Sedan
-
ఒకసారి చార్జింగ్‌తో 650 కిలోమీటర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఉన్న చైనా దిగ్గజం బీవైడీ.. భారత్‌లో సీల్ ఎలక్ట్రిక్ సెడాన్‌ను మూడు వేరియంట్లలో ఆవిష్కరించింది. ధర రూ.41 లక్షలతో ప్రారంభమై రూ.53 లక్షల వరకు ఉంది. ఒకసారి చార్జింగ్‌తో వేరియంట్‌నుబట్టి ఈ కారు 510–650 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 3.8 సెకన్లలో అందుకుంటుంది. 15.6 అంగుళాల టచ్‌్రస్కీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 10.25 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, హెడ్–అప్ డిస్ప్లే వంటి హంగులు ఉన్నాయి. ప్రపంచంలో తొలిసారిగా సెల్ టు బాడీ, ఇంటెలిజెంట్ టార్క్ అడాప్షన్ కంట్రోల్ సాంకేతికతలతో రూపుదిద్దుకుందని కంపెనీ తెలిపింది. అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్‌ను పొందుపరిచారు. 4.8 మీటర్ల పొడవు ఉంది. పూర్తిగా తయారైన కారును చైనా నుంచి భారత్‌కు దిగుమతి చేస్తారు. ఇప్పటికే బీవైడీ భారత్‌లో ఈవీ6 ఎలక్ట్రిక్ ఎంపీవీ, ఆటో3 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని విక్రయిస్తోంది. రూ.30 లక్షలకుపైగా ఖరీదు చేసే లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో భారత్‌లో తాము నాయకత్వ స్థానంలో ఉన్నామని బీవైడీ ఇండియా ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గోపాలకృష్ణన్ తెలిపారు. -
ఒకప్పుడు టాటా నానో.. ఇప్పుడు బీఎమ్‌డబ్ల్యూ - అట్లుంటది కిమ్ శర్మ అంటే!
బాలీవుడ్ బ్యూటీ 'కిమ్ శర్మ' (Kim Sharma) పేరు తెలుగు వారికి పెద్దగా పరిచయం ఉండకపోవచ్చు, కానీ మగధీర సినిమాలో జోర్సే.. జోర్సే పాట గుర్తొస్తే తప్పకుండా ఈమే గుర్తొస్తుంది. ఇది మాత్రమే కాకుండా ఖడ్గం, ఆంజనేయులు సినిమాల్లో కూడా తనదైన రీతిలో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది. అయితే ఈ ముద్దుగుమ్మ ఇటీవల ఓ ఖరీదైన జర్మన్ లగ్జరీ కారుని కొనుగోలు చేసింది. ఈ కారు గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. కిమ్ శర్మ కొనుగోలు చేసిన కొత్త కారు బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన ఐ7 (BMW i7) ఎలక్ట్రిక్ సెడాన్. ఇటీవలే ఈ కారుతో ఓ రెస్టారెంట్ వెలుపల కనిపించింది. ఈ సెడాన్ ధర రూ. 1.95 కోట్లు (ఎక్స్-షోరూమ్). దీనికి సంబంధించిన ఒక వీడియోను కార్స్ ఫర్ యు అనే యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసింది. ఈ వీడియోలో గమనించినట్లయితే, బీఎండబ్ల్యూ ఐ7 కారు దిగి రెస్టారెంట్ లోపలికి వెళ్లిపోవడం చూడవచ్చు. గతంలో ఈమె భారతదేశంలో అత్యంత సరసమైన కారు 'టాటా నానో' (Tata Nano) ఉపయోగించేది. అయితే దీని స్థానంలో ఖరీదైన బీఎండబ్ల్యూను చేర్చింది. బీఎండబ్ల్యూ ఐ7 ఎలక్ట్రిక్ దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణపొందిన బీఎండబ్ల్యూ కార్లలో ఐ7 ఒకటి. ఇది అద్భుతమై డిజైన్, అధునాతన ఫీచర్స్ పొందుతుంది. ఇందులో బ్లూ యాక్సెంట్లు, కొత్త డైమండ్ అల్లాయ్ వీల్ వంటివి గమనించవచ్చు. ఇదీ చదవండి: ఎలాన్ మస్క్‌కు షాక్.. ఎక్స్(ట్విటర్)కు రూ.3.21 కోట్లు ఫైన్ - కారణం ఇదే! ఇంటీరియర్ విషయానికి వస్తే.. ఈ సెడాన్ 14.9 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ & 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ పొందుతుంది. అంతే కాకుండా రెండవ వరుస ప్రయాణికుల కోసం ఇందులో 31.3 ఇంచెస్ 8కే సినిమా స్క్రీన్ ఉంటుంది. డోర్స్ వద్ద కూడా 5.5 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఉంటుంది. బీఎండబ్ల్యూ ఐ7 రెండు ఎలక్ట్రిక్ మోటార్లను కలిగి 544 హార్స్ పవర్, 745 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇందులోని 101.7 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఒక సింగిల్ ఛార్జ్‌తో గరిష్టంగా 600 కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుందని కంపెనీ ధ్రువీకరించింది. దీని టాప్ స్పీడ్ 239 కిమీ/గం. -
అయ్యయ్యో కొత్త కారు, రోడ్డు మీదకి రాకముందే ఇలా! వైరల్ వీడియో
సాధారణంగా చాలా మందికి కారు కొనటం ఒక కల, ఆ కల నిజమయ్యే సమయంలో చేసే చిన్న చిన్న పొరపాట్లు భారీ నష్టాలను కలిగిస్తాయి. ఇటీవల ఒక వ్యక్తి కారు కొనుగోలు చేసిన కొన్ని నిముషాల్లోనే ప్రమాదానికి గురైంది, దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నివేదికల ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి డీలర్షిప్ ముందు ఉన్న రోడ్డుపై ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ ప్రమాదానికి గురైంది. డెలివరీ తీసుకునే సమయంలో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం ఎక్కువగా దెబ్బతినింది. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. ఇందులో కస్టమర్ల తొందర, అత్యుత్సాహం వల్ల జరిగిన పొరపాట్లు స్పష్టంగా తెలుస్తుంది. డ్రైవింగ్ పూర్తిగా నేర్చుకోకుండా కారు నడిపితే ఇలాంగే ఉంటుందనటానికి ఇది మంచి ఉదాహరణ. నిజానికి భారతీయ మార్కెట్లో ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ రూ. 11,21,900 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధర వద్ద విడుదలైంది. ఈ సెడాన్ మార్కెట్లో విడుదలైనప్పటి నుంచి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. ఇది రెండు వేరియంట్స్, రెండు ఇంజిన్ ఆప్సన్షతో అందుబాటులో ఉన్నాయి. ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ 1.0-లీటర్ టిఎస్ఐ త్రీ-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 115 హెచ్‌పి పవర్, 178 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తే, 1.5-లీటర్ టిఎస్ఐ ఫోర్-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 150 హెచ్‌పి పవర్, 250 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అంతే కాకుండా ఈ సెడాన్ లాటిన్ NCAP క్రాస్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ పొంది దేశీయ మార్కెట్లో అత్యంత సురక్షితమైన వాహనంగా నిలిచింది. -
టాటా మోటార్స్–ఉబర్ భారీ డీల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వెహికిల్స్ రంగంలో భారీ డీల్‌కు వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్, రైడ్ షేరింగ్ యాప్ ఉబర్ తెరలేపాయి. ఇరు సంస్థల మధ్య సోమవారం ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా 25,000 యూనిట్ల ఎక్స్‌ప్రెస్–టి ఎలక్ట్రిక్ సెడాన్ వాహనాలను ఉబర్‌కు టాటా మోటార్స్ సరఫరా చేయనుంది. ఎక్స్‌ప్రెస్–టి ఈవీలను ప్రీమియం సేవల కింద ఉపయోగించనున్నట్టు ఉబర్ వెల్లడించింది. హైదరాబాద్‌సహా ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, కోల్‌కత, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్ నగరాల్లో ఈ నెల నుంచే వీటిని నడుపుతామని తెలిపింది. దశలవారీగా డెలివరీలు.. ‘ఎలక్ట్రిక్ వెహికల్స్ సరఫరా విషయంలో వాహన తయారీ కంపెనీ, రైడ్ షేరింగ్ సంస్థ మధ్య దేశంలో ఈ స్థాయి డీల్ కుదరడం ఇదే తొలిసారి. ఫిబ్రవరి నుంచే దశలవారీగా ఉబర్ ఫ్లీట్ పార్ట్నర్స్కు డెలివరీలను టాటా మోటార్స్ ప్రారంభించనుంది. దేశంలో పర్యావరణ, స్వచ్ఛ వాహనాల వినియోగం పెరిగేందుకు ఈ డీల్ దోహదం చేస్తుందని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్, టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఎండీ శైలేశ్ చంద్ర అన్నారు. ట్యాక్సీల కోసం ప్రత్యేకంగా ఎక్స్‌ప్రెస్ బ్రాండ్‌ను టాటా మోటార్స్ 2021 జూలైలో తెచ్చింది. ఈ బ్రాండ్ కింద ఎక్స్‌ప్రెస్–టి తొలి ఉత్పాదన. ఫేమ్ సబ్సిడీ పోను హైదరాబాద్ ఎక్స్‌షోరూం ధర.. ఎక్స్‌ప్రెస్–టి ఎక్స్ఎమ్ ప్లస్ రూ.13.04 లక్షలు, ఎక్స్‌టీ ప్లస్ రూ.13.54 లక్షలు ఉంది. -
మారుతీ సుజుకీ డిజైర్ ఎస్–సీఎన్జీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఎస్–సీఎన్జీ పరిజ్ఞానంతో కాంపాక్ట్ సెడాన్ డిజైర్‌ను రెండు ట్రిమ్స్‌లో ప్రవేశపెట్టింది. ధర ఎక్స్‌షోరూంలో రూ.8.14 లక్షల నుంచి ప్రారంభం. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో ఇంటెలిజెంట్ ఇంజెక్షన్ సిస్టమ్‌తో ఇవి రూపుదిద్దుకున్నాయని కంపెనీ తెలిపింది. మైలేజీ కిలోకు 31.12 కిలోమీటర్లు అని వెల్లడించింది. నిర్వహణ వ్యయం తక్కువగా ఉండడం, అధిక మైలేజీ కారణంగా ఎస్–సీఎన్జీ వాహనాలకు డిమాండ్ విపరీతంగా పెరిగిందని మారుతీ సుజుకీ ఇండియా మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. అయిదేళ్లలో కంపెనీ ఈ విభాగంలో ఏటా సగటున 19 శాతం వృద్ధి చెందిందని పేర్కొన్నారు. -
భారత్‌కు ఫోక్స్‌వ్యాగన్ వర్చూస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న జర్మనీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ వర్చూస్ సెడాన్‌ను ఆవిష్కరించింది. ఈ ఏడాది మే నెలలో భారత మార్కెట్లో అందుబాటులోకి రానుంది. 115 పీఎస్ పవర్‌తో 1.0 లీటర్, 150 పీఎస్ పవర్‌తో 1.5 లీటర్ టీఎస్ఐ పెట్రోల్ పవర్‌ట్రైయిన్స్, మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్స్‌తో రూపుదిద్దుకుంది. హోండా సిటీ, హ్యుండాయ్ వెర్నా, మారుతి సుజుకీ సియాజ్, స్కోడా స్లేవియా వంటి మోడళ్లకు ఇది పోటీ ఇవ్వనుంది. మధ్య స్థాయి ప్రీమియం సెడాన్స్ విభాగంలో 12–15 శాతం మార్కెట్ వాటా లక్ష్యంగా చేసుకున్నట్టు ఫోక్స్‌వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ ఇండియా బ్రాండ్ డైరెక్టర్ ఆశిష్ గుప్తా వెల్లడించారు. ‘కొత్త ఉత్పాదన రాగానే విభాగం వృద్ధి చెందుతుంది. 2022 డిసెంబర్ నాటికి ఈ విభాగం 1.5 లక్షల యూనిట్లకు చేరుతుందన్న అంచనా ఉంది. కారు నిర్మాణ శైలికి ఇప్పటికీ దేశంలో ఆదరణ ఉంది. మొత్తం ప్యాసింజర్ వెహికిల్స్ అమ్మకాల్లో ఈ శైలి కార్ల వాటా 12–14 శాతం కైవసం చేసుకుంది. ఏటా 4 లక్షల యూనిట్లు అమ్ముడవుతున్నాయి. మధ్యస్థాయి సెడాన్ విభాగం గతేడాది 28 శాతం వృద్ధి చెందింది’ అని వివరించారు. -
టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ సెడాన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ రంగంలో ఉన్న టాటా మోటార్స్.. ఎక్స్‌ప్రెస్ బ్రాండ్ కింద ఎలక్ట్రిక్ సెడాన్‌ను రెండు ట్రిమ్స్, నాలుగు వేరియంట్లలో ఆవిష్కరించింది. ట్రిమ్నుబట్టి 21.5, 16.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ పొందుపరిచారు. సింగిల్ స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డి్రస్టిబ్యూషన్తో ఏబీఎస్ వంటి ఏర్పాటు ఉంది. ఎక్స్‌ప్రెస్–టి 165 మోడల్ ఒకసారి చార్జ్ చేస్తే 165 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. అలాగే ఎక్స్‌ప్రెస్–టి 213 మోడల్ 213 కిలోమీటర్లు పరుగెడుతుందని వివరించింది. ధర వేరియంట్‌నుబట్టి ఫేమ్–2 సబ్సిడీ పోను రూ. 9.54 లక్షల నుంచి రూ.10.64 లక్షల వరకు ఉంది. ప్రయాణికుల రవాణా, కార్పొరేట్, ప్రభుత్వ సంస్థలను లక్ష్యంగా చేసుకుని ఎక్స్‌ప్రెస్–టి రూపొందించినట్టు కంపెనీ తెలిపింది. -
సేఫ్టీ క్రాష్ టెస్ట్‌లో స్విఫ్ట్, డస్టర్ ఫెయిల్!
రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు అందులో ప్రయాణించే వారికి రక్షణ కల్పించే విషయంలో మారుతి సుజూకి స్విఫ్ట్, రెనాల్ట్ డస్టర్ కార్ల పని తీరు అస్సలు బాగోలేదంటూ లాటిన్ ఎన్సీఏపీ స్పష్టం చేసింది. ఇటీవల నిర్వహించిన క్రాష్ టెస్ట్‌లో ఈ రెండు కార్లు దారుణమైన ఫలితాలను పొందాయి. క్రాష్ టెస్ట్ కార్లలో ప్రయాణికుల భద్రతకు సంబంధించి వివిద దేశాలు న్యూ కార్ ఎస్సెస్మెంట్ ప్రోగ్రామ్ (ఎన్సీఏపీ) పేరుతో క్రాష్ టెస్ట్‌లు నిర్వహించి రేటింగ్స్ ఇస్తుంటాయి. ఇటీవల లాటిన్ ఎన్సీపీఏ పరీక్షలు నిర్వహించగా మారుతి సుజూకి స్విఫ్ట్, రెనాల్ట్ డస్టర్ కార్లు ఈ పరీక్షలో పాల్గొన్నాయి. ఇటీవల కొత్తగా అమల్లోకి తెచ్చిన నిబంధనలను అనుసరించి ఈ పరీక్షలు నిర్వహించగా ఈ రెండు ప్రముఖ కార్లు దారుణంగా జీరో స్టార్స్ రేటింగ్ సాధించి నిరాశజనకమైన ఫలితాలు కనబరిచాయి. మారుతి స్విఫ్ట్ పరిస్థితి మారుతి సిఫ్ట్కి సంబంధించి హ్యాచ్‌బ్యాక్, సెడాన్ రెండు కార్లు సైతం ఈ టెస్టులో అత్తెసరు మార్కులు కూడా సాధించలేపోయాయి. ఆడల్డ్ ఆక్యుపెంట్ బాక్స్ కేటగిరిలో 15.53 శాతం, చిల్డ్రెన్ ఆక్యుపెంట్ బాక్స్ కేటగిరీలో సున్నా శాతం. పెడస్ట్రియన్ ప్రొటెక్షన్, వల్నరబుల్ రోడ్ బాక్స్ కేటగిరిలో 66 శాతం, సేఫ్టీ అసిస్ట్ బాక్స్ కేటగిరిలో 6.98 శాతం పాయింట్లనే సాధించగలిగింది. దీంతో మారుతి స్విఫ్ట్‌కి లాటిన్ ఎన్సీఏపీ జీరో రేటింగ్ ఇచ్చింది. డస్టర్దీ అదే దారి రెనాల్ట్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ డస్టర్‌కి ఈ క్రాష్ టెస్ట్‌లో ఆడల్డ్ ఆక్యుపెంట్ బాక్స్ కేటగిరిలో 29.47 శాతం, చిల్డ్రెన్ ఆక్యుపెంట్ బాక్స్ కేటగిరీలో 22.93 శాతం. పెడస్ట్రియన్ ప్రొటెక్షన్, వల్నరబుల్ రోడ్ బాక్స్ కేటగిరిలో 50.79 శాతం, సేఫ్టీ అసిస్ట్ బాక్స్ కేటగిరిలో 34.88 శాతం పాయింట్లనే సాధించగలిగింది. రక్షణ చర్యలేవి లాటిన్ ఎన్సీఏపీ పరీక్షలో విఫలమైన మారుతి స్విఫ్ట్, రెనాల్ట్ డస్టర్ల్ కార్లలో స్టాండర్డ్‌గా రెండు ఎయిర్‌బ్యాగులు అందించారు. అయితే ప్రమాదం జరిగినప్పుడు సైడ్ ఇంపాక్ట్ ప్రొటెక్షన్ విషయంలో ఈ రెండు కార్లలో భద్రతా ప్రమాణాలు నాసిరకంగా ఉన్నాయని లాటిన్ ఎన్సీఏపీ అభిప్రాయపడింది. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ సిస్టమ్ లేకపోవడం పెద్దలోటని తెలిపింది. ఇప్పుడే కష్టం యూఎన్ 95 నిబంధనలకు తగ్గట్టుగా స్విఫ్ట్ , డస్టర్ కార్లలో భద్రతా ఏర్పాట్లు లేనందున వీటిని ఇప్పుడే లాటిన్ దేశాల్లో అనుమతించే అవకాశం లేదు. 2018లో జరిగిన క్రాష్ టెస్ట్‌లో స్విఫ్ట్‌కి 2 స్టార్ రేటింగ్ వచ్చింది. ఈసారి రేటింగ్ మెరుగవుతుందని భావిస్తే దారుణంగా పడిపోయింది. యూరోపియన్, లాటిన్ దేశాల్లో కార్లకు 6 ఎయిర్‌బ్యాగ్స్‌తో పాటు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ సిస్టమ్‌లు తప్పనిసరిగా మారాయి. చదవండి : హ్యుందాయ్ సంచలనం! త్వరలో హైడ్రోజన్ వేవ్ కారు!! -
బీఎండబ్ల్యూ 6 సిరీస్ కొత్త వెర్షన్
సాక్షి, ముంబై: జర్మనీ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ బీఎండబ్ల్యూ తన 6 సిరీస్ సెడాన్ అప్డేటెడ్ వెర్షన్‌ను గురువారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.67.9 లక్షలుగా ఉంది. సరికొత్త వెర్షన్‌ను పెట్రోల్, రెండు డీజిల్‌తో సహా మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంచారు. పెట్రోల్ వేరియంట్లో లభ్యమయ్యే 630ఐ ఎమ్ స్పోర్ట్‌లో 2.0 లీటర్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 258 హెచ్‌పీ సామర్థ్యాన్ని ఉత్పత్తి చేస్తుంది. 6.5 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. దీని ధర రూ.67.9 లక్షలుగా ఉంది. డీజిల్ వేరియంట్లలో లభించే 620డీ కారులో 2.0 లీటర్ ఇంజిన్ ఉంది. ఇది 190 హెచ్‌పీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. 7.9 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. దీని ధరను రూ.68.9 లక్షలుగా నిర్ణయించారు. అదేవిధంగా 630డీ కారులో అమర్చిన 3 లీటర్ల ఇంజిన్ 190 హెచ్‌పీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది కూడా కేవలం 6.5 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఈ వేరియంట్ ధర రూ.77.9 లక్షలుగా ఉంది. ఉన్నత స్థాయి వర్గాలను దృష్టిలో పెట్టుకొని 6 సిరీస్ సెడాన్‌లో కొత్త వెర్షన్ విడుదల చేసినట్లు కంపెనీ ఎండీ విక్రమ్ పావా తెలిపారు. -
మార్కెట్లోకి ‘బీఎండబ్ల్యూ కొత్త 3 సిరీస్ సెడాన్’
గురుగ్రామ్: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘బీఎండబ్ల్యూ’ తాజాగా తన ‘3 సిరీస్ సెడాన్’లో సరికొత్త వేరియంట్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఎయిట్ స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, 2–లీటర్ల ఇంజిన్ కలిగిన ఈ నూతన మోడల్ మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. రెండు డీజిల్ ఇంజిన్ కార్లు విడుదల కాగా, వీటి ధరల శ్రేణి రూ. 41.4లక్షలు – రూ.46.9 లక్షలుగా కంపెనీ ప్రకటించింది. డీజిల్ ఇంజిన్ కారు ప్రారంభ ధర రూ.47.9 లక్షలుగా నిర్ణయించామని, నూతన మోడల్.. మునుపటి సిరీస్‌ల కంటే 55 కేజీల బరువు తక్కువగా ఉందని వివరించింది. కారు ఫీచర్ల విషయానికి వస్తే.. వైర్లెస్ చార్జింగ్, ఆపిల్ కార్ప్లే ఇన్ఫోటైన్మెంట్, 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్, భద్రత కోసం 6 ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. -
టాటా కొత్త కారు జెస్ట్
ముంబై: టాటా మోటార్స్ కంపెనీ కాంపాక్ట్ సెడాన్, జెస్ట్‌ను మంగళవారం మార్కెట్లోకి విడుదల చేసింది. పెట్రోల్ వేరియంట్ ధరలు రూ.4.64 లక్షలు, డీజిల్ వేరియంట్ ధరలు రూ.5.64 లక్షల(అన్ని ధరలు ఎక్స్‌షోరూమ్, ఢిల్లీ) నుంచి ప్రారంభమవుతాయని టాటా మోటార్స్ ప్రెసిడెంట్(ప్యాసింజర్ వెహికల్స్ బిజినెస్ యూనిట్) రంజిత్ యాదవ్ చెప్పారు. ఈ సెగ్మెంట్లో లభించే అతి చౌకైన డీజిల్ కారు ఇదేనని పరిశ్రమ వర్గాలంటున్నాయి. కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్ కార్లలో లోని 29 ప్రత్యేకమైన ఫీచర్లను తొలిసారిగా ఈ జెస్ట్ కారులోనే అందిస్తున్నామని రంజిత్ పేర్కొన్నారు. ఈ కారు మారుతీ డిజైర్, హోండా అమేజ్, హ్యుందాయ్ ఎక్సెంట్‌లతో పాటు టాటా మోటార్స్‌కే చెందిన ఇండిగో సీఎస్ కార్లకు గట్టిపోటీనిస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. నాలుగేళ్ల తర్వాత కంపెనీ అందిస్తోన్న కొత్త మోడల్ ఇది. నానో తర్వాత మార్కెట్లోకి వస్తోన్న టాటా మోటార్స్ చెప్పుకోదగ్గ కారు ఇది. దేశీయ మార్కెట్లో పూర్వవైభవం సాధించడం లక్ష్యంగా ఈ కారును కంపెనీ మార్కెట్లోకి తెస్తోంది. ఈ కారు ప్రత్యేకతలు.., భారత దేశపు తొలి టర్బో చార్జ్డ్ మల్టీ-పాయింట్ ఫ్యూయల్ ఇంజెక్షన్(ఎంపీఎఫ్ఐ) పెట్రోల్ ఇంజిన్, 5-స్పీడ్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్సిమిషన్(ఏఎంటీ-గేర్లను మామూలుగా చేతితోనూ, ఆటోమాటిక్‌గానూ మార్చవచ్చు), ప్రయాణికుల ఎత్తుకు తగ్గట్లుగా అడ్జెస్ట చేసుకునే సీట్లు, పూర్తిగా ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఫీచర్, హార్మన్ సంస్థ డిజైన్ చేసిన 5 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. 8 -స్పీకర్ల మ్యూజిక్ సిస్టమ్, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, ఎలక్ట్రానిక్ పవర్ అసిస్టెడ్ స్టీరింగ్ వీల్, గరిష్ట వేగం 154 కిమీ. (గంటకు) వంటి ప్రత్యేకతలున్నాయి. నెక్స్ట్ జనరేషన్ నావిగేషన్, ప్రదేశం ఆధారిత సర్వీసులను మ్యాప్‌మై ఇండియా డిజైన్ చేసింది. ఆరు రంగుల్లో, తొమ్మిది వేరియంట్లలో ఈ కారు లభిస్తుంది. ఆటోమోటివ్ రీసెర్చ్ ఆసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఏఆర్ఏఐ) ధ్రువీకరణ ప్రకారం ఈ కారు పెట్రోల్ వేరియంట్ 17.6 కిమీ, డీజిల్ వేరియంట్ 23 కిమీ. మైలేజీని ఇస్తుందని టాటా మోటార్స్ డిజైన్ హెడ్ ప్రతాప్ బోస్ తెలిపారు. ఆఫర్లు ఈ కారుతో పలు ఆఫర్లనందిస్తున్నామని రంజిత్ యాదవ్ వివరించారు. మూడేళ్లు లేదా లక్ష కిమీ. వారంటీని, మూడేళ్లు, లేదా 45 వేల కిమీ. వార్షిక మెయింటనెన్స్ కాంట్రాక్ట్(ఏఎంసీ)ను , మూడేళ్ల పాటు 24 గంటల పాటూ రోడ్ సైడ్ అసిస్టెన్స్ సర్వీస్ తదితర ఆఫర్లనిస్తున్నామని రంజిత్ యాదవ్ పేర్కొన్నారు. జెస్ట్ తర్వాత బోల్ట్ ఈ కారు తర్వాత బోల్డ్ మోడల్‌ను టాటా మోటార్స్ రంగంలోకి తేనున్నది. జెస్ట్, బోల్ట్‌లు-టాటా మోటార్స్ భవిష్యత్తును ఈ రెండు కార్లు నిర్ణయిస్తాయని నిపుణులంటున్నారు. ఈ సెగ్మెంట్ కార్లలో మారుతీ డిజైర్ బాగా అమ్ముడవుతోంది. ఈ కార్ల సెగ్మెంట్‌ను టాటా మోటార్స్ కంపెనీయే తన ఇండిగో సీఎస్‌తో ప్రారంభించింది.