అమెరికా గజగజ
న్యూయార్క్: ఎనిమిది అంగుళాల మందంలో పేరుకుపోయిన మంచు.. ఆపై గంటలకు 56 కి.మీ. వేగంతో చలిగాలులు... రక్తం గడ్డ కట్టేంతగా చలిపులి (మైనస్ డిగ్రీల్లో ఉష్ణోగ్రత)... ఇప్పుడు అమెరికా ఉత్తర ప్రాంతాన్ని గజగజలాడిస్తున్నాయి. గురువారం మధ్యాహ్నం నుంచి పలు రాష్ట్రాల్లో, పెద్ద నగరాల్లో ప్రజలు ఈ విపత్కర వాతావరణం వలలో చిక్కుకొని వణికిపోతున్నారు. చికాగో నుంచి న్యూయార్క్ వరకు, అమెరికా రాజధాని వాషింగ్టన్లో కూడా మంచు దుప్పటి కప్పేసింది. దీంతో జాతీయ వాతావరణ శాఖ (ఎన్‌డబ్ల్యూఎస్) శీతాకాల తుపాను హెచ్చరికలు జారీ చేసింది. విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. చికాగో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అన్ని విమాన సర్వీసులు నిలిచిపోయాయి. దాదాపు 2,200 దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి.
అమెరికా పశ్చిమ ప్రాంతాన్ని కూడా ఈ చలిపులి వదల్లేదు. గురువారం సాయంత్రం అమెరికా ప్రధాన నగరం న్యూయార్క్‌లో కనిష్ణ ఉష్ణోగ్రత మైనస్ 13 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి విధిస్తూ న్యూయార్క్ గవర్నర్ అండ్రూ కౌమో ఆదేశాలిచ్చారు. ఇక బుధవారమే న్యూయార్క్ కొత్త మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన బిల్ డే బ్లాసియోకు చలిపులి రూపంలో తొలి పరీక్ష ఎదురైంది. పక్కనున్న న్యూజెర్సీ గవర్నర్ కూడా రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి ప్రకటించా రు. బ్రిటన్‌లోనూ మంచు తుపాను విరుచుకుపడింది. వేల్స్, ఉత్తర ఐర్లాండ్, నైరుతి ఇంగ్లాండ్‌లో భారీగా మంచు పేరుకుపోయింది.