షీనా తండ్రిని నేనే.. కాని ఇంద్రాణిని పెళ్లాడలేదు
ముంబయి/కోల్కతా: దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో బయటకు వస్తున్న ఒక్కో అంశం ఒక్కో సంచలనంగా మారుతోంది. తొలిసారి షీనా బోరా అసలు తండ్రి సిద్ధార్థ్ దాస్ బయటకు వచ్చి పలు వివరణలు కోల్ కతాలో మీడియాకు వివరణ ఇచ్చారు. షీనాకు తండ్రి తానేనని ఒప్పుకున్న ఆయన ఈ కేసులో అసలు ముద్దాయి ఇంద్రాణి ముఖర్జియాను వివాహం మాత్రం చేసుకోలేదని చెప్పారు. కన్నకూతురు హత్యకు పాల్పడిన ఆమెను నిలువునా ఉరి తీయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంద్రాణి పూర్తిగా డబ్బు మనిషి అని, ఆమెతో తాను సహజీవనం మాత్రమే చేశాను తప్ప వివాహం చేసుకోలేదని వివరణ ఇచ్చారు. 1989లోనే ఇంద్రాణి తనను వదిలేసి వెళ్లిపోయిందని, అప్పటి నుంచి ఆమెతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని చెప్పారు. బహుశా నాకు అప్పుడు ఉద్యోగం కూడా లేనందున నా స్థితి ఆమెకు నచ్చక వెళ్లిపోయి ఉండొచ్చని అన్నారు. షీనా డీఎన్ఏ పరీక్ష కోసం తన డీఎన్ఏ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నానని సిద్ధార్థ దాస్ తెలిపారు.