Round Robin League
-
CWC 2023: లీగ్ దశ ముగిసాక పరిస్థితి ఇది.. విరాట్, జంపా టాప్‌లో..!
భారత్-నెదర్లాండ్స్ మ్యాచ్‌తో వన్డే వరల్డ్‌కప్ 2023 రౌండ్ రాబిన్ (లీగ్) దశ మ్యాచ్‌లు ముగిసాయి. పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచిన భారత్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు సెమీస్‌కు అర్హత సాధించాయి. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన భారత్.. బుధవారం (నవంబర్ 15) జరిగే తొలి సెమీఫైనల్లో (ముంబై) నాలుగో స్థానంలో ఉన్న న్యూజిలాండ్‌ను ఎదుర్కొంటుంది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచిన సౌతాఫ్రికా.. నవంబర్ 16న జరిగే రెండో సెమీఫైనల్లో (కోల్‌కతా) మూడో స్థానంలో ఉన్న జట్టు ఆస్ట్రేలియాతో తలపడుతుంది. అనంతరం ఈ రెండు సెమీస్‌లో గెలిచే జట్లు అహ్మదాబాద్ వేదికగా నవంబర్ 19న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. లీడింగ్ రన్ స్కోరర్‌గా విరాట్.. రౌండ్ రాబిన్ దశ మ్యాచ్‌లు ముగిసాక టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ దశలో విరాట్ 9 మ్యాచ్‌లు ఆడి 2 శతకాలు, 5 అర్ధశతకాల సాయంతో 99 సగటున 594 పరుగులు చేశాడు. ఈ జాబితాలో డికాక్ (9 మ్యాచ్‌ల్లో 591 పరుగులు), రచిన్ రవీంద్ర (9 మ్యాచ్‌ల్లో 565 పరుగులు), రోహిత్ శర్మ (9 మ్యాచ్‌ల్లో 503 పరుగులు), డేవిడ్ వార్నర్ (9 మ్యాచ్‌ల్లో 499 పరుగులు) టాప్-5లో ఉన్నారు. లీగ్ దశలో డికాక్ 4 సెంచరీలతో టాప్‌లో ఉండగా.. రచిన్ 3, విరాట్, వార్నర్, డస్సెన్, మిచెల్ మార్ష్, మ్యాక్స్‌వెల్ తలో 2 సెంచరీలు చేశారు. టాప్‌లో జంపా.. రౌండ్ రాబిన్ దశ మ్యాచ్‌లు ముగిసాక ఆసీస్ స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపా లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. జంపా 9 మ్యాచ్‌ల్లో 22 వికెట్లు పడగొట్టాడు. ఈ జాబితాలో మధుషంక (9 మ్యాచ్‌ల్లో 21 వికెట్లు), షాహీన్ అఫ్రిది (9 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు), గెరాల్డ్ కొయెట్జీ (7 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు), జస్ప్రీత్ బుమ్రా (9 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు) టాప్-5లో నిలిచారు. భారత బౌలర్లు జడేజా (9 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు), షమీ (5 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు) ఏడు, ఎనిమిది స్థానాల్లో ఉన్నారు. -
వన్డే వరల్డ్‌కప్-2023 మ్యాచ్‌లు ఎలా జరుగుతాయంటే..?
2023 వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్‌ను ఐసీసీ నిన్న (జూన్ 27) విడుదల చేసిన విషయం తెలిసిందే. అక్టోబర్ 5 నుంచి మొదలయ్యే ఈ మెగా టోర్నీలో తొలి దశ మ్యాచ్‌లు నవంబర్ 12 వరకు జరుగుతాయి. అనంతరం రెండు సెమీఫైనల్స్, నవంబర్ 19 ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ టోర్నీలో తొలి దశ మ్యాచ్‌లు జరిగే విధానాన్ని రౌండ్ రాబిన్ ఫార్మాట్ అంటారు. అంటే టోర్నీలో పాల్గొనే అన్ని జట్లు (10) మిగతా జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడతాయి. ఈ లెక్కన తొలి దశలో 10 జట్లు 9 మ్యాచ్‌ల్లో పోటీపడతాయి. తొలి దశ ముగింపు సమయానికి టాప్-4లో ఉండే నాలుగు జట్లు సెమీస్‌కు చేరతాయి. ఇక్కడి నుంచి నాకౌట్ దశ (ఓడిన జట్టు ఇంటిముఖం పడుతుంది) మొదలవుతుంది. నవంబర్ 15న జరిగే తొలి సెమీస్‌లో (ముంబై) తొలి దశ అనంతరం ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న జట్టు.. నాలుగో స్థానంలో ఉన్న జట్టుతో తలపడుతుంది. ఆ మరుసటి రోజు (నవంబర్ 16) జరిగే రెండో సెమీస్‌లో తొలి దశ అనంతరం రెండో స్థానంలో ఉన్న జట్టు మూడో ప్లేస్‌లో ఉన్న జట్టును ఢీకొంటుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో విజేతలు అహ్మదాబాద్ వేదికగా నవంబర్ 19న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. కాగా, 2019 వన్డే వరల్డ్‌కప్ కూడా ఇదే ఫార్మాట్లో జరిగిన విషయం తెలిసిందే. భారత్ వార్మప్ మ్యాచ్‌లు.. సెప్టెంబర్ 30: ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ (గౌహతి) అక్టోబర్ 3: ఇండియా వర్సెస్ క్వాలిఫయర్-1 (తిరువనంతపురం) భారత్ ఆడబోయే మ్యాచ్‌ల వివరాలు.. అక్టోబర్ 8: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా (చెన్నై) అక్టోబర్ 11: ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ (ఢిల్లీ) అక్టోబర్ 15: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ (అహ్మదాబాద్) అక్టోబర్ 19: ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ (పూణే) అక్టోబర్ 22: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ (ధర్మశాల) అక్టోబర్ 29: ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ (లక్నో) నవంబర్ 2: ఇండియా వర్సెస్ క్వాలిఫయర్-2 (ముంబై) నవంబర్ 5: ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా (కోల్‌కతా) నవంబర్ 11: ఇండియా వర్సెస్ క్వాలిఫయర్-1 (బెంగళూరు) నాకౌట్ మ్యాచ్‌ల వివరాలు.. నవంబర్ 15: సెమీఫైనల్-1 ఏ1 వర్సెస్ ఏ4 (ముంబై) నవంబర్ 16: సెమీఫైనల్-2 ఏ2 వర్సెస్ ఏ3 (కోల్‌కతా) నవంబర్ 19: ఫైనల్ సెమీస్-1 విజేత వర్సెస్ సెమీస్-2 విజేత (అహ్మదాబాద్) -
చిన్న దేశాలకూ టెస్టు అవకాశం
దుబాయ్ : టెస్టు హోదా దక్కించుకోవాలనే అసోసియేట్ దేశాల కల తొందర్లోనే తీరే అవకాశం కనిపిస్తోంది. ఇందుకు 2015-17 ఐసీసీ ఇంటర్ కాంటినెంటల్ కప్ వేదిక కానుంది. రౌండ్ రాబిన్ లీగ్‌లో జరిగే ఈ కప్‌లో నెగ్గిన విజేత 2018లో జరిగే ఐసీసీ టెస్టు చాలెంజ్‌లో... ఆఖరి ర్యాంకులో ఉండే టెస్టు జట్టుతో తలపడుతుంది. దీంట్లో భాగంగా వీటి మధ్య నాలుగు టెస్టు మ్యాచ్‌లు జరుగుతాయి. ఇందులో నెగ్గిన అసోసియేట్ జట్టుకు టెస్టు హోదా దక్కుతుంది. ఇంటర్ కాంటినెంటల్ కప్‌లో అఫ్ఘానిస్తాన్, హాంగ్‌కాంగ్, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నమీబియా, పపువా న్యూ గినియా, స్కాట్లాండ్, యూఏఈ జట్లు ఆడనున్నాయి. ఈనెల 10 నుంచి 13 వరకు నమీబియా, హాంగ్‌కాంగ్ జట్ల మధ్య నాలుగు రోజుల ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌తో ఈ కప్ ఆరంభం కానుంది. 2004లో తొలి ఇంటర్ కాంటినెంటల్ కప్‌ను స్కాట్లాండ్ గెలుచుకోగా నాలుగు సార్లు (2005, 06-07, 07-08, 11-13) ఐర్లాండ్, 2009-10లో అఫ్ఘాన్ విజేతగా నిలిచింది.