కొండలలో కోటి జ్ఞానకాంతుల స్వామి పళని మురుగన్
శివపార్వతుల గారాల తనయుడు, దేవసేనాధిపతి, తారకాసురుడనే రాక్షస సంహారానికి ఉద్భవించిన కారణజన్ముడు కార్తికేయుడు. సకల విద్యాపారంగతుడిగా, జ్ఞానప్రదాతగా, దండాయుధపాణిగా, నిత్యయవ్వనుడుగా సుబ్రహ్మణ్యేశ్వరునికి పేరుంది. సుబ్రహ్మణ్యేశ్వరుని ఆలయాలకు, ఆయనను అర్చించే భక్తులకు తెలుగునాట కొదవలేనప్పటికీ తమిళనాడు, కర్ణాటకలలో మనకన్నా అధికంగా సుబ్రహ్మణ్యేశ్వరునికి అడుగడుగునా గుడులు కట్టి పూజించడం సర్వసాధారణంగా కనబడుతుంటుంది. తమిళనాట గల ప్రసిద్ధి చెందిన సుబ్రహ్మణ్యక్షేత్రం పళని. దండాయుధపాణిగా, బాలమురుగన్‌గా, పళని మురుగన్‌గా తమిళులు కొలిచే ఈ స్వామి ఆలయం ఎంతో ప్రముఖమైనదిగా, మహిమాన్వితమైనదిగా వాసికెక్కింది.
స్థలపురాణం: వినాయకచవితినాడు మనందరం చెప్పుకునే కథ ఒకటుంది. అదేమంటే గణాధిపత్యం కోసం పోటీపడుతున్న కుమారులతో భూమండల ంలోని అన్ని పుణ్యతీర్థాలలోనూ స్నానం చేసి, ఎవరు ముందుగా తమ వద్దకు వస్తారో, వారికే గణాధిపత్యమిస్తానని శివుడు చెప్పడం, ఆ మాట వినడంతోటే తన మయూరవాహనాన్ని అధిరోహించి, కుమారస్వామి వాయువేగంతో వెళ్లిపోవడం, వినాయకుడు తెలివి తేటలను ఉపయోగించి, నారాయణ మంత్రాన్ని పఠిస్తూ, మూడుమార్లు తన తల్లిదండ్రులైన శివపార్వతుల చుట్టూ ప్రదక్షిణ చేయడం, ఆ ప్రదక్షిణ మహిమతో కుమారస్వామి ఏ పుణ్యతీర్థానికేగినా అన్నగారే తనకన్నా ముందుగా వచ్చి పుణ్యతీర్థాలలో స్నానం చేసి వె ళ్లిన ఆనవాళ్లు కనిపించి ఖిన్నుడై, కైలాసం వచ్చేసరికి, ఈ పరీక్షలో గణేశుడే నెగ్గాడంటూ గణాధిపత్యాన్ని వినాయకుడికే కట్టబెట్టడం.. ఆ ఆనందోత్సాహాలతో వినాయక చవితి పండుగ జరుపుకోవడం...
ఇంతవరకూ కథ అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఏం జరిగిందో, వినాయకచవితిరోజున తెలుసుకోవడానికి అవకాశం ఉండదు. అది ఇప్పుడు తెలుసుకుందాం.. అప్పుడు జరిగిన పరిణామానికి బాలసుబ్రహ్మణ్యేశ్వరుడు ఎంతో బాధపడతాడు. తలిదండ్రుల మీద అలిగి, అన్నగారిలాగా తనకు కూడా పరిపక్వమైన జ్ఞానం లభించాలనే కాంక్షతో తన అలంకారాలన్నింటినీ వదిలేసి, భూలోకం వెళ్లి అక్కడ తనకు నచ్చిన ఒక కొండమీద గల ప్రశాంతమైన వాతావరణంలో తపస్సులో మునిగిపోయాడు. కైలాసంలో కుమారుని జాడ తెలియక పార్వతీదేవి బెంగపడుతుంది. పరమేశ్వరుడు పత్నిని ఊరడించి, ఆమెను వెంటబెట్టుకుని కొడుకుని వెతుకుతూ భూలోకానికి పయనమవుతాడు. ఇద్దరూ కలసి వెతుకుతుండగా, తమిళనాడులోని తిరు ఆవినంకుడి అనే ప్రదేశంవద్దకు రాగానే కొండశిఖరం బంగారు కాంతులతో మెరుస్తూ కనపడటంతో తమ కుమారుడు అక్కడే ఉన్నాడని తెలుసుకుంటారు.
తపోదీక్షలో ఉన్న పుత్రుని చేరదీసి, ముద్దాడుతూ, ‘నువ్వే నా జ్ఞానఫలానివిరా బంగారుకొండా’ అంటూ పార్వతీ పరమేశ్వరులు కుమారుని అనుగ్ర హిస్తారు. తల్లిదండ్రుల ఊరడింపుతో కుమారస్వామి అలకమానతాడు కానీ, ఆ ప్రదేశం తనకు ఎంతో నచ్చడంతో తన అంశను అక్కడే వదిలి, తలిదండ్రులతో తిరిగి కైలాసం చేరతాడు. ఇదీ పళని సుబ్రహ్మణ్యేశ్వరుని పురాగాథ. ఆ ప్రదేశమే ప్రస్తుతం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని భక్తులు అర్చించే పళని ఆలయం. తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో మధురైకి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కొండ ప్రకృతి రమణీయకతకు పెట్టింది పేరు.
అన్ని విగ్రహాల్లాంటిది కాదు: పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం అన్ని విగ్రహాలలా రాతితో మలిచింది కాదు. నవపాషాణాలతో ప్రత్యేకంగా తీర్చిదిద్దినది. ఈ నవ పాషాణాలనే తొమ్మిది విధాలైన మూలికలు అని కొందరంటారు, తొమ్మిది భయంకరమైన విషాలనూ ప్రత్యేకమైన పాళ్లలో కలిపితే అమృతం వంటి ఔషధం తయారవుతుందని, అందుకే దీనిని భోగార్ అనే ముని ఈ విగ్రహాన్ని ప్రత్యేకశ్రద్ధతో మలచాడని క్షేత్రపురాణం చెబుతోంది. ఈ ఆలయం దాదాపు పదహారు గంటలసేపు తెరిచే ఉంటుంది. అందరూ స్వామిని దర్శనం చేసుకునేందుకు వీలుగా గర్భాలయం తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయి.
ఈ మందిరం క్రీస్తుశకం 7వ శతాబ్దంలో కేరళ రాజు చీమన్ పెరుమాళ్ కట్టించగా, దానిని పాండ్యరాజులు పునరుద్ధరించారు.
అద్భుతమైన శిల్పసంపదతో, కేవలం కౌపీనం మాత్రమే కట్టుకుని, చేతిలో శూలాయుధం పట్టుకుని, చూడగానే ఆకట్టుకునే అందమైన విగ్రహంతో కనువిందు చేస్తాడు ఈ దేవసేనాని, దండాయుధ పాణి. కావడి మొక్కులంటే ఇష్టమట ఈస్వామికి. అంటే ఏదయినా ఆపద కలిగినప్పుడు తాము సమర్పించగలిగినదానిని కావిళ్లకొద్దీ సమర్పించుకుంటామని మొక్కుకుని, ఆపద తీరగానే, నియమ నిష్ఠలతో స్వామికి కావిళ్లలో కానుకలు మోసుకుంటూ నృత్యగానాలతో స్వయంగా సమర్పించుకుంటారు భక్తులు. తండ్రి అయిన శివునిలాగే ఈయన కూడా అభిషేక ప్రియుడు. కార్తికమాసంలో అయితే రోజుకు కనీసం 700 మార్లు భ క్తుల అభిషేకాలందుకుంటాడు ఈ స్వామి. వల్లీ, దేవసేన ఆయన భార్యలు. ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ షష్ఠిరోజున స్వామివారికి కన్నులపండువగా కల్యాణోత్సవం జరుగుతుంది.
పర్యాటక స్థలాల పళని
పళని చుట్టూ బోలెడన్ని పర్యాటక స్థలాలున్నాయి. తిరునావినంకుడి ఆలయం, ఇదుంబన్ ఆలయం, పదగణపతి ఆలయం, తిరు అవినాకుడి ఆలయం, పెరియ నాయకి అమ్మన్ ఆలయం, పెరియన్ అవుడైయర్ ఆలయం, కన్నడి పెరుమాల్ ఆలయం, పళని కొండలు, పార్వతీదేవికి తల్లిగా పేర్కొనే మరియమ్మన్ ఆలయం, మురుగన్ విగ్రహ శిల్పి భోగర్ సమాధి ఆలయం, కురుంజి అందవార్ ఆలయం, లక్ష్మీనారాయణ పెరుమాళ్ ఆలయం ముఖ్యమైనవి. అసలు పళని కొండలే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి. ప్రకృతి అందాలను వీక్షిస్తూ పళని ఆలయాన్ని చేరుకోవాలంటే మెట్లమార్గంలో వెళ్లడం ఉత్తమం.
ఎప్పుడు వెళ్లాలి?
వాతావరణ పరిస్థితుల రీత్యా పళని వెళ్లేందుకు చలికాలమే అనకూలమని చెప్పాలి. ఎందుకంటే ఎండాకాలంలో విపరీతమైన వేడి ఉంటుంది. వర్షాకాలంలో కొండ ఎక్కడం కొంచెం కష్టమే. అదే చలికాలంలో అయితే హాయిగా వెళ్లవచ్చు. ప్రకృతి అందాలను తనివితీరా తిలకింవచ్చు. పళనిలో ప్రత్యేకమైన కొంగలు బారులు తీరుతాయి. నారాయణ పక్షులు, గోల్డెన్ వడ్రంగి పిట్టలు కనువిందు చేస్తాయి. వాటి కిలకిలరావాలతో మనస్సుకు ఆహ్లాదం కలిగిస్తాయి. చలికాలంలోనే పళనిలో అనేక ఉత్సవాలు జరుగుతాయి. వాటిలో కావడి ఉత్సవం, మార్గశిరశుద్ధ షష్ఠికి జరిగే కల్యాణోత్సవం ఒకటి.
వివాహం కానివారు, సంతానం లేనివారు, కుజదోషం ఉన్నవారు, రాహు, కేతు, కుజగ్రహదోషాలు ఉన్నవారు, కాలసర్పదోషం, నాగదోషం వగైరాలతో బాధపడేవారు పళని సుబ్రహ్మణ్యేశ్వరుని సందర్శించుకుని స్వాంతన పొందుతారు. అంతేకాదు, జ్ఞానప్రదాతగా పేరుగాంచిన సుబ్రహ్మణ్యేశ్వరుని బుద్ధిమాంద్యంతో బాధపడేవారు కన్నులారా సందర్శించుకుని ఆయా బాధలనుంచి విముక్తి పొందుతుంటారు.
ఎలా వెళ్లాలంటే..?
పళని సుబ్రహ్మణ్యేశ్వరాలయానికి వెళ్లడం సులువే. రైలు, బస్సు, విమాన మార్గాలున్నాయి. దేశంలోని అన్ని ప్రధాన నగరాలనుంచి పళనికి నేరుగా బస్సులు, రైళ్లు ఉన్నాయి. రైలు మార్గం: పొల్లాచ్చి మీదుగా మధురై నుంచి కోయంబత్తూరు వెళ్లే రైలుంది. అలాగే తిరుచెందూరు నుంచి మధురై మీదుగా పళని వెళ్లేందుకు రైలుంది. చెన్నై సెంట్రల్ నుంచి పళని వెళ్లేందుకు ప్రత్యేకంగా రైలుంది. ఎలాగైనా పళని చేరుకుంటే అక్కడి నుంచి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో గల ఆలయాన్ని చేరుకోవడానికి ఆటోరిక్షాలు, బస్సులు విరివిగా ఉన్నాయి. వాయుమార్గం: పీలమేడు లేదా కోయంబత్తూరు, మధురై వరకు విమానంలో వెళ్తే అక్కడినుంచి పళనికి బస్సులు, రైళ్లు ఉన్నాయి.
- డి.వి.ఆర్. భాస్కర్