‘ఉపాధి, పీడీఎస్ సమాచారం అందుబాటులో..’
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు, ప్రజాపంపిణీ వ్యవస్థ(పీడీఎస్)లకు సంబంధించిన సమస్త సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని కేంద్రప్రభుత్వం రాష్ట్రాలను ఆదేశించింది. అలాగే, బ్లాక్, పంచాయతీల్లోని విభాగాల స్థాయిల్లో జరిగిన పనుల వివరాలను సమాచార హక్కు చట్టానికి(ఆర్టీఐ) అనుగుణంగా తమంత తాముగానే(సుమోటో) వెల్లడించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించింది.
ఎవరూ అడగకుండానే సమాచారాన్ని అందుబాటులో ఉంచడం వల్ల అధికారుల్లో పారదర్శకత పెరుగుతుందని, వ్యక్తిగత ఆర్టీఐ దరఖాస్తుల సంఖ్య కూడా తగ్గుతుందని పేర్కొంది. ఈ మేరకు ఆర్టీఐ చట్టం అమలును పర్యవేక్షించే డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ కార్యదర్శి ఎస్కే సర్కార్ గురువారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు పంపించారు.