కల్యాణ ‘లక్షి’ ఏదీ?
డిప్యూటీ స్పీకర్ ఆగ్రహించినా.. సామాన్యుడి ఆవేదన చెందినా అధికారులు మాత్రం ఏమాత్రం లెక్కచేయడం లేదు. అందువల్లే సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కల్యా ణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలు జిల్లా దయనీయంగా ఉంది. పథకం ప్రారంభించి మూడు నెలలైనా జిల్లాలో ఏ ఒక్కరూ లబ్ధిపొందలేకపోయారంటే మన అధికారుల తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
* జిల్లాలో అమలుకాని పథకం
* అయోమయంలో దరఖాస్తుదారులు
* డిప్యూటీ స్పీకర్ ఆగ్రహించినా స్పందించని అధికారులు
‘నలుగురు నిరుపేద ముస్లింల దరఖాస్తులను నేనే స్వయంగా నింపాను..పెళ్లికి నెల రోజుల ముందే వాళ్లు దరఖాస్తు చేసుకున్నారు. పెళ్లి రోజు నాటికి పథకం డబ్బు అందేలా చూడాలని జేఏసీ మూర్తికి నేను ఫోన్ చేసి మరీ చెప్పాను. పెళ్లి అయిపోయింది కానీ పథకం సర్కార్ సాయం మాత్రం అందలేదు. తీరా నేను వచ్చి చూస్తే దరఖాస్తుల వివరాలను కూడా రికార్డుల్లో పొందుపరచలేదు. మీరు (అధికారులు) అనుసరిస్తున్న తీరు ఆందోళనకరం’
-నవంబర్ 15న సంక్షేమ పథకాల సమీక్షలో
అధికారులపై డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ఆగ్రహం
‘‘సర్కార్ పైసలిస్తుందన్న ధీమాతో అప్పుజేసి పిల్ల పెండ్లి జేసిన. రోజులు గడుస్తుండటంతో అప్పులొళ్లు రోజూ ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. నేనుకూడా తహశీల్దార్ కార్యాలయం చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నా, నా ఇంటి లక్ష్మి వెళ్లిపోయింది. సర్కారు పెట్టిన కల్యాణ లక్ష్మి వెక్కిరిస్తోంది’’
‘కల్యాణ లక్ష్మి’కి దరఖాస్తు చేసుకున్న దుబ్బాక మండలం చెల్లాపూర్‌కు చెందిన
పరశురాములు ఆవేదన ఇది
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: తెలంగాణ సర్కార్ కల్యాణ ‘లక్ష్మి’ పథకం ప్రారంభించి మూడు మాసాలు కావొస్తున్నా ఇంకా బాలారిష్టాలు మాత్రం దాటలేదు. ఎస్సీ, ఎస్టీ, యువతులకు వివాహాలకు ఆర్థిక తోడ్పాటుకు ‘కల్యాణ లక్ష్మి’, మైనార్టీ యువతుల కోసం షాదీ కోసం ‘షాదీముబారక్’ పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. రూ. 10 కోట్లు బడ్జెట్లో ప్రవేశపెట్టి, అక్టోబర్ 21న ఉత్తర్వులు జారీ చేసినా.. జిల్లాలో ఇప్పటి వరకు ఏ ఒక్కరికి కూడా పథకం అందలేదు. డబ్బులొస్తాయన్న నమ్మకంతోనే కానుకలు ఇచ్చేందుకు తల్లిదండ్రులు ఒప్పుకోవడం... ఇంతవరకూ సర్కార్ సాయం అందకపోవడంతో బంగారు తల్లులకు మెట్టినింట్లో తిప్పలు తప్పడం లేదు.
దీంతో ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా, అధికారులు నుంచి ‘రేపు రాపో... మాపు రాపో’ అన్న సమాధానం తప్ప మరొక్కటి రావటం లేదని వినోద ఆవేదన వ్యక్తం చేశారు. షాదీముబారక్ పథకం కింద 117 మంది, కల్యాణ లక్ష్మి పథకం కింద 11 మంది గిరిజన మహిళలు, 25 దళిత యువతులు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో దాదాపు 90 శాతంపెళ్లిళ్లు కూడా జరిగిపోయాయి. కానీ పథకం కింద అందాల్సిన సొమ్ములు మాత్రం ఇంతవరకు అందలేదు. జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా ఇటీవల విలేకరులతో మాట్లాడుతూ, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పారు. కానీ ఆచరణలో అది సాధ్యం కావడం లేదు.
వరం ఊరిస్తోంది...
నిజానికి పేద కుటుంబాలకు రూ.51 వేల ఆర్థిక సహాయం అనేది పెద్ద వరం. వధువు తల్లిదండ్రులు ఇప్పుడు పెళ్లి పనుల్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు దరఖాస్తు చేసుకోవడం కూడా ఓ ముఖ్య తంతుగా పెట్టుకున్నారు. ప్రభుత్వం కోరినట్టు నెల రోజుల ముందుగానే అన్ని ఆధారాలతో, అధికారులు కోరిన సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసుకుంటున్నారు. కానీ పెళ్లి ముగిసిపోయి నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు పథకం మాత్రం అందకపోవడం గమనార్హం.
ఇటీవలే కూతురు పెళ్లి చేసిన జహీరాబాద్ మండలం గౌసాబాద్ తండాకు చెందిన జాబిబాయి, తిస్రాం పవార్ల దంపతులను పలకరిస్తే...‘పథకం ఉంటదని టీవీ చేప్తే బిడ్డ పెళ్లి పెట్టుకున్న. రూ.51 వేలు సిన్న మాట కాదు. 2014 డిసెంబర్ 3న లగ్గం పెట్టుకున్నాం. నా బిడ్డపేరు అంజన. అల్లుని పేరు మిథున్ రాథోడ్. ఆయనది బీదర్ దగ్గర చించోళి తాలూకా సూర్యానాయక్ తాండ. పెండ్లికి నెల ముందే దరఖాస్తు చేసినం...పెండ్లి అయిపోయి నెల దాటుతోంది. డబ్బులు మాత్రం రాలేదు. రూ.2 లక్షలకు పైగా అప్పుజేసిన. నా బిడ్డ పెండ్లికి నేను అప్పు చేసుకున్న కానీ ప్రభుత్వం చెప్పినట్టు రూ. 51 వేలు ఇస్తే వేడి నీళ్లకు చన్నీళ్లు తోడు అయినట్టు ఉండేది’. అని చెప్పారు.
మంజూరితోనే సరి....
కొల్చారం మండలం వరిగుంతం గ్రామంలో రెండు గిరిజన కుటుంబాలు కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకున్నాయి. సీతారాం తండాకు చెందిన ధర్మవ్వ తన కూతురు రమావత్ మీన వివాహం గత డిసెంబర్ 18న చేసింది. నవంబర్ నెలలో కల్యాణలక్ష్మి కోసం దరఖాస్తు చేసుకున్నారు. డిసెంబర్ 31న పథకం మంజూరు పత్రం ఇచ్చారు. డబ్బులు బ్యాంక్ అకౌంట్లో వేస్తామని అధికారులు చెప్పారట. ఎకౌంట్ తీసి 20 రోజులు దాటినా ఇప్పటి వరకు డబ్బులు మాత్రం జమ కాలేదంటోంది ధర్మవ్వ.
ఇదే గ్రామ పంచాయతీ పరిధిలోని చందర్‌తండాలో నాన్గోత్ బద్య, మంగమ్మకు ఇద్దరు కూతుళ్లు. అందులో మొదటి కూతురు మంజూలకు డిసెంబర్ 12న పెళ్లి చేశారు. నానా తంటాలు పడి తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగి వివాహానికి 15 రోజుల ముందే పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. డిసెంబర్ 31న పథకం మంజూరు పత్రాలను అందజేసిన అధికారులు డబ్బు మాత్రం ఇప్పటి వరకు ఇవ్వలేదు.
ఇంటి లక్ష్మి వెళ్లిపోయింది..
దుబ్బాక మండలం చెల్లాపూర్ గ్రామానికి చెందిన వనమ కనకవ్వ, పరుశురాములు ఏకైక కూతురు చంద్రకళ. చంద్రకళను చిన్నకోడూరు మండలం పెద్ద కోడూరు గ్రామానికి చెందిన సుల్తాన్ మల్లయ్య కుమారుడు కనకరాజుకిచ్చి డిసెంబర్ 17న వివాహం జరిపించారు. నవంబర్ మాసంలోనే పరుశురాములు తహశీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. పథకం మీద నమ్మకంతో అయినోళ్ల దగ్గర డబ్బు చేబదులు తీసుకొచ్చి పెళ్లి తంతు ముగించారు. కానీ ఇంతవరకూ పరుశురాములు సర్కార్ సాయం అందలేదు.
గజ్వేల్‌లోనూ గదే తీరు
గజ్వేల్...సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం. అందుకే ఇప్పుడు ఉన్నత, అత్యున్నత స్థాయి అధికార గణం అంతా గజ్వేల్ నియోజకవర్గంలోనే చెక్కర్లు కొడుతోంది. కనీసం ఇక్కడైనా పథకం అమలు తీరు అద్భుతంగా ఉంటుందేమోనని పరిశీలిస్తే... అక్కడ కూడా ఇదే పరిస్థితి.
నియోజకవర్గంలోని గజ్వేల్ మండలంలో కల్యాణ లక్ష్మి పథకానికి 2, షాదీ ముబారక్ పథకానికి మరో రెండు, తూప్రాన్‌లోనూ రెండు పథకాలకు రెండు మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. ములుగులో రెండు పథకాలకు కలుపుకొని 11, వర్గల్లో రెండు, జగదేవ్‌పూర్ మండలంలో మూడు దరఖాస్తులు మాత్రమే అందాయి.
జగదేవ్‌పూర్ మండలంలోని మునిగడప గ్రామంలో కల్యాణ లక్ష్మి పథకం అమలు తీరుపై పరిశీలన జరపగా ఆన్లైన్లో దరఖాస్తు చేయాలనే నిబంధన ఎన్నో ఇబ్బందులు పడ్డామని గ్రామానికి చెందిన బొమ్మల లింగయ్య తెలిపారు. సంక్రాంతి తర్వాత పెళ్లి చేయాలనుకుంటున్నా...ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయి అనేది అధికారులు చెప్పలేదని లింగయ్య వాపోయాడు.
చేబర్తి గ్రామానికి తెడ్డు కిష్టయ్య,కిష్టమ్మ దంపతులు కూతురు అరుణ పెండ్లి కోసం కల్యాణ లక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. డిసెంబర్ 12న ఆరుణ పెళ్లి చేసినా, ఇంత వరకు డబ్బులు రాలేదని చెప్పారు. ‘‘అప్పులు జేసి పెండ్లి జేసినం.. సర్కార్ సాయం అందుతదనుకుంటే ఇంకా అందకపాయే’’ అంటూ లింగయ్య అందోళన చెందారు.