కుయ్ కుయ్.. ఇక రయ్ రయ్!
♦ నగరంలో అంబులెన్స్‌ల కోసం ప్రత్యేక ‘మార్గం’
♦ అధ్యయనానికి సన్నాహాలు చేస్తున్న నగర పోలీసులు
సాక్షి, హైదరాబాద్: అంబులెన్స్.. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో రోగులను, ప్రమాద బాధితులను ఆస్పత్రులకు తరలించేందుకు ఉపయోగపడే అత్యవసర వాహనం. కానీ, హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ రద్దీ కారణంగా అంబులెన్స్‌లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. సకాలంలో రోగులను, బాధితులను గమ్యస్థానానికి చేర్చడానికి నానా పాట్లు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ చిక్కులను తప్పించేలా అంబులెన్స్‌ల కోసం ప్రత్యేకంగా మార్గం ఏర్పాటు చేయాలని నగర పోలీసు విభాగం నిర్ణయించింది.
ప్రధాన రహదారిలో భాగంగానే ఓ పక్కగా మార్కింగ్ ఇవ్వాలని భావిస్తోంది. ప్రయోగాత్మక అమలు కోసం ప్రధాన ఆస్పత్రులు ఉన్న 15 మార్గాల్లో అధ్యయనానికి సన్నాహాలు చేస్తోంది. దీనికోసం ట్రాఫిక్, శాంతిభద్రతల విభాగం సమన్వయంతో పని చేయనుంది.
అంబులెన్స్‌లకు అష్టకష్టాలు..
వైద్య రంగానికి కేంద్ర బిందువుగా మారిన నగరంలో అనేక కార్పొరేట్ ఆస్పత్రులు ఏర్పాటవుతున్నాయి. వీటికి తోడు ఉస్మానియా, గాంధీ, మెటర్నిటీ ఆస్పతులు ఉండనే ఉన్నాయి. నగరంతో పాటు బయటి ప్రాంతాలకు చెందిన అనేక మంది రోగులను, తీవ్ర అస్వస్థతకు గురైన వారిని అంబులెన్స్‌లో వైద్యం కోసం సిటీకి తీసుకువస్తున్నారు. ఆ వాహనాలు శివార్ల వరకు ఆగమేఘాలపై వచ్చినా.. సిటీలో ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుపోతున్నాయి. ఫలితంగా ఒక్కోసారి రోగుల పరిస్థితి చేయి దాటిపోతోంది. వర్షాలు కురవడం, ట్రాఫిక్ జామ్స్ వంటి సమయాల్లో సాధారణ వాహనాల్లాగే అంబులెన్స్‌లు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోతున్నాయి.
స్ఫూర్తినిచ్చిన ‘గ్రీన్ చానల్’..
ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల కృషి ఫలితంగా ఇటీవల ప్రజల్లో అవయవ దానంపై అవగాహన పెరిగింది. ఇతర నగరాలతో పాటు రాష్ట్రాల్లోనూ బ్రెయిన్‌డెడ్ స్థితికి చేరిన వారి అవయవాలను ఇక్కడకు తీసుకురావడం, ఇక్కడి నుంచి ఆయా ప్రాంతాలకు తీసుకువెళ్లడం చేస్తున్నారు. ఆ సందర్భాల్లో వైద్యులతో పాటు ట్రాఫిక్ పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. సదరు అవయవాలతో ప్రయాణిస్తున్న అంబులెన్స్‌లు విమానాశ్రయం నుంచి నిర్దేశించిన ఆస్పత్రికి చేరుకునే వరకు పక్కా సమన్వయంతో పని చేస్తున్నారు. వీటి కోసం ట్రాఫిక్ క్లియర్ చేస్తూ ‘గ్రీన్ చానల్’ ఇస్తున్నారు.
ఫలితంగా అవయవదానానికి సంబంధించిన లక్ష్యం నెరవేరుతోంది. ఇప్పుడు ఈ ‘గ్రీన్ చానల్’ విధానాన్ని నగర పోలీసులు స్ఫూర్తిగా తీసుకున్నారు. కొన్ని సందర్భాల్లో ట్రాఫిక్ జామ్ వల్ల ‘గోల్డెన్ అవర్’ దాటిపోవడంతో పరిస్థితులు మారిపోతున్నాయి. దీంతో నగరంలో అంబులెన్స్‌లకు ప్రత్యేక మార్గం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీన్ని అమలులోకి తీసుకువచ్చే అంశంపై కొత్వాల్ ఎం.మహేందర్‌రెడ్డితో పాటు ఉన్నతాధికారులు భేటీ అయ్యారు.
ప్రయోగాత్మకంగా.. ‘క్లిష్ట సమయాల్లో’..
ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అత్యంత క్లిష్ట సమయాల్లో అమలు చేయాలని నగర పోలీసులు యోచిస్తున్నారు. సిటీలో ఉన్న రహదారుల పరిస్థితి, వాటి వెడల్పులు, బాటిల్ నెక్స్‌ను పరిగణనలోకి తీసుకున్న అధికారులు అన్ని రహదారుల్లోనూ ఏకకాలంలో అమలు చేయడంలో ఇబ్బందులు ఉన్నట్లు గుర్తించారు. తొలుత భారీ ట్రాఫిక్ జామ్స్ ఏర్పడినప్పుడు, వర్షాలతో పాటు ఇతర కారణాలతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తినప్పుడు ప్రత్యేక లైన్‌ను అమలు చేస్తారు.
ప్రధాన రహదారులకు కుడి వైపున నాలుగు అడుగుల ప్రాంతాన్ని అంబులెన్స్‌ల కోసం వదలాలని భావిస్తున్నారు. ఆయా సమయాల్లో ఈ రూట్స్‌లో అంబులెన్స్‌లతో పాటు ఇతర అత్యవసర వాహనాలను మాత్రమే పంపేలా చర్య లు తీసుకోవాలని యోచిస్తున్నారు. ప్రయోగాత్మక అమలు తర్వాత ఇతర ఇబ్బందుల్ని గుర్తించి, వాటిని పరిష్కరించాక నగర వ్యాప్తంగా అన్ని వేళల్లో అమలు అంశాన్ని పరిశీలించనున్నారు.
అప్పట్లో ఢిల్లీలో ‘కామన్వెల్త్ లైన్’..
దేశ రాజధాని ఢిల్లీలో 2010 సంవత్సరంలో కామన్వెల్త్ గేమ్స్ జరిగాయి. అప్పట్లో ఆటగాళ్లకు నగరంలోని ప్రధాన హోటళ్ళలో బస ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల నుంచి ప్లేయర్లు మైదానాలకు రావడంలో ఆలస్యానికి తావు లేకుండా పోలీసు విభాగం ప్రధాన రహదారులకు కుడి వైపుగా ఓ లైన్ ఏర్పాటు చేసి, ఆ భాగాన్ని కామన్వెల్త్ లైన్‌గా మార్కింగ్ ఇచ్చింది. ఇందులోకి సాధారణ వాహనాలు వస్తే రూ.2 వేలు జరిమానా విధించింది. దీంతో ఆ ‘లైన్’ విజయవంతమై క్రీడాకారులకు ఇబ్బందులు తప్పాయి.