tehalka editor
-
ఏడున్నరేళ్ల పోరాటం: తరుణ్ తేజ్‌పాల్ నిర్దోషి
పనాజీ: అత్యాచారం కేసులో తెహల్క మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ నిర్దోషిగా బయటపడ్డాడు. అతడు నిర్దోషి అని గోవా కోర్టు తేల్చి చెప్పింది. 2013లో థింక్ ఇన్ గోవా సమావేశంలో తనను తరుణ్ తేజ్‌పాల్ లైంగికంగా వేధించాడంటూ ‘తెహల్క.కమ్’కు చెందిన మహిళా జర్నలిస్టు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ మొదలుపెట్టిన పోలీసులు అదే ఏడాది నవంబర్ 30వ తేదీన అరెస్ట్ చేశారు. దీనిపై గోవా కోర్టు విచారణ చేపట్టింది. ఈ ఆరోపణలపై తేజ్‌పాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తప్పుడు ఆరోపణలని, ఈ కేసును కొట్టివేయాలని పిటిషన్ వేశారు. బెయిల్ కోసం కూడా విజ్ఞప్తి చేశారు. విచారణ చేసి 2014 జూలై 1వ తేదీన సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. తదనంతరం తనపై ఆరోపణలను కొట్టివేయాలని.. కేసు రద్దు చేయాలని దాఖలు చేసిన పిటిషన్‌ను మాత్రం సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో గోవా కోర్టులో విచారణ జరిగి చివరకు 2021 మే 21 శుక్రవారం నాడు తీర్పు వెలువడింది. తరుణ్ తేజ్‌పాల్ నిర్దోషి అని పేర్కొంటూ పేర్కొంది. ఏడున్నరేళ్ల తర్వాత తీర్పు వెలువడడంతో తేజ్‌పాల్ కుమార్తె కారా తేజ్‌పాల్ హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా తన న్యాయవాది దివంగత రాజీవ్ గోమొస్‌కు తేజ్‌పాల్ కృతజ్ఞతలు తెలిపారు. ఆయన ఇటీవల కరోనాతో మృతిచెందాడు. -
తేజ్‌పాల్‌కు బెయిల్ మంజూరు
-
ఎట్టకేలకు తరుణ్ తేజ్‌పాల్‌కు బెయిల్ మంజూరు
న్యూఢిల్లీ : మహిళా జర్నలిస్టుపై అత్యాచార ఆరోపణలతో జైలుపాలైన తెహల్కా పత్రిక వ్యవస్థాపక సంపాదకుడు తరుణ్ తేజ్‌పాల్‌కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. సుప్రీంకోర్టు మంగళవారం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. గత ఏడు నెలలుగా తరుణ్ తేజ్‌పాల్ గోవా జైల్లో ఉన్నారు. అంతకు ముందు తరుణ్ తేజ్ పాల్ తల్లి అనారోగ్యంతో మృతి చెందటంతో సుప్రీంకోర్టు ఆయనకు మూడు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. గతేడాది నవంబర్‌లో గోవాలోని ఓ హోటల్లో సహచర మహిళా ఉద్యోగిపై లైంగిక దాడికి పాల్పడినట్టు తేజ్‌పాల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పణజీలోని గ్రాండ్ హయత్ ఫైవ్‌స్టార్ హోటల్ లిఫ్టులో తన జూనియర్ మహిళా జర్నలిస్టుపై అత్యాచారం, తదితర నేరాలకు పాల్పడ్డారని, ఇందుకు తగిన ఆధారాలు ఉన్నాయని చార్జిషీట్లో పేర్కొన్నారు. పలు సంచలనాత్మక స్టింగ్ ఆపరేషన్లు నిర్వహించిన తేజ్‌పాల్ ఈ అభియోగాల కింద దోషిగా తేలితే ఏడేళ్లకు పైగా జైలు శిక్ష పడుతుంది. -
తరుణ్ తేజ్‌పాల్‌కు మధ్యంతర బెయిలు
పనాజి: అత్యాచార ఆరోపణలతో జైలుపాలైన తెహల్కా పత్రిక వ్యవస్థాపక సంపాదకుడు తరుణ్ తేజ్‌పాల్‌కు సుప్రీంకోర్టు మూడు వారాల మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన తల్లి శకుంతల తేజ్ పాల్(87) నేడు కన్నుమూశారు. తల్లి అంత్యక్రియలు, కార్మకాండలు నిర్వహించేందుకు వీలుగా ఆయనకు కోర్టు బెయిల్ ఇచ్చింది. గతేడాది నవంబర్‌లో గోవాలోని ఓ హోటల్లో సహచర మహిళా ఉద్యోగిపై లైంగిక దాడికి పాల్పడినట్టు తేజ్‌పాల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పణజీలోని గ్రాండ్ హయత్ ఫైవ్‌స్టార్ హోటల్ లిఫ్టులో తన జూనియర్ మహిళా జర్నలిస్టుపై అత్యాచారం, తదితర నేరాలకు పాల్పడ్డారని, ఇందుకు తగిన ఆధారాలు ఉన్నాయని చార్జిషీట్లో పేర్కొన్నారు. పలు సంచలనాత్మక స్టింగ్ ఆపరేషన్లు నిర్వహించిన తేజ్‌పాల్ ఈ అభియోగాల కింద దోషిగా తేలితే ఏడేళ్లకుపైగా జైలు శిక్ష పడుతుంది. -
తేజ్‌పాల్ కేసులో బదులిచ్చిన డినీరో
పణజీ: తెహల్కా పత్రిక సంపాదకుడు తరుణ్ తేజ్పాల్పై నమోదైన అత్యాచారం కేసులో గోవా పోలీసులు తనకు పంపిన ప్రశ్నావళికి ప్రముఖ హాలీవుడ్ నటుడు రాబర్ట్ డినీరో సమాధానాలు అందజేశారు. ఆయన న్యూయార్క్‌లోని తన న్యాయవాదుల ద్వారా ఇటీవల వీటిని గోవా క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు పంపించారు. తేజ్‌పాల్, ఆయనపై అత్యాచార ఆరోపణలు చేసిన మహిళా జర్నలిస్టు గత ఏడాది నవంబర్‌లో థింక్‌ఫెస్ట్ సదస్సు కోసం గోవా హోటల్లో ఉన్నట్లు డినీరో న్యాయవాదులు ధ్రువీకరించారని గోవా డీఐజీ ఓపీ మిశ్రా తెలిపారు. అయితే ఆయన డినీరో సమాధానాలను పూర్తిగా వెల్లడించలేదు. హోటల్లో బసచేసిన డినీరోను, ఆయన కూతురిని వారి గదిలోకి తీసుకెళ్లే క్రమంలో తేజ్‌పాల్ లిఫ్టులో తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపించడం తెలిసిందే. -
గోవా పోలీసుల అతిథిగా తెహల్కా ఎడిటర్!
లైంగిక ఆరోపణలతో ఉద్యోగానికి రాజీనామా చేసిన తెహల్కా పత్రిక ఎడిటర్ ఇన్ చీఫ్ తరుణ్ తేజ్పాల్ను గోవా పోలీసులు విచారించనున్నారు. తమ పత్రికలోనే పనిచేస్తున్న మహిళా జర్నలిస్టుకు తాను పంపిన ఈమెయిల్ సందేశం బయటపడటంతో ఆరు నెలల పాటు ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు తేజ్‌పాల్ గత రాత్రే ప్రకటించారు. పది రోజుల క్రితం గోవాలోని ఓ హోటల్ లిఫ్టులోకి తేజ్‌పాల్ తనను లాగారంటూ ఆ మహిళా జర్నలిస్టు తెహల్కా మేనేజింగ్ ఎడిటర్ షోమా చౌధురికి ఫిర్యాదు చేసింది. ఈ అంశంపై చౌధురి చేసిన వ్యాఖ్యల పట్ల మహిళా సంఘాల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. సీనియర్ జర్నలిస్టులు కూడా ఈ సంఘటనపై వెంటనే చర్య తీసుకోవాలని డిమాండు చేశారు. కానీ, దాన్ని సరిచేసుకోడానికి తనకు సమయం అవసరమని ఆమె చెప్పారు. ఈ మొత్తం సంఘటనపై గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ స్పందించారు. సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ వ్యవహారంపై ప్రాథమిక విచారణ జరిపించాలని ఆదేశించారు. ఈ సంఘటన జరిగిందని చెబుతున్న ఫైవ్‌స్టార్ హోటల్ సీసీ టీవీ ఫుటేజ్ కావాలని పోలీసులు యాజమాన్యాన్ని అడిగారు. ఈ సంఘటనపై సుమోటోగా విచారణ జరిపే అవకాశం కూడా లేకపోలేదు. బాధితురాలైన మహిళా జర్నలిస్టు నుంచి కూడా వాంగ్మూలం తీసుకునే యోచనలో గోవా పోలీసులు ఉన్నారు. తేజ్పాల్పై ప్రాథమిక విచారణ జరుగుతోందని, ఏదైనా విషయం బయటపడితే మాత్రం సుమోటోగా కేసు నమోదు చేస్తామని పారికర్ చెప్పారు.