ఎర్రబుగ్గలు తీశామంతే.. సెక్యూరిటీ తగ్గదు
వీఐపీల కార్లకు ఎర్రబుగ్గలు తీసేయాలనడంతో ఇప్పుడు చాలామంది పెద్దమనుషుల గుండెలు గుభేలుమంటున్నాయి. తమకు ఇంతకాలం ఉన్న సెక్యూరిటీని కూడా కూడా తీసేస్తారేమోనని అనుమానాలు మొదలయ్యాయి. సెక్యూరిటీ తీసేస్తే తమ గతేంకాను అని చాలామంది అనుకుంటున్నారు. అయితే, అలాంటి భయం ఏమీ అక్కర్లేదని, వీఐపీల భద్రతను తగ్గించే ఆలోచన ఏదీ కేంద్ర ప్రభుత్వానికి లేదని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా కొంతమంది ముఖ్యమైన వ్యక్తులను రక్షించాలని.. అది కొనసాగి తీరుతుందని ఆయన తెలిపారు.
వీఐపీ సంస్కృతికి ఫుల్‌స్టాప్ పెట్టాలనుకున్న కేంద్ర నిర్ణయం వెనక కారణం ఏంటని ప్రశ్నించగా, దేశంలో ప్రతి ఒక్కరూ వీఐపీయే అన్నదే తమ ప్రభుత్వ సిద్ధాంతమని ఆయన తెలిపారు. తాము తీసుకున్నది చిన్న చర్యే అయినా, సమాజంలో అందరినీ సమానంగా చూడాలన్న సందేశం దానివల్ల వెళ్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎర్రబుగ్గల సంస్కృతిని ఆపుతాయని ఆశిస్తున్నామన్నారు.
ఇక రామజన్మభూమి బాబ్రీమసీదు వివాదం చాలా కాలంగా కొనసాగుతోందని, అందులో కొత్తేమీ లేదని మరో ప్రశ్నకు సమాధానంగా వెంకయ్య చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రభావం అద్వానీ తదితర నేతలపై ఎలా ఉంటుందని అడిగితే మాత్రం ఆయన స్పందించలేదు. సోషల్ మీడియాను కూడా సెన్సార్ చేయొచ్చని, అది చాలా పెద్ద విషయమని, దానిపై ఆలోచించి అన్ని వర్గాలతోను చర్చించాల్సి ఉందని తెలిపారు.