సమ్మె విరమణ
కార్మిక సంఘాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించాయి. సమస్యల పరిష్కారానికి ఓ కమిటీ వేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అరెస్టయిన కార్మికులను విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. దీంతో రవాణాశాఖ సంఘాల నాయకులు స్పందించారు. సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించారు. నాలుగు రోజులుగా డిపోలకే పరిమితమైన బస్సులు బుధవారం ఉదయం నుంచి తిరగడం మొదలుపెట్టారుు.
చెన్నై, సాక్షి ప్రతినిధి:రవాణాశాఖ కార్మికులు, సిబ్బంది చేపట్టిన సమ్మె బుధవారం సుఖాంతమైంది. వాహనాలు రోడ్డెక్కారుు. ఇదిలావుండగా రవాణాశాఖ సిబ్బందికి ప్రతి మూడేళ్లకు ఒకసారి వేతనాన్ని సవరించాల్సి ఉంది. గత ఏడాదితో మూడేళ్లు నిండిపోయూరుు. కానీ దీనిపై ప్రభుత్వం జాప్యం చేస్తూవస్తోంది. సుమారు ఆరు నెలలుగా ప్రభుత్వాన్ని సంప్రదిస్తూ వస్తున్న సంఘాల నాయకులు ఫలితం లేదని భావించి సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఈనెల 28వ తేదీ నుంచి సమ్మెకు పూనుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బస్సులు డిపోల్లోనే ఉండిపోయాయి. రాష్ట్రం నలుమూలల నుంచి బస్సుల రాకపోకలు స్తంభించిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు లోనయ్యారు. ఇదే అదునుగా కాల్‌టాక్సీ, ఆటోవాలాలు చార్జీలు పెంచి అందినంత దోచుకున్నారు. లోకల్ రైళ్లు కిక్కిరిసిపోయాయి. మొదటి రోజు సమ్మె పూర్తిస్థాయిలో విజయవంతమైంది. కానీ మరుసటి రోజు నుంచి బలహీనపడింది. అన్నాడీఎంకే సంఘాలవారు సమ్మె నుంచి వైదొలిగి డిపోల నుంచి బస్సులను బయటకు తీశారు. అధికార, ప్రతిపక్ష సంఘాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. బస్సుల ధ్వంసం, రాస్తారోకోలు, బైఠాయింపులతో మూడు రోజుల పాటు సమ్మె సాగింది. శనివారం దాదాపు 50 శాతం బస్సులు తిరిగాయి.
రవాణా మంత్రి చర్చలు
ఒకవైపు సమ్మె నీరుగారిపోతుండగా, మరోవైపు రాష్ట్ర రవాణాశాఖా మంత్రి సెంథిల్‌బాలాజీ బుధవారం ఉదయం 10.30 గంటలకు సచివాలయంలో చర్చలు ప్రారంభించారు. మొత్తం 8 రవాణా కార్పొరేషన్ల నుంచి 12 సంఘాల ప్రతినిధులు హాజరయ్యూరు. రవాణా సిబ్బంది డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వం రెండు రోజుల్లో ఒక కమిటీని వేసేందుకు అంగీకరించడంతో సమ్మెను విరమించినట్లు సంఘాల నాయకులు ప్రకటించారు. అలాగా సమ్మె సమయంలో అరెస్ట్ చేసిన కార్మికులను వెంటనే విడుదల చేసేందుకు ప్రభుత్వం అంగీకరించిదన్నారు. అరెస్టయినవారిలో శాంతియుతంగా సమ్మె నిర్వహించినవారిని వెంటనే విడుదల చేస్తారని తెలిపారు. క్రిమినల్ కేసులపై అరెస్టయిన కార్మికులను రెండు రోజుల్లో విడుదల చేసి కేసులను కొట్టివేసేందుకు సైతం మంత్రి సుముఖత వ్యక్తం చేశారని వారు తెలిపారు. డిమాండ్ల సాధన కమిటీలో ఎవరెవరు సభ్యులుగా ఉండాలో ప్రభుత్వమే నిర్ణయిస్తుందని అన్నారు.
అయితే మొత్తం 11 సంఘాలకు చెందిన ప్రతినిధులు సభ్యులుగా ఉంటారని వారు చెప్పారు. ఇదిలా ఉండగా డీఎంకే అనుబంధ సంఘాల వైఖరే సమ్మెకు దారితీసిందనే ఆరోపణలు చేశారు. ఉద్యోగ, కార్మికుల న్యాయపరమైన కోర్కెల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉన్నా ఇతర విపక్షాలను రెచ్చగొట్టి సమ్మెకు పురిగొల్పారని అన్నాడీఎంకే సంఘాల ప్రతినిధులు విమర్శించారు. 10.30 గంటలకు ప్రారంభమైన చర్చలు 10.45 నిమిషాలకు ముగిశాయి. సచివాలయం నుంచి బైటకు రాగానే అన్ని సంఘాల నేతలు విక్టరీకి చిహ్నం చూపిస్తూ మీడియా ముందు పోటీలుపడి ఫొటోలు దిగారు. నాలుగు రోజులుగా జరుగుతున్న సమ్మె కేవలం 15 నిమిషాల చర్చలతోనే ముగిసిపోవడం గమనార్హం.