సెబాస్టియన్, ఉదయ్ లను కస్టడీ కోరిన ఏసీబీ
హైదరాబాద్: నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫన్సన్ కు ముడుపుల ఇవ్వజూపిన వ్యవహారంలో అరెస్టైన టీడీపీ క్రిస్టియన్ విభాగం నాయకుడు సెబాస్టియన్ హారీ, ఉదయ్ సింహాలను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ కోర్టులో ఏసీబీ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో పాటు టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని ఐదు రోజుల ఏసీబీ కస్టడీకి అప్పగించాలని విజ్ఞప్తి చేసింది. రేవంత్ రెడ్డి దగ్గర మరింత సమాచారం సేకరించాల్సి ఉన్న క్రమంలో ఆయన్ను తమ కస్టడీకి అప్పగించాలంటూ ఏసీబీ పిటిషన్ లో పేర్కొంది. రేవంత్ రెడ్డిన అరెస్ట్ చేసిన తరువాత విచారించడానికి సమయం సరిపోలేనందున ఐదు రోజుల కస్టడీకి అప్పగించాలని ఏసీబీ స్పష్టం చేసింది.
టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఏసీబీ కార్యాలయానికి వచ్చి నానా హంగామా చేశారని.. ఈ పరిస్థితుల్లో నిందితులను విచారించడం సాధ్యం కాలేదని కోర్టుకు తెలిపింది. ముడుపుల కేసులో అరెస్టైన నిందితుల నుంచి పూర్తిస్థాయిలో స్టేట్ మెంట్స్ ను తీసుకోవాల్సి ఉందని, దీని కోసం కొన్ని ప్రశ్నలను వారి నుంచి తెలుసుకోవాలని ఏసీబీ తెలిపింది. అసలు డబ్బు ఎక్కడ నుంచి వచ్చింది?..ఎవరు సమకూర్చారన్న దానిపై దర్యాప్తు కొనసాగించాల్సి ఉందని.. రూ. 50 లక్షలతోపాటు మర్నాడు ఇస్తామన్న రూ. 4.5 కోట్ల ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు గుర్తించాల్సి ఉందని ఏసీబీ పిటిషన్ లో పేర్కొంది. అంత పెద్ద మొత్తం ఎక్కడ నుంచి వచ్చిందో నిందితులకు మాత్రమే తెలుసని.. ఈ క్రమంలో నిందితులను ఇంటరాగేట్ చేసి తెలుసుకోవాల్సి ఉందని కోర్టుకు విన్నవించింది. రేవంత్ రెడ్డిని ఫోన్ ను పరిశీలించి అనేక వివరాలు సంపాదించామని ఏసీబీ తెలిపింది. ఈ డీల్ పై రేవంత్ రెడ్డి అనేక మందితో మాట్లాడినట్లు తెలుస్తోందని, ఈ వివరాల ఆధారంగా కుట్రలో అన్ని కోణాలు వెలికి తీయాల్సి ఉందని కోర్టుకు ఏసీబీ విజ్ఞప్తి చేసింది.
ఇప్పటికే అరెస్టై జైల్లో ఉన్న ఎమ్మెల్యే రేవంత్ రెడ్డితో పాటు, సెబాస్టియన్, ఉదయ్ , మాథ్యూస్ లకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు తమ ' బాస్ ' ఆదేశాల ప్రకారం ముడుపులు ఇవ్వజూపినట్టు చెబుతూ వీరందరూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఈ వ్యవహారంలో సెబాస్టియన్ హారీయే మధ్యవర్తి అని, ఆయనను ప్రశ్నిస్తామని ఏసీబీ వర్గాలు తెలిపాయి.