ఎట్టకేలకు తరుణ్ తేజ్పాల్కు బెయిల్ మంజూరు
న్యూఢిల్లీ : మహిళా జర్నలిస్టుపై అత్యాచార ఆరోపణలతో జైలుపాలైన తెహల్కా పత్రిక వ్యవస్థాపక సంపాదకుడు తరుణ్ తేజ్పాల్కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. సుప్రీంకోర్టు మంగళవారం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. గత ఏడు నెలలుగా తరుణ్ తేజ్పాల్ గోవా జైల్లో ఉన్నారు. అంతకు ముందు తరుణ్ తేజ్ పాల్ తల్లి అనారోగ్యంతో మృతి చెందటంతో సుప్రీంకోర్టు ఆయనకు మూడు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.
గతేడాది నవంబర్లో గోవాలోని ఓ హోటల్లో సహచర మహిళా ఉద్యోగిపై లైంగిక దాడికి పాల్పడినట్టు తేజ్పాల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పణజీలోని గ్రాండ్ హయత్ ఫైవ్‌స్టార్ హోటల్ లిఫ్టులో తన జూనియర్ మహిళా జర్నలిస్టుపై అత్యాచారం, తదితర నేరాలకు పాల్పడ్డారని, ఇందుకు తగిన ఆధారాలు ఉన్నాయని చార్జిషీట్‌లో పేర్కొన్నారు. పలు సంచలనాత్మక స్టింగ్ ఆపరేషన్లు నిర్వహించిన తేజ్‌పాల్ ఈ అభియోగాల కింద దోషిగా తేలితే ఏడేళ్లకు పైగా జైలు శిక్ష పడుతుంది.