Red beacons
-
‘నేటి నుంచే బుగ్గకార్లకు మంగళం’
► ‘ఎర్రబుగ్గలు’ నేటి నుంచి కనుమరుగు ► దేశవ్యాప్తంగా వర్తింపు ► అత్యవసర సర్వీసులకు ఇక ‘బ్లూలైట్లు’ సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులకు, అధికారులకు బుగ్గకార్ల దర్పం ఇక గత స్మృతే. అత్యవసర సేవలందించే అంబులెన్సులు, అగ్నిమాపక యంత్రాలు, పోలీసు విభాగాలు తప్ప మరెవరూ కార్లకు బుగ్గలైట్లు వినియోగించరాదని కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం మే ఒకటోతేదీ సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. రాజ్యాంగబద్ధ సంస్థల అధిపతులతోపాటు వీవీఐపీలు ఎవ్వరూ కార్లకు ఎర్రలైట్లు వాడరాదని ఏప్రిల్ 18న జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం నిర్ణయించడం తెలిసిందే. ప్రజాస్వామ్యంలో వీఐపీ సంస్కృతి ఉండరాదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుంది. ఈ చరిత్రాత్మక నిర్ణయం ప్రకారం దేశ ప్రథమ పౌరుడైన రాష్ట్రపతి, ప్రధానమంత్రి,, ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కేంద్రమంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాష్ట్రాల మంత్రులతో సహా ఏ ఒక్కరూ తమ కార్లకు ఎర్రబుగ్గలైట్లు వాడటానికి వీల్లేదు. ఈ నిర్ణయం నేపథ్యంలో పలువురు కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల మంత్రులు తమ కార్లకు ఉన్న బుగ్గ లైట్లను తొలగించడం తెలిసిందే. సోమవారం నుంచి వీటికి పూర్తిగా తెరపడుతోంది. అత్యవసర సేవలందించే అంబులెన్సులు, అగ్నిమాపక యంత్రాలు, పోలీసు వాహనాలకు మాత్రం బ్లూలైట్లు వినియోగించుకోవచ్చు. త్వరలో చట్ట సవరణ.. వీఐపీల కార్లకు ఎర్ర బుగ్గలైట్ల వాడకాన్ని నిషేధిస్తూ కేంద్ర మోటారు వాహనాల చట్టం–1989లోని సెక్షన్ 108కి త్వరలో కేంద్రప్రభుత్వం సవరణలు తేనుందని అధికార వర్గాలు తెలిపాయి. ‘‘కొన్ని విభాగాల వాహనాలకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కొన్ని హోదాలవారు వినియోగించే అధికారిక వాహనాలకు ఎరుపు, బ్లూబుగ్గలైట్లు వాడుకోవచ్చని కేంద్ర మోటారు వాహనాల చట్టం–1989లోని సెక్షన్ 108 (1)లో ఉంది. వ్యక్తుల వాహనాలకు ఎర్రబుగ్గల వాడకాన్ని నిషేధించిన కేంద్రప్రభుత్వం ఈ మేరకు కేంద్ర మోటారు వాహనాల చట్టానికి సవరణలు చేసి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయనుంది. అత్యవసర సేవలందించే అంబులెన్సులు, అగ్నిమాపక యంత్రాలు, పోలీసు వాహనాలకు మాత్రం బ్లూలైట్లు వినియోగించుకోవచ్చు. దీనిలో ఎలాంటి మార్పు చేయడంలేదు. ఇది కేంద్ర చట్టమైనందున అన్ని రాష్ట్రాలు అమలు చేయాల్సిందే. రాష్ట్రాల్లో ఎలాంటి మార్పులు చేయడానికి అవకాశం ఉండదు’’ అని ఒక ఉన్నతాధికారి ‘సాక్షి’కి వివరించారు. -
‘బుగ్గ’తోపాటు భద్రత కూడా...
చండీగఢ్: బుగ్గ కార్లు ఉండరాదని కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం మంచి ప్రభావమే చూపుతోంది. భద్రత కోసం నాయకులకు, ఉన్నతాధికారులకు కేటా యించిన 2,000మంది పోలీసు సిబ్బందిని ఉపసం హరించుకుంటున్నట్టు పంజాబ్ ప్రభుత్వం ప్రకటిం చింది. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సైతం తన భద్రతకున్న 1,392మంది సిబ్బందిలో 376 మందిని వారి వారి విభాగాలకు పంపించారు. మరోసారి సమీ క్షించాక దీన్నింకా తగ్గిస్తారట. ప్రస్తుత భద్రతా విధా నాన్ని లోతుగా సమీక్షించి సరిచేయాలని రాష్ట్ర హోం శాఖను అమరీందర్ ఆదేశించారు. తాను వెళ్లే తోవ పొడవునా పోలీసు పహారా ఉండటాన్ని ఆయన ఇప్ప టికే రద్దు చేయించారు. ముఖ్యమంత్రి లేదా మంత్రులు బయటికొస్తే రోడ్లపై ఎంత షో జరుగుతుందో పౌరులందరికీ నిత్యానుభవం. ఇది ఏ కాస్త తగ్గినా మంచిదే అనుకోవాలి. -
ఎర్ర బుగ్గలకు స్వస్తి!
అక్షర తూణీరం పవర్లోకి వచ్చీ రాగానే, నేతలకు గన్మెన్లు, పైలట్లు సిద్ధమవుతాయ్. ఇవి చాలా అనవసరం, నాకొద్దు అన్నవారెవరైనా ఉంటే వారికి వందనం. ఉన్నట్టుండి ఆయనెందుకో సిగ్గుపడి, ‘ఎర్ర బుగ్గలకు‘ స్వస్తి పలికారు. మోదీ మాట వినగానే, నేనిదివరకే... కాదు నాకిదివరకే సిగ్గేసి ఎర్ర బుగ్గలు వదిలేశానని, కారులో నిలబడి మన వెంకయ్య నాయుడు చెప్పారు. జాగ్రత్తగా గమనిస్తే, నరేంద్ర మోదీ అప్పుడప్పుడు ఇలాంటి మెరుపులు మెరిపిస్తుంటారు. యూపీ విజయం తరువాత నాకేదో అనుమానంగా ఉంది. ఉన్నట్టుండి ముఖ్య నేతలంతా పాంకోళ్లు వేసుకుని.. మేండేటరీ చేయ కపోయినా, ఆదరణీయ క్రియగా భావిస్తారని సందేహంగా ఉంది. నిజమే! ఈ ఎర్ర దీపం కాన్సెప్ట్ ఎట్నించి వచ్చిందో తెలియదు. ఫైరింజన్ని చిన్నప్పుడు మావూళ్లో గంటల కారు అనేవాళ్లం. దానికి కూడా ఎర్రదీపం జ్ఞాపకం లేదు. అంబులెన్స్‌కి ఎర్ర దీపం ఎరుగుదుం. వీఐపీలకి అంటే వాళ్ల కార్లకి ప్రమాద ఘంటికలు మోగిస్తూ ఈ ఎర్ర దీపం తిరుగుడేందో, ఎట్లా వచ్చిందో మనకు తెలి యదు. గొప్పవాళ్లకి కొంచెం ఆర్భాటం ఉండాల్సిందే. లేకపోతే వాళ్లకి గుర్తింపు ఉండదు. కలెక్టర్ గారికి, రిజిస్ట్రార్ గారికి, జడ్జీ గార్లకి ముందు డవాళా బంట్రోతు నడుస్తూ తెగ సందడి చేసి భయపెడుతూ ఉంటారు. పూర్వం రాజులకి వంది మాగధుల నించి వెండి బెత్తాల వారు దాకా ముందుండి హంగు కూర్చేవారు. ఫ్యూడల్ అవశేషాలు ఇంకా బోలెడు మిగిలే ఉన్నాయి. ప్రజా నాయకులం, ప్రజాసేవకులం అని చెప్పుకోవడం, రాచమర్యాదలకు తహతహలాడడం మనవాళ్లకి అలవాటే! ‘మేం అసాంఘిక శక్తులపై నిరంతరం పోరు సాగిస్తున్నాం, మా ప్రాణానికి ముప్పుంది‘ అనే సాకుని ‘సెక్యూరిటీ‘గా మార్చి, ఆ వంకన లేనిపోని ఆర్భాటం చేస్తున్నారని కొందరు విశ్లేషకులంటారు. ఎర్ర దీపానికి సెక్యూరిటీకి సంబంధం ఉంది కాబట్టి, గొప్పవారి ప్రాణాలు అందులోనే ఉన్నాయనే వాదన వినిపిస్తోంది. ఎర్ర దీపం కారు సైరన్‌తో, ఒక మహా మనిషి కదలి వస్తున్నాడని హెచ్చరిస్తూ వేగంగా వెళ్లి పోతుంది. దీని తర్వాత స్థాయి బులుగు బుగ్గలది. క్యాబినెట్ స్థాయికి దిగువన ఉండే వీఐపీలకు నీలం దీపాలుంటాయి. పవర్లోకి వచ్చీ రాగానే, ఇంకేముంది మమ్మల్ని చంపేస్తారంటూ–గన్మెన్లు, పైలట్లు సిద్ధమవుతాయ్. ‘ఇవి చాలా అనవసరం, నాకొద్దు’ అన్నవారెవరైనా ఉంటే వారికి వందనం. ప్రజలతో మమేకమయ్యే వారికి ఈ గొప్పలన్నీ అవసరమా అనిపిస్తుంది. నేనొకసారి ప్రత్యక్షంగా చూశాను–నగరంలో వెటర్నరీ హాస్పిటల్‌కి ఒక ఎర్ర దీపం కారు, నీలం దీపం కారు వచ్చాయి. రెండు కార్లలోంచి రెండు కుక్కలు దిగాయి. ఎర్ర దీపంలో వచ్చిన కుక్క ఆలస్యంగా వచ్చినా, దాన్నే ముందు చూసి పంపించారు. నీలం కారు కుక్క తాలూకు డ్రైవర్ ముందొచ్చా గదా అని సణిగాడు. ఎర్ర దీపానికున్న ప్రయార్టీ నీకుండదు గదా అన్నాడు. కుక్కల డాక్టరు ఈ రంగు దీపాల కార్లు స్కూల్లో పిల్లల్ని దింపుతూ కనిపిస్తాయ్. అందరూ ఒకే యూని ఫాంలో ఉన్నా ఎర్ర దీపం యవ్వారం వేరుగా ఉంటుంది. తరచు డ్రైవర్ సొంత పనిమీద మందు షాపు ముందు ఆపుతాడు. ప్రసిద్ధ నటులు, తెలుగుదేశం రాజ్యసభ సభ్యులు, గొప్ప చమత్కారి ఒకసారి నాతో అన్నారు–ఈ ఎర్ర దీపం బళ్లు వెళ్తుంటే ఖడ్గ మృగాల్ని చూసినట్టుండేదయ్యా. మా అన్నగారు ఢిల్లీ పీఠమెక్కితే ఎర్రకోటకి పచ్చరంగు పడుద్ది. కార్లకీ పచ్చదీపాలే! దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోమన్నారు. అంటే తలమీద ఎరుపో బులుగో ఉండగానే నాలుగు రాళ్లు... శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
ఎర్రబుగ్గలు తీశామంతే.. సెక్యూరిటీ తగ్గదు
వీఐపీల కార్లకు ఎర్రబుగ్గలు తీసేయాలనడంతో ఇప్పుడు చాలామంది పెద్దమనుషుల గుండెలు గుభేలుమంటున్నాయి. తమకు ఇంతకాలం ఉన్న సెక్యూరిటీని కూడా కూడా తీసేస్తారేమోనని అనుమానాలు మొదలయ్యాయి. సెక్యూరిటీ తీసేస్తే తమ గతేంకాను అని చాలామంది అనుకుంటున్నారు. అయితే, అలాంటి భయం ఏమీ అక్కర్లేదని, వీఐపీల భద్రతను తగ్గించే ఆలోచన ఏదీ కేంద్ర ప్రభుత్వానికి లేదని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా కొంతమంది ముఖ్యమైన వ్యక్తులను రక్షించాలని.. అది కొనసాగి తీరుతుందని ఆయన తెలిపారు. వీఐపీ సంస్కృతికి ఫుల్స్టాప్ పెట్టాలనుకున్న కేంద్ర నిర్ణయం వెనక కారణం ఏంటని ప్రశ్నించగా, దేశంలో ప్రతి ఒక్కరూ వీఐపీయే అన్నదే తమ ప్రభుత్వ సిద్ధాంతమని ఆయన తెలిపారు. తాము తీసుకున్నది చిన్న చర్యే అయినా, సమాజంలో అందరినీ సమానంగా చూడాలన్న సందేశం దానివల్ల వెళ్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎర్రబుగ్గల సంస్కృతిని ఆపుతాయని ఆశిస్తున్నామన్నారు. ఇక రామజన్మభూమి బాబ్రీమసీదు వివాదం చాలా కాలంగా కొనసాగుతోందని, అందులో కొత్తేమీ లేదని మరో ప్రశ్నకు సమాధానంగా వెంకయ్య చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రభావం అద్వానీ తదితర నేతలపై ఎలా ఉంటుందని అడిగితే మాత్రం ఆయన స్పందించలేదు. సోషల్ మీడియాను కూడా సెన్సార్ చేయొచ్చని, అది చాలా పెద్ద విషయమని, దానిపై ఆలోచించి అన్ని వర్గాలతోను చర్చించాల్సి ఉందని తెలిపారు. -
ఊడుతున్న ఎర్ర బుగ్గలు
వీఐపీ సంస్కృతికి చరమగీతం పాడాలన్న ఉద్దేశంతో ఎర్ర బుగ్గలను (సైరన్లను) తొలగించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించడంతో క్రమంగా ఆ సైరన్లు ఊడుతున్నాయి. మే 1వ తేదీ నుంచి నోటిఫికేషన్ అమలులోకి రానుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పినా, అంతకంటే ముందుగానే కొంతమంది కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ దిశగా ముందడుగు వేస్తున్నారు. అందరికంటే ముందుగా కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తన కారుకు ఉన్న ఎర్రలైటు సైరన్‌ను తీయించేశారు. కేవలం ఎమర్జెన్సీ సర్వీసులకు మాత్రమే ఎర్రలైటు ఉండాలని.. అలాంటప్పుడు తనకు అవసరం లేదు కాబట్టి తన కారు మీద ఉన్న సైరన్‌ను తీయించేశానని ఆయన చెప్పారు. ఆయన తర్వాత కేంద్ర మంత్రులు మహేష్ శర్మ, విజయ్ గోయల్ కూడా ఎర్రబుగ్గలను తమ తమ కార్ల నుంచి తీయించేశారు. ఆ తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా కేంద్ర మంత్రుల బాటలోనే వెళ్లి.. ఆ సైరన్లను తొలగించారు. రాష్ట్ర ప్రభుత్వాలలో నీలిరంగు సైరన్లను వాడుకోవచ్చన్న నిబంధన కూడా మారబోతోందని, కేవలం ముందుగా నిర్ణయించిన ఎమర్జెన్సీ సర్వీసులకు మాత్రమే ఆ సైరన్లు ఉండొచ్చని జైట్లీ చెప్పారు. -
వీఐపీల ముసుగులో ఎర్రబుగ్గ కారు వాడుతున్న నలుగురి అరెస్ట్
వీఐపీల ముసుగులో ఎర్రబుగ్గ కారును ఉపయోగిస్తున్న నలుగురు వ్యక్తులను గోవా పోలీసులు అరెస్ట్ చేశారు. వాహనాలపై నీలి బుగ్గ, సైరన్, ఫ్లాషర్స్, ఎర్రబుగ్గను ఉపయోగించకూడదని సుప్రీం కోర్టు ఆంక్షలు విధించిన నేపథ్యలో గోవా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఇటీవల అత్యున్నత పదవుల్లో కొనసాగే వ్యక్తులు తప్ప మరెవరూ ఎర్రబుగ్గ వాహనాలను ఉపయోగించడంపై సుప్రీం నిషేధం విధించింది. విలాసవంతమైన కార్లపై ఎర్రబుగ్గ ఉండటంతో తనిఖీ చేశామని.. అనుమానస్పదం వ్యక్తుల తీరు కనిపించడంతో వాహనాలను సీజ్ చేసి వారిని అరెస్ట్ చేశాం అని పోలీసులు తెలిపారు. హర్యానా, ఢిల్లీలకు చెందిన వీఐపీలమని టాటా సఫారీ, టాయోటా ఫార్చునర్ వాహనాల్లో తిరుగుతున్న వారిని విచారించి.. వారిపై చీటింగ్ కేసు నమోదు చేశామన్నారు. అధికారిక వాహనాలపై ఎర్రబుగ్గలను తీసివేసిన వారిలో డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ తొలి వరసలో ఉన్నారు. -
‘బుగ్గ’పై సుప్రీం భగ్గు
ఎర్రబుగ్గ కార్లను ఇష్టారాజ్యంగా వాడడానికి వీల్లేదని స్పష్టీకరణ ఎర్రబుగ్గ కార్లతో అధికారదర్పం ప్రదర్శించే నాయకులు, అధికారులకు సుప్రీంకోర్టు చెక్ పెట్టింది. కార్లపై ఇష్టారాజ్యంగా ఎర్రబుగ్గ వాడడానికి వీల్లేదని స్పష్టం చేసింది. రాజ్యాంగబద్ధమైన పోస్టుల్లో ఉన్నవారు, అత్యున్నత పదవుల్లో ఉన్నవారు మాత్రమే వీటిని ఉపయోగించాలని తెలిపింది. ఈ మేరకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, ఎర్రబుగ్గ వాడేందుకు అర్హులైనవారి జాబితాను మూడు నెలల్లోపు ప్రకటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అభయ్‌సింగ్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిల్‌పై జస్టిస్ జీఎస్ సింఘ్వీ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం ఈ ఆదేశాలను వెలువరించింది. అలాగే ఎమర్జెన్సీ వాహనాలు, అంబులెన్సులు, పోలీసు, అగ్నిమాపక, ఎస్కార్టు, శాంతిభద్రతల నిర్వహణ కోసం వాడే వాహనాలు మాత్రమే నీలి, తెలుపు, బహుళ రంగు బుగ్గలను వాడాలని తెలిపింది. వీటికి వాడే ‘సైరన్’ కర్ణ కఠోరంగా ఉండకూడదని సూచించింది. ప్రైవేటు వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లో ఎర్రబుగ్గలుకానీ, సైరన్ కానీ వాడకుండా చూడాలని తెలిపింది. దేశంలో పలుచోట్ల నేరాలకు పాల్పడుతున్న వ్యక్తులు తమ వాహనాలపై ఎర్రబుగ్గలను వాడుతున్నారని ధర్మాసనం ఆందోళన వ్యక్తంచేసింది. ఎర్రబుగ్గ దుర్వినియోగాన్ని అడ్డుకోవడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని దుయ్యబట్టింది. పోలీసులు కూడా అలాంటి వాహనాలను తనిఖీ చేయడానికి, జరిమానాలు విధించడానికి జంకుతున్నారని వ్యాఖ్యానించింది. వాస్తవానికి ఎర్రబుగ్గ కార్ల వినియోగం రాచరికాన్ని గుర్తుతెచ్చేదిగా ఉంటుందని, ప్రస్తుత మన గణతంత్ర వ్యవస్థకు ఇది తగదని కోర్టు అభిప్రాయపడింది. ఎర్రబుగ్గ వాడేందుకు అర్హులైన వారి జాబితాను కూడా చాంతాడంత తయారు చేయకూడదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు న్యాయస్థానం స్పష్టంచేసింది. 2002, 2005లో కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్లకు అనుగుణంగా ఈ జాబితా ఉండాలని తెలిపింది. ఈ నోటిఫికేషన్ల ప్రకారం రాష్ట్రపతి, ప్రధానమంత్రి, భారత ప్రధాన న్యాయమూర్తి, కేబినెట్ మంత్రులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, త్రివిధ దళాల అధిపతులు ఎర్రబుగ్గ వాహనాలు వాడొచ్చు. నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా ఎర్రలైటు వాహనాలను ఉపయోగించేవారికి భారీగా జరిమానాలు విధించేలా మోటారు వాహనాల చట్టానికి సవరణలు తేవాలని సూచించింది. -
బుగ్గ కార్లపై కేంద్రానికి సుప్రీంకోర్టు ఉత్తర్వులు
న్యూఢిల్లీ : వీఐపీల బుగ్గకార్లపై సుప్రీంకోర్టు మంగళవారం కేంద్రానికి ఉత్తర్వులు జారీ చేసింది. నీలిరంగు బీకర్లను అంబులెన్స్, పోలీసులు మాత్రమే అత్యవసర సమయాల్లో ఉపయోగించాలని సూచించింది. అలాగే ఎరుపు రంగు బుగ్గకార్లు రాజ్యాంగబద్దమైన పదవుల్లో ఉన్నవారు మాత్రమే ఉపయోగించాలని, పదవులు నోటిపై చేయాలని న్యాయస్థానం పేర్కొంది. కాగా ప్రతిష్టకు సంకేతంగా భావిస్తూ బుగ్గకార్ల (కార్లపై రెడ్‌లైట్ల)తో వెలిగిపోతున్న పలువురు వీఐపీలు, ఉన్నతాధికారులు ఇకపై ఈ అవకాశాన్ని కోల్పోనున్నారు. ఇంతవరకు జిల్లాధికారులు, జిల్లా మేజిస్ట్రేట్లు, ఎస్పీలు, పార్లమెంటు సభ్యులు, ఇతర వీఐపీలకు ఉన్న ఈ సదుపాయం తొలగిపోనుంది. ఇంతవరకు 30 కేటగిరీలకు చెందిన వీఐపీలకు బుగ్గ కార్ల సదుపాయం ఉండేది. ప్రభుత్వ వర్గాలు తెలిపిన మేరకు అర్హత లేకున్నా కొందరు తాలూకా స్థాయి అధికారులు కూడా అనధికారికంగా ఈ సౌకర్యాన్ని పొందేవారు. ఇటీవల సుప్రీంకోర్టు వెలువరించిన ఆదేశాల మేరకు కేవలం ఐదు కేటగిరీలకు చెందిన వీఐపీల కార్లపై మాత్రమే రెడ్‌లైట్లు వెలగనున్నాయి. ఈ మేరకు సుప్రీంకోర్టు ఓ ప్రజోపయోగ వ్యాజ్యంలో తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు బూటకపు ఎన్కౌంటర్లపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసు విచారణను జస్టిస్ ఆర్పీ దేశాయ్, జస్టిస్ చలమేశ్వర్ ధర్మాసనం....ప్రత్యేక బెంచ్‌కు బదిలీ చేసింది.