Thiagarajan
-
51 ఏళ్ల వయసులో పెళ్లి పీటలెక్కనున్న హీరో
కోలీవుడ్ హీరో ప్రశాంత్ రెండోసారి పెళ్లిపీటలెక్కనున్నాడు. 51 ఏళ్ల వయసున్న ఈయన త్వరలోనే మరోసారి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నాడు. ఈ విషయాన్ని ఆయన తండ్రి, దర్శకుడు త్యాగరాజన్ వెల్లడించాడు.అంధగన్ సినిమా సక్సెస్ మీట్లో త్యాగరాజన్.. ప్రశాంత్ పెళ్లి గురించి మాట్లాడాడు. వధువు గురించి వెతుకులాట మొదలుపెట్టామని, త్వరలో గుడ్‌న్యూస్ చెబుతామని తెలిపాడు. ఈ మాటలతో స్టేజీపై ఉన్న ప్రశాంత్ కాస్త సిగ్గుపడినట్లు కనిపించాడు.కాగా 2005లో ప్రశాంత్‌కు గృహలక్ష్మి అనే మహిళతో పెళ్లి జరిగింది. కానీ ఈ బంధం ఎంతోకాలం నిలబడలేదు. 2009లో వీరు విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి ఈయన సింగిల్‌గానే ఉంటున్నాడు. కెరీర్‌పైనే పూర్తి ఫోకస్ పెట్టిన ప్రశాంత్ ఇన్నాళ్లకు మళ్లీ పెళ్లి గురించి ఆలోచిస్తున్నాడు.సినిమాల విషయానికి వస్తే.. ఈయన తెలుగులో లాఠి, ప్రేమ శిఖరం, తొలి ముద్దు చిత్రాల్లోనూ నటించాడు. వినయ విధేయ రామలో కీలక పాత్రలో మెప్పించాడు. ఇటీవలే అంధగన్లో హీరోగా నటించిన ఈయన ప్రస్తుతం గోట్ సినిమా చేస్తున్నాడు. ఇందులో విజయ్ స్నేహితుడిగా కనిపించనున్నాడు. -
నా అనుకున్న వాళ్లే హీరో విక్రమ్‌ను తొక్కేశారా.. ఆయనకు జరిగిన నష్టం ఏంటి?
సినీ పరిశ్రమలో ఎందరో హీరోలు ఉన్నారు. వారిలో ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఎదిగిన వారు కూడా ఉన్నారు. అలాంటి అరుదైన కథానాయకుల్లో కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ ఒకరు. అయితే కెరీర్ ప్రారంభంలో తమిళ చిత్రాలతో పాటు నేరుగా తెలుగు మూవీస్‌లోనూ యాక్ట్ చేశారు విక్రమ్. విభిన్నమైన కథలతో, పాత్రలతో తనదైన ముద్ర వేసుకున్నారు. ప్రయోగాలు చేయడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. పేరుకు కోలీవుడ్ హీరో అయినప్పటికీ దాదాపు అన్ని భాషల్లో ఆయనకు అభిమానులు ఉన్నారు. అయితే విక్రమ్ సినిమా కెరీర్ ఆరంభం సవాళ్లతో కూడుకున్నది. విక్రమ్‌ను దురదృష్టవంతుడని కూడా అప్పట్లో కోలీవుడ్‌లో అనేవారు. విక్రమ్ కెరీర్ ప్రారంభంలో ఒకదాని తర్వాత ఒకటిగా ఏడు సినిమాలు పరాజయం చెందాయి. దీంతో విక్రమ్‌ను సినీ ప్రపంచం దురదృష్టవంతుడిగా ముద్ర వేసింది. కానీ 1999లో బాలా దర్శకత్వంలో వచ్చిన సేతు సినిమాతో విక్రమ్ జీవితం మారిపోయింది. వంద రోజుల పాటు హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో కొనసాగింది. సేతు సినిమాతో తమిళనాట కొత్త ఉదయానికి సాక్షిగా విక్రమ్ నిలిచాడు. అక్కడి నుంచి విక్రమ్ వెనక్కి తిరిగి చూడలేదు. మేనమామతో విక్రమ్‌కు కష్టాలు విక్రమ్ సినీ ఇండస్ట్రీలో కష్టాలు పడుతున్నప్పుడు ఆయన కజిన్, హీరో ప్రశాంత్ కోలీవుడ్‌లో సూపర్‌స్టార్‌గా కొనసాగుతున్నాడు. అతను నటించిన ప్రతి సినిమా సూపర్ హిట్టే. సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లోకి ఆయన సినిమాలు విడుదల అయ్యేవి. హీరో ప్రశాంత్ తండ్రి త్యాగరాజన్ విక్రమ్‌కి సొంత మేనమామ అవుతాడు. ఆయనకు తమిళ చిత్రసీమలో ఒక నటుడు, డైరెక్టర్, నిర్మాతగా మంచి గుర్తింపు ఉంది. కానీ త్యాగరాజన్ తన మేనళ్లుడు అయిన విక్రమ్‌కు ఎలాంటి సహాయం చేయడానికి ముందుకు రాలేదు. ప్రశాంత్ కూడా విక్రమ్ గురించి ఎక్కడా మాట్లాడకుండా అప్పట్లో దూరం పాటించాడు. విక్రమ్ కూడా వారి గురించి ఎక్కడా మాట్లాడలేదు. విక్రమ్ నటించిన ఏడు సినిమాలు వరుసగా పరాజయం పాలయ్యాయి. దీంతో విక్రమ్ అన్ లక్కీ యాక్టర్ అనే ముద్ర పడింది. విక్రమ్‌తో సినిమా చేస్తే నష్టపోతామని అందరూ అనుకున్నారు. అలాంటి సమయంలోనే దర్శకుడు బాలాను విక్రమ్ కలిశాడు. విక్రమ్ హీరోగా ఆయన 'సేతు' సినిమాను తెరకెక్కించాడు. అయితే సినిమాను కొనుగోలు చేసేందుకు డిస్ట్రిబ్యూటర్లు సిద్ధంగా లేరు. చివరకు చిత్ర నిర్మాతలు తక్కువ మొత్తానికే ఇచ్చేశారు. వారికి థియేటర్లు కూడా తక్కువగానే దొరికాయి. సినిమా భారీ హిట్ అయినా నిర్మాతలు అంతగా లాభపడలేదు. దీనికి విక్రమ్ కూడా కారణమని చెప్పారు. అతనికి ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా కూడా వారి పేర్లు ఎక్కడా ఉపయోగించుకోకుండా ఉండటం అని పలువురు చెప్పుకొచ్చారు. విక్రమ్ మామ కొడుకు అయిన ప్రశాంత్ అప్పట్లో పెద్ద స్టార్. కానీ ప్రశాంత్ మాత్రం విక్రమ్ ఎవరో తనకు తెలియనట్లు ఉండేవాడు. సేతు సినిమాకు మరిన్నీ థియేటర్లు కావాలని నిర్మాతలు మాట సాయం కోరినా ప్రశాంత్ స్పందించలేదట. దీంతో ఇరువురి కుటుంబాల మధ్య ఏదో ఒక గొడవ జరిగిందని తర్వాత అందరూ భావించారు. అందుకే విక్రమ్ కోసం త్యాగరాజన్, ప్రశాంత్ ఎలాంటి రికమెండేషన్ చేయలేదని పలువురు విశ్లేషకులు ఇప్పటికీ చెబుతారు. విక్రమ్‌కు వచ్చిన సినిమా అవకాశాలను కూడా రానీయకుండా త్యాగరాజన్ ప్రయత్నించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. దీంతో విక్రమ్ అవకాశాల కోసం ఎంతగానో కష్టపడాల్సి వచ్చింది. చివరకు విక్రమ్ తన లక్ష్యాన్ని చేరుకుని సూపర్ స్టార్ అయ్యాడు. కానీ ఈరోజు హీరో ప్రశాంత్ అంటే చాలామందికి తెలియని స్థితిలో ఆయన ఉన్నారని చెప్పవచ్చు. ఇప్పటికీ హీరో విక్రమ్ తన మేనమామ కుటుంబంతో ఎలాంటి సంబంధం లేకుండానే ఉన్నారు. ఒకప్పుడు రాబోయే తరానికి సూపర్ స్టార్ అని అనుకున్న ప్రశాంత్ ఇప్పుడు సినిమా ప్రపంచంలోనే లేరు. అప్పట్లో ఆయనతో పాటు ఎంట్రీ ఇచ్చిన అజిత్, విజయ్, విక్రమ్ నేడు సూపర్ స్టార్లుగా ఎదిగారు. చియాన్ విక్రమ్ ఎప్పటికీ తమిళ సినిమా సూపర్ స్టార్. పొన్నియన్ సెల్వన్ విజయంతో జోరుమీద ఉన్న ఆయన.. త్వరలో తంగళన్, ధ్రువనక్షత్రం చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. -
సినీ పరిశ్రమలో మరో విషాదం: ప్రముఖ దర్శకుడు కన్నుమూత
సాక్షి, చెన్నై(తమిళనాడు): సినీ దర్శకుడు త్యాగరాజన్ బుధవారం ఉదయం చెన్నైలో కన్నుమూశారు. ప్రభు కథానాయకుడిగా వెట్రిమేల్ వెట్రి, విజయకాంత్ హీరోగా మా నగర కావలన్ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు త్యాగరాజన్. అవకాశాలు తగ్గడంతో సొంతూరు అరుంబుకోటైకి వెళ్లిపోయారు. అక్కడ ప్రమాదానికి గురైన త్యాగరాజన్ కోమాలోకి వెళ్లారు. అనంతరం కోలుకున్న ఆయన మళ్లీ అవకాశాల కోసం చెన్నైకి తిరిగి వచ్చారు. ఈసారి కూడా అవకాశాలు రాకపోవడంతో స్థానిక వడప ళణి, ఏవీఎం స్టూడియో సమీపంలో రోడ్డు పక్కనే పడుకుని అమ్మా క్యాంటీన్లో తింటూ దీని పరిస్థితి అనుభవించారు. ఈ క్రమంలో బుధవారం వేకువజామున త్యాగరాజన్ కన్నుమూశారు. పోలీసులు అనాథ శవంగా భావించి మృతదేహాన్ని కీల్పాక్కం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
తమన్నా వల్లే ఆగిపోయింది..!
బాలీవుడ్లో ఘనవిజయం సాధించిన క్వీన్ సినిమాను సౌత్‌లో రీమేక్ చేసేందుకు చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కోలీవుడ్ నటుడు నిర్మాత త్యాగరాజన్, క్వీన్ రీమేక్ హక్కులు సొంతం చేసుకోగా.. ప్రధాన పాత్రల్లో కనిపించబోయే నటీనటుల కోసం చాలా కాలం కసరత్తులు చేశాడు. ఫైనల్‌గా తమన్నా హీరోయిన్గా సీనియర్ నటి రేవతి దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించాడు. అయితే సడన్‌గా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందన్న ప్రకటన వచ్చింది. క్వీన్ రీమేక్ ఆగిపోవడానికి కారణాలు ఇవే అంటూ రకరకాల వార్తలు వినిపించాయి. ఈ రూమర్స్ అన్నింటికి ఫుల్ స్టాప్ పెడుతూ నిర్మాత త్యాగరాజన్ అసలు కారణాన్ని బయటపెట్టాడు. తమన్నా భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడం కారణంగానే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని తెలిపాడు. ప్రస్తుతానికి క్వీన్ రీమేక్‌ను పక్కకు పెట్టినా.. సరైన నటి దొరికితే తిరిగి ప్రారంభిస్తానని తెలిపాడు. -
‘క్వీన్’గా ఎవర్నీ ఖరారు చేయలేదు
కంగనా రనౌత్ కథానాయికగా వికాస్ బాల్ దర్శకత్వటంలో రూపొంది, ఘనవిజయం సాధించిన హిందీ చిత్రం ‘క్వీన్’ దక్షిణాది రీమేక్ హక్కుల్ని ప్రముఖ నటుడు, దర్శక, నిర్మాత త్యాగరాజన్ చేజిక్కించుకున్నారు. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని ఆయన రూపొందించనున్నారు. ఈ సందర్భంగా త్యాగరాజన్ మాట్లాడుతూ -‘‘కథానాయికలుగా అనుష్క. కాజల్, తమన్నాలను పరిశీలిస్తున్నాం అనే వార్త ప్రచారంలో ఉంది. వాస్తవానికి త్రిష పేరుని పరిశీలిస్తున్నాం. హిందీలో కంగనా అద్భుతంగా నటించింది. దక్షిణాది రాణిగా ఎవరు నప్పుతారు? అనే విషయాన్ని చర్చిస్తున్నాం. త్వరలో కథానాయికను ఖరారు చేస్తాం’’ అన్నారు. ఈ రీమేక్‌లో మీ అబ్బాయి, హీరో ప్రశాంత్ నటిస్తారా? అనడిగితే -‘‘తను నటిస్తానంటే నాకభ్యతరం లేదు. ప్రస్తుతం తను ‘జులాయి’ రీమేక్‌లో నటిస్తున్నాడు’’ అని చెప్పారు. ప్రస్తుతం ‘జీన్స్ 2’కి సన్నాహాలు చేస్తున్నానని, ఆ చిత్రవిశేషాలు కూడా త్వరలో తెలియజేస్తానని త్యాగరాజన్ తెలిపారు.