మాఫీ సాధ్యం కాదు
రైతులు తీసుకున్న రుణాలు చెల్లించాల్సిందే
యశస్విని ప్రీమియం తగ్గింపు యోచన
గ్రామ పంచాయతీ పరిధిలో సహకార సంఘం ఏర్పాటు
సహకార సంఘాల ద్వారా గ్రామీణ యువతకు ఉపాధి రుణాలు
మంత్రి మహదేవ ప్రసాద్
బెంగళూరు: రైతులు తీసుకున్న వ్యవసాయ రుణాలను మాఫీ చేయడం సాధ్యం కాదని, వడ్డీతో సహా వాటిని రైతులు తిరిగి చెల్లించితీరాల్సిందేనని రాష్ర్ట సహకార శాఖ మంత్రి మహదేవ ప్రసాద్ స్పష్టం చేశారు. ప్రతిసారీ రైతుల రుణాలను మాఫీ చేయలేమని తేల్చి చెప్పారు. కేపీసీసీ ప్రధాన కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 30 లోపు రాష్ర్టంలోని 24 లక్షల మంది రైతులకు రూ. పది వేల కోట్ల మేర రుణాలు అందించాలని లక్ష్యంగా నిర్ణయించుకోగా, ఇప్పటికే రూ. ఏడు వేల కోట్ల రుణాలను అందజేసినట్లు తెలిపారు. యశస్విని పథకం కింద నగరంలోని సహకార సంఘాల్లోని సభ్యులు ఏడాదికి ప్రీమియంగా చెల్లిస్తున్న రూ.650ను మరింత తగ్గించే ఆలోచన ప్రభుత్వం వద్ద ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని 78 లక్షల బీపీఎల్ కుటుంబాల్లో ప్రస్తుతం 30 లక్షల కుటుంబాలు మాత్రమే సహకార సంఘాల్లో సభ్యులుగా ఉన్నారన్నారు.
మిగిలిన వారిని కూడా సహకార సంఘాల సభ్యులుగా చేర్చడానికి వీలుగా సభ్యత్వ రుసుంను ప్రభుత్వమే చెల్లించేలా విధివిధానాలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ఒక సహకార సంఘాన్ని ప్రారంభించడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని యువత స్వయం ఉపాధి వైపు మొగ్గు చూపించడానికి వీలుగా స్థానిక సహకార సంఘాల ద్వారా రుణాలు ఇప్పించే ఏర్పాటు చేయనున్నామన్నారు. ఈ మేరకు వచ్చే బడ్జెట్లో స్పష్టంగా విధివిధానాలు వెల్లడిస్తామన్నారు. గృహ నిర్మాణ రంగంలోని సహకార సంఘాలు అవసరమైన పరిమాణంలో ఇకపై నేరుగా భూమిని ఖరీదు చేయడానికి వీలుగా రాష్ట్ర రెవెన్యూ చట్టంలో మార్పులు తీసుకువచ్చి రానున్న శాసనసభ సమావేశాల్లో ముసాయిదా బిల్లును ప్రవేశపెడుతామని మహదేవ ప్రసాద్ పేర్కొన్నారు.