Start-Up India
-
'ఐటీ రంగం అభివృద్ధి రహస్యమిదే'
-
'ఐటీ రంగం అభివృద్ధి రహస్యమిదే'
న్యూఢిల్లీ: ఓ వైపు ఖాయిలాపడే పరిశ్రమలు, నష్టాలబాటలో నడిచే కర్మాగారాల సంఖ్య పెరిగిపోతుండగా, ఐటీ రంగం మాత్రం విప్లవాత్మక మార్పులతో దూసుకెళ్లటం చూస్తున్నాం. ఇంతటి అభివృద్ధి వెనక దాగున్న రహస్యం గుట్టువిప్పారు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన స్టార్ట్-అప్ ఇండియాను లాంచ్ చేసిన ఆయన పలు అంశాలపై కూలంకషంగా మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నేటి సాయంత్రం అధికారికంగా ప్రారంభించనున్నారు. 'గతంలో ఒక పరిశ్రమను స్థాపించాలంటే ఎన్నో అడ్డంకులు. 'లైసెన్స్ రాజ్' విధానంతో పారిశ్రామికవేత్తలకు ఎన్నో ఇబ్బందులు. కాలక్రమంలో ఇండియా ఆ విధానానికి తిలోదకాలిచ్చింది. ప్రస్తుత ప్రభుత్వం యువ పారిశ్రామికవేత్తల అభ్యున్నతికి కట్టుబడి ఉంది. అందుకు 'స్టార్ట్-అప్ ఇండియా' వేదికగా నిలుస్తుంది. మన దేశంలో ఒక్కో రాష్ట్రానిది ఒక్కో పారిశ్రామిక విధానం. ఈ పరిస్థితిని మార్చాల్సిన అవసరాన్ని గుర్తించాం. అందుకే విధాన నిర్ణయాల్లో రాష్ట్రాల ప్రాధాన్యతను తగ్గించాలనుకుంటున్నాం' అని అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. ప్రభుత్వ అజమాయిషీ ఎంత తగ్గితే సంస్థలు అంతగా వృద్ధిలోకి వస్తాయన్న జైట్లీ.. ఆది నుంచీ ప్రభుత్వ పర్యవేక్షణలో లేనందునే ఐటీ రంగం అద్భుత పురోగతిని సాధించిందన్నారు. ఆర్థికంగా ప్రపంచ దేశాలన్నీ మందగమనంలో ఉన్నవేళ అందుకు విరుద్ధంగా భారత్ వృద్ధిబాటలో పయనిస్తున్నదని, ఆ మేరకు యువత అవకాశాలు అందివ్వటమే 'స్టార్ట్-అప్ ఇండియా' ప్రధాన ఉద్దేశ్యమని జైట్లీ ఉద్ఘాటించారు. -
'స్టార్ట్ అప్'ల ఆలస్యానికి నేనే కారణం: ప్రణబ్
న్యూఢిల్లీ: యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేలా స్టార్ట్ అప్ లను ప్రారంభించడంలో భారత్ వెనుకబడిపోయిందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. స్టార్ట్ అప్ ల విషయంలో దేశం ఆలస్యంగా మేల్కొందని, అందుకు కారణం కూడా తానేనని ఆవేదన చెందారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన 'స్టార్ట్ అప్ ఇండియా' కార్యక్రమ ప్రారంభానికి కొద్ది గంటలముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేయటం గమనార్హం. గ్రామీణ స్థాయిలో యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే దిశగా చేపట్టనున్న స్టార్-అప్ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో సిలికాన్ వ్యాలీ సీఈవోలతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నిన్న రాత్రి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. 'ప్రభుత్వం స్టార్ట్ అప్ లను బాగా ప్రోత్సహిస్తోందని మీలో చాలా మంది మాట్లాడారు. మీరన్నది సరైందే కానీ వాస్తవమేమిటంటే స్టార్ట్ అప్ ల విషయంలో ఇండియా ఇప్పుడే మేల్కొంది. జరిగిన ఆలస్యానికి భారీ మూల్యం కూడా చెల్లించుకుంటోంది. నిజానికి ఈ ప్రోత్సాహకాలు ఒక దశాబ్దం కిందటే ప్రవేశపెట్టిఉంటే గనుక పరిస్థితి మరోలా ఉండేది. ఆలస్యానికి ప్రధాన కారణం నేనేనని చెప్పక తప్పదు. ఆర్థిక మంత్రిగా(గతంలో) నూతన పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడంలో విఫలమయ్యా. అప్పట్లో నేను త్వరపడి ఉంటే బాగుండేది' అని ప్రణబ్ చెప్పుకొచ్చారు. స్టార్ట్ అప్ లను ప్రోత్సహించడంలో ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ తీరును ఆయన ప్రశంసించారు. కాగా శనివారం నాటి కార్యక్రమంలో స్టార్ట్-అప్ ఉద్యమానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా స్టార్ట్-అప్‌లో ప్రారంభించిన యువ సీఈవోలు హాజరుకానున్నారు. స్టార్ట్-అప్ వర్చువల్ ఎగ్జిబిషన్‌ను కూడా ప్రధాని ప్రారంభిస్తారు. బ్యాంక్ రుణాలతో పాటు ఇతర ప్రోత్సహాకాలను యువ పారిశ్రామికవేత్తలకు కల్పించే లక్ష్యంగా స్టార్ట్-అప్ ఉద్యమం సాగనుంది. ఈ రోజు జరిగే కార్యక్రమంలో కీలక మంత్రిత్వ శాఖలు, డిపార్ట్మెంట్లకు సంబంధించిన కార్యదర్శులతో యువ పారిశ్రామికవేత్తలు ముఖాముఖీ చర్చలు జరిగే అవకాశం ఉంది.