమిస్తూ, భారత్‌లో జాతి వివక్ష ఉండదు అనే విషయాన్ని చెప్పాలనుకుని పొరపాటున పదాల కూర్పు కారణంగా మరొక విధమైన అర్థమొచ్చిందని, అది అధిక్షేపణీయమని, తన ఉద్దేశం అది కాదని సదరు మాజీ ఎంపీ స్వయంగా ప్రకటించిన తర్వాత కూడా కాంగ్రెస్ వారు రాజకీయం చేశారు. కేంద్ర స్థాయిలో పటిష్ట నాయకత్వం లేని స్థితిని, అధినాయకురాలి అశక్తత, యువరాజు సామర్థ్యంపై అనుమానం, నెహ్రూ–గాంధీ కుటుంబం తప్ప ఒక్క అడుగు ముందుకు వేయలేని దీనావస్థ, అధిష్టానం విశ్వాసంతో మాత్రమే పనిచేసే వృద్ధనాయకుల వ్యవహార శైలి, యువనాయకత్వానికి మార్గదర్శనం చేసేవారు లేక పార్లమెం టులో కూడా ప్రభావవంతమైన రీతిలో పనిచేయలేని పరి స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అదేసమయంలో వీటన్నింటితో సంబంధం లేకుండా, జాతిప్రయోజనం కోసం దృఢచిత్తంతో సుపరిపాలనను అందిస్తున్న మోదీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కావున ప్రతి విషయాన్నీ రాద్ధా్దంతం చేయకుండా గుణా త్మక విశ్లేషణతో ప్రవర్తిస్తే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కొంతైనా మెరుగుపడుతుంది. ప్రజాస్వామ్యంలో బలమైన ప్రతి పక్షం కూడా అవసరమే. కాబట్టి పరనింద మాని ఇంటిని చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే వియ్యానికైనా, కయ్యానికైనా సమ ఉజ్జీ అవసరం. రావుల శ్రీధర్ రెడ్డి వ్యాసకర్త బీజేపీ రాష్ట్ర నాయకులు మొబైల్ : 99855 75757