వ్యవసాయోత్పత్తుల కోసం ‘స్వదేశ్’ మాల్స్..
మండల కేంద్రాల్లో ఏర్పాటు; మాల్స్‌లో మినీ థియేటర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశ, విదేశీ బ్రాండ్ల ఔట్లెట్లతో నిండిన మాల్స్ కాకుండా... వ్యవసాయోత్పత్తులు, స్థానిక కంపెనీలు తయారు చేసే ఉత్పత్తుల విక్రయానికి కూడా సరికొత్త మాల్స్ రాబోతున్నాయి. పెపైచ్చు ఇవి మండల కేంద్రాలకే పరిమితం కానున్నాయి. ఢిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్వదేశ్ గ్రూప్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వ్యాపారావకాశాలను గుర్తించి మాల్స్ తరహాలో స్వదేశ్ బజార్స్‌ను ఏర్పాటు చేయటానికి ముందుకొచ్చింది. రైతులు పండించిన ఉత్పత్తులు, స్థానికంగా చేతివృత్తులవారు, చిన్న కంపెనీలు తయారు చేసే ఉత్పత్తులు వీటిలో విక్రయిస్తారు. రైతులు, తయారీదారులు స్వయంగా తమ ఉత్పత్తులను అమ్ముకోవచ్చని గ్రూప్ ప్రాజెక్ట్స్ డెరైక్టర్ ఎం.కృష్ణ ప్రసాద్ శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు.
తొలి కేంద్రం మేడ్చల్ వద్ద: స్వదేశ్ గ్రూప్ తొలి స్వదేశ్ బజార్‌ను హైదరాబాద్ సమీపంలోని మేడ్చల్ వద్ద నెలకొల్పుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనూ దశలవారీగా ఇతర మండల కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నట్టు గ్రూప్ సలహాదారు, ఎంకే ఇంటర్నేషనల్ గ్రూప్ డెరైక్టర్ హరికృష్ణ మారం తెలిపారు. బజార్ల స్థాపనకు కావాల్సిన పెట్టుబడిని స్వదేశ్ గ్రూప్ కంపెనీలు సమకూరుస్తాయన్నారు. వివిధ బ్రాండ్లకు థర్డ్ పార్టీగా ఉన్న తయారీ ప్లాంట్ల నుంచి దుస్తులు, పానీ యాలు, ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేసి సొంత బ్రాండ్‌లో తక్కువ ధరకు విక్రయిస్తామని తెలియజేశారు. స్వదేశ్ బజార్లోనే మినీ థియేటర్లు నిర్మిస్తారు. స్వదేశ్ గ్రూప్‌ను యూఎస్‌తోపాటు పలు దేశాల్లో ఉన్న ఇన్వెస్టర్లు ప్రమోట్ చేస్తున్నారు.