Sripada Nayak
-
రోడ్డు ప్రమాదం.. కేంద్ర మంత్రి భార్య మృతి
బెంగళూరు: కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కేంద్ర రక్షణ, ఆయూష్ శాఖ సహాయమంత్రి శ్రీపాదనాయక్ కారుకు రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మంత్రి భార్య విజయ అక్కడికక్కడే మృతి చెందారు. శ్రీపాదనాయక్‌కు తీవ్ర గాయాలు కాగా, ఆయన్ను గోవాలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఎల్లాపూర్ నుంచి గోవర్ణ వెళుతుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై గోవా సీఎంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడి తక్షణమే అత్యవసర చికిత్స అందించాలని ఆదేశించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
త్రివిధ దళాలకు డీఆర్డీఓ వ్యవస్థలు
న్యూఢిల్లీ: రక్షణ రంగ పరిశోధన సంస్థ డీఆర్డీఓ(డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్) అభివృద్ధి చేసిన మూడు భద్రత వ్యవస్థలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం త్రివిధ దళాల అధిపతులకు అందజేశారు. ఇండియన్ మారిటైమ్ సిచ్యువేషనల్ అవేర్నెస్ సిస్టమ్(ఇమ్‌సాస్)ను నౌకాదళ ప్రధానాధికారి అడ్మిరల్ కరమ్‌బీర్ సింగ్‌కు, అస్త్ర ఎంకే –1 క్షిపణి వ్యవస్థను వైమానిక దళ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బధౌరియాకు, బోర్డర్ సర్వీలెన్స్ సిస్టమ్(బాస్)ను ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణెకు రాజ్‌నాథ్ అందజేశారని రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కార్యక్రమంలో రక్షణ శా ఖ సహాయ మంత్రి శ్రీపాద నాయక్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ కూడా పాల్గొన్నారు. క్షిపణుల కంటే సెల్ ఫోన్లే శక్తివంతం మారుతున్న కాలానికి అనుగుణంగా దేశ భద్రత విషయంలో కొత్త ముప్పు పొంచి ఉంటోందని, యుద్ధ రీతులు సైతం మారిపోతున్నాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఆయన శుక్రవారం చండీగఢ్‌లో జరిగిన మిలటరీ లిటరేచర్ ఫెస్టివల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. దేశాల మధ్య ఘర్షణల విషయంలో సోషల్ మీడియా అధిక ప్రభావం చూపుతోందని గుర్తుచేశారు. క్షిపణుల కంటే మొబైల్ ఫోన్ల పరిధే ఎక్కువ అని తెలిపారు. శత్రువు సరిహద్దు దాటకుండానే మరో దేశంలోని ప్రజలను చేరుకొనే సాంకేతికత వచ్చిందని, అందుకే ప్రతి ఒక్కరూ సైనికుడి పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. -
భారత్ చేతికి మూడు రాఫెల్ యుద్ధ విమానాలు
న్యూఢిల్లీ: భారత్ చేతికి ఇప్పటి వరకూ మూడు రాఫెల్ యుద్ధ విమానాలు అందినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం భారత వాయు సేన సిబ్బందికి (ఐఏఎఫ్) ఫ్రాన్స్‌లో శిక్షణ అందుతోందని లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా రక్షణ శాఖ సహాయక మంత్రి శ్రీపాద్ నాయక్ బుధవారం చెప్పారు. తొలి విమానాన్ని రాజ్‌నాథ్ అక్టోబర్ 8న స్వీకరించారు. రాఫెల్ విమానాలను ఫ్రాన్స్‌లోని డసోల్ట్ ఏవియేషన్ తయారు చేస్తోంది. ప్రస్తుతం భారత్ అందుకున్న 3 విమానాల్లో చివరి రెండు ఎప్పుడు అందుకున్నదన్న విషయాన్ని ఆయన చెప్పలేదు. 36 రాఫెల్ యుద్ధ విమానాల కోసం ఫ్రాన్స్‌తో కేంద్ర ప్రభుత్వం 2016లో దాదాపు రూ.59 కోట్లతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. మొదటి బ్యాచ్‌కు చెందిన 4 రాఫెల్ యుద్ధ విమానాలు వచ్చే ఏడాది మే నెలలో మన దేశానికి రానున్నాయి. -
బ్లాక్‌బెర్రీ మొబైల్‌కు 16 పట్టణాల సమాచారం
న్యూఢిల్లీ: మరొకరి సాయం లేకుండా దేశవ్యాప్తంగా 16 పట్టణాలలో సొంతంగానే పర్యటించేందుకు ఉపకరించే మొబైల్ అప్లికేషన్‌ను కేంద్ర పర్యాటక శాఖ విడుదల చేసింది. జెనెసిస్ ఇంటర్నేషనల్ సహకారంతో ‘ఇంక్రెడిబుల్ ఇండియా వాకింగ్ టూర్స్’ పేరుతో తీసుకొచ్చిన ఈ అప్లికేషన్లో హైదరాబాద్, చెన్నై, జైపూర్, గోవా, బెంగళూరు, ముంబై సహా 16 పట్టణాల సమాచారం ఉంటుందని పర్యాటక శాఖ వెల్లడించింది. నిపుణుల బందం ఈ సమాచారాన్ని పొందుపరిచిందని, ఈ అప్లికేషన్ ద్వారా పట్టణాల్లోని వీధులను 360 డిగ్రీల కోణంలో ఆమూలాగ్రం చూడవచ్చని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీపాదనాయక్ తెలిపారు. ప్రస్తుతానికి ఇది బ్లాక్‌బెర్రీ మొబైల్స్ కోసమే అందుబాటులో ఉంది. త్వరలో ఆండ్రాయిడ్ అప్లికేషన్ కూడా విడుదల చేస్తామని చెప్పారు.