RRB Exam
-
ఆర్ఆర్బీ పరీక్ష రాసే అభ్యర్థుల కోసం ప్రత్యేక రైళ్లు
కడప కోటిరెడ్డి సర్కిల్: రెల్వే రిక్రూట్మెంట్ బోర్డు(ఆర్ఆర్బీ) పరీక్ష రాసే అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తకుండా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోందని చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సీహెచ్ రాకేష్ తెలిపారు. కడప– బెంగళూరు–కడప మధ్య ఒక రైలు, కడప– నల్గొండ–కడపల మధ్య మరో రైలు నడుపుతున్నామన్నారు. ఈనెల 11వ తేదీ ఉదయం 9 గంటలకు కడప రైల్వే స్టేషన్ నుంచి ఈ ప్రత్యేక రైలు(నంబర్–07582) బయలుదేరి రాజంపేట, రైల్వేకోడూరు, కాట్పాడి, జోలార్‌పేట మీదుగా బెంగళూరుకు అదేరోజు సాయంత్రం 5.30 గంటలకు చేరుతుందన్నారు. ఈ రైలు ఈనెల 12వ తేదీన సాయంత్రం 7.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు కడపకు చేరుకుంటుందన్నారు. అలాగే నల్గొండ నుంచి కడపకు ఈనెల 10వ తేదీ ప్రత్యేక రైలు బయలుదేరిందని, 13న ఉదయం 6 గంటలకు కడప నుంచి బయలుదేరి ప్రొద్దుటూరు, నంద్యాల, గిద్దలూరు, కంభం, మార్కాపురం, దొనకొండ, నరసరావుపేట, గుంటూరు, శెట్టిపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ మీదుగా సాయంత్రం 4.45 గంటలకు నల్గొండ చేరుతుందన్నారు. ఈ అవకాశాన్ని ఆర్ఆర్బీ పరీక్ష రాసే అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. -
ఆర్ఆర్బీ అభ్యర్థులకు రైల్వేశాఖ గుడ్‌న్యూస్..
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బి) పరీక్షల కోసం సిద్ధపడుతున్న అభ్యర్థుల సౌకర్యార్థం పలు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజన్, సీనియర్ డీసీఎం ఏకే త్రిపాఠి ప్రకటనలో తెలిపారు. భద్రక్–గుంటూరు–భద్రక్ (08401/08402) భద్రక్ –గుంటూరు (08401) ఎగ్జామ్ స్పెషల్ రైలు ఈనెల 10వ తేదీ రాత్రి 9గంటలకు భద్రక్‌లో బయల్దేరి మరుసటిరోజు ఉదయం 6.35 గంటలకు విశాఖపట్నం చేరుకుని, ఇక్కడ నుంచి ఉదయం 6.55కు బయల్దేరి అదేరోజు మధ్యాహ్నం 1.30కు గుంటూరు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో గుంటూరు–భద్రక్ (08402) స్పెషల్ 11వ తేదీ రాత్రి 8గంటలకు గుంటూరులో బయల్దేరి మరుసటిరోజు తెల్లవారుజామున 2.30 విశాఖ చేరుకుని, ఇక్కడ నుంచి 2.50గంటలకు బయల్దేరి అదేరోజు మధ్యాహ్నం 1.30కు భద్రక్ చేరుకుంటుంది. ఈ స్పెషల్ రైలు 1–సెకండ్ ఏసీ, 5–థర్డ్ ఏసీ, 9–స్లీపర్‌క్లాస్, 4–జనరల్ సెకండ్ క్లాస్, 2–సెకండ్ క్లాస్ కం లగేజీ కోచ్‌లతో నడుస్తాయి. ఈ రైళ్లు ఇరు మార్గాలలో జైపూర్ కియోంజర్ రోడ్, కటక్, భువనేశ్వర్, ఖుర్దారోడ్, బ్రహ్మపూర్, పలాస, శ్రీకాకుళంరోడ్, విజయనగరం, విశాఖపట్నం, దువ్వాడ, రాజమండ్రి, విజయవాడ స్టేషన్లలో ఆగుతాయి. చదవండి: ఏపీ టెట్–2022 నోటిఫికేషన్ విడుదల ఎప్పుడంటే..? భువనేశ్వర్–తాంబరం–భువనేశ్వర్ (08407/08408) భువనేశ్వర్–తాంబరం (08407)ఎగ్జామ్ స్పెషల్ భువనేశ్వర్‌లో 11వ తేదీ ఉదయం 10.30 గంటలకు బయల్దేరి అదేరోజు సాయంత్రం 5.15 విశాఖపట్నం చేరుకుని, ఇక్కడ నుంచి సాయంత్రం 5.35కు బయల్దేరి 12వ తేదీ ఉదయం 7.15కు తాంబరం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో తాంబరం–భువనేశ్వర్ (08408)స్పెషల్ 12వ తేదీ రాత్రి 10.30 గంటలకు బయల్దేరి మరుసటిరోజు 13వ తేదీ మధ్యాహ్నం 11.45కు విశాఖపట్నం చేరుకుని, ఇక్కడ నుంచి 12.05కు బయల్దేరి అదేరోజు రాత్రి 7గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుంది. ఈ స్పెషల్ రైలు 1–సెకండ్ ఏసీ, 5–థర్డ్ ఏసీ, 8–స్లీపర్ క్లాస్, 2–జనరల్ సెకండ్ క్లాస్, 1–సెకండ్ క్లాస్ కం లగేజీ కం దివ్యాంగ కోచ్, 1–జనరేటర్ మోటార్కార్ కోచ్‌లతో నడుస్తాయి. ఈ స్పెషల్ ఇరుమార్గాలలో ఖుర్దారోడ్, బ్రహ్మపూర్, పలాస, శ్రీకాకుళంరోడ్, విజయనగరం, విశాఖ, దువ్వాడ, రాజమండ్రి, విజయవాడ, గూడూరు, చెన్నై ఎగ్మోర్ స్టేషన్లలో ఆగుతాయి. షాలిమార్–సికింద్రాబాద్– షాలిమార్(08005/08006) షాలిమార్ – సికింద్రాబాద్ (08005)ఎగ్జామ్ స్పెషల్ షాలిమార్‌లో 11వ తేదీ ఉదయం 6 గంటలకు బయల్దేరి అదేరోజు రాత్రి 8.25గంటలకు విశాఖపట్నం చేరుకుని, ఇక్కడ నుంచి 8.45 గంటలకు బయల్దేరి మరుసటిరోజు 12వ తేదీ మధ్యాహ్నం 11కు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్–షాలిమార్ స్పెషల్ సికింద్రాబాద్‌లో 14వ తేదీ మధ్యాహ్నం 2.30గంటలకు బయల్దేరి మరుసటిరోజు తెల్లవారు 5.20గంటలకు విశాఖపట్నం చేరుకుని, ఇక్కడ నుంచి 5.40గంటలకు బయల్దేరి అదేరోజు రాత్రి 9.20 గంటలకు షాలిమార్ చేరుకుంటుంది. ఈ స్పెషల్ 1–సెకండ్ ఏసీ, 1–థర్డ్ ఏసీ, 11–స్లీపర్‌క్లాస్, 5–జనరల్ సెకండ్ క్లాస్, 2–సెకండ్ క్లాస్ కం లగేజి/ దివ్యాంగ కోచ్‌లతో నడుస్తాయి. ఈ రైళ్లు ఇరుమార్గాలలో ఖరగ్‌పూర్, బాలాసోర్, భద్రక్, జాయ్పూర్ కియోంజర్ రోడ్, కటక్, భువనేశ్వర్, ఖుర్దారోడ్, బ్రహ్మపూర్, పలాస, శ్రీకాకుళంరోడ్, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు స్టేషన్లలో ఆగుతాయి. -
అసంతృప్తి జాడలు
నిరుద్యోగ సమస్య పరిష్కారానికి పకడ్బందీ విధాన రూపకల్పన కొరవడితే పర్యవసానాలెలా ఉంటాయో నాలుగు రోజులుగా ఆగ్రహంతో రగులుతున్న ఉత్తరప్రదేశ్, బిహార్ యువత నిరూపిస్తున్నారు. త్వరలో కొత్త బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ పరిణామాలను పరిగణనలోకి తీసుకోవాలి. యువ జనాభా అధికంగా ఉన్న ఆ రెండు రాష్ట్రాల్లోనూ చోటుచేసుకుంటున్న ఘటనలను విపక్షాల కుట్రగా కొట్టిపారేయడం లేదా యాదృచ్ఛికంగా తలెత్తిన సమస్యగా భావించడం సులభం. కానీ నిరుద్యోగ భారతంలో అంతర్లీనంగా గూడుకట్టుకుంటున్న అసంతృప్తిని ఆ ఉదంతాలు వెల్లడిస్తున్నాయని గ్రహించాల్సిన అవసరం ఉంది. ఆగ్రహోదగ్రులైన యువత బిహార్‌లోని గయలో ఒక ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పు పెట్టగా... ఆ రాష్ట్రంలోని సమస్తీ పూర్, బక్సార్, భోజ్‌పూర్, ముజఫర్‌పూర్, పట్నా తదితర నగరాల్లో వేలాదిమంది యువకులు ధర్నా చేశారు. రైల్వే ఆస్తుల్ని ధ్వంసం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ తదితరచోట్ల రైలు పట్టాలపై ధర్నాలు జరిగాయి. రిపబ్లిక్ డే రోజున అక్కడి ప్రయాగ్‌రాజ్‌లో యువకులున్న హాస్టళ్లపై పోలీసులు దాడికి దిగారు. ఉద్యమ మూలాలు గమనిస్తే యువత ఆగ్రహానికి కారణం అర్థమవుతుంది. రైల్వే శాఖలో సాంకేతికేతర విభాగాల సిబ్బంది నియామకాల కోసం ఎప్పుడో 2019 మార్చిలో 35,281 పోస్టుల కోసం ఒక నోటిఫికేషన్ వెలువడింది. ఈ ప్రవేశ పరీక్షకు కోటి 25 లక్షలమంది దరఖాస్తు చేసు కున్నారు. కరోనా విజృంభణతో చాలా ఆలస్యంగా సంబంధిత పరీక్షను ఆన్లైన్లో నిరుడు నిర్వ హించారు. ఈ నెల 14న విడుదల చేసిన ఫలితాల్లో ఏడు లక్షలమంది అర్హులుగా తేలారు. అంటే ఒక్కో పోస్టుకు 20 మంది పోటీ పడాలి. కానీ తొలుత నోటిఫికేషన్లో చెప్పినదానికి భిన్నంగా వచ్చే నెల 14, 18 తేదీల్లో మరో అర్హత పరీక్ష నిర్వహించబోతున్నట్టు రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది. ఆ పరీక్షలో ఒక్కో పోస్టుకు 8 మందిని ఎంపిక చేసి వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తామన్నారు. ఇదే అభ్యర్థులకు ఆగ్రహం కలిగించింది. నోటిఫికేషన్లో కేవలం ఒక్క అర్హత పరీక్ష ఉంటుందని ప్రక టించి, ఇప్పుడు దాన్నెలా మారుస్తారని యువత నిలదీసింది. దానికితోడు పరీక్షల్లో గోల్మాల్ జరిగిందన్న వదంతులు వ్యాపించాయి. వారి అభ్యంతరాలు మీడియాలో ప్రముఖంగా రాకపోయి ఉండొచ్చుగానీ... పక్షం రోజులుగా ట్విటర్, ఫేస్బుక్ తదితర మాధ్యమాల్లో అవి హోరెత్తు తున్నాయి. అర్హులుగా తేలినవారికి తక్షణం ఇంటర్వ్యూలు నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. ఆ పోస్టులకు టెన్త్, ఇంటర్ అర్హతలుగా ప్రకటించి, పట్టభద్రులకు ఎందుకు చోటిచ్చారని ప్రశ్నిం చారు. రెండేళ్లపాటు నిద్రాహారాలు మాని చదువుకున్నామని, కోచింగ్ కేంద్రాల కోసం వేలకు వేలు ఖర్చుపెట్టామని మొరపెట్టుకున్నారు. కానీ నిలువెల్లా కళ్లున్న కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోయింది. కనీసం రైల్వే మంత్రిత్వ శాఖలోని బాధ్యులైనా ఈ సమస్యపై దృష్టి పెట్టలేక పోయారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు రెండో పరీక్షను ఇప్పుడు తాత్కాలికంగా నిలిపే శారు. అభ్యంతరాల పరిశీలనకు కమిటీ ఏర్పాటైంది. దేశంలో వాస్తవ పరిస్థితులేమిటో ప్రభుత్వ పత్రాల్లో కనబడకపోవచ్చు... అంతా సవ్యంగానే ఉన్నదని అధికారపక్షం పదే పదే చెబుతూ ఉండొచ్చు. కానీ క్షేత్ర స్థాయి వాస్తవాలు వేరుగా ఉన్నాయని భారతీయ ఆర్థిక వ్యవస్థ పర్యవేక్షణ కేంద్రం(సీఎంఐఈ) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఉద్యోగిత రేటు డిసెంబర్ 2016లో 43 శాతం ఉంటే 2021 డిసెంబర్ నాటికి అది 37 శాతానికి పడిపోయింది. ఉత్తరప్రదేశ్‌లో అది 32.8 శాతం మించి లేదు. పైగా అనేకులు క్రమబద్ధంగా జీతా లొచ్చే ఉద్యోగాలు కోల్పోయి, రోజు కూలీలుగా మారారు. ప్రభుత్వ ఉద్యోగాలు రోజురోజుకూ కుంచించుకుపోతున్నాయి. రిటైరవుతున్నవారి సంఖ్యకు అనుగుణంగా నియామకాలు ఉండటం లేదు. ఇప్పటికీ ఉద్యో గాలివ్వడంలో అగ్రభాగంలో ఉన్న రైల్వే శాఖలో పదేళ్లక్రితంతో పోలిస్తే సుమారు అయిదు లక్షల ఉద్యోగాలు మాయమయ్యాయి. దానికితోడు పబ్లిక్ రంగ సంస్థలు క్రమేపీ ప్రైవేటు పరమవుతున్నాయి. అక్కడా ఉద్యోగావకాశాలు పెద్దగా ఉండటం లేదు. ఉన్నా ప్రభుత్వో ద్యోగంతో పోలిస్తే అక్కడ ఉద్యోగ భద్రత తక్కువ. ఇది చాలదన్నట్టు లేబర్ కోడ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం నిరుడు తీసుకొచ్చిన 3 చట్టాలు అమల్లోకొస్తే ఆ భద్రత మరింత దిగజారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో యువతలో ప్రభుత్వోద్యోగం సంపాదించాలన్న ఆత్రుత పెరగడంలో ఆశ్చర్యం లేదు. అది వచ్చినట్టే వచ్చి చేజారిపోతున్నదన్న అభిప్రాయం కలిగితే ఇక చెప్పేదేముంది? కోర్కెల సాధన కోసం హింసామార్గం అవలంబించడం ఎంతమాత్రమూ సమర్థనీయం కాదు. కానీ ఇందుకు దారితీసిన కారణాలేమిటో పాలకులు సానుభూతితో అర్థం చేసుకోవాలి. దేశ ఆర్థిక వ్యవస్థ గురించి ప్రభుత్వ గణాంకాలు ఏం ఊదరగొడుతున్నా, తయారీ రంగ పరిశ్రమలు ఊపందు కోనిదే ఉద్యోగావకాశాలు పెరగవు. రోజు కూలీలుగా బతుకీడుస్తున్న యువతకు భద్రత కలిగిన, గౌరవప్రదమైన ఉపాధి దొరకనిదే వారిలోని అసంతృప్తీ, ఆగ్రహమూ చల్లారవు. కనుక ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం తన విధానాలను పదునెక్కించాలి. వచ్చే బడ్జెట్లో నికరమైన పథకాలకు చోటీయాలి. ప్రసంగాలతో పొద్దుపుచ్చి, ఎన్నికల్లో ఇతరేతర భావోద్వేగాలను రెచ్చగొడితే నాలుగు ఓట్లు రాలవచ్చేమోగానీ... సమస్యలు మాయం కావని గ్రహించాలి. -
ఆర్ఆర్బీ పరీక్షలో సక్సెస్ సాధించాలంటే..?
ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అంటే... రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్–నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ ఎగ్జామ్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు.. ఈనెల 23 నుంచి 31 వరకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ పరీక్ష నిర్వహణకు షెడ్యూల్ ఖరారు చేసింది. ప్రస్తుతం నిర్వహించేది స్టేజ్–1 పరీక్ష. ఎగ్జామ్‌కు మరో పది రోజులు మాత్రమే సమయం ఉంది. అభ్యర్థులు ఈ విలువైన సమయాన్ని సమర్థంగా వినియోగించుకుంటే పరీక్షలో విజయం సాధించవచ్చు. ఈ నేపథ్యంలో.. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ టిప్స్.. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ పరీక్షను దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. ఈ పరీక్ష ద్వారా అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్, కమర్షియల్ అప్రెంటిస్, ట్రైన్స్ క్లర్క్, జూనియర్ టైమ్ కీపర్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రాఫిక్ అసిస్టెంట్, ట్రాఫిక్ అప్రెంటిస్, గూడ్స్ గార్డ్ మొదలైన ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఇంటర్మీడియెట్(10+2) ఉత్తీర్ణులు, గ్రాడ్యుయేట్స్ ఈ పరీక్ష దరఖాస్తుకు అర్హులు. వయసు 18 ఏళ్ల నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ పోస్టులకు మొత్తం నాలుగు దశల్లో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. తొలుత సీబీటీ(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్)1, ఆ తర్వాత సీబీటీ(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) 2, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా తుది ఎంపిక నిర్వహిస్తారు. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ టెస్ట్‌ను ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నారు. ప్రస్తుతం జరిగే ది పరీక్ష స్టేజ్–1. ఇందులో అర్హత సాధించిన వారిని రెండో దశ(స్టేజ్–2)కు ఎంపిక చేస్తారు. రెండో దశ పరీక్ష సైతం ఆన్లైన్ విధానంలోనే ఉంటుంది. ఆ తర్వాత టైపింగ్ స్కిల్ టెస్ట్/కంప్యూటర్ ఆధారిత అప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్/మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటాయి. స్టేజ్–1 పరీక్ష ► తొలి దశ పరీక్ష 100 ప్రశ్నలు–100 మార్కులకు జరుగుతుంది.ఇందులో మ్యాథమెటిక్స్ 30 ప్రశ్నలు–30 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 ప్రశ్నలు–30 మార్కులు, జనరల్ అవేర్నెస్ 40 ప్రశ్నలు–40 మార్కులకు ఉంటాయి. పరీక్ష సమయం 90నిమిషాలు. స్టేజ్1లో అర్హత సాధించినవారిని స్టేజ్2కు అనుమతిస్తారు. స్టేజ్–2 పరీక్ష రెండో దశ పరీక్ష 120 ప్రశ్నలు–120 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో మ్యాథమెటిక్స్ 35 ప్రశ్నలు–35 మార్కులు, రీజనింగ్ 35 ప్రశ్నలు–35 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ 50 ప్రశ్నలు–50 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం 90 నిమిషాలు. నెగిటివ్ మార్కుల విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానినికి 1/3 మార్కు కోత వేస్తారు. ప్రిపరేషన్ ప్రణాళిక ► ఎంతో కాలంగా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ పరీక్ష కోసం సిద్ధమవుతున్న వారు ఇప్పటికే సిలబస్ అంశాల అధ్యయనం పూర్తిచేసి ఉంటారు. ► ఇప్పుడున్న తక్కువ సమయంలో అభ్యర్థులు తమ బలాలు, బలహీనతలను అంచనా వేసుకోవడం అవసరం. ఏ విభాగంలో బలహీనంగా ఉన్నారో గుర్తించి.. దానికి ఎక్కువ సమయం కేటాయించాలి. ► పరీక్ష రోజు వరకు అభ్యర్థులు గత ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ప్రశ్న పత్రాలను ప్రాక్టీస్ చేయడం మంచిది. ఇది పరీక్షలో టైమ్ మేనేజ్మెంట్కు దోహదపడుతుంది. ► ఒక సబ్జెక్ట్ కోసం ఎంత సమయం కేటాయించారో.. ఆలోపే చదవడం పూర్తి చేయాలి. ప్రతిరోజు రివిజన్ చేయడం మరిచిపోవద్దు. ► ఆన్లైన్లో మాక్‌టెస్టులు ప్రాక్టీస్ చేయడం ద్వారా ఒత్తిడిని జయించడంతోపాటు వేగం పెంచుకోవచ్చు. ► ప్రస్తుతం అందుబాటులో ఉన్న తక్కువ సమయంలో ఎలాంటి చిట్కాలు పాటిస్తే మంచి మార్కులు స్కోరు చేయవచ్చో తెలుసుకోవాలి. ► గణిత విభాగానికి సంబంధించిన ఫార్ములాలు, సూత్రాలను గుర్తుంచుకోవాలి. ► ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సిలబస్‌లో పేర్కొన్న టాపిక్స్ అన్నీ కవర్ చేశారో లేదో చూసుకోవాలి. ఇప్పుడు కొత్త అంశాల జోలికి వెళ్లడం కంటే ఇప్పటికే చదివిన టాపిక్స్‌ను మరోసారి అధ్యయనం చేయడం మంచిది. ► ఏదో ఒక ఒక సబ్జెక్టుకు ఎక్కువ సమయం కేటాయించకుండా..టైమ్ టేబుల్ ప్రకారం అన్ని అంశాలకు సన్నద్ధమవ్వాలి. ► ప్రతి ప్రశ్నను పరిష్కరించడానికి నిర్దిష్ట సమయాన్ని కేటాయించాలి. జవాబులను త్వరగా గుర్తించేందుకు సత్వరమార్గాలు, చిట్కాలను గుర్తుంచుకోవాలి. ► ఏదైనా ఒక టాపిక్‌ను సాధన చేసే క్రమంలో ఇబ్బందులు తలెత్తితే.. ఇతర టాపిక్స్‌ను చదవడం లేదా ఇంతకుముందు చదివిన టాపిక్స్‌ను మరోసారి ప్రాక్టీస్ చేయడం మంచిది. పరీక్ష రోజు టిప్స్ ► పరీక్షలో మొదట తేలికపాటి ప్రశ్నల నుంచి క్లిష్టమైన ప్రశ్నలకు జవాబులు గుర్తించడం మంచిది. దీనివల్ల ఒత్తిడి తగ్గడంతోపాటు ఎక్కువ ప్రశ్నలకు జవాబులు గుర్తించేందుకు వీలవుతుంది. ► గణిత విభాగంతో పోలిస్తే, జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ విభాగాల ప్రశ్నలకు సులభంగానే సమాధానాలు గుర్తించవచ్చు. కాబట్టి మొదట సులభమైన వాటితో పరీక్ష ప్రారంభించాలి. దీనివల్ల కేటాయించిన సమయం కంటే ముందే తేలికపాటి ప్రశ్నలు ముగిస్తే.. క్లిష్ట ప్రశ్నలకు కేటాయించేందుకు అధిక సమయం లభిస్తుంది. ► ఒక ప్రశ్నకు 30 సెకన్ల కంటే ఎక్కువ సమయం కేటాయించకుండా చూసుకోవాలి. ఎక్కువ సమయం తీసుకునే ప్రశ్నలను చివరగా ప్రయత్నించడం మేలుచేస్తుంది. -
ఆర్ఆర్బి ఎన్టీపీసీ రెండో విడత షెడ్యూల్ విడుదల
న్యూఢిల్లీ: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల నియామకానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల కోసం రెండో విడుత షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఆర్ఆర్బి విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఆర్ఆర్బి ఎన్టీపీసీ సెకండ్ పేజ్ సీబీట-1 టెస్ట్ 2021 జనవరి 16 నుండి 2021 జనవరి 30 వరకు జరగనుంది. ఈ పరీక్షలో సుమారు 27 లక్షల మంది అభ్యర్థులు పాల్గొననున్నట్లు ప్రకటించింది. ఈ రోజు(జనవరి 6) నుండి పరీక్షా నగరం & తేదీని తెలుసుకోవడంతో పాటు ఎస్సీ/ఎస్టీ అభ్యర్థుల కోసం ఉచిత ట్రావెలింగ్ సర్టిఫికెట్‌ను అన్ని ఆర్ఆర్బి వెబ్సైట్లలో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.(చదవండి: వైరలవుతోన్న రతన్ టాటా ఫోటో) పరీక్ష తేదీకి 4 రోజుల ముందు ఆర్ఆర్బి ఎన్టీపీసీ అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని అధికారులు తెలిపారు. 2వ దశలో షెడ్యూల్ చేసిన అభ్యర్థులందరికీ వారు ఆన్లైన్ దరఖాస్తులో ఇచ్చిన ఇ-మెయిల్, మొబైల్ నంబర్లకు ఈ సమాచారాన్ని పంపనున్నట్లు పేర్కొన్నారు. మిగిలిన అభ్యర్థులకు సంబందించిన పరీక్షలను తదుపరి దశలో వెల్లడించనున్నట్లు ఆర్ఆర్బి పేర్కొంది. మిగతా సమాచారం కోసం ఆర్ఆర్బి ఎన్టీపీసీ అధికారిక వెబ్సైట్ వీక్షించండి. ఆర్ఆర్బి ఎన్టిపీసీ నోటిఫికేషన్ ద్వారా 35,208 పోస్టులను భర్తీ చేయనున్నారు. -
ఆర్ఆర్బీ పరీక్షకు 3.59 లక్షల మంది
న్యూఢిల్లీ: రైల్వేశాఖలో అసిస్టెంట్ లోకోపైలెట్, టెక్నీషియన్ పోస్టుల భర్తీలో భాగంగా విడతల వారీగా నిర్వహిస్తున్న పరీక్షలకు మొదటి రోజు దాదాపు 4 లక్షల మంది హాజరైనట్లు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (ఆర్ఆర్బీ) గురువారం ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం మూడు షిఫ్ట్‌ల్లో మొత్తం 4.83 లక్షల మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 3.59 లక్షల మంది హాజరయ్యారని తెలిపింది. ఇప్పటి వరకు ఆర్ఆర్బీ నిర్వహించిన పరీక్షల్లో ఇదే రికార్డు స్థాయి హాజరు శాతమని వెల్లడించింది. ఆర్ఆర్బీ చరిత్రలోనే అతిపెద్ద రిక్రూట్‌మెంట్‌గా భావిస్తున్న ఈ నోటిఫికేషన్లో.. మొత్తం 60వేల పోస్టులకుగాను దేశవ్యాప్తంగా 47.55 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. 15 భాషలలో విడతల వారీగా ఈ నెల 31 వరకు జరగనున్న ఈ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. -
ఒకే రోజు రెండు బ్యాంకుల ఇంటర్వ్యూలు!
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు(కడప), తెలంగాణ గ్రామీణ బ్యాంకు(హైదరాబాద్)లు ఉద్యోగాల భర్తీకి ఒకే రోజు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయి. బుధవారం ఉదయం 10 గంటలకు ఇంట ర్వ్యూలకు రావాలంటూ ఆర్ఆర్బీ పరీక్షల్లో ఎంపికయిన అభ్యర్థులకు లేఖలు, మెయిళ్లు వచ్చాయి. దీంతో అభ్యర్థులు తీవ్ర గందరగోళంలో పడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలోని ఐదు గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీకి గత ఏడాది సెప్టెంబర్‌లో ఆర్ఆర్బీ పరీక్ష నిర్వహించింది. తొలి విడతలో కొందర్ని ఇప్పటికే నియమించుకోగా రెండో విడతగా జాబితాలోని మిగతావారిని ప్రస్తుతం ఇంటర్వ్యూలకు ఆహ్వానించారు. అయితే ఒకే రోజు రెండు ఇంటర్వ్యూలు ఉండడంతో తేదీలు మార్చాలని అభ్యర్థులు కోరుతున్నారు.