south zone DCP satyanarayana
-
గ్యాంగ్‌స్టర్ అయూబ్ పై 72 కేసులు
హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ అయూబ్ ఖాన్‌ను పోలీసులు మంగళవారం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. గత కొన్నేళ్లుగా ముంబైలో తలదాచుకుంటున్న అతడిని, హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. బలవంతపు వసూళ్లు, పలు హత్యల్లో అయుబ్పై కేసులు ఉన్నాయి. ఈ సందర్భంగా సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ మాట్లాడుతూ అయూబ్‌పై 22 భూ ఆక్రమణ, ఎనిమిది హత్యలతో పాటు మొత్తం 72 కేసుల్లో నిందితుడని తెలిపారు. ముంబైలో నిన్న అరెస్టు చేసి హైదరాబాద్‌కు తీసుకొచ్చిన అతడిని పురానా హవేలీలోని తన కార్యాలయంలో మీడియా ఎదుట హాజరుపరిచారు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిన అతడిపై పలు హత్యాయత్నం కేసులతో పాటు, బెదిరించి డబ్బులు గుంజుకోవడం వంటి కేసులు కూడా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. నకిలీ పాస్‌పోర్టు ఆధారంగా ముంబై ఇమ్మిగ్రేషన్ అధికారులు అయూబ్‌ను గుర్తించి హైదరాబాద్ పోలీసులకు సమాచారం అందించారన్నారు. గతంలోనూ ఇతడిపై ఓ నకిలీ పాస్‌పోర్టు కేసు నమోదు అయినట్లు డీసీపీ చెప్పారు. అయుబ్ గ్యాంగ్‌లోని మిగతా వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తామన్నారు. -
పాతబస్తీలో కార్డన్ సెర్చ్.. ఆయుధాలు స్వాధీనం
హైదరాబాద్: పాతబస్తీ ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణారెడ్డినగర్, మొఘల్‌పురా పోలీస్‌స్టేషన్ పరిధిలోని సుల్తాన్షాహి ప్రాంతాల్లో సౌత్‌జోన్ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు శనివారం తెల్లవారు జామున కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని సుమారు 220 ద్విచక్ర వాహనాలు, రెండు ఆయుధాలను వారి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 60 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 10 మందిపై నాన్‌బెయిలబుల్ వారంట్లు జారీ కాగా తప్పించుకు తిరుగుతున్నారు. నకిలీ స్టాంప్ వెండర్లు కూడా పట్టుబడ్డారు. గుడుంబా తయారుచేస్తున్న గ్యాంగ్, తెల్లవారుజాము వరకు హుక్కా సెంటర్లు నడుపుతున్న కొందరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు డీసీపీ సత్యనారాయణ వెల్లడించారు. సౌత్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో సుమారు 500 మంది పోలీసులు ఉదయం 5 గంటల నుంచి కార్డన్ సెర్చ్ కొనసాగిస్తున్నారు.