శోభానాగిరెడ్డి మృతి.. ప్రముఖుల సంతాపాలు
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష ఉప నాయకురాలు శోభానాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించారన్న సమాచారం రాష్ట్రంలోని ప్రముఖులు, రాజకీయ నేతలను విస్మయపరిచింది. మరణవార్త విన్న పలువురు రాజకీయ ప్రముఖులు గురువారం హైదరాబాద్ వచ్చి ఆమె పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. వివిధ పార్టీల నేతలు వేర్వేరు ప్రకటనల్లో సంతాపాలను ప్రకటించారు.
నరసింహన్, రోశయ్య, ప్రముఖుల సంతాపం
శోభా నాగిరెడ్డి మృతి దురదృష్టకరమని రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఢిల్లీలో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. శోభా నాగిరెడ్డి మరణవార్త దిగ్భ్రాంతికి గురి చేసిందని తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఆమె తన సేవాతత్వంతో ప్రజల మనస్సుల్లో స్థానం సంపాదించుకున్నారని పేర్కొన్నారు. ఆమె లేని లోటు ఆ కుటుంబానికి తీరనిదని, ఆమె ఆత్మకు శాంతి కలగాలని దేవున్ని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. శోభ మరణం కుటుంబ సభ్యులకే కాకుండా కర్నూలు జిల్లా ప్రజలకు పూడ్చలేని లోటని శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తన సంతాపాన్ని ప్రకటించారు.
శోభానాగిరెడ్డి దుర్మరణం పట్ల కేంద్రమంత్రి చిరంజీవి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు, టీపీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, బీజేపీ నేతలు కిషన్‌రెడ్డి, హరిబాబు, వెంకయ్యనాయుడు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, లోక్‌సత్తా అధినేత జేపీ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు, టీడీపీ ఎంపీలు దేవేందర్‌గౌడ్, సుజనా చౌదరి, ఎమ్మెల్యే వంగా గీత తమ సంతాపాన్ని ప్రకటించారు. శోభానాగిరెడ్డి మరణం తమ పార్టీకి, తమకు తీరని లోటని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, పత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత, నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్, కొండేపి అభ్యర్థి జూపూడి ప్రభాకర్, పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సినీహీరో రాజా తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.
మాటలకందని విషాదం: తండ్రి ఎస్వీ సుబ్బారెడ్డి
‘‘శోభ మరణం ఊహకందని, మాటలకందని మహా విషాదం. చిన్నప్పటినుంచి చాలా ఉత్సాహంగా ఉండేది. నాతో ఎక్కువ చనువుగా ఉండేది. పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు నాతోపాటు కార్యాలయానికి వచ్చేది. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా నాతో కలసి తిరిగేది. అందుకే ఆమెకు రాజకీయాలంటే మంచి ఆసక్తి. తండ్రి, కూతురు ఒకే శాసనసభలో కూర్చోవడం చాలా అరుదైన విషయం. అప్పట్లో మహబూబ్‌నగర్ నుంచి సి.నర్సిరెడ్డి, ఆయన తనయ డీకే అరుణ మాత్రమే మాలాగా ఎమ్మెల్యేలుగా ఉండేవారు. శోభ ప్రతి విషయం నాతో చర్చించేది. అసెంబ్లీలో ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడవచ్చా.. లేదా? అని అడిగి తెలుసుకునేది.
చిన్నవయస్సులోనే రాజకీయాల్లో అందరి మెప్పు పొం దింది. బుధవారం రాత్రి 12 గంటలకు హైదరాబాద్‌లో ఉండే నా స్నేహితుడు టీవీల్లో శోభానాగిరెడ్డికి ప్రమాదం జరిగిందని స్క్రోలింగ్ వస్తోందని ఫోన్ చేసి చెప్పేవరకు నాకు తెలియదు. వెంటనే నా కుమారుడు మోహన్‌రెడ్డికి ఫోన్ చేశాను. నా కోడలుతో పాటు నంద్యాలకు వెళ్తున్నామని మోహన్ చెప్పాడు. నేను బయలుదేరుతానన్నాను. నీ ఆరోగ్యం బాగాలేదు వద్దని వారించారు. నేను యువకుడిగా ఉన్నప్పుడు రాజకీయాలంటే అసలు ఆసక్తే ఉండేది కాదు. అలాంటిది కాలేజీ సెలవుల్లో ఊరికి వచ్చి రాజకీయాల్లోకి వచ్చేశాను. శోభ కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఓ మంత్రిగా ఉంటుందని అనుకున్నాను. అయితే మనం అనుకున్నవన్నీ జరగవు కదా. భూమా నాగిరెడ్డిని పెంచింది కూడా నా భార్యే. ఆళ్లగడ్డలో మా కుటుంబానికి ఓ చరిత్ర ఉంది. రాజకీయంగా ఓ పేరుంది. ఆ స్ఫూర్తిని అందుకునే శోభ రాజకీయంగా ఎదిగింది’’ అని ‘సాక్షి’తో తనయ జ్ఞాపకాలను నెమరేసుకుని ఎస్వీ సుబ్బారెడ్డి కన్నీటిపర్యంతమయ్యారు.