దళితులపై దాడులను అరికట్టాలి
బాపట్ల టౌన్: దళితులపై మతోన్మాదులు, కులోన్మాదులు చేస్తున్న దాడులను వెంటనే అరికట్టాలని ప్రగతి శీల మహిళా సంఘం జిల్లా కార్యదర్శి శీలం ఏసమ్మ తెలిపారు. మండలంలోని వెదుళ్ళపల్లి సమీపంలో ఉన్నటువంటి వికలాంగుల కాలనీలో మంగళవారం జ్యోతిరావు పూలే స్థాపించిన సత్యశోధక్ సమాజ్ 144వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శీలం ఏసమ్మ మాట్లాడుతూ దళితులకు చదువులనందించి, మనువాదంపై సమరశీల పోరాటాలు నడిపారన్నారు. కుల నిర్మూలన కోసం దళితులను చైతన్య వంతం చేసిన ఘనత జ్యోతిరావు పూలేకు దక్కుతుందన్నారు. దళిత బాలికలకు విద్యనందించడం కోసం భారతదేశంలోనే మొదటిగా పాఠశాలలు నెలకొల్పి విద్యనందించారన్నారు. తన భార్యకు చదువునేర్పి స్త్రీలకు చదువు చెప్పించారన్నారు. అగ్ర కులోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడిన ధైర్యశాలి అన్నారు. మనుధర్మ సూత్రాల వలన స్త్రీలపై హింస, స్త్రీలను వంటింటికి పరిమితం చేసే విధానాల వలన స్త్రీలు నేటికి విద్యకు దూరమవుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి యు. గనిరాజు, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు బెజ్జం శ్రీనివాసరావు, ఎ.ఐ.కె.ఎం.ఎస్ జిల్లా కార్యదర్శి మేకల ప్రసాద్, తెనాలి డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు డి. రాములమ్మ, ఎం.పి.రంజాన్, ప్రగతిశీల న్యాయవాదులు జిల్లా కన్వీనర్ ఎస్. సురేష్‌బాబు, ఎం. పల్లవి ఉన్నారు.