‘నేటి నుంచే బుగ్గకార్లకు మంగళం’
► ‘ఎర్రబుగ్గలు’ నేటి నుంచి కనుమరుగు
► దేశవ్యాప్తంగా వర్తింపు
► అత్యవసర సర్వీసులకు ఇక ‘బ్లూలైట్లు’
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులకు, అధికారులకు బుగ్గకార్ల దర్పం ఇక గత స్మృతే. అత్యవసర సేవలందించే అంబులెన్సులు, అగ్నిమాపక యంత్రాలు, పోలీసు విభాగాలు తప్ప మరెవరూ కార్లకు బుగ్గలైట్లు వినియోగించరాదని కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం మే ఒకటోతేదీ సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. రాజ్యాంగబద్ధ సంస్థల అధిపతులతోపాటు వీవీఐపీలు ఎవ్వరూ కార్లకు ఎర్రలైట్లు వాడరాదని ఏప్రిల్ 18న జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం నిర్ణయించడం తెలిసిందే. ప్రజాస్వామ్యంలో వీఐపీ సంస్కృతి ఉండరాదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుంది. ఈ చరిత్రాత్మక నిర్ణయం ప్రకారం దేశ ప్రథమ పౌరుడైన రాష్ట్రపతి, ప్రధానమంత్రి,, ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కేంద్రమంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాష్ట్రాల మంత్రులతో సహా ఏ ఒక్కరూ తమ కార్లకు ఎర్రబుగ్గలైట్లు వాడటానికి వీల్లేదు. ఈ నిర్ణయం నేపథ్యంలో పలువురు కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల మంత్రులు తమ కార్లకు ఉన్న బుగ్గ లైట్లను తొలగించడం తెలిసిందే. సోమవారం నుంచి వీటికి పూర్తిగా తెరపడుతోంది. అత్యవసర సేవలందించే అంబులెన్సులు, అగ్నిమాపక యంత్రాలు, పోలీసు వాహనాలకు మాత్రం బ్లూలైట్లు వినియోగించుకోవచ్చు.
త్వరలో చట్ట సవరణ..
వీఐపీల కార్లకు ఎర్ర బుగ్గలైట్ల వాడకాన్ని నిషేధిస్తూ కేంద్ర మోటారు వాహనాల చట్టం–1989లోని సెక్షన్ 108కి త్వరలో కేంద్రప్రభుత్వం సవరణలు తేనుందని అధికార వర్గాలు తెలిపాయి. ‘‘కొన్ని విభాగాల వాహనాలకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కొన్ని హోదాలవారు వినియోగించే అధికారిక వాహనాలకు ఎరుపు, బ్లూబుగ్గలైట్లు వాడుకోవచ్చని కేంద్ర మోటారు వాహనాల చట్టం–1989లోని సెక్షన్ 108 (1)లో ఉంది. వ్యక్తుల వాహనాలకు ఎర్రబుగ్గల వాడకాన్ని నిషేధించిన కేంద్రప్రభుత్వం ఈ మేరకు కేంద్ర మోటారు వాహనాల చట్టానికి సవరణలు చేసి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయనుంది. అత్యవసర సేవలందించే అంబులెన్సులు, అగ్నిమాపక యంత్రాలు, పోలీసు వాహనాలకు మాత్రం బ్లూలైట్లు వినియోగించుకోవచ్చు. దీనిలో ఎలాంటి మార్పు చేయడంలేదు. ఇది కేంద్ర చట్టమైనందున అన్ని రాష్ట్రాలు అమలు చేయాల్సిందే. రాష్ట్రాల్లో ఎలాంటి మార్పులు చేయడానికి అవకాశం ఉండదు’’ అని ఒక ఉన్నతాధికారి ‘సాక్షి’కి వివరించారు.