టాటా కొత్త కారు జెస్ట్ | Zest from Tata Motors launched at Rs 4.64 lakh | Sakshi
Sakshi News home page

టాటా కొత్త కారు జెస్ట్

Published Wed, Aug 13 2014 12:00 AM | Last Updated on Sat, Sep 2 2017 11:47 AM

టాటా కొత్త కారు జెస్ట్

టాటా కొత్త కారు జెస్ట్

 ముంబై: టాటా మోటార్స్ కంపెనీ కాంపాక్ట్ సెడాన్, జెస్ట్‌ను మంగళవారం మార్కెట్లోకి విడుదల చేసింది. పెట్రోల్ వేరియంట్ ధరలు రూ.4.64 లక్షలు, డీజిల్ వేరియంట్ ధరలు రూ.5.64 లక్షల(అన్ని ధరలు ఎక్స్‌షోరూమ్, ఢిల్లీ) నుంచి ప్రారంభమవుతాయని టాటా మోటార్స్ ప్రెసిడెంట్(ప్యాసింజర్ వెహికల్స్ బిజినెస్ యూనిట్) రంజిత్ యాదవ్ చెప్పారు. ఈ సెగ్మెంట్లో లభించే అతి చౌకైన డీజిల్ కారు ఇదేనని పరిశ్రమ వర్గాలంటున్నాయి.

 కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్ కార్లలో లోని 29 ప్రత్యేకమైన ఫీచర్లను తొలిసారిగా ఈ జెస్ట్ కారులోనే అందిస్తున్నామని రంజిత్ పేర్కొన్నారు. ఈ కారు మారుతీ డిజైర్, హోండా అమేజ్, హ్యుందాయ్ ఎక్సెంట్‌లతో పాటు టాటా మోటార్స్‌కే చెందిన ఇండిగో సీఎస్ కార్లకు గట్టిపోటీనిస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. నాలుగేళ్ల తర్వాత కంపెనీ అందిస్తోన్న  కొత్త మోడల్ ఇది. నానో తర్వాత మార్కెట్లోకి వస్తోన్న టాటా మోటార్స్ చెప్పుకోదగ్గ కారు ఇది. దేశీయ మార్కెట్లో పూర్వవైభవం సాధించడం లక్ష్యంగా ఈ కారును కంపెనీ మార్కెట్లోకి తెస్తోంది.

 ఈ కారు ప్రత్యేకతలు..,
 భారత దేశపు తొలి టర్బో చార్జ్‌డ్ మల్టీ-పాయింట్ ఫ్యూయల్ ఇంజెక్షన్(ఎంపీఎఫ్‌ఐ) పెట్రోల్ ఇంజిన్, 5-స్పీడ్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్సిమిషన్(ఏఎంటీ-గేర్లను మామూలుగా చేతితోనూ, ఆటోమాటిక్‌గానూ మార్చవచ్చు), ప్రయాణికుల ఎత్తుకు తగ్గట్లుగా అడ్జెస్ట చేసుకునే సీట్లు,  పూర్తిగా ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఫీచర్,   హార్మన్ సంస్థ డిజైన్ చేసిన 5 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్.

8 -స్పీకర్ల మ్యూజిక్ సిస్టమ్,  ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్, ఎలక్ట్రానిక్ పవర్ అసిస్టెడ్ స్టీరింగ్ వీల్, గరిష్ట వేగం 154 కిమీ. (గంటకు) వంటి ప్రత్యేకతలున్నాయి. నెక్స్‌ట్ జనరేషన్ నావిగేషన్, ప్రదేశం ఆధారిత సర్వీసులను మ్యాప్‌మై ఇండియా డిజైన్ చేసింది.  ఆరు రంగుల్లో, తొమ్మిది వేరియంట్లలో  ఈ కారు లభిస్తుంది. ఆటోమోటివ్ రీసెర్చ్ ఆసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఏఆర్‌ఏఐ) ధ్రువీకరణ ప్రకారం ఈ కారు పెట్రోల్ వేరియంట్ 17.6 కిమీ, డీజిల్ వేరియంట్ 23 కిమీ. మైలేజీని ఇస్తుందని టాటా మోటార్స్ డిజైన్ హెడ్ ప్రతాప్ బోస్ తెలిపారు.

 ఆఫర్లు
 ఈ కారుతో పలు ఆఫర్లనందిస్తున్నామని రంజిత్ యాదవ్ వివరించారు. మూడేళ్లు లేదా లక్ష కిమీ. వారంటీని, మూడేళ్లు, లేదా 45 వేల కిమీ. వార్షిక మెయింటనెన్స్ కాంట్రాక్ట్(ఏఎంసీ)ను , మూడేళ్ల పాటు 24 గంటల పాటూ రోడ్ సైడ్ అసిస్టెన్స్ సర్వీస్ తదితర ఆఫర్లనిస్తున్నామని రంజిత్ యాదవ్ పేర్కొన్నారు.

 జెస్ట్ తర్వాత బోల్ట్
 ఈ కారు తర్వాత బోల్డ్ మోడల్‌ను టాటా మోటార్స్ రంగంలోకి తేనున్నది. జెస్ట్, బోల్ట్‌లు-టాటా మోటార్స్ భవిష్యత్తును ఈ  రెండు కార్లు నిర్ణయిస్తాయని నిపుణులంటున్నారు.  ఈ సెగ్మెంట్ కార్లలో మారుతీ డిజైర్ బాగా అమ్ముడవుతోంది. ఈ  కార్ల సెగ్మెంట్‌ను టాటా మోటార్స్ కంపెనీయే తన ఇండిగో సీఎస్‌తో ప్రారంభించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement