ప్రతి విద్యార్థి శాస్త్రవేత్త కావాలి
విజయవాడ (గుణదల) : ప్రతి విద్యార్థి శక్తివంతమైన శాస్త్రవేత్త కావాలని మాజీ డీజీపీ ప్రసాదరావు అన్నారు. ప్రముఖ శాస్త్రవేత్తల ఆవిష్కరణలు తెలుసుకోవడటం వల్ల నూతన ఆలోచనలు వస్తాయని చెప్పారు. ఇంటర్మీడియెట్ సైన్స్ విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేదుకు నగరంలోని ఆంధ్రా లయోలా కళాశాలలో కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యాన రాష్ట్ర స్థాయిలో మూడు రోజులపాటు నిర్వహించే ‘ఇన్స్పైర్–16’ కార్యక్రమాన్ని అయన సోమవారంప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసాదరావు మాట్లాడుతూ విద్యార్థులు సైన్స్‌పై ఆసక్తి పెంచుకోవాలని చెప్పారు. దేశ అభ్యున్నతికి ఉపయోగపడే హేతుబద్ధమైన, వివరణాత్మకమైన ప్రయోగాలను చేయాలని సూచించారు. ప్రతి విద్యార్థిలో ప్రశ్నించే తత్వం ఉండాలన్నారు. ప్రశ్నల ద్వారానే నూతన ఆవిష్కరణలకు ఆస్కారం ఉంటుందని పేర్కొన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఏఎస్ రాఘవేంద్రరావు మాట్లాడుతూ భూమి మీద మొక్కలు చాలా ముఖ్యమైనవని, ప్రతి ఒక్కరికి ఆహారం, గాలి, ఆరోగ్యం, ఆయిల్, సువాసన, సంతోషాన్ని అందిస్తాయని వివరించారు. బెనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి వచ్చిన మహేంద్రకుమార్ ఠాకూర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు శరీరక ఆరోగ్యంతోపాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలని సూచించారు. మానసిక అనారోగ్యం వల్ల ఎక్కువ పనులు చేయలేరన్నారు. అనంతరం విద్యార్థులకు భౌతిక, రసాయన, గణిత, వృక్ష, జంతు శాస్త్ర విభాగాల నిపుణులు, శాస్త్రవేత్తలతో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. తొలుత కాలేజీ ఆవరణలో ప్రసాదరావు మొక్కలు నాటారు. ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ డి.వెంకటసతీష్, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు, పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు.