Seemandhra MPs Protest
-
సభలోకి వచ్చేందుకు సస్పెండైన ఎంపీల యత్నం
న్యూఢిల్లీ: లోక్‌సభ నుంచి సస్పెండైన ఎంపీలు సభలోకి వచ్చేందుకు ప్రయత్నించడంతో ప్రవేశ ద్వారం వద్ద కలకలం రేగింది. వీరిని మార్షల్స్ అడ్డుకోవడంతో ఉద్రికత్త పరిస్థితి నెలకొంది. తెలంగాణ బిల్లుపై ఓటింగ్ జరుగుతుందన్న సమాచారంతో సభలోకి అడుగు పెట్టేందుకు ప్రయత్నించారు. లోపలకు వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించిన ఎంపీలను మార్షల్స్ అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎంపీలు నినాదాలు చేశారు. మరోవైపు స్పీకర్ ఆదేశాలతో గ్యాలరీ, ద్వారాలను మూసివేశారు. లోక్ సభ టీవీ ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు లోక్‌సభలో ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ తీవ్రస్థాయిలో సభలో ఆందోళనకు దిగడంతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 16 మంది ఎంపీలను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. -
టి.బిల్లుపై చర్చను ప్రారంభించిన షిండే
న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లుపై లోక్‌సభలో చర్చను కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రారంభించారు. సీమాంధ్ర సభ్యుల నిరసనల మధ్య 45 సెకన్లపాటు షిండే మాట్లాడారు. తెలంగాణ ఉద్యమానికి సుదీర్ఘ చరిత్ర ఉందన్నారు. 1960 దశకంలో రెండు ప్రాంతాల్లోనూ ఉద్ధృతంగా ఉద్యమాలు జరిగాయన్నారు. చర్చలు, సంప్రదింపులతో తాత్కాలికంగా సమస్యలను పరిష్కరించుకున్నారని గుర్తు చేశారు. గడచిన కొన్నేళ్లుగా సామాజిక, ఆర్థిక, రాజకీయ ఆకాంక్షల కోసం ప్రజలు ఉద్యమించారని తెలిపారు. పునర్విభజన ద్వారా తెలంగాణ ప్రజల ఆకాంక్షను ఈ బిల్లు తీరుస్తుందని షిండే చెప్పారు. సీమాంధ్ర సభ్యుల ఆందోళన కొనసాగడంతో లోక్‌సభను స్పీకర్ 3 గంటల వరకు వాయిదా వేశారు. -
చర్చ.. సాయంత్రమా, మధ్యాహ్నమా?
న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లుపై ఈరోజు లోక్‌సభలో చర్చ ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. దీనిలో భాగంగా జీవోఎం సభ్యులు ఈ సాయంత్రం 4 గంటలకు ప్రధానితో సమావేశం కానున్నారు. ప్రధానితో భేటీ తర్వాతే లోక్‌సభలో తెలంగాణ బిల్లుపై చర్చ ప్రారంభించాలని కేంద్రం భావిస్తోంది. మరోవైపు మధ్యాహ్నం 2:30 గంటలకు విభజన బిల్లుపై లోక్‌సభలో చర్చ ప్రారంభమైయ్యే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బిల్లుపై చర్చ ఎప్పుడు ప్రారంభమవుతుందన్న సందిగ్దం నెలకొంది. బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అనూహ్యంగా వ్యవహరించిన కాంగ్రెస్... బిల్లుపై చర్చ విషయంలోనూ అదే తీరుగా ముందుకెళుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పార్లమెంట్లో సీమాంధ్ర సభ్యుల నిరసన కొనసాగుతోంది. ఈ ఉదయం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన వెంటనే ఉభయ సభలు మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడ్దాయి. సమైక్య నినాదాలతో ఉభయ సభలు దద్దరిల్లాయి. సీమాంధ్ర కేంద్ర మంత్రులు లోక్‌సభ వెల్‌లోకి వచ్చి నిరసన తెలిపారు. రాజ్యసభలోనూ సమైక్య నిరసనలు హోరెత్తాయి.