రాజన్‌పై మౌనం వీడిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ రఘురామ రాజన్ పునర్నియామకంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారి మౌనం వీడారు. ఆర్ బీఐ గవర్నర్ గా రాజన్ రెండవసారి ఎంపికను సమర్థిస్తారా అని అడిగినపుడు.. ఈ విషయం పరిపాలనకు సంబంధించిన విషయమన్నారు. దీంట్లో మీడియాకు సంబంధంలేదని వ్యాఖ్యానించారు. రాజన్ పై బీజేపీ ఎంపీ, సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి వరుస సంచలన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రధాని స్పందించడం ఇదే మొదటిసారి.
రాజన్ నియామకం ఎడ్మినిస్ట్రేషన్ కు సంబంధించిన వ్యవహారమని మోదీ తేల్చి చెప్పారు. ఈ విషయంలో మీడియాకు అంత ఆసక్తి అవసరం లేదనుకుంటున్నానంటూ ప్రధాని వ్యాఖ్యానించారు. మరోవైపు సెప్టెంబర్ లోనే ఈ విషయాన్ని పరిశీలిద్దా మని ది వాల్ స్ట్రీట్ జర్నల్ తో చెప్పారు. ఆయన పదవీకాలం సెప్టెంబర్‌లో ముగుస్తుంది కనుక అప్పుడు చూద్దామన్నట్టు చెప్పారు.
అయితే ఆర్బీఐ గవర్నర్ గా రఘురామ రాజన్ ను తక్షణమే తొలగించాలంటూ సుబ్రహ్మణ్య స్వామి డిమాండ్ చేయడంతో వివాదం మొదలైంది. రాజన్ ఉద్దేశపూర్వకంగానే దేశ ఆర్థిక వ్యవస్థను నష్టపరుస్తున్నారని, దేశంలో నిరుద్యోగం పెరిగిందంటూ తీవ్రమైన ఆరోపణల పరంపర ను కొనసాగించారు. ఈ విషయంలో పట్టువీడని స్వామి ..మోదీకి ఇప్పటికే రెండుసార్లు లేఖలు కూడా రాశారు.
కాగా రఘురామ్ రాజన్ ఆర్బీఐ గవర్నర్‌గా రెండోసారి అర్హుడని కాంగ్రెస్ సీనియర్ నాయకులు దిగ్విజయ్ సింగ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అటు నెటిజన్లు రాజన్ సమర్థతతపై అనేక సర్వేల్లో సానుకూలంగా స్పదించారు. రాజన్ మూడేళ్ల పదవీకాలం ఈ సెప్టెంబర్ ముగియనుంది.