చర్చ.. సాయంత్రమా, మధ్యాహ్నమా?
న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లుపై ఈరోజు లోక్సభలో చర్చ ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. దీనిలో భాగంగా జీవోఎం సభ్యులు ఈ సాయంత్రం 4 గంటలకు ప్రధానితో సమావేశం కానున్నారు. ప్రధానితో భేటీ తర్వాతే లోక్సభలో తెలంగాణ బిల్లుపై చర్చ ప్రారంభించాలని కేంద్రం భావిస్తోంది.
మరోవైపు మధ్యాహ్నం 2:30 గంటలకు విభజన బిల్లుపై లోక్‌సభలో చర్చ ప్రారంభమైయ్యే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బిల్లుపై చర్చ ఎప్పుడు ప్రారంభమవుతుందన్న సందిగ్దం నెలకొంది. బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అనూహ్యంగా వ్యవహరించిన కాంగ్రెస్... బిల్లుపై చర్చ విషయంలోనూ అదే తీరుగా ముందుకెళుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు పార్లమెంట్లో సీమాంధ్ర సభ్యుల నిరసన కొనసాగుతోంది. ఈ ఉదయం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన వెంటనే ఉభయ సభలు మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడ్దాయి. సమైక్య నినాదాలతో ఉభయ సభలు దద్దరిల్లాయి. సీమాంధ్ర కేంద్ర మంత్రులు లోక్సభ వెల్లోకి వచ్చి నిరసన తెలిపారు. రాజ్యసభలోనూ సమైక్య నిరసనలు హోరెత్తాయి.