ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు భారతదేశం
బేతంచెర్ల:
ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు భారతదేశమని పరిపూర్ణానంద సరస్వతి స్వామీజీ అన్నారు. శనివారం స్వామీజీ నేతృత్వంలో శ్రీనివాస నిత్య కల్యాణ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో లోక కల్యాణార్థం శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం కనుల పండువగా నిర్వహించారు. స్థానిక అమ్మవారిశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పరిపూర్ణానంద సరస్వతి స్వామి భక్తులనుద్దేశించి మాట్లాడుతూ సేవా మార్గంతోనే ముక్తి లభిస్తుందన్నారు.
సంస్కృతీ సాంప్రదాయాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కల్యాణ మహోత్సవానికి సంబంధించి రూ.1.50 లక్షల విలువ చేసే శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వార్ల ఉత్సవ విగ్రహాలను బేతంచెర్లకు చెందిన లక్ష్మీరెడ్డి దంపతులు అందజేసినందున కార్యక్రమాన్ని మొదటగా ఈ ప్రాంతం నుంచే ప్రారంభించామన్నారు. కల్యాణోత్సవంలో నమో వేంకటేశాయ నమః నామ స్మరణ మారుమ్రోగింది.
పట్టణానికి చెందిన అల్లంపల్లె కృష్ణమూర్తి సహకారంతో భక్తులకు అన్నమయ్య లడ్డూ ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో నిర్వాహకులు ఈ.వి.సుజాత శర్మ, నాగేంద్రప్రసాద్, గుండా మోహన్రావు, రామకృష్ణ, గణేష్కుమార్రెడ్డి, భజన కృష్ణయ్య, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.