soya bean
-
సోయా...ఇదేం ధరయ్యా?
సాక్షి, హైదరాబాద్: సోయా రైతులను దళారులు దగా చే స్తున్నారు. వానాకాలం సీజన్లో సాగు చేసిన సోయాబీన్ పంటకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాల్‌కు రూ.4,892 కాగా, వ్యాపారులు మాత్రం రూ.3,9 80 నుంచి గరిష్టంగా రూ. 4,100 వరకు మాత్రమే కొంటున్నారు. దీంతో రైతులు భారీగా నష్టపోతున్నారు. కొన్నిచోట్ల గత్యంతరం లేక తక్కువ ధరకే అమ్ముకుంటున్నారు. ఉత్పత్తిలో నాలుగో వంతే కొనుగోలు తెలంగాణలో సోయాబీన్ కీలకమైన పంట. వరి, పత్తి, మొక్కజొన్న, కంది తర్వాత అత్యధికంగా సాగయ్యేది సోయాబీనే. ఈ ఏడాది వానాకాలం సీజన్లో 4 లక్షల ఎకరాల్లో సోయాబీన్ సాగు చేశారు. అత్యధికంగా ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్, ప్రస్తుత సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో సోయాబీన్ సాగైంది. ఈ ఏడాది 2.60 లక్షల మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తులు వస్తాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. అయితే కేంద్ర ప్రభు త్వం మాత్రం 56,550 మెట్రిక్ టన్నులు మాత్రమే కొను గోలుకు అంగీకరించింది. ఆ నిర్ణీత పరిమాణంలో మాత్ర మే కొనుగోలు చేస్తామని మార్క్‌ఫెడ్ అధికారులు అంటున్నారు. అంటే మొత్తం ఉత్పత్తిలో కేవలం నాలుగోవంతే కొనుగోలు చేయడం వల్ల, మిగిలిన పంటను తిరిగి వ్యా పారులకే తెగనమ్ముకోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన పంటను కూడా కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. కాగా, మిగిలిన పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసేలా తాము ప్రతిపాదనలు పంపిస్తామని మార్క్‌ఫెడ్ వర్గాలు వెల్లడించాయి. 13 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తుండటంతో మార్క్‌ఫెడ్ రంగంలోకి దిగింది. నిజామాబాద్, కామారె డ్డి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, సంగారెడ్డి జిల్లాలో 37 సోయాబీన్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మార్క్‌ఫెడ్ నిర్ణయించింది. ప్రస్తుతం ఆయా జిల్లాల్లో 13 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించింది. అవసరాన్ని బట్టి మిగిలిన కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. రైతులకు మద్దతు ధర ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని మార్క్‌ఫెడ్ ఎండీ శ్రీనివాస్‌రెడ్డి, సేకరణ విభాగం ఇన్చార్జ్ చంద్రశేఖర్ తెలిపారు. -
ఈ కొత్తరకం స్నాక్స్ వంటకాలు.. ట్రై చేయండిలా..!
ఈ కొత్తరకం స్నాక్స్ వంటకాలను గురించి మీరెప్పుడైనా విన్నారా! ఆమ్లెట్ వేయడంలో కొత్తదనం.., బాదం క్రిస్పీ చికెన్ మరెంతో స్పెషల్.., సోయా అంజీరా హల్వాలు నోరూరించే విధంగా ఉన్నాయంటే ఒక్కసారి వంట వార్పు చేయాల్సిందే!కోకోనట్ ఆమ్లెట్..కావలసినవి..గుడ్లు – 5కొబ్బరి కోరు – పావు కప్పుఉల్లిపాయ ముక్కలు – 2 టీ స్పూన్లు (చాలా చిన్నగా తరిగి, దోరగా వేయించి పెట్టుకోవాలి)పచ్చిమిర్చి ముక్కలు – కొద్దిగా (చాలా చిన్నగా తరిగి, దోరగా వేయించి పెట్టుకోవాలి)కొత్తిమీర తురుము– కొద్దిగా (అభిరుచిని బట్టి)హెవీ క్రీమ్ – అర టేబుల్ స్పూన్ (మార్కెట్లో లభిస్తుంది)పంచదార – 2 లేదా 3 టీ స్పూన్లుబటర్ – 2 టేబుల్ స్పూన్లు (కరిగింది, నూనె కూడా వాడుకోవచ్చు)ఉప్పు – కొద్దిగాతయారీ..– ముందుగా ఒక బౌల్లో వేయించిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు.. కొత్తిమీర తురుము, కొబ్బరి తురుము, పంచదార, హెవీ క్రీమ్ వేసుకుని.. అందులో గుడ్లు పగలగొట్టి.. కొద్దిగా ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి.– అనంతరం పాన్ లో బటర్ లేదా నూనె వేసుకుని మొత్తం స్ప్రెడ్ చేసుకుని.. ఈ ఎగ్ మిశ్రమాన్ని ఆమ్లెట్‌లా పరచి.. చిన్న మంట మీద ఉడకనివ్వాలి.– ఇరువైపులా ఉడికిన తర్వాత సర్వ్ చేసుకోవాలి. అభిరుచిని బట్టి ఈ మిశ్రమంతో మొత్తం ఒకే అట్టులా కాకుండా.. రెండు లేదా మూడు చిన్నచిన్న ఆమ్లెట్స్‌లా వేసుకోవచ్చు. వేడి వేడిగా ఉన్నప్పుడే తింటే భలే రుచిగా ఉంటుంది ఈ ఆమ్లెట్.బాదం క్రిస్పీ చికెన్..కావలసినవి..బోన్ లెస్ చికెన్ – 3 లేదా 4 పీసులు (పలుచగా, పెద్దగా కట్ చేసిన ముక్కలు తీసుకోవాలి)మొక్కజొన్న పిండి – 6 టేబుల్ స్పూన్లుగోధుమ పిండి – 1 టేబుల్ స్పూన్బాదం – అర కప్పు (దోరగా వేయించి.. బ్రెడ్ పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి)ఎండుమిర్చి – 2 (కచ్చాబిచ్చాగా పొడి చేసుకోవాలి)గుడ్లు – 2, బాదం పాలు – 3 టీ స్పూన్లుమిరియాల పొడి – కొద్దిగాఉప్పు – తగినంతనూనె – సరిపడాతయారీ..– ముందుగా ఒక బౌల్లో మొక్క జొన్న పిండి, గోధుమ పిండి, మిరియాల పొడి, ఎండు మిర్చి పొడి, తగినంత ఉప్పు వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.– మరో బౌల్లో గుడ్లు పగలగొట్టి.. బాగా గిలకొట్టి.. అందులో బాదం పాలు పోసి కలిపి పెట్టుకోవాలి. ఇంకో బౌల్ తీసుకుని.. అందులో బాదం పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో చికెన్ ముక్కను తీసుకుని.. దానికి మొక్కజొన్న పిండి మిశ్రమాన్ని బాగా పట్టించాలి.– అనంతరం దాన్ని గుడ్డు–బాదం పాల మిశ్రమంలో ముంచి, వెంటనే బాదం పొడి పట్టించి.. నూనెలో దోరగా వేయించి.. సర్వ్ చేసుకోవాలి.సోయా అంజీరా హల్వా..కావలసినవి..డ్రై అంజీరా – 20 లేదా 25 (15 నిమిషాలు నానబెట్టుకోవాలి)కిస్మిస్ – 15 (నానబెట్టి పెట్టుకోవాలి)సోయా పాలు – అర కప్పుఫుడ్ కలర్ – కొద్దిగా (అభిరుచిని బట్టి)జీడిపప్పు, బాదం, పిస్తా – కొద్దికొద్దిగా (నేతిలో దోరగా వేయించి.. చల్లారాక కచ్చాబిచ్చాగా మిక్సీ పట్టుకోవాలి)నెయ్యి, పంచదార – సరిపడాగసగసాలు లేదా నువ్వులు – కొద్దిగా గార్నిష్కితయారీ..– ముందుగా అంజీరా, కిస్మిస్ రెండూ కలిపి.. మెత్తటి పేస్ట్‌లా చేసి పక్కన పెట్టుకోవాలి.– ఈలోపు కళాయిలో 5 టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేసుకుని అందులో.. అంజీరా మిశ్రమాన్ని వేసుకుని చిన్న మంట మీద గరిటెతో తిప్పుతూ ఉండాలి.– దగ్గర పడుతున్న సమయంలో సోయా పాలు, జీడిపప్పు, బాదం, పిస్తా ముక్కలు వేసుకుని మళ్లీ దగ్గరపడే వరకు చిన్న మంట మీద.. మధ్య మధ్యలో తిప్పుతూ ఉడికించాలి.– అనంతరం సరిపడా పంచదార, ఫుడ్ కలర్ వేసుకుని.. బాగా తిప్పాలి. టేస్ట్ చూసుకుని పంచదార, నెయ్యి అభిరుచిని బట్టి ఇంకొంచెం కలుపుకోవచ్చు.– కాస్త దగ్గర పడుతున్న సమయంలో స్టవ్ ఆఫ్ చేసి.. కాసేపు అలానే గాలికి వదిలిపెట్టాలి.– దగ్గరపడి, చల్లారాక చేతులకు నెయ్యి రాసుకుని.. మొత్తం మిశ్రమాన్ని రోల్స్‌లా చుట్టుకుని.. గసగసాల్లో లేదా వేయించిన నువ్వుల్లో దొర్లించాలి. అనంతరం నచ్చినవిధంగా కట్ చేసుకోవాలి.ఇవి చదవండి: ఈ మినీ మెషిన్‌తో.. స్కిన్ సమస్యలకు చెక్! -
ఒంట్లో నీరసంగా అనిపిస్తుందా? ఇలా చేయండి
ఉరుకుల పరుగుల జీవితంలో మన ఆరోగ్యం గురించి ఎక్కువగా దృష్టిపెట్టం. ఏదైనా సమస్య వచ్చినప్పుడే అసలు ఎందుకిలా అయ్యింది? ఇప్పుడేం చేయాలి అని ఆలోచిస్తుంటాం. అలా కాకుండా ప్రతిరోజు మనకోసం కొంత సమయాన్ని కేటాయించుకొని ఆరోగ్యంపై దృష్టి పెడితే లక్షలకు లక్షలు ఆసుపత్రులకు వెచ్చించాల్సిన అవసరం ఉండదు. సింపుల్‌గా మన వంటింట్లో దొరికే వస్తువులతో ఆరోగ్యంగా ఎలా ఉండొచ్చో కొన్ని తెలుసుకుందాం.. హెల్త్ టిప్స్ తేనెలో ఐరన్, కాపర్, మాంగనీస్‌లు సమృద్ధిగా ఉండటం వల్ల నీరసంగా అనిపించినప్పుడు ఒక గ్లాస్ నీటిలో రెండు స్పూన్ల తేనె కలుపుకొని తాగితే ఒంటికి వెంటనే శక్తి వస్తుంది. సోయా బీన్ ఎక్కువగా తీసుకుంటే శరీరం పోషకాలను గ్రహించే శక్తి పెరుగుతుంది. దాంతో మనం తీసుకున్న ఆహారంలోని ఐరన్‌ని శరీరం బాగా గ్రహిస్తుంది. విటమిన్ సి సమృద్ధిగా లభించే నిమ్మ, ఉసిరి, జామ వంటి పళ్ళు, మొలకెత్తిన పప్పుధాన్యాలు తీసుకుంటూ ఉంటే రక్తహీనత నుంచి బయట పడవచ్చు. -
అయోమయంలో రైతన్నలు... ఏ పంట విత్తుకోవాలి!
ఆర్మూర్ : వర్షాకాలం ప్రారంభ దినమైన మిరుగు దాటి రెండు వారాలు గడుస్తున్నా తొలకరి వర్షాలు ముఖం చాటేయడంతో జిల్లా రైతాంగం సోయాబీన్ లేదా మొక్కజొన్న పంటల్లో ఏ పంట విత్తుకోవాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. ప్రతికూల పరిస్థితుల్లో రైతులకు అందుబాటులో ఉండి సలహాలు ఇవ్వాల్సిన వ్యవసాయ శాఖ సిబ్బంది జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వేధింపుల కారణంగా క్షేత్ర స్థాయిలో రైతులకు అందుబాటులో ఉండలేకపోతున్నామని అంటున్నారు. మొక్కజొన్నకు ప్రత్యామ్నాయంగా సోయాబీ న్ పంటను వ్యవసాయ శాఖ అధికారులు ప్రోత్సహించారు. ఈ వర్షాకాలంలో జిల్లా వ్యాప్తంగా 58,715 ఎకరాల్లో సోయాబీన్, 32,185 ఎకరాల్లో మొక్కజొన్న పంటను పండించడానికి వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. కానీ వాతావరణ పరిస్థితులు అందుకు తగినట్లుగా లేకపోవడంతో రైతులకు ఎటూ పాలుపోని పరిస్థితి ఏర్పడింది. సోయాబీన్ పండించే రైతులు.. వర్షాధార పంట అయిన సోయా పండించడానికి తొలకరి వర్షం కోసం రైతన్నలు ఎదురు చూస్తున్నారు. తొలకరి వర్షాలు ప్రారంభంతోనే విత్తనాలు విత్తుకోవడానికి రైతులు తమ వ్యవసాయ క్షేత్రాలను సిద్ధం చేసుకున్నారు. మొక్కజొన్న పంటతో పోలిస్తే కూలీల ఖర్చు తక్కువ కావడమే కాకుండా సాగుకు శ్రమ తక్కువగా ఉంటుంది. మొక్కజొన్న పండించడానికి పడిన శ్రమలో సగం శ్రమిస్తే అదే లాభం ఆర్జించడంతో పాటు వర్షాధార పంట కావడంతో రైతులు సోయాబీన్ పండించడానికి ఆసక్తి చూపుతున్నారు. మొక్కజొన్న పండించే రైతులు.. మే చివరి వారం రోహిణి నుంచి జూలై 15 వరకు మొక్కజొన్న విత్తవచ్చు. ఇది వర్షాధార పంట. నీటి వసతి ఉన్నవారు సైతం వేయవచ్చు. 120 రోజుల పంట. నీటి వసతి ఉన్న వారు పచ్చి మక్కబుట్ట కోసం ఆర్మూర్ మండలంలో 500 ఎకరాల్లో పండిస్తున్నారు. పచ్చి బుట్ట పంట 90 రోజుల్లో చేతికొస్తుంది. బోరు బావుల్లో నీటి వసతి ఉన్న రైతులు మాత్రం ధైర్యంగా మొక్కజొన్న విత్తుకొని సాగునీటిని అందిస్తున్నారు. వర్షంపై ఆధారపడ్డ రైతులు మాత్రం ఆకాశం వైపు వర్షం కోసం చూస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తొలకరి కోసం ఎదురుచూపు.. ప్రతి ఏడాది లాగే సోయాబీన్ విత్తుకుందామని అనుకున్నాము. కాని తొలకరి సకా లంలో రాకపోవడంతో బో రు బావిలో ఉన్న నీటితో రెండు మడులు మొక్కజొ న్న విత్తాను. మొక్కజొన్నకు కూడా వర్షం కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఏం చేయాలో తోచడం లేదు. భూగర్భ జలాలు సైతం ఆశించిన స్థాయిలో లేవు. చేసేది లేక తొలకరి కోసం ఎదురు చూస్తున్నాము. – చిన్నయ్య, రైతు, (శ్రీరాంపూర్) ఫత్తేపూర్, ఆర్మూర్ మండల -
వర్క్ ఫ్రం హోమ్.. మరోపక్క ప్రకృతి వ్యవసాయం
రవి కుమార్, సునంద యువ దంపతులు. లాక్డౌన్ నేపథ్యంలో సొంతూరు వెళ్లిపోయారు. రసాయన రహితంగా పండించిన ఆహారంతోనే ఆరోగ్యం చేకూరుతుందన్న స్పృహతో రసాయనాల్లేని వ్యవసాయం ప్రారంభించారు. రవి ఆన్లైన్లో ఉద్యోగం చేస్తూనే 8 ఎకరాల నల్లరేగడి భూమిలో భార్య తోడ్పాటుతో ఆఫ్‌లైన్‌లో వర్షాధార సేద్యం చేస్తున్నారు. పూర్తిగా సీవీఆర్ పద్ధతిలో మట్టి సేద్యంతో తొలి ఏడాదే మంచి దిగుబడులు తీసి భళా అనిపించుకుంటున్నారు ఈ ఆదర్శ యువ రైతులు. మాదాని రవి, సునంద ఎమ్మెస్సీ చదువుకున్నారు. హైదరాబాద్‌లో ఉంటూ అతను ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంటే, ఆమె ప్రైవేటు కాలేజీలో లెక్చరర్‌గా ఉద్యోగం చేస్తుండే వాళ్లు. వారికి ఇద్దరు పిల్లలు. రవి స్వగ్రామం కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని విజయనగరం. 40 ఎకరాల భూమి కలిగిన అతని తల్లిదండ్రులు వరి, పత్తి తదితర పంటలను రసాయనిక పద్ధతిలోనే సాగు చేస్తున్నారు. బాల్యం నుంచీ రవికి వ్యవసాయం అంటే మక్కువ ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా రవి, సునంద ప్రకృతి వ్యవసాయ విషయాలను ఆసక్తిగా గమనిస్తున్నారు. సుభాష్ పాలేకర్ ప్రసంగాలు విని, పుస్తకాలు, పత్రికలు చదివి, రైతుల విజయగాధల వీడియోలు చూసి స్ఫూర్తి పొందారు. వారాంతాల్లో వీలైనప్పుడల్లా స్వయంగా కొన్ని క్షేత్రాలకు వెళ్లి చూసి, వివరాలు తెలుసుకొని వచ్చేవారు. ఇంట్లో ఎవరో ఒకరికి నెలకోసారైనా ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చేది. మార్కెట్లో దొరికే వంటనూనెలు వాడటం ఆపేసి గానుగ నూనె వాడటం మొదలు పెట్టిన తర్వాత క్రమంగా ఆస్పత్తికి వెళ్లాల్సిన అవసరం తగ్గిపోయిందని.. ఆ తర్వాత బియ్యం, పప్పులు కూడా మార్చుకున్నామని సునంద చెప్పారు. ఆ విధంగా రసాయనాల్లేని ఆహారంతో ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చని గుర్తించిన తర్వాత.. నగర పరిసరాల్లో భూమిని కౌలుకు తీసుకునైనా వారాంతాల్లో మనమే ఎందుకు పంటలు పండించుకోకూడని ఆలోచించారు. ఆ ప్రయత్నాలు సాగుతుండగా కరోనా వచ్చిపడింది. నవారతో ప్రారంభం లాక్డౌన్ కారణంగా వర్క్‌ఫ్రం హోం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో గతేడాది ఫిబ్రవరిలో వీరి కుటుంబం సొంత గ్రామానికి మకాం మార్చింది. తొలుత గత ఏడాది ఫిబ్రవరిలో 3–4 సెంట్ల భూమిలో నవార విత్తారు. ‘మా అత్త మామల ద్వారా దుక్కి చేయటం, గొర్రుతో విత్తనం వేయటం వంటి ప్రతి పనినీ కొత్తగా నేర్చుకున్నాం. అయితే, రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపు మందులు వాడటం అక్కడి రైతులందరికీ బాగా అలవాటు. అవి లేకుండా పంటలు ఎలా పండిస్తారని ప్రశ్నించేవారు. అయినా వెనక్కి తగ్గ లేదు’ అన్నారు సునంద. మొదట వ్యవసాయం చాలా కష్టంగా అనిపించినా పట్టు వదలకుండా ముందుకు సాగారు. మొదట ఆకు కూరలు, కూరగాయలు సాగు చేశారు. వేసవిలో పెరట్లో గోంగూర మొక్కలకు పిండి నల్లి సోకినప్పుడు మట్టి ద్రావణం ఆశ్చర్యకరమైన ఫలితాలనిచ్చింది. దాంతో వ్యవసాయం అంతా పద్మశ్రీ అవార్డు గ్రహీత, సీనియర్ రైతు శాస్త్రవేత్త చింతల వెంకటరెడ్డి (సీవీఆర్) చెప్పిన విధంగా కేవలం మట్టి ద్రావణం పద్ధతిలోనే సాగు చేసి మంచి దిగుబడులు తీయొచ్చన్న నమ్మకం కుదిరింది. అదే పద్ధతి అనుసరిస్తున్నాం అని సునంద వివరించారు. పంట ఏదైనా కేవలం మట్టి ద్రావణమే ఈ ఏడాది వానాకాలంలో 8 ఎకరాల నల్లరేగడి నేలలో వర్షాధారంగా వరి, సోయాబీన్, కంది, సజ్జ, కొర్రలు, రాగి తదితర పంటలు ఎడ్ల గొర్రుతో విత్తారు. పంటలు ఏవైనా మట్టి ద్రావణమే ప్రతి 10 రోజులకోసారి పిచికారీ చేస్తుండటం విశేషం. 200 లీటర్ల నీటిలో 30 లోపలి మట్టి (భూమిలో 2 అడుగుల లోతు నుంచి తీసి ఎండబెట్టిన పొడి మట్టి), అర లీటరు అముదంను కలిపి ఈ ద్రావణాన్ని అన్ని పంటలకు 10 రోజులకోసారి మొక్కలు పూర్తిగా తడిచేలా పిచికారీ చేయాలి. పంట పూత/పిందె దశలో 3 పిచికారీలకు మాత్రం ఈ ద్రావణానికి రాక్ డస్ట్ 5 కిలోలు కలిపి పిచికారీలు చేయాలి. దీనితో పాటు.. 30 కిలోల లోపలి మట్టికి అర లీటరు ఆముదం కలిపి.. ఆ మట్టి మిశ్రమాన్ని పంట మొక్కల కింద 20 రోజులకు ఒకసారి ఎరువుగా వేయాలి. ఈ మట్టి మిశ్రమం వేసిన తర్వాత వారం వరకు జీవామృతం వంటి ద్రావణాలు వేయకూడదు. ఇంతే. పంటలన్నిటికీ ఇవే ఇస్తున్నామని సునంద, రవి వివరించారు. సోయా.. ఎకరానికి 11 క్విం. సునంద, రవి వానాకాలంలో 3 ఎకరాల నల్లరేగడి నేలలో వర్షాధారంగా సోయా విత్తారు. సాళ్ల మధ్య 1.5 అడుగులు పెట్టారు. కలుపు మందు చల్లకుండా నాగళ్లతో 2 సాళ్లు పైపాటు చేయించారు, ఓసారి కూలీలతో కలుపు తీయించారు. సీవీఆర్ మట్టి ద్రావణం మాత్రం పిచికారీ చేశారు. పూత, పిందె దశలో మినుము, పెసర, నవార వడ్లు, బొబ్బర్లను ఒక్కో రకం ఒక్కోసారి మొలకల ద్రావణాన్ని కూడా కలిపి పిచికారీ చేశామని సునంద వివరించారు. ఇంకేమీ వెయ్యలేదు. అయినా, సగటున ఎకరానికి 11 క్వింటాళ్ల దిగుబడి సాధించటం విశేషం. వత్తుగా విత్తుకొని రసాయనిక సేద్యం చేసిన వారికన్నా ఎక్కువ దిగుబడి సాధించడం సాగులో పూర్వానుభవం లేని తమకు ఎంతో సంతోషాన్ని, ధైర్యాన్ని ఇచ్చిందని సునంద, రవి ఆనందిస్తున్నారు. 2 ఎకరాల్లో కంది విత్తారు. అంతర పంటలు వేశారు. 5 క్వింటాళ్ల కొర్రలు, 2 క్లింటాళ్ల సజ్జలు (సగానికిపైగా చిలకలు తినగా మిగిలినవి), 5 క్వింటాళ్ల కొర్రల దిగుబడి వచ్చింది. ఇవి కోసిన తర్వాత కుసుమ విత్తారు. 3 ఎకరాల్లో అధిక పోషకాలతో కూడిన ఇంద్రాణి, కుజూపటాలియా, కాలాబట్టి, నవార, మాపిళ్ళె సాంబ వంటి దేశీ వరి రకాలను సాగు చేసి 30 క్వింటాళ్ల దిగుబడి పొందటం విశేషం. ధైర్యంగా మట్టి ద్రావణంతో సేద్యం చేపట్టి నలుగురూ ఇదేమి సేద్యం అని తప్పుపడుతున్నా ముందుకు సాగి.. చివరకు గ్రామస్తులతో ఔరా అనిపించుకున్నారు రవి, సునంద వ్యవసాయంలోకి రాదలచిన యువతకు మార్గదర్శకులు. – కమ్రె నరేష్, సాక్షి, కౌటాల, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎన్ని ఇబ్బందులున్నా ఆనందంగా ఉంది నేను ఇంటి వద్ద నుంచి ఉద్యోగం చేస్తున్నాను. నా భార్య సునంద ఉద్యోగానికి స్వస్తి చెప్పి ఇంటి పనులతో పాటు వ్యవసాయం చూసుకుంటున్నది. నేను విధుల్లో ఉన్న సమయంలో నా భార్య సునంద పొలం పనులు చూసుకుంటుంది. ఇద్దరం కలిసి ఇష్టపూర్వకంగా సహజ వ్యవసాయం చేస్తున్నాం. ఎన్ని ఇబ్బందులున్నా ఫలితాలను చూసి మాకెంతో ఆనందంగా ఉంది. సహజ పద్ధతిలో పండించిన పంటతో మంచి ఆరోగ్యం చేకూరుతుంది. యువ రైతులందరూ సహజ పద్ధతిలో పంటల సాగు చేపట్టాలి. అప్పుడే భూమి సారవంతం కావడంతో పాటు మనుషులు ఆరోగ్యంగా ఉంటారు. – మాదాని రవి, యువ రైతు, విజయనగరం, కౌటాల మండలం, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సీవీఆర్ మట్టి సేద్య పద్ధతి చాలు! వ్యవసాయం చేయడానికి శ్రద్ధతో పాటు చాలా ఒపిక ఉండాలి. అటు ఉద్యోగం.. ఇటు పిల్లల్ని చూసుకుంటూ సహజ పద్ధతిలో పంటలు సాగు చేస్తున్నాం. ఏసీలో ఉండే మీరు ఎందుకు వ్యసాయం చేస్తున్నారు? మందులు (రసాయనిక ఎరువులు, పురుగుమందులు) వాడకుండా పంటలు ఎలా పండుతాయని చాలా మంది ఎద్దేవా చేశారు. కానీ, ఎన్నో కష్టాలు పడి పంటలు సాగు చేస్తున్నాం. పంట దిగుబడిని చూసినప్పుడు ఆనందంగా ఉంటుంది. సీవీఆర్ మట్టి సేద్య పద్ధతి ఒక్కటి అనుసరిస్తే చాలని మా అనుభవంలో శాస్త్రీయంగా నేర్చుకున్నాం. సంతృప్తిగా ఉంది. NSU Nandanam natural farms యూట్యూబ్ ఛానల్ ద్వారా సలహాలు, సూచనలు అందిస్తున్నాం. – సునంద (77995 44705), యువ రైతు, విజయనగరం, కౌటాల మండలం, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా -
సోయా విత్తనానికి.. మహారాష్ట్రకు పరుగులు
సాక్షి, హైదరాబాద్: సోయాబీన్ విత్తనం కోసం రైతులు మహారాష్ట్ర సహా ఇతర రాష్ట్రాలకు పరుగులు తీస్తున్నారు. పెద్ద ఎత్తున విత్తన కొరత ఏర్పడటంతో ఎక్కడ దొరికితే అక్కడ, ఎంత ధరైతే అంతకు కొంటున్నారు. ఎన్నడూ లేని విధంగా సోయాబీన్ విత్తనాన్ని ఈసారి వ్యవసాయ శాఖ సరఫరా చేయలేకపోయింది. ఫలితంగా రైతులకు విత్తనం దొరకలేదు.. రాయితీ కూడా అందలేదు. దీన్ని అదనుగా తీసుకొని వ్యాపారులు, దళారులు దగా చేస్తున్నారు. దీంతో సోయాబీన్ సాగు చేసే రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిత్రమేంటంటే వ్యవసాయ శాఖకు విత్తనం దొరక్క పోగా, వ్యాపారులకు మాత్రం అది అందుబాటులో ఉంటోంది. నాలుగున్నర లక్షల ఎకరాల్లో సాగు... తెలంగాణలో ఈసారి వానాకాలం సీజన్లో సోయాబీన్ సాధారణ సాగు విస్తీర్ణం 4.50 లక్షల ఎకరాలు ఉంటుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. అందులో ఇప్పటివరకు 18,112 (4 శాతం) ఎకరాల్లో సాగు చేశారని వ్యవసాయశాఖ లెక్కలు చెబుతున్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి జిల్లాల్లో రైతులు సోయాను సాగు చేస్తారు. రాష్ట్రానికి అవసరమైన సోయా విత్తనాల్లో 1.20 లక్షల క్వింటాళ్ల వరకు ప్రతీ ఏడాది ప్రభుత్వమే సమకూర్చుతుంది. కొన్ని రకాల వెరైటీ విత్తనాలను రైతులు ప్రైవేట్ వ్యాపారుల వద్ద కొనుగోలు చేస్తారు. ఈసారి ఇతర రాష్ట్రాల్లోనూ అధిక వర్షాలతో సోయా విత్తన పంట దెబ్బతిన్నది. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోనూ సోయా విత్తనం ఇతర ప్రాంతాలకు విక్రయించకూడదని అక్కడి ప్రభుత్వాలు నిర్ణయించడంతో తెలంగాణ వ్యవసాయశాఖ చేతులెత్తేసింది. టెండర్లు వేసినా కంపెనీలు ముందుకు రాలేదు. దీంతో రైతులే సమకూర్చు కోవాలని, లేకుంటే ప్రత్యామ్నాయంగా పత్తి, కంది వంటి పంటలు వేసుకోవాలని వ్యవసాయశాఖ సూచించింది. ఆ పంటకే అలవాటు పడటంతో చాలామంది రైతులు సోయాబీన్ విత్తనాల కోసం మహారాష్ట్రకు పరుగులు తీస్తున్నారు. సబ్సిడీ లేకపోవడంతో.. గతేడాది సోయా విత్తనాలు క్వింటాలుకు రూ. 6,645 ఉండగా, రూ. 2,701 సబ్సిడీ వచ్చేది. రూ.3,944 రైతు తన వాటాగా చెల్లించేవాడు. ఎకరానికి 30 కిలోల వరకు విత్తనాలు విత్తుకునేవారు. 30 కిలోల బస్తాను సబ్సిడీపై రైతులకు అందించేవారు. ప్రభుత్వం సబ్సిడీపై విత్తనాలను సరఫరా చేయకపోవడంతో మార్కెట్లో వ్యాపారులు రెట్టింపు ధరలకు అమ్ముతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో క్వింటాలు విత్తనాల ధర రూ. 13 వేల వరకు ఉంది. 27 కిలోల బస్తా ధర రూ.3,500 వరకు చెల్లించి రైతులు కొంటున్నారు. నానా తిప్పలు పడ్డాను నేను 16 ఎకరాలు సోయా సాగు చేస్తున్నాను. ఇక్కడ సోయా విత్తనాలు సరఫరా చేయకపోవడంతో నాందేడ్ నుంచి తెచ్చుకు న్నా. బస్తా (30 కిలోలు) రూ.3,300 చొప్పున కొన్నాను. విత్తనాలు కొనుగోలు చేసేందుకే నానా తిప్పలు పడ్డాను. తప్పనిసరి పరిస్థితుల్లో మహారాష్ట్రలో రెట్టింపు ధరకు దొరికాయి. ప్రభుత్వమే సబ్సిడీపై ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. – చిద్రపు అశోక్, ఖాజాపూర్, నిజామాబాద్ విత్తనాలకే రూ.25వేలు ఖర్చు.. నేను 5 ఎకరాల్లో సోయాబీన్ వేశా. ప్రతిసారి ప్రభుత్వమిచ్చే సబ్సిడీ విత్తనాలు కొనుగోలు చేసేవాన్ని. ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వకపోవడంతో మార్కెట్లో వ్యాపారులు ధరలు పెంచేశారు. ఏడు బస్తాల సోయా విత్తనాలను కొనుగోలు చేశాను. ఒక్కో బస్తా రూ. 3,600లకు తెచ్చి విత్తుకున్నాను. విత్తనాల కోసమే రూ. 25 వేలు వెచ్చించాల్సి వచ్చింది. --- కుంట రంజిత్‌రెడ్డి, నల్లవెల్లి, నిజామాబాద్ -
మన సోయాకు ‘మహా’ డిమాండ్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: సోయా పంటకు మహారాష్ట్రలో మంచి డిమాండ్ ఏర్పడింది. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కంటే ఎక్కువ ధర పలుకుతుండటంతో రైతులు తమ సోయా పంటను అక్కడి వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఇప్పటికే సుమారు 90 శాతానికి మించి పంట మహారాష్ట్రకు తరలిపోయింది. నాందేడ్, లాతూరు, కుసునూరు తదితర ప్రాంతాల్లో సోయా ఆయిల్ మిల్లులు, సోయా ఆధారిత పరిశ్రమలు ఉన్నాయి. పెద్ద రైతులు లారీల్లో అక్కడికి తీసుకెళ్లి విక్రయించగా, చిన్న సన్నకారు రైతులు కూడా స్థానికంగా ఉండే వ్యాపారులకు విక్రయించగా, వారు ఈ సోయాను మహారాష్ట్రలోని ఆయిల్ మిల్లులకు తరలించారు. ఎంఎస్పీ కంటే ఎక్కువ ధర బహిరంగ మార్కెట్లో సోయాకు మంచి ధర పలకడంతో రైతులు తమ పంటను ప్రైవేటు వ్యాపారులకే విక్రయించారు. సోయాకు కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.3,880 ఉంది. అయితే వ్యాపారులు క్వింటాలుకు రూ.3,900 నుంచి రూ.4,200 వరకు ఇస్తుండటంతో రైతులు ప్రైవేటు వైపే మొగ్గు చూపారు. సర్కారు కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే డబ్బులు రావడానికి కాస్త సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. దీనికి తోడు కాంటాలు చేయడంలో జాప్యం జరుగుతోంది. ప్రైవేటు వ్యాపారులు వెంటనే నగదు చెల్లించడంతో పాటు, గ్రామానికి వచ్చి కాంటాలు చేస్తుండటంతో రైతులు కొనుగోలు కేంద్రాల్లో విక్రయించడం లేదు. నాఫెడ్ కొనుగోళ్లు నిల్ ఈసారి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నాఫెడ్ సోయాను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ మార్క్‌ఫెడ్‌కు కొనుగోళ్ల బాధ్యతలు అప్పగించింది. అయితే మార్క్‌ఫెడ్ జిల్లాల వారీగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. నిజామాబాద్ జిల్లాలో పలుచోట్ల కేంద్రాలను ప్రారంభించినప్పటికీ.. ఈ కేంద్రాలకు సరుకు రాలేదు. రైతులంతా ప్రైవేటు వ్యాపారులకే విక్రయించారు. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే సుమారు ఆరు లక్షల క్వింటాళ్ల సోయాను ప్రైవేటు వ్యాపారులే కొనుగోలు చేశారు. -
ఆ పంటలకు ఆశాజనకంగా ధర
మోర్తాడ్(బాల్కొండ): సోయా, కందులు, పెసర్లకు మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం పెంచడంతో నూతన వ్యవసాయ విధానం అమలుతో రైతులకు ప్రయోజనం కలుగనుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. వర్షాకాలంలో మొక్కజొన్నకు బదులు సోయా, కందులు, పెసర్లు సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఆహార ధాన్యాలు, వాణిజ్య పంటలకు మినిమం సపోర్టు ప్రైస్(ఎమ్మెస్పీ)ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించగా సోయా, కందులు, పెసర్లకు గతంలో కంటే ఎక్కువ ధర పెరిగింది. సోయాకు గతంలో క్వింటాలుకు రూ.3,710 మద్దతు ధర ఉండగా ఈ సారి రూ.170 పెరిగింది. రాష్ట్రంలో సోయా సాగు విస్తీర్ణం పెరగడానికి వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తుంది. మొక్కజొన్నకు ప్రత్యామ్నయంగా సోయా పంటను సాగు చేయడానికి రైతులను వ్యవసాయ శాఖ అధికారులు ప్రోత్సహిస్తున్నారు. కందులకు రూ.200 మద్దతు ధర పెరిగింది. కందులకు గతంలో క్వింటాల్‌కు రూ.5,800 ఉండగా ఇప్పుడు రూ.ఆరు వేలు అయింది. అలాగే పెసర్లకు క్వింటాలుకు రూ.146 మద్దతు ధర పెంచారు. దీంతో క్వింటాలుకు రూ.7,196 ధర లభించనుంది. పెసర్లు దిగుబడి ఎక్కువగా లభించే అవకాశం లేదు. సోయాలో కందులను అంతర్ పంటగా సాగు చేయడంతో ప్రయోజనాలు ఉంటాయని వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎల్. కిషన్‌రెడ్డి ‘సాక్షి’తో చెప్పారు. -
రూ. 20 కోట్ల సోయాబిన్ పట్టివేత
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో అక్రమంగా నిల్వచేసిన 36వేల క్వింటాళ్ల సోయాబిన్ విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు. పట్టణ శివారులోని డైమండ్ గోడౌన్ పై మంగళవారం ఆర్డీవో, రెవిన్యూ అధికారులు దాడులు జరిపారు. గోడౌన్లో 36వేల క్వింటాళ్ల సోయాబిన్ విత్తనాలను అక్రమంగా బస్తాల్లో నిల్వ ఉంచినట్లు గుర్తించారు. వీటి విలువ సుమారు రూ. 20 కోట్ల వరకు ఉన్నట్లు అంచనా వేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.